పాటల తోటలో! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాటల తోటలో! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, జులై 23, 2026

జాతీయ స్థాయిలో ఓ గొప్ప పాట... అవార్డు వద్దన్న గీత రచయిత



 మరణం అనివార్యమే. కానీ అది ముందుగానే వచ్చి ఇంటి తలుపు తడితే  బాధాకరం. బాధ్యతలు తీరకుండానే, బంధాలు తెంచుకోమంటే విషాదం. కొన్ని రోజులకు మించి తనకు బతుకు లేదని తెలియడం కన్నా, ఆ సంగతి అర్థం కాని పసిపిల్లల గురించి ఆలోచించాల్సి రావడం ఘోరం. అందుకే ‘మాతృదేవోభవ’ సినిమా ఎన్నాళ్లయినా ప్రేక్షకుల మనసుల్ని మెలిపెడుతూనే ఉంటుంది. అందులో సన్నివేశాలు, పాటల్ని ఎప్పుడు తల్చుకున్నా తెలియకుండానే ఓ నిట్టూర్పు  గుండెల్ని తడిమిపోతుంది.

ఆ సినిమాలో ‘‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?’ అనే పాట... మరణాన్ని విశ్లేషిస్తుంది. బతుకును ప్రశ్నిస్తుంది. జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే

చిత్రం : మాతృదేవోభవ (1993)

సంగీతం : యం యం కీరవాణి

గీతరచన : వేటూరి

గానం : యం యం కీరవాణి 

:పల్లవి:


రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో చీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మా.... కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం..

 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే 

చరణం :1:

చెదిరింది నీ గూడు గాలిగా

చిలకా గోరింకమ్మ గాధగా...

చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా......

తనవాడు తారల్లో చేరగా...

మనసు మాంగళ్యాలు జారగా..

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...

తిరిగే భూమాతవు నీవై..

వేకువలో వెన్నెలవై..

కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హరతివై .. 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... 


చరణం :2: 

అనుబంధమంటేనె అప్పులే..

కరిగే బంధాలన్నీ మబ్బులే..

హేమంత రాగల చేమంతులే వాడిపోయే...

తన రంగు మార్చింది రక్తమే..

తనతో రాలేనంది పాశమే..

దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే...

పగిలే ఆకాశం నీవై... జారిపడే జాబిలివై..

మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీణియవై... 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే..

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే

 

మరణం అంచున ఉన్న ఒక తల్లి వేదన పాటలోని ప్రతి పదంలో ప్రతిధ్వినిస్తుంది. జీవితంలోని అనిశ్చితిని ఈ పాట హృదయవిదారకంగా వర్ణిస్తుంది.

వేటూరికి జాతీయ అవార్డు: తెలుగు పాటకు వన్నెతెచ్చిన దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తికి ఈ పాట జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.  అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారని చాలా తక్కువ మందికే తెలుసు. అందకు ఆయన చెప్పిన కారణం... “తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు” అనేది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు కె. అజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో ఆయన... ‘‘ఇది కేవలం నాకు వచ్చిన వ్యక్తిగత అవార్డు. నేను ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు ఒక్కడి కోసం కాదు..  మన జాతి, మన భాష కోసం” అని ఆయన వ్యాఖ్యానించారని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషాభిమానం, ఆత్మగౌరవం విషయంలో వేటూరి నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.  

సినిమా విజయం: కే.ఎస్. రామారావు (క్రియేటివ్ కమర్షియల్స్) నిర్మించిన ఈ సినