గురువారం, జనవరి 25, 2018

వైవిధ్యమైన నటనకు గీటురాళ్లెన్నో!



దర్పం, రాజసం ఉట్టిపడే 
ఓ అందాల రాజకుమారి... 
అందం, అమాయకత్వం ప్రతిబింబించే 
ఓ ప్రేయసి... 
చిలిపిదనం, చలాకీదనం కలగలిసిన 
ఓ పడుచుపిల్ల... 
హుందాతనం, గాంభీర్యం కనబరిచే ఓ ప్రౌఢ... 
నటి కృష్ణకుమారి నటజీవన ప్రస్థానంలో గుర్తుండిపోయే పాత్రలెన్నో! 
ఆమె అభినయ వైవిధ్యానికి గీటురాళ్లెన్నో!! 
పాత్ర ధరించినా ఆ పాత్రలో ఒదిగిపోవడం కృష్ణకుమారి నైపుణ్యం. ఎలాంటి నటనైనా అది ఆమెకే సాధ్యమనేలా మెప్పించడం ఆమెకు సుసాధ్యం. 
* తెలుగు చిత్రసీమకు రెండు కళ్లయిన   ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సరసన అసమాన అభినయాన్ని పండించి రాణిస్తూనే... కాంతారావుతో కలసి 28జానపద చిత్రాల్లో అభిమానులను అలరించారు. ఎన్టీఆర్‌తో దాదాపు 25 సినిమాలు, అక్కినేనితో సుమారు 18 చిత్రాలు చేసిన కృష్ణకుమారి వారితో దీటైన నటనతో ఆకట్టుకున్నారు. కాంతారావుతో ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు. ‘బందిపోటు’, ‘అగ్గి   పిడుగు’, ‘లక్షాధికారి’, ‘నిండు సంసారం’, ‘వరకట్నం’, ‘కులగోత్రాలు’, ‘భార్యాభర్తలు’, ‘జ్వాలాద్వీప రహస్యం’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘చిక్కడు దొరకడు’, ‘చదువుకున్న అమ్మాయిలు’ లాంటి సినిమాల్లో ఆమె నటన గుర్తుండిపోతుంది. ఆమె వైవిధ్యభరితమైన అభినయానికి వెండితెర ఆనవాళ్లు ఎన్నో... 

* అమ్మాయిల వెంటపడి తిరిగే ఓ సంపన్నుడు (అక్కినేని) తనను చులకనగా చూస్తే చెంప దెబ్బకొట్టిన ఆభిజాత్యం... అతడే పట్టుదల పట్టి తనను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయత... భర్తననే అధికారంతో అతడు తనను వశపరుచుకోవాలని చూసినప్పుడు నిబ్బరంగా తన అయిష్టతను వెలిబుచ్చే ధైర్యం... ఇవన్నీ ఒకే పాత్రలో ఆమె అభినయించిన తీరు ‘భార్యాభర్తలు’ సినిమాలో చిరస్మరణీయం. తనకిష్టంలేని వాడే పెళ్లిచూపులకు వచ్చినప్పుడు ‘ఏమని పాడెదనో ఈ వేళ... మానస వీణ మౌనముగా నిదురించిన  వేళ...’ పాటలో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. సినిమాలో ఒక సన్నివేశంలో  అక్కినేనితో ఆమె, ‘‘మనసు ప్రమేయం లేని ఈ దేహమేగా మీకు కావలసింది... అనుభవించండి’’ అంటూ శరీరాన్ని అప్పగిస్తున్నట్టుగా ముందుకొచ్చి నిలబడుతుంది. నటన మోతాదులో ఏ మాత్రం తేడా వచ్చినా  కరుణరసభరితమైన ఆ సన్నివేశం అభాసుపాలవుతుంది. అయితే కృష్ణకుమారి ఆ సన్నివేశాన్ని అద్వితీయంగా పండించారు. 

* తాను ప్రేమించింది ఓ సామాన్యమైన యువకుడిని (జగ్గయ్య)... కానీ అతడి స్నేహితుడు (ఎన్టీఆర్‌) తనను ఇష్టపడతాడు.ప్రియుడి త్యాగంతో అతడి స్నేహితుడికే ఇల్లాలవుతుంది... పెళ్లయ్యాక భర్తకు   అనుమానం మొదలవుతుంది... ఇలాంటి కథతో నడిచే ‘గుడిగంటలు’ సినిమాలో కత్తిమీద సాములాంటి పాత్రను కృష్ణకుమారి అలవోకగా మెప్పించారు. ఓ కన్నెపిల్లగా చలాకీతనాన్ని చూపినా... ప్రేమించినవాడితో పెళ్లికాని పరిస్థితుల్లో బేలతనాన్ని కనబరచినా... పెళ్లయ్యాక భర్త అనుమానిస్తున్నా నిశ్చలంగా తన పవిత్రతను నిరూపించుకునే హుందాతనాన్ని ప్రదర్శించినా కృష్ణకుమారికే చెల్లింది. 
* దేశాన్ని గడగడలాడిస్తున్న బందిపోటును పట్టుకోడానికి వెళ్లే ఓ ధీరోదాత్తురాలైన రాజకుమారిగా... ఆ బందిపోటే ప్రజారంజకుడని తెలిసి మనసిచ్చిన అమ్మాయిగా... ఆకట్టుకునే కృష్ణకుమారిని ‘బందిపోటు’ సినిమాలో చూస్తాం. 

* ఇంకా... కులం గోత్రం లేని పిల్లను పెళ్లాడావంటూ అత్తింటి వారు వెలివేస్తే వారి కోసమే పాటుపడుతూ... కులం కన్నా గుణం మిన్న అని నిరూపించి కుటుంబాన్ని కలిపే కోడలిగా ‘కులగోత్రాలు’ సినిమాలో ఆమె నటన మరుపురానిదే. అలాగే... పేదింటి పిల్లగా ఒకరిని ప్రేమించినా,   సంపన్నురాలైన తన స్నేహితురాలు కూడా అతడినే ప్రేమిస్తోందని తెలిసి మానసికంగా నలిగిపోయే పాత్రలో ‘చదువుకున్న అమ్మాయిలు’లో చక్కని నటన చూపించింది. అన్ని వ్యసనాలు ఉండి కూడా కపట వేషాలతో తనను ప్రేమించిన వాడిని తన అమాయకత్వంతో ఆకట్టుకుని అతడిని మంచి మార్గంలోకి మార్చిన అమ్మాయిగా ‘అంతస్తులు’ సినిమాలో అలరించింది. ఇక జానపద, పౌరాణిక చిత్రాల్లో కూడా పాత్రకు తగినట్టు ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కృష్ణకుమారి.
PUBLISHED IN EENADU ON 25.01.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి