సోమవారం, నవంబర్ 02, 2020

అతి సాధార‌ణ స్థితి నుంచి... అంత‌ర్జాతీయ స్థాయికి!

 


శ‌క్తి పీఠాలు-3

 


శ‌క్తి పీఠాలు-2


 

శ‌క్తి పీఠాలు... ఆధ్యాత్మిక నిజాలు!

 


అరుదైన బ్లూమూన్‌... అద్భుత నిజాలు!

 


గురువారం, అక్టోబర్ 22, 2020

విచిత్ర పోరాటాల వీరుడు!: జాకీచాన్‌

 కళ్లకి కనిపించనంత వేగంగా చేతుల్ని తిప్పుతూ ప్రత్యర్థి మీద దాడి చేయగలడు...

ఊహించని విధంగా అకస్మాత్తుగా పైకెగిరి కాళ్లతో శత్రువుని తన్ని నేలకరిపించగలడు...

ప్రాణాంతకమైన సాహసాలు చూపిస్తూ పోరాట విన్యాసాలు చేయగలడు...

−ఇవన్నీ చేస్తూ సినిమా హాళ్లో ప్రేక్షకులను మునివేళ్లపై కూర్చోబెడుతూనే... చటుక్కున చిలిపి పనులతో నవ్వించనూగలడు!

అందుకే అతడంటే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు చెప్పలేనంత ఇష్టం!

ఆ ఇష్టమే అతడికి ప్రపంచ సినీ రంగంలో ఏకంగా 350 మిలియన్‌ డాలర్ల విలువ గలిగిన వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చింది!

కానీ ఆ ఇష్టాన్ని పొందడానికి అతడు...

ఎన్నోసార్లు ముక్కు బద్దలు కొట్టుకున్నాడు!

దవడలు విరగ్గొట్టుకున్నాడు!

పక్కటెముకలకు గాయాలైనా లక్ష్యపెట్టలేదు!

ఎన్నో శస్త్రచికిత్సలు జరిగినా చలించలేదు!

ఆఖరికి ఎత్తుమీద నుంచి పడి మెదడు చిట్లిపోయి మరణం అంచుల వరకు వెళ్లినా తన పంథాను మార్చుకోలేదు!

ఆ విచిత్ర పోరాట వీరుడే జాకీచాన్‌!!




అందరూ జాకీచాన్‌గా పిలుచుకునే ఈ అంతర్జాతీయ నటుడి అసలు పేరు చాన్‌ కాంగ్‌ సాంగ్‌. అంటే అర్థం ఏమిటో తెలుసా? హాంగ్‌కాంగ్‌లో పుట్టిన డ్రాగన్‌ అని! అభిమానులు ‘బిగ్‌ బ్రదర్‌’గా పిలుచుకునే ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు, మార్షల్‌ యుద్ధవిద్యల నిపుణుడు, దర్శకుడు, నిర్మాత, స్టంట్‌మ్యాన్, గాయకుడు కూడా. ఇతడు కుంగ్‌ఫు, హాప్‌కిడో, కరాటే, టైక్వాండో, జూడో, జీత్‌కునే దో లాంటి విద్యల్లో ప్రవేశం ఉన్నవాడు. దాదాపు 160 సినిమాలకు పైగా నటించిన జాకీచాన్‌ తను నటించిన సినిమాల్లో పోరాటాలను తానే రూపొందిస్తాడు. ఆయా సినిమాల్లో పాటల్ని కంపోజ్‌ చేసి స్వయంగా పాడతాడు కూడా. విడిగా కూడా వందలాది ఆల్బమ్స్‌ ద్వారా పాప్‌ పాటల ప్రియులకు అభిమాన గాయకుడు. ఫోర్బ్స్ పత్రిక అంచనా ప్రకారం 2015 నాటికే 350 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన జాకీచాన్, ప్రపంచంలోని మేటి పది మంది వితరణశీలురలో ఒకడు.

చిన్నప్పుడే నటనకేసి...

హాంగ్‌కాంగ్‌లో 1954 ఏప్రిల్‌7న చార్లెస్, లీలీచాన్‌లకు పుట్టిన జాకీచాన్‌ను తల్లిదండ్రులు ముద్దుగా ‘పావో పావో’ అని పిలుచుకునేవారు. అంటే చైనా భాషలో ‘ఫిరంగి గుండు’ అని అర్థం! ఒక క్షణమైనా ఒక్కచోట కుదురుగా ఉండలేని ఈ చిచ్చరపిడుగు హాషారును, ఉత్సాహాన్ని తట్టుకోవడం వాళ్లకి తలకిమించిన పనిగానే ఉండేది. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వలసపోయిన తల్లిదండ్రులు జాకీచాన్‌ను మాత్రం హాంగ్‌కాంగ్‌లోనే స్కూల్లో చేర్చి ఉంచేశారు. అక్కడున్న పదేళ్లకాలంలోనే చదువు సంగతి ఎలా ఉన్నా, యుద్ధవిద్యలు, అక్రోబాటిక్స్‌లో శిక్షణ వల్ల ఓ ప్రపంచ హీరోగా రాటుదేలడానికి కావలసిన తొలి బీజాలు జాకీచాన్‌లో పెంపొందాయి. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలు వేసే ఇతగాడికి నటుడిగా ఐదేళ్ల వయసులోనే చిన్న చిన్న వేషాలు దొరికాయి. ఎనిమిదేళ్లకల్లా ‘బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌’ (1962), ‘ది లవ్‌ ఎటర్న్‌’ (1963), ‘కమ్‌ డ్రింక్‌ విత్‌ మి’ (1966) లాంటి సినిమాల్లో పాత్రలు మంచి గుర్తింపునే తీసుకొచ్చాయి. పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి బ్రూస్‌లీ నటించిన ప్రపంచప్రఖ్యాత సినిమాలు ‘ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’, ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ సినిమాల్లో స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగాడు. తర్వాత కొన్ని సినిమాల వైఫల్యంతో స్టంట్‌మాస్టర్‌గా అవకాశాలు రాక మళ్లీ నటుడిగా ఏవేవో పాత్రల కోసం ముఖానికి రంగు వేసుకోవాల్సి వచ్చింది. అయినా ఆశించినంత ప్రోత్సాహం లేక ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయి అక్కడ కొన్నాళ్లు నిర్మాణ కార్మికుడి అవతారం ఎత్తాడు. అక్కడి బిల్డర్‌ ఇతగాడిని ‘లిటిల్‌ జాక్‌’ అని పిలిచేవాడు. అదే పొట్టి రూపం దాల్చి జాకీగా మారి చాన్‌కి ముందుకొచ్చి స్థిరపడిపోయింది.


భవిష్యత్తులో జాకీచాన్‌ జీవితం వెండితెరపై సర్వాంగసుందరంగా నిర్మాణం కావలసి ఉండగా, అతడెందుకు ఓ కార్మికుడిగా ఉండిపోతాడు? అందుకే హాంగ్‌కాంగ్‌లో ఓ నిర్మాత అతడికి ఫోన్‌ చేసి తన సినిమాలో నటించమని పిలిచాడు. భావి హీరో మళ్లీ కొత్తగా బ్యాగ్‌ సర్దుకుని వెండితెర వెలుగుల్లో నట ప్రస్థానం కోసం బయల్దేరాడు. ఏవో కొన్ని సినిమాలు చేశాక 1978లో వచ్చిన ‘స్నేక్‌ ఇన్‌ ది ఈగిల్స్‌ షాడో’ సినిమా అతడి జాతకాన్ని మార్చేసింది. అందులో హాస్యాన్ని మేళవిస్తూ జాకీచాన్‌ రూపొందించిన విచిత్ర పోరాట విన్యాసాలు హాంగ్‌కాంగ్‌ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించి ఈలలు వేయించాయి. ఆ తర్వాత వచ్చిన ‘డ్రంకెన్‌ మాస్టర్‌’ విజయాల వీరుడిగా అతడి స్థానాన్ని సుస్థిరం చేసింది. తర్వాత ఒకో సినిమా అతడిని ఒకో మెట్టు ఎక్కించింది. ‘ది యంగ్‌ మాస్టర్‌’ (1980)తో జాకీచాన్‌ అంతక్రితం బ్రూస్‌లీ సినిమాల రికార్డులను కూడా అధిగమించి హాంగ్‌కాంగ్‌లో టాప్‌ స్టార్‌ హోదాకి ఎదిగాడు. ఆపై ‘ప్రాజెక్ట్‌ ఏ’, ‘పోలీస్‌ స్టోరీ’, ‘ఆర్మర్‌ ఆఫ్‌ గాడ్‌’ లాంటి చిత్రాల పరంపర అతడిని అంతకంతకు ఎదిగేలా చేశాయి. ఇక ‘రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌’, ‘సూపర్‌కాప్‌’, ‘రష్‌ అవర్‌’ సినిమాలు జాకీచాన్‌ను హాలీవుడ్‌లో కూడా ప్రముఖుడిని చేశాయి. అప్పటి నుంచి 2017లో ‘కుంగ్‌ఫు యోగా’ వరకు వచ్చిన సినిమాల చరిత్ర అంతా అభిమానులకు తెలిసిందే.

ఇదీ కుటుంబం...

జాకీచాన్‌ 1982లో జొవాన్‌ లిన్‌ అనే తైవాన్‌ నటిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన జేసీచాన్‌ కూడా గాయకుడిగా, నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. జాకీచాన్‌కి మరో మహిళ ఎలైన్‌ ఎన్‌గ్‌ యిలీ ద్వారా ఓ కూతురు కూడా ఉంది.

గిన్నిస్‌ రికార్డులు...

‘ఎక్కువ పోరాటాలు చేసిన నటుడు’గా జాకీచాన్‌కి గిన్నిస్‌ ప్రపంచ రికార్డు ఉంది. అలాగే ఒక సినిమాలో ఎక్కువ విభాగాల్లో పనిచేసిన వ్యక్తిగా ‘చైనీస్‌ జోడియాక్‌’ (2012)కి మరో రికార్డు ఉంది. ఇందులో ఇతడు 15 విభాగాల్లో పనిచేశాడు.



శుక్రవారం, అక్టోబర్ 16, 2020

అధిక మాసం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం!

అధిక ఆశ్వయుజ మాసం ముగిసి నిజ ఆశ్వయుజ మాసం మొదలైంది కదా.  మరి అసలు అధిక మాసం గురించి శాస్త్రీయ విషయాలు తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. 



 

బుధవారం, అక్టోబర్ 14, 2020

చందమామ శంకర్ బొమ్మలకు జేజేలు!

చిన్నప్పుడు హాయిగా చందమామ చదువుకుని ఆనందించిన వారందరికీ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. కథలు చదివిన దానికన్నా ఎక్కువ సేపు ఆయన వేసిన బొమ్మలనే మైమరచిపోయి చూసిన జ్ఞాపకాలు వాళ్ళ మదిలో పదిలంగానే ఉంటాయి. మరి ఆ శంకర్ జీవితంలోకి తొంగి చూడాలని ఉందా? అయితే ఈ వీడియోపై ఓసారి క్లిక్ చేయండి. 







 

మృత్యువ్యాపారి మ‌నో వేద‌న‌!

ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన నోబెల్ బ‌హుమ‌తుల వెన‌క ఓ ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త మ‌నోవేద‌న ఉంద‌ని  మీకు తెలుసా? త‌న మ‌ర‌ణ వార్త త‌నే చ‌దువుకున్న అత‌డు అందులోని త‌న‌ను మృత్యువ్యాపారిగా అభివ‌ర్ణించ‌డం చూసి ఎంతో బాధ ప‌డ్డాడని తెలుసా? ఆ బాధే నోబెల్ అవార్డుల‌కు నాంది ప‌లికింద‌ని తెలుసా?  ఆ విష‌యాల‌న్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.



తిరుగులేని హాస్య నట చక్రవర్తి!



నల్లని కళ్లు... ఆ కళ్లల్లో జాలి...
నిశితంగా చూస్తే, అంతులేని కారుణ్యం! 
                                          తెల్లని మొహం... ఆ మొహంలో అమాయకత్వం...
పరిశీలనగా చూస్తే, కట్టిపడేసే మానవత్వం!
వెర్రిబాగుల వేషం... ఆ వేషంలో హాస్యం...
తేరిపారి చూస్తే, నిలువెత్తు అభినయం!
−ఇది వెండితెరపై చార్లీచాప్లిన్‌ మూర్తిమత్వం!
−హాస్య నట చక్రవర్తిగా చార్లీచాప్లిన్‌ విశ్వరూపం!!
చూడగానే నవ్వొచ్చేలా... నవ్విస్తూనే ఆలోచింపజేసేలా...
ఆలోచిస్తుండగానే మనసు కలుక్కుమనిపించేలా...
కలుక్కుమనేలోగానే పొట్టచెక్కలయ్యేలా...
పొట్టచెక్కలవుతుండగానే గుండెను మెలిపెట్టేలా...
చార్లీచాప్లిన్‌ చవిచూపించిన వెండితెర విన్యాసం!!
మూకీలైనా... టాకీలైనా...
రెండు నిముషాలైనా... రెండు గంటలైనా...
పిల్లలైనా... పెద్దలైనా...
ఆనందించి, ఆస్వాదించి, అనుభవించి, పరవశించి...
కేరింతలు కొట్టి, చప్పట్లు కొట్టి...
పట్టుపట్టి మళ్లీమళ్లీ చూసేలా చేసే
అపురూప, అద్భుత, అసాధారణ, అనన్యసామాన్య... కళాప్రదర్శనం!!

ఓసారి ‘యూట్యూబ్‌’ లోకి వెళ్లి, సెర్చిబాక్స్‌లో ‘చార్లీ చాప్లిన్‌’ అని కొట్టి చూడండి. వచ్చే వీడియోల్లో ఏదో ఒక దాన్ని నొక్కండి. ఆపై... ‘నవ్వనుగాక నవ్వను’ అని తీర్మానించుకుని మరీ ఆ వీడియో చూడండి... లోపలి నుంచి నవ్వు తెరలుతెరలుగా తన్నుకురాకపోతే అడగండి!
అదీ చార్లీచాప్లిన్‌ అంటే! అందుకే మూకీల నాటి వాడైనా, నేటికీ చెప్పుకునే అరుదైన నటుడిగా నిలిచాడు చార్లీచాప్లిన్‌!
కానీ... చార్లీచాప్లిన్‌ పంచిన నవ్వులు... కష్టాల కొలిమిలో కాలి రాటుదేలినవి!
అతడు పంచిన అభినయం... పేదరికం ముంగిట నిగ్గుదేలిన అనుభవాల సారం!
ఓ సామాన్య పేద కుటుంబంలో పుట్టి... తినీ తినకా... అనేక బాధలు పడుతూ... పట్టెడన్నం కోసం ఎవేవో పనులు చేస్తూ... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారుడిగా చార్లీచాప్లిన్‌ ఎదిగిన తీరును తెలుసుకోవాలంటే అతడి జీవితంలోకి ఓసారి తొంగి చూడాలి.





కాల పరీక్షలకు ఎదురు నిలిచి..
చార్లెస్‌ స్పెన్సర్‌ చాప్లిన్‌గా లండన్‌లో పుట్టిన ఓ కుర్రాడు, తన పేరుకు ముందు బ్రిటిష్‌ ప్రభుత్వం గౌరవప్రదంగా ఇచ్చే ‘సర్‌’ బిరుదును పొందడం వెనుక... అతడి 88 ఏళ్ల జీవితంలో 75 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వెండితెర ప్రస్థానం ఉంది. 1889 ఏప్రిల్‌ 16న పుట్టిన చాప్లిన్, 1977 డిసెంబర్‌ 25న మరణించేలోగా వేదనాభరిత రోజుల్ని, వైభవోపేతమైన దశల్ని, అవమానకరమైన పరిస్థితుల్ని, వివాదప్రదమైన స్థితిగతుల్ని కూడా అనుభవించాడు. కడుపు నింపుకోవడం కోసం పని చెయ్యక తప్పని బాల్యం నుంచి దొరికిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, అనుభవాలు పేర్చుకుంటూ, నైపుణ్యాలు కూర్చుకుంటూ... ఓ హాస్య నటుడిగా, ఓ చిత్ర నిర్మాతగా, ఓ సంగీతకారుడిగా, ఓ రచయితగా ప్రపంచ స్థాయికి ఎదిగి సినీరంగంలో చెరగని ముద్ర వేయగలిగాడు. ఒకవైపు వెండితెర ప్రస్థానం వెలుగులతో కొనసాగుతుండగానే, అతడి వ్యక్తిగత జీవితం వైవాహిక పొరపాట్లతో ముడిపడుతూ సాగింది. అందుకే నాలుగు పెళ్లిళ్లు, 11 మంది సంతానంతో చాప్లిన్‌ జీవితం మరోవైపు వివాదాస్పద కోణానికి దర్పణం పట్టింది.

తన తొలి చిత్రం తనకే నచ్చలేదు..
చార్లీచాప్లిన్‌ బాల్యమంతా పేదరికంలో, బాధల మధ్యే గడిచింది. తండ్రి చార్లెస్‌ చాప్లిన్, తల్లి హన్నా (లిలీహార్లీ)లు ఇద్దరూ నాటకరంగంలో గాయకులు, నటులే అయినా అంతంత మాత్రం ఆదాయంతో నెట్టుకొచ్చేవారు. చాప్లిన్‌కి ఊహ తెలిసేనాటికే తండ్రి చనిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనికి సాయం తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చిన్నారి చాప్లిన్, సోదరుడు సిడ్నీ ఇద్దరూ పొట్టగడవడం కోసం ఏవేవో పనులు చేయకతప్పలేదు. తల్లిదండ్రులు ఆస్తులేవీ ఇవ్వకపోయినా వారసత్వంగా అలవడిన నటనే వారిని రంగస్థలంకేసి అడుగులు వేయించింది. అవకాశాన్ని బట్టి పాట, ఆట, నటనలతో అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అలా చాప్లిన్‌ చిన్నతనంలోనే తనదైన హాస్య నటనతో మంచి గుర్తింపు పొందగలిగాడు. పందొమ్మిది ఏళ్ల వయసుకల్లా ఓ కంపెనీతో కుదిరిన ఒప్పందం వల్ల చాప్లిన్‌ అమెరికాలో అడుగుపెట్టాడు. అదే అతడి జీవితానికి తొలి మేలు మలుపు. అక్కడి ప్రేక్షకులకు చాప్లిన్‌ హాస్యం నచ్చడంతో 1913లో తొలి సినిమా అవకాశం వచ్చింది. భవిష్యత్తులో వెండితెరపై బలమైన ముద్ర వేసిన చాప్లిన్‌ తొలి సినిమా ఏంటో తెలుసా? కేవలం ఒకే ఒక్క రీలుతో రూపొందిన ‘మేకింగ్‌ ఏ లివింగ్‌’ సినిమా. ఇది 1914 ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఆ సినిమా చాప్లిన్‌కి అస్సలు నచ్చలేదు.
అది చాప్లిన్‌ సృష్టించుకున్న ఆహార్యమే..
రెండో సినిమాకి చాప్లిన్, తనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన వేషధారణను స్వయంగా ఎంపికచేసుకున్నాడు. అదే... వదులుగా వేళ్లాడే ప్యాంటు, బిగుతుగా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు, చిట్టి మీసం... దాన్నే ‘ది ట్రాంప్‌ క్యారెక్టర్‌’ అంటారు. ఈ వేషంలో చాప్లిన్‌ను చూపిస్తూ విడుదలైన సినిమా ‘కిడ్‌ ఆటో రేసెస్‌ ఎట్‌ వెనిస్‌’. ఆ వేషం వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించింది. దాంతో ఆపై చాప్లిన్‌ వెండితెర ఆహార్యం అదే అయ్యింది. చాప్లిన్‌ చిత్రాలకు బాగా డిమాండ్‌ పెరగడంతో తొలి దర్శకత్వ అవకాశం ‘కాట్‌ ఇన్‌ ద రైjన్‌’ (1914)తో వచ్చింది. అది సూపర్‌హిట్‌. ఇక ఆపై వారానికో సినిమా వంతున చాప్లిన్‌ ఎన్నో చిత్రాలు రూపొందించాడు. చాప్లిన్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఎన్నో కంపెనీలు అతడితో ఒప్పందం కోసం క్యూ కట్టాయి. అలా 26 ఏళ్లకల్లా ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడిగా చాప్లిన్‌ ఖ్యాతి పొందాడు. ‘ది ఫ్లోర్‌ వాకర్‌’, ‘ది ఫైర్‌మేన్‌’, ‘ది వేగబాండ్‌’, ‘వన్‌ ఏఎమ్‌’, ‘ది కౌంట్‌’, ‘ది పాన్‌షాప్‌’... లాంటి ఎన్నో సినిమాల్లో యువ చాప్లిన్‌ కడుపుబ్బ నవ్వించాడు. ఆపై సొంతంగా ‘యునైటెడ్‌ ఆర్టిస్ట్స్ ’ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కూడా మారాడు.

మూడేళ్లలో 50 దేశాల్లో ప్రదర్శితమైందా చిత్రం..
చార్లీ చాప్లిన్‌ తొలి పూర్తిస్థాయి చిత్రం ‘ది కిడ్‌’ (1921). అరవై ఎనిమిది నిమిషాల నిడివి ఉండే ఇది చాప్లిన్‌ చిత్రల్లోకెల్లా పెద్దది. మూడేళ్ల ఈ సినిమా 50 దేశాల్లో ప్రదర్శితమై అంతులేని ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎ ఉమన్‌ ఆఫ్‌ ప్యారిస్‌’ (1923), ‘ది గోల్డ్‌ రష్‌’ (1925), ‘ది సర్కస్‌’ (1928) లాంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. అప్పటికి మూకీలు పోయి, టాకీలు వచ్చినా కొంత కాలం పాటు చాప్లిన్‌ వాటికి దూరంగా ఉన్నాడు. అందుకే ‘సిటీ లైట్స్‌’ (1931), ‘మోడర్న్‌ టైమ్స్‌’ (1936) చిత్రాలను డైలాగులు లేకుండానే తీశాడు. జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ను వ్యంగ్యంగా అనుకరిస్తూ తీసిన ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ (1940) నుంచి చాప్లిన్‌ పదేళ్ల పాటు రాజకీయ వివాదాల్లోను, వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకుల్లోను కూరుకుపోయాడు. అతడిపై కమ్యూనిస్ట్‌ సానుభూతిపరుడిగా ముద్ర పడడంతో పాటు, తనకన్నా ఎంతో చిన్న వాళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం విమర్శలకు గురిచేసింది. కొన్ని కేసులు చుట్టుముట్టడంతో అన్నేళ్లు తనకు ఆశ్రయమిచ్చిన అమెరికాను విడిచి వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆపై స్విట్జర్లాండ్‌ వెళ్లి ‘మాన్సియర్‌ వెర్‌డాక్స్‌’ (1947), ‘లైమ్‌లైట్‌’ (1952), ‘ఎ కింగ్‌ ఇన్‌ న్యూయార్క్‌’ (1957), ‘ఎ కౌంటెస్‌ ఫ్రమ్‌ హాంగ్‌కాంగ్‌’ (1967) లాంటి తన శైలికి భిన్నమైన సినిమాలు తీశాడు.

ఆస్కార్‌ వేదికపై అరుదైన గౌరవం..
అమెరికా వదిలి పెట్టిన చార్లీచాప్లిన్‌ 20 ఏళ్ల తర్వాత తిరిగి అమెరికా రావలసి వచ్చింది. అది ఆస్కార్‌ అవార్డు అందుకోవడం కోసం! 1972లో అకాడమీ చాప్లిన్‌కు గౌరవ అవార్డును ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోడానికి అతడు వేదిక మీదకి వచ్చినప్పుడు ఆ వేడుకకు హాజరైన ఆహూతులంతా లేచి నిలబడి 12 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా చప్పట్ల వర్షం కురిపించారు. ఆస్కార్‌ వేడుకల చరిత్రలోనే అత్యధిక సమయం నమోదైన ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ అది!

తర్వాత ఈ హాస్య నట చక్రవర్తి ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. మాటలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమవాల్సి వచ్చింది. 1974లో ‘మై లైఫ్‌ ఇన్‌ పిక్చర్స్‌’ పేరుతో చిత్రాలతో కూడిన ఆత్మకథ వచ్చింది. 1975లో ‘ద జెంటిల్‌మేన్‌ ట్రాంప్‌’ పేరిట అతడి జీవితంపై ఓ డాక్యుమెంటరీ విడుదలైంది. అదే సంవత్సరం రాణి ఎలిజబెత్‌ చేతుల మీదుగా బ్రిటన్‌ అత్యున్నత పురస్కారం ‘నైట్‌హుడ్‌’ను చక్రాల కుర్చీ మీద నుంచే అందుకున్నాడు చాప్లిన్‌. జీవితమంతా ప్రపంచాన్ని నవించడానికే వెచ్చించిన చార్లీచాప్లిన్‌ 1977 డిసెంబర్‌ 25న నిద్రలోనే గుండెపోటుకు గురై 88 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఎప్పటికీ తనను తల్చుకునే సినీ అభిమానుల గుండెల్లో ఓ చిరునవ్వుతో పాటు, ఓ విషాదాన్నీ వదలివెళ్లాడు!!

మరి కొన్ని జ్ఞాపకాలు..
* చాప్లిన్‌ తన మొదటి భార్య మిడ్రెడ్‌ హ్యారిస్‌ను 1918లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు పుట్టినా రెండు రోజులకే చనిపోయాడు. తర్వాత ఇద్దరూ రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. రెండో భార్య లిటా గ్రే ‘ది కిడ్‌’, ‘ది గోల్డ్‌ రష్‌’ చిత్రాల్లో నటించింది. వారికిద్దరు పిల్లలు. మూడేళ్లకే ఈ బంధం ముగిసింది. మూడోసారి పాలెట్‌ గొడార్డ్‌ను 1936 పెళ్లి చేసుకున్నాడు. ఈమె ‘మోడర్న్‌ టైమ్స్‌’, ‘ది డిక్టేటర్‌’ సినిమాల్లో కనిపించింది. వీరి బంధం ఐదేళ్లకే ముగిసింది. ఆ తర్వాత 53 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఊనా ఓనీల్‌ను 1943లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిది మంది సంతానం.

* ప్రతి సినిమాలోను ప్రతి సన్నివేశంలో కనిపించే చార్లీచాప్లిన్‌ ఒకే ఒక చిత్రంలో మాత్రం ఓ అనామకుడిగా, కొన్ని సెకన్లు మాత్రమే కనిపిస్తాడు. అదీ ఓ పోర్టర్‌గా! పైగా అది హాస్యప్రధానమైన సినిమా కాదు. ఓ రొమాంటిక్‌ డ్రామా. ఎందుకంటే చాప్లిన్‌కి సీరియస్‌ సినిమా తీయాలనే కోరిక ఉండడమే. ఆ సినిమా ‘ఏ ఉమన్‌ ఆఫ్‌ ప్యారిస్‌’ (1923). ఇదీ విజయవంతమైంది.

* ‘ది సర్కస్‌’ చిత్రం చాప్లిన్‌కి తొలి అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే అప్పటికి ‘ఆస్కార్‌’ అనే పేరు ఆ వేడుకకు లేదు. దీన్ని 1929లో తొలి వేడుకలో ఇచ్చారు.


మంగళవారం, జూన్ 23, 2020

ఆ క‌ష్టం... ప‌డాల్సిందే!


బాబుకి స్నానం చేయించింది అమ్మ‌. మెత్త‌ని తువ్వాలుతో సుతారంగా తుడిచింది. మురిపెంగా చూస్తూ పౌడ‌ర్ పూసింది. చ‌క్క‌గా విస్త్రీ చేయించిన‌ చొక్కా తొడిగింది. ఆస‌రికి బాబుకి అర్థం అయింది. 
"తా... తా..." అన్నాడు. 
అమ్మ హాయిగా న‌వ్వేసింది. 
"అరె... బుజ్జిక‌న్న‌కి తెలిసి పోయిందీ... మ‌నం టాటా వెళుతున్నామ‌నీ..." అంటూ ముద్దుపెట్టుకుంది. 
బాబు కేరింత‌లు కొట్టాడు. ఇంత‌లో ఇంటి ముందు స్కూట‌ర్ ఆగింది. 
"నా...న‌..." అన్నాడు బాబు ఉత్సాహంగా ఊగుతూ.
బ‌య‌ట‌కు చూసిన అమ్మ‌, అప్పుడే లోప‌లికి వ‌స్తున్న నాన్న‌కి ఎదురెళ్లింది.
"మీ స్కూట‌ర్ చ‌ప్పుడు విన‌గానే వీడు గుర్తు ప‌ట్టేశాడండోయ్‌! నాన్న అంటున్నాడు" అంటూ న‌వ్వుతూ అంది. 
నాన్న హెల్మెట్ తీసి ప‌క్క‌న పెడుతూ, "అవునాలాలే... క‌న్న‌... నేనొత్తేతాన‌ని తెల్సి పోయిందాలే" అంటూ బాబును తీసుకుని బుగ్గ‌మీద ముక్కు రాశాడు.
బాబు వెన్నెల‌లా న‌వ్వుతూ నాన్న భుజం మీద వాలిపోయాడు.
"ప‌ద‌.. వెళ్దాం. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైపోయింది" అన్నాడు నాన్న‌.
అమ్మ ఓ చిన్న బుట్ట పట్టుకుని బ‌య‌ట‌కు అడుగుపెడుతూ, "పాపం... వీడి సంబ‌రం చూస్తుంటే జాలేస్తుంది. అక్క‌డ మాత్రం మీరే ఎత్తుకోవాలి. నాకు ఏడుపు వ‌చ్చేస్తుంది" అంది.
"స‌ర్లే... ప‌ద‌... త‌ప్ప‌దుగా మ‌రి? " అన్నాడు నాన్న‌.
స్కూట‌ర్ స్టార్ట్ చేశాడు నాన్న‌. అమ్మ ఒడిలో హాయిగా కూర్చుని విప్పారిన క‌ళ్ళ‌తో అన్నీ చూస్తున్నాడు బాబు. స్కూట‌ర్ వెళుతుంటే రివ్వుమని త‌గులుతున్న చ‌ల్ల‌ని గాలికి కేరింత‌లు కొడుతున్నాడు. అమ్మ వెచ్చ‌ని ఒడిలో, భ‌ద్ర‌మైన చేతుల మ‌ధ్య ఒద్దిక‌గా ఒదిగి పోయి, క‌ళ్ల ముందు క‌దిలిపోతున్న లోకాన్ని వింత‌గా చూస్తున్నాడు. ఏదో తెలియ‌ని ఆనందంతో ఉత్సాహ‌ప‌డుతున్నాడు. 
స్కూట‌ర్ ఆగింది. అమ్మ బాబును జాగ్ర‌త్త‌గా పొదివి ప‌ట్టుకుని దిగింది. అమ్మ భుజం మీద త‌ల‌పెట్టి చూస్తున్నాడు బాబు. 
లోప‌లికి వెళ్లి అమ్మ కూర్చునేస‌రికి నాన్న వ‌చ్చి, జేబులోంచి చాక్లెట్ తీసి బాబు నోట్లో పెట్టాడు. తీయ‌గా, హాయిగా చ‌ప్ప‌రిస్తూ ఆడుతున్నాడు బాబు. 
కాసేపటికి న‌ర్స్ వ‌చ్చి, "రండ‌మ్మా..." అంది.
అమ్మ చేతుల్లోంచి నాన్న భుజం మీద‌కి మారాడు బాబు. 
గ‌దిలోప‌లికి వెళ్లారు. 
"ఏమంటున్నాడు మీ వాడు?" అన్నాడు అక్క‌డున్న డాక్ట‌ర్‌. 
"ఇప్ప‌టికి దాకా హుషారుగానే ఉన్నాడు సార్‌. ఇప్పుడు చూడాలి..." అంటూ స‌న్న‌గా న‌వ్వాడు నాన్న‌. డాక్ట‌ర్ కూడా న‌వ్వేస్తూ స్టెత‌స్కోప్ బాబు గుండెల మీద పెట్టాడు. ఆ గొట్టాన్ని ప‌ట్టుకుని ఆడసాగాడు బాబు. ఆయ‌న అన్నీ ప‌రీక్షించి, "ఓకే... " అని, ఆ త‌ర్వాత న‌ర్స్‌ని పిలిచాడు. న‌ర్స్ వ‌చ్చింది. ఆమె చేతిలో ఇంజ‌క్ష‌న్‌! బాబుని భుజం మీద పెట్టుకుని త‌ల నొక్కి ప‌ట్టాడు నాన్న‌. అమ్మ ఆ ప‌క్క‌కి తిరిగిపోయింది. న‌ర్స్ బాబు లాగుని కొంచెం కిందికి లాగింది. దూదితో స్పిరిట్ రాసింది. చ‌ల్ల‌గా త‌గిలింది బాబుకి. ఆ వెంట‌నే... చురుక్కుమంటూ సూది దిగింది. ఆ బాధ ఒక్క‌సారిగా తెలిసేస‌రికి కెవ్వుమ‌న్నాడు బాబు. లేద్దామంటే న‌న్న చేయి బిగుసుకుంది. గ‌ట్టిగా త‌ల అదిమి పెట్టింది. 
బాబుకి ఏదో తెలియ‌ని బాధ‌. అంత‌కు మించి కోపం. ఏం చేయాలో తోచ‌క నాన్న మొహం మీద గుద్ద‌డం మొద‌లు పెట్టాడు. చిట్టి గోర్ల‌తో ర‌క్కేశాడు. ఇంతలో అమ్మ వ‌చ్చి బాబుని తీసుకుంది. అమ్మ చేతుల్లోనూ గింజుకున్నాడు. కాళ్ల‌తో త‌న్నాడు. చేతుల‌తో కొట్టాడు. "లేదు... నాన్నా... త‌గ్గిపోతుందిలే..." అంటూ బాబు కొడుతున్న‌కొద్దీ గుండెల‌కు హ‌త్తుకుంది అమ్మ‌. అమ్మ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు. నాన్న క‌న్నుల్లో స‌న్న‌టి నీటి తెర‌. 
బాబుకి మాత్రం కోపం త‌గ్గ‌లేదు. టాటాకి బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్ప‌టి ఉత్సాహం ఇప్పుడు లేదు. పైగా ఎందుకో అమ్మా, నాన్న‌ల మీద  విప‌రీత‌మైన కోపం, ఉక్రోషం!!
******
మ‌న ప‌రిస్థితీ ఆ బాబులాంటిదే. మ‌న జీవితంలో కూడా ఉన్న‌ట్టుండి ఏదో తెలియ‌ని బాధ చ‌టుక్కున ఎదుర‌వుతుంది. ఉత్సాహంగా ఉన్న మ‌న‌కి చురుక్కుమ‌నిపిస్తుంది. అప్పుడు ఆ బాబులాగే మ‌నకి కూడా భ‌గ‌వంతుడి మీద కోపం వ‌స్తుంది. మ‌న న‌మ్మ‌కం అంతా ఒక్క‌సారిగా వీగిపోయిన‌ట్టు అనిపిస్తుంది. ఏదో మోసం జ‌రిగిపోయిన‌ట్టు బాధ‌ప‌డ‌తాం. కానీ ఆ అమ్మా నాన్న‌ల లాగే ఆ భ‌గ‌వంతుడు కూడా బాధ ప‌డ‌తాడు. బాబు ఆరోగ్యంగా పెర‌గాలంటే అలాంటి ఇంజెక్ష‌న్ అవ‌స‌ర‌మ‌ని అమ్మానాన్న‌ల‌కి తెలుసు. అందుకే ద‌గ్గ‌రుండి మ‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి నెప్పి క‌లిగించారు. మ‌నం జీవితంలో మ‌రింత రాటుదేలాలంటే ఆ క‌ష్టం అనివార్య‌మ‌ని భ‌గ‌వంతుడికి తెలుసు. కానీ ఆ బాబులాగే... మ‌న‌కి మాత్రం ఆ క్ష‌ణంలో అర్థం కాదు. ఎందుకంటే మ‌నం కూడా ఆ బాబులాగే ఎదిగీఎద‌గ‌ని వాళ్లం!

