గురువారం, జనవరి 25, 2018

అందంగా... అమాయకంగా... అభినయంలో అపురూపంగా


‘‘చెడిపోవడమనేది మనిషి  మనసును బట్టి ఉంటుంది. నీ వ్యక్తిత్వం, నీ మనోబలం స్థిరంగా ఉంటే ఎక్కడున్నా చెడు జరగదు. నువ్వు సినిమాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.  మిగతాది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’
- ఇది ప్రముఖ నటి కృష్ణకుమారికి వాళ్ల నాన్నగారు రాసిన ఉత్తరం. సినిమాల్లో అవకాశాల గురించి ఆయనకు తెలియజేస్తూ కృష్ణ కుమారి 70 ఏళ్ల క్రితం రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరమిది. మంచి చెడుల వ్యత్యాసం గురించి చెబుతూనే తాను ఎంచుకున్న రంగంలో ప్రవేశానికి అనుమతిస్తూ ఆయనిచ్చిన ప్రోత్సాహం తెలుగు చలన చిత్రసీమకు ఓ అందాల తారను పరిచయం చేసింది. ఓ అసమాన నటి ముందడుగు వేయడానికి దోహదపడింది. అలా కృష్ణకుమారి 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో వెండితెరపై తొలి అవకాశాన్ని అందుకున్నారు. అయితే ఆ సినిమా కన్నా ముందు ‘మంత్రదండం’ విడుదలవడం విశేషం. అందంతో, అందుకు తగిన నాజూకు తనంతో, అమాయకత్వాన్ని ప్రతిబింబించే ముఖంతో వెండితెరపైకి అడుగుపెట్టిన కృష్ణకుమారి అలనాటి చిత్రాల్లో అప్పటి  యువకుల హృదయాలను కొల్లగొడుతూనే సహజమైన అభినయంతో ఆకట్టుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. 
చిన్నతనంలోనే వేదాంతం జగన్నాథశర్మ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న కృష్ణకుమారి, సినిమాల్లో ఎలాంటి పాటల్లోనైనా ఉత్సాహంగా నర్తిస్తూ ఆకట్టుకునేవారు. రెండున్నర దశాబ్దాల పాటు దాదాపు 150 చిత్రాల్లో నటించి వైవిధ్యమైన పాత్రలు పోషించిన కృష్ణకుమారి మూడుసార్లు జాతీయ అవార్డులను, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్‌ అవార్డులు, బ్రిటన్‌లోని బర్మింగ్‌హాం సంస్థ వారి జీవన సాఫల్య  అవార్డును... అన్నింటినీ మించి ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని అభిమానాన్ని ఆర్జించుకున్నారు. అలనాటి అగ్రతారలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో పాటు కాంతారావు, హరనాథ్‌, జగ్గయ్య లాంటి మేటి నాయకుల సరసన నటించి ప్రేక్షకాదరణ పొందారు. 

సంప్రదాయ కుటుంబానికి చెందిన కృష్ణ    కుమారి, పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో 1935లో పుట్టారు. ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆమె చిన్నవారు. ప్రముఖ నటి ‘షావుకారు జానకి’ ఆమె అక్కే. మరొక అక్క దేవకి కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆ తర్వాత చిన్నవయసులోనే చనిపోయారు. తండ్రి ఉద్యోగరీత్యా కృష్ణకుమారి పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. రాజమండ్రి, చెన్నై, అస్సాం, కోల్‌కతాల్లో చదువుకుని మెట్రిక్‌ పూర్తయ్యేనాటికి చెన్నైకి చేరారు. అదే ఆమె నట జీవితానికి మలుపుగా మారింది. ఇంటర్‌లో చేరేలోగానే ఆమెను వెండితెర  అవకాశం ఆహ్వానించింది. ఓసారి ‘స్వప్న సుందరి’ సినిమాకు వెళ్లిన కృష్ణకుమారి,  తమిళనాడు టాకీస్‌ సౌందరరాజన్‌ కుమార్తె భూమాదేవి కంటపడ్డారు. సౌందరరాజన్‌ తీయాలని తలపెట్టిన ఓ సినిమాలో కథా  నాయికగా అమాయకంగా కనిపించే అమ్మాయి కోసం వెతుకుతున్న ఆమెకు కృష్ణకుమారిలో ఆ లక్షణాలన్నీ కనిపించాయి. అలా వచ్చిన అవకాశం గురించి చెబుతూనే కృష్ణకుమారి అప్పటికి కోల్‌కతాలో ఉంటున్న తండ్రికి ఉత్తరం రాయడం, ఆయన వెంటనే సరేననడం జరిగిపోయాయి. ఆ సినిమానే ‘నవ్వితే నవరత్నాలు’. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఏకంగా 14 సినిమాల్లో అవకాశాలు వచ్చి   పడ్డాయి. అప్పటికి ఆమె వయసెంతనీ? కేవలం పదహారేళ్లు! 
సినిమాల్లో చురుగ్గా ఉన్న సమయంలోనే కృష్ణకుమారి, స్నేహితుల ద్వారా పరిచయమైన వ్యాపారవేత్త అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వారి కుమార్తె దీపిక. పెళ్లయ్యేనాటికి కృష్ణకుమారి నటించిన ‘నిండు సంసారం’, ‘వరకట్నం’ సినిమాలు విజయవంతంగా ఆడుతున్నాయి. అవకాశాలు చేతినిండా ఉన్నా ఆమె గృహిణిగానే ఉండడానికి ఇష్టపడ్డారు. అయితే పెళ్లయిన రెండేళ్లకు భర్త ప్రోత్సాహంతో నటించడం మొదలు పెట్టి దాదాపు 50 సినిమాలు చేశారు.
PUBLISHED IN EENADU ON 25.01.2018

2 కామెంట్‌లు: