'కొంటె బొమ్మల బాపు...
కొన్ని తరముల సేపు...
గుండెలూయలలూపు!'
అంటూ ఆరుద్ర కూనలమ్మ పదాల మాలికతో బాపుపై భక్తిని చాటుకున్నారు.
గీసిన బొమ్మలయినా, తీసిన బొమ్మలయినా...
అవి చూసినవారి గుండెల్లో బొమ్మల కొలువులాగా కళకళలాడిపోతాయి.
ఏమని చెప్పగలం బాపు సినిమాల గురించి!
కళ్ల ముందు నుంచి ఆయన తరలి వెళ్లిపోయిన తర్వాత కన్నీరు నిండిన కళ్లలో ఆయన చిత్రాలే సినిమా రీలులాగా కదులుతున్నాయి.
ఒకో సినిమా ఒకో రసరమ్య గీతమై అభిమానుల మనసుల్లో తారాడుతున్నాయి. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' దాకా ఆయన వెండితెరపై మలిచిన ఏ సినిమాను తల్చుకున్నా అదొక తీయని అనుభూతినే గుర్తుకు తెస్తుంది.
ఆయన సినిమాలు... చిత్రసీమ ముంగిట్లో ముత్యాల ముగ్గులు!
సినిమా రంగం సింహద్వారానికి కట్టిన మామిడాకు తోరణాలు!
సినీ వేలుపు మెడలో అలంకరించిన నిలువెత్తు కనకాంబరం దండలు! వాటికి వేవేల దండాలు...! ఏ సినిమా చూసినా ఆయన విలక్షణమైన ముద్ర కనిపిస్తుంది. అందుకే చిత్రరంగంపై అవన్నీ చెరిగిపోలేని, మరిచిపోలేని ముద్రను వేశాయి. ఒకో సినిమా ఒకో రకం అనుభూతిని, రసానుభూతిని ప్రేక్షకుల గుండెల్లో మిగిల్చినవే.
సినిమా ఎలా ఉండాలో ఆయనకు సుస్పష్టమైన అవగాహన ఉంది. అంతకు ముందు తీసే తీరుపై అంతులేని నమ్మకం ఉంది. అందుకనే 1967లో తొలి సినిమా 'సాక్షి' తీస్తూనే 'ఇది సాక్షినామ సంవత్సరం' అని నిబ్బరంగా చాటుకోగలిగారు. ఆ ప్రచారం చూసి కొందరు 'పొగరు' అన్నారు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక తెలిసింది అది ఆత్మవిశ్వాసం అని! ఇండోర్ స్టూడియోల గదుల్లో, కృత్రిమ సెట్టింగుల హంగుల మధ్య సినిమాలు చూసిన ప్రేక్షకులకు 'సాక్షి' ఓ సరికొత్త వాతావరణాన్ని చూపించింది. ఔట్‌డోర్‌లో పకడ్బందీగా తీస్తే సహజత్వం ఎలా వెల్లివిరుస్తుందో సినిమావాళ్లకు కూడా చవిచూపించింది. ఇప్పటికీ చెప్పుకోదగిన ఓ పాఠంలా మిగిలింది. పల్లెటూరిలోని మనుషుల నైజాలను నిజాలుగా ఆవిష్కరించింది. అందుకనే ప్రతి వూరూ ఆ సినిమాను తనదనుకుంది. మన వూర్లోనే జరిగిన కథనుకుంది. ఆదరించి అక్కున చేర్చుకుంది.
అందులో 'అమ్మకడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా... బతకరా... బతకరా పచ్చగా...' అనే పాటను కేవలం ఒకటి రెండు రోజుల్లో తీసినట్టు బాపు ఓ సందర్భంలో చెప్పారు. కొన్నేళ్ల తర్వాత ఆ విషయమై ఎవరో ప్రస్తావిస్తే 'ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్' అని నవ్వేశారాయన. తన సినిమాల మీద తనే కార్టూన్లు వేసుకోగలిగిన నిబ్బరి బాపు. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో బాపు తీసిన 'బుద్ధిమంతుడు' (1969) చిత్రం కూడా పల్లె రాజకీయాలను కళ్లకు కడుతుంది. అందులో అక్కినేనిని ఆయన పూర్తి ఆస్తికుడైన అన్నయ్యగా, పరమ నాస్తికుడైన తమ్ముడిగా రెండు విభిన్నమైన కోణాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా... బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా...' అంటూ తిరిగే తమ్ముడికి, 'నను పాలించగ నడచి వచ్చితివా...' అంటూ భక్తితత్పరతతో మైమరచి పోయే అన్నయ్యకి తేడా చూపించిన తీరు అద్వితీయం.
'అంతా భగవంతుడు చూసుకుంటాడనే' అన్నయ్యకు, సమాజంలోని అన్యాయాన్ని ఎదురించేవాడు నాస్తికుడైనా దేవుడికి ఇష్టుడవుతాడని చెప్పించిన తీరు మనసులకు హత్తుకుంటుంది. గోదావరి అన్నా, తీర ప్రాంతాలన్నా బాపుకి ఎంత ఇష్టమో 'అందాల రాముడు' (1973) సినిమా చూస్తే అర్థం అవుతుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో జరిగే ప్రయాణంగా సాగిపోయే ఈ సినిమా గోదావరి అందాలకు పట్టిన నీరాజనం! ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం! ఈ ప్రయాణంలోనే పేద, ధనిక తారతమ్యాలు, సమాజంలో విభిన్న మనస్తత్వాలు అన్నీ తారసపడి ప్రేక్షకులను కూడా గోదావరి లాంచీపై ఆహ్లాదకరమైన ప్రయాణం చేయిస్తాయి. వీటి మధ్యలో అల్లుకున్న ఓ చక్కని ప్రేమకథ సినిమాను రక్తి కట్టిస్తుంది. 'మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్...' అని 'రాముడేమన్నాడోయ్' పాటలో చెప్పిస్తారు. ఇందులో ప్రతి పాటా ఓ రసగుళికే.
ఇక 'ముత్యాల ముగ్గు' (1975) మరో అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించింది. అందులో ముళ్లపూడి వెంకట రమణ రాసిన సంభాషణలన్నీ రికార్డులాగా వెలువడి రికార్డు సృష్టించాయి. ఆయన సంభాషణలకు తగినట్టుగా అందులో కాంట్రాక్టర్ అనే విలన్ పాత్రను బాపు మలిచిన తీరు అద్వితీయం. అపురూపం. 'మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా...', 'డిక్కీలో తొంగోబెట్టేస్తాను...', 'ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు సెప్పాల...' 'ఏముందీ నిన్ను కరుసు రాయించి ఆయన కాతాలో జమేస్తే సరి...' లాంటి డైలాగులను రావుగోపాలరావు చేత పలికించిన పంథా విలనిజానికి విలక్షణతను ఆపాదించాయి. ఈతరం పిల్లలు ఇప్పుడు ఆ సినిమాను చూసినా అందులో మమేకమైపోతారనడంలో సందేహం లేదు. 'ఏదో ఏదో అన్నది... ఈ మసక వెలుతురు... గూడి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు...' 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది...' పాటలను బాపు వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను మంత్రుముగ్ధుల్ని చేస్తుంది. అందుకే ఆ సినిమా బాపు తీసిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
కృష్ణంరాజు, వాణిశ్రీలతో తీసిన 'భక్త కన్నప్ప' (1976) భక్తి ప్రధానమైన సినిమాను కూడా ఎలా వ్యాపారాత్మకంగా, జనరంజకంగా తీయవచ్చో చెబుతుంది. అప్పటికి కృష్ణంరాజు, వాణిశ్రీకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ వేరు. కమర్షియల్ పంథాలో సాగుతున్న వారిని ఓ పౌరాణిక నేపథ్యంలో ఉన్న కథలో పాత్రలుగా చూపిస్తూనే అప్పటి యువతకి నచ్చే విధంగా పాటలు, పోరాటాలతో చక్కగా మలిచారు బాపు.
అలాగే పాండవులు, కృష్ణుడి పాత్రలను సాంఘికంగా మలుస్తూ ఓ పల్లెటూరిలో జరిగే రాజకీయాలు, అన్యాయాల నేపథ్యంలో తీసిన 'మనవూరి పాండవులు' (1978) ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో కూడా రావుగోపాలరావును ప్రతినాయకుడిగా తీర్చిదిద్దిన తీరు పల్లెటూరి మోతుబరుల అకృత్యాలకు అద్దం పడుతుంది. ఈ అన్యాయాలను సహించలేని ఐదుగురు యువకులను పాండవులుగా తీర్చిదిద్దుతూ, ప్రతినాయకుడి తమ్ముడి పాత్రలో కృష్ణంరాజును సాంఘిక కృష్ణుడిగా చూపించడం బాపు విలక్షణ శైలికి అద్దం పడుతుంది. 'పాండవులు పాండవులు తుమ్మెద...', 'ఒరేయ్ పిచ్చి సన్నాసి...' లాంటి పాటల చిత్రీకరణ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటారు. చిత్రం చివర్లో వూరందరూ చైతన్యవంతులై రావుగోపాలరావు అనుచరులను తరిమికొడుతున్నప్పుడు కృష్ణంరాజు చేత 'మేలుకున్న వూరు దేవుడి విశ్వరూపం లాంటిది...' చెప్పించినప్పుడు థియేటర్లలో చప్పట్లు మోగుతాయి. చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చిన తొలిచిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. ఆ తర్వాత కాలంలో చిరంజీవి కథానాయకుడిగా తీసిన 'మంత్రిగారి వియ్యంకుడు' (1983) మరో చిరస్మరణీయమైన సినిమాగా నిలిచిపోయింది.
ప్రయోగాలకు కూడా బాపు పెద్ద పీట వేసేవారు. ఓ చిన్నపిల్లవాడి కథతో తీసిన 'బాలరాజు కథ' ఇప్పటికీ పిల్లల్ని, పెద్దల్నీ ఆకట్టుకుంటుంది. ఆ కథలో ఓ గుడిలో రాసి ఉన్న నీతి సూత్రాలు ఓ పిల్లవాడి జీవితంలో ఎలా నిజమయ్యాయో, అవి ఆ పసి మనసుకు ఎంత గొప్ప జీవిత సత్యాలు బోధించాయో పిల్లల స్థాయిలో చిత్రీకరించిన తీరు ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోతుంది. అలాగే వాణిశ్రీని మేకప్ లేకుండా చూపించాలనుకోవడం అప్పట్లో ఓ సాహసం. ఆ సాహసాన్ని 'గోరంత దీపం' చిత్రంలో చేశారు బాపు. ఆ చిత్రం వ్యాపారాత్మకంగా విజయవంతం కాలేదనే సత్యాన్ని స్వీకరిస్తూ గోరు మీద దీపం కాలుతున్నట్టుగా కార్టూన్ వేసి అభిమానులను నవ్వించారు బాపు. వ్యాపారాత్మకతలను పక్కన పెడితే గోరంత దీపంలో తెలుగు వాడి ఆత్మ కనిపిస్తుంది. మధ్యతరగతి లోగిళ్లలోని విచిత్రమైన మనస్తత్వాలను వాస్తవికమైన రీతిలో ప్రతిబింబించిన తీరు, బాపు చిత్రీకరణలోని విలక్షణ శైలిని చాటి చెబుతుంది.
ఇక 'పెళ్లి పుస్తకం..'. ఈ సినిమా గురించి ఏమని చెప్పాలి? ఉద్యోగాల కోసం 'పెళ్లి కాలేద'ని అబద్దం చెప్పిన ఓ జంట కథ ఇది. 'శ్రీరస్తు.. శుభమస్తు..' పెళ్లి పాటకు ఓ బ్రాండ్ అయిపోయింది. ఈ పాటని బాపు తెరకెక్కించిన విధానం నభూతో.. నభవిష్యత్ అనొచ్చు. 'మిస్టర్ పెళ్లాం'ది మరో వింత. ఉద్యోగం చేస్తున్న భార్య, వంటింట్లో గరెటె తిప్పుతున్న మగాడు.. అదీ కథ. మగవాడి మనస్తత్వానికి రాజేంద్రప్రసాద్ పాత్ర పరాకాష్ట. చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం'లోనూ బాపు ముద్ర స్పష్టంగా కనిపించింది. వయసు మీరినా ఆయన మార్క్ చెరగలేదనడానికి... అదో నిదర్శనంలా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతే.. ప్రతి సినిమా భావి దర్శకులకు ఓ పాఠంలా మారిపోతుంటుంది. తెలుగు సినీ వాకిట్లో ప్రతి చిత్రం ఓ ముత్యాల ముగ్గులా మెరిసిపోతుంటుంది.
PUBLISHED IN EENADU ON 01/09/2014