గురువారం, జూన్ 18, 2020

దాన‌శీలి క‌ల‌!



పూర్వం అవంతీ రాజ్యంలో, మ‌హారాజు ఆంత‌రంగిక సలహాదారు ప‌ద‌వికి ఖాళీ ఏర్ప‌డింది. అంత‌వ‌ర‌కు ఆ ప‌ద‌విలో ఉన్న జ‌యానందుడు వార్థ‌క్య భారానికి తోడు, అనారోగ్యానికి గురి కావ‌డంతో, ఆ స్థానానికి మ‌రొక‌రిని ఎంపిక చేయ‌వ‌ల‌సి వ‌చ్చింది. ఈ విషయం రాజు వీర‌వ‌ర్మ‌కొక  స‌మ‌స్య‌గా మారింది. కార‌ణం, ఎంతో సూక్ష్మ బుద్ధిగ‌ల జ‌యానందుడు, ఇంత‌వ‌ర‌కు ఆ ప‌ద‌విని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాడు. 
    ఒక‌నాడు రాజు ఈ విష‌యం గురించి త‌న మంత్రి సుబుద్ధితో ప్ర‌స్థావించ‌గా, ఆయ‌న, "మ‌హారాజా! ముందు దేశంలో రాజ‌నీతి, ఆర్థిక, న్యాయ శాస్త్రాల‌ను అభ్య‌సించిన వారినంద‌రినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విష‌య‌మై ప‌రీక్ష నిర్వ‌హించి, అందులో ప్ర‌తిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ త‌ర్వాత జ‌యానందుడి స‌ల‌హాపై, వారిలో ఒక‌రిని త‌మ ఆంత‌రంగిక స‌ల‌హాదారుగా నియ‌మించ‌వ‌చ్చు" అని స‌ల‌హా ఇచ్చాడు. 
     రాజు ఇందుకు స‌మ్మ‌తించ‌గానే, మంత్రి వెంట‌నే దేశ‌మంత‌టా చాటింపు వేయించాడు.
   ఈ చాటింపు విని దేశం న‌లుమూల‌ల నుంచి అనేక‌మంది యువ‌కులు వ‌చ్చారు. వారందరికీ శాస్త్ర‌ప‌ర‌మైన ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, జ‌యుడు, విజ‌యుడు అనేవాళ్లు ప్ర‌థ‌ములుగా నిలిచారు. వాళ్లిద్ద‌రూ స‌మ ఉజ్జీలు కావ‌డంతో మంత్రి సుబుద్ధి, జ‌యానందుడిని కలుసుకుని సంగ‌తి వివ‌రించాడు.
    జ‌యానందుడు అంతా విని, "ఆంత‌రంగిక స‌ల‌హాదారుడ‌న్న‌వాడు శాస్త్రాల‌లో పండితుడైనంత మాత్రాన స‌రిపోదు. క్లిష్ట మైన స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు, వాటిని ప‌రిష్క‌రించ‌గ‌ల యుక్తి కూడా అత‌నికి కావాలి. శాస్త్ర‌ప‌రంగా ఉద్దండులైన ఆ యువ‌కులిద్ద‌రిలో ప‌ద‌వికి ఎవ‌రు అర్హులో ఈ ఆఖ‌రు ప‌రీక్ష నిర్ణ‌యిస్తుంది అని, ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివ‌రించాడు.
   మ‌ర్నాడు మంత్రి జ‌యుణ్ణీ, విజ‌యుణ్ణీ పిలిపించి, కొద్దిసేపు వాళ్ల‌తో, ఆ మాటా, ఈమాటా మాట్లాడిన త‌ర్వాత ముఖం విచారంగా పెట్టి, "ఈమ‌ధ్య నా మిత్రుడొక‌డు చాలా విషాద ప‌రిణామానికి గురి అయ్యాడు. అది మీరిద్ద‌రూ విన‌ద‌గిన సంగ‌తి!" అన్నాడు. 
    త‌ర్వాత మంత్రి సుబుద్ది, త‌న మిత్రుడి గురించి చెప్పిన వివ‌ర‌రాలిలా ఉన్నాయి.

   మంత్రి సుబుద్ధి మిత్రుడైన దాన‌శీలి వ‌యోవృద్ధుడు; ఆయ‌న‌కు కొంత‌కాలంగా గుండె జ‌బ్బులాంటిది కూడా ఉన్న‌ది. ఒక‌నాటి రాత్రి దాన‌శీలికి ఒక భ‌యంక‌ర‌మైన క‌ల వ‌చ్చింది. ఆ క‌ల‌లో ఆయ‌న, ఒక కార‌డ‌విలో దారి త‌ప్పిపోయాడు. ఆయ‌న చెట్ల మ‌ధ్య ప‌డుతూ లేస్తూ అతి క‌ష్టం మీద ప్ర‌యాణం సాగించి, చివ‌ర‌కు ఒక మైదాన ప్ర‌దేశాన్ని చేరాడు. పైన న‌క్ష‌త్రాలు మిణుకు మిణుకుమంటున్న‌వి. ఆ గుడ్డి వెలుగులో ఆయ‌న‌కు నాలుగు దారులు గ‌ల, ఒక కూడ‌లి ప్ర‌దేశం క‌నిపించింది. ఆయ‌న ఆ దారుల‌లో ఒక‌దాని వెంట న‌డ‌వ‌సాగాడు. కొంత‌దూరం వెళ్లేస‌రికి, దారే క‌నిపించ‌నంత‌గా పొద‌లూ, చెట్ల గుబుళ్ల‌తో నిండిన ప్ర‌దేశం వ‌చ్చింది. అక్క‌డ కొన్ని సింహాలు తిరుగుతున్నవి. వాటిలో ఒక సింహం దాన‌శీలిని చూసి భ‌యంక‌రంగా గ‌ర్జిస్తూ‌, ఆయ‌న కేసి రాసాగింది. 
    దానశీలి ప్రాణ‌భ‌యంతో వెనుదిరిగి ప‌రిగెత్తి, కొంత సేప‌టికి కాలిదారుల కూడ‌లికి చేరాడు. సింహం జాడ‌లేదు. ఆయ‌న అల‌స‌ట తీర్చుకున్నాక‌, రెండో దారి వెంట న‌డ‌వ‌సాగాడు. కొంత‌దూరం వెళ్లాక ఆయ‌న‌కు పెద్ద వెలుగు క‌నిపించింది. దాన‌శీలి ఒక పొదచాటుకు చేరి, ఆ వెలుగు వ‌స్తున్న వైపు చూశాడు. ఆ ప్ర‌దేశంలో అనేక‌మైన పెద్ద పెద్ద పుట్ట‌లున్న‌వి. వాటిపై కాల‌స‌ర్పాలు ప‌డ‌గ‌లు విప్పి ఆడుతున్న‌వి. ఆ ప‌డ‌గ‌ల‌పై ఉన్న మ‌ణులు, కాంతులు విర‌జిమ్ముతూ ప్ర‌కాశిస్తున్న‌వి. 

   ఆశ్చ‌ర్యంతో, ఆ దృశ్యాన్ని చూస్తున్న దాన‌శీలిని, పుట్ట‌ల మ‌ధ్య ఆడుతున్న ఐదు త‌ల‌ల మ‌హాస‌ర్పం ఒక‌టి చూసి, బుస‌లు కొడుతూ అమిత‌వేగంతో ఆయ‌న‌కేసి రాసాగింది. ఆయ‌న గిరుక్కున వెనుదిరిగి, శ‌క్తికొల‌దీ ప‌రిగెత్తి, తిరిగి నాలుగు దారుల కూడ‌లిని చేరాడు. మ‌హాస‌ర్పం జాడ‌లేదు. 
    ఈసారి దాన‌శీలి మూడ‌వ దారిగుండా న‌డ‌వ‌సాగాడు. కొంత‌దూరం వెళ్లాక, ఆ దారి ఓ కొండ ద‌గ్గ‌ర ఆగిపోయింది. ఆ ప్ర‌దేశాన ఆయ‌న‌కు, కొన్ని మాన‌వ కంకాళాలు క‌నిపించాయి. కీడు శంకించిన దాన‌శీలి, వెనుదిరిగేలోప‌లే, దాపుల వున్న గుహలోంచి భ‌యంక‌రాకారుడైన రాక్ష‌సుడొక‌డు ముక్కు పుటాలు ఎగ‌ర‌వేస్తూ బ‌య‌ట‌కి వ‌చ్చాడు. వాణ్ణి చూస్తూనే దాన‌శీలి కెవ్వుమంటూ అరిచి, ప‌రిగెత్తి నాలుగు దారుల కూడ‌లిని చేరాడు.
    అయితే, రాక్ష‌సుడు పెద్ద‌గా హుంక‌రిస్తూ, త‌న‌కేసి రావ‌డం చూసిన వెంట‌నే అక్క‌డున్న నాలుగ‌వ దారి వెంట ప‌రిగెత్తాడు. ఆ దారి అత‌ణ్ణి కొండ అంచుకు చేర్చింది. దానికి దిగువ‌న పెద్ద అగాధ‌మున్న‌ది. వెనుక రాక్ష‌సుడు; ముందు అగాధం! ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దాన‌శీలి నిలువెల్లా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంత‌లో, కాళ్ల కింద ఉన్న రాయి జారింది. ఆయ‌న కెవ్వుమ‌ని అరుస్తూ అగాధంలోకి ప‌డిపోయాడు.
    మంత్రి ఇలా చెప్పి, ఒక క్ష‌ణం ఆగి జ‌య‌, విజ‌యుల‌తో, "చూశారా, ఎంత భ‌యంక‌ర‌మైన క‌లో! అస‌లే గుండెజ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న‌, నా మిత్రుడు దాన‌శీలి, క‌ల నుంచి మెల‌కువ వ‌స్తూనే, గుండెపోటుకు గురి అయి మ‌ర‌ణించాడు" అన్నాడు.

    అప్పుడు జ‌యుడు ఎంతో విచారంగా, "స్వ‌ప్నంలో క‌లిగే అనుభూతుల‌కు శ‌రీరం కూడా లోన‌వుతుంద‌ని, మ‌న‌స్తత్వ శాస్త్రం చెబుతున్న‌ది. త‌మ మిత్రుడు క‌ల‌లో నాలుగుసార్లు ప్రాణ భ‌యానికి లోన‌య్యాడు. అస‌లే గుండెజ‌బ్బు మ‌నిషి క‌నుక‌, ఆ వ‌త్తిడికి త‌ట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మ‌ర‌ణానికి, నా ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నాను" అన్నాడు.
    మంత్రి త‌ల‌పంకించి, విజ‌యుడికేసి చూశాడు.
   విజ‌యుడు చిరున‌వ్వు న‌వ్వుతూ "క్ష‌మించాలి, మ‌హామంత్రీ! మీరు చెప్పిన‌దంతా ఒక క‌ట్టుక‌థ‌అన్నాడు.
    మంత్రి కోపంగా, "అదెలా క‌ట్టుక‌థో నిరూపించ‌గ‌ల‌వా? "అన్నాడు. 
    దానికి విజ‌యుడు విన‌యంగా, "మీ మిత్రుడు మెల‌కువ వ‌స్తూనే, గుండెపోటుకు గురై వెంట‌నే చ‌నిపోయిన‌ప్పుడు, ఆయ‌న‌కు క‌ల వ‌చ్చిన విష‌యం మీకు తెలిసే అవ‌కాశం లేదు క‌దా!" అన్నాడు.
    మంత్రి సుబుద్ధి, విజ‌యుణ్ణి అభినందించి, అప్ప‌టిక‌ప్పుడే అత‌ణ్ని రాజు వీర‌వ‌ర్మ‌కు ఆంత‌రంగి స‌ల‌హాదారుగా నియ‌మించాడు. 
Published in "CHANDAMAMA" children's Magazine in April, 1992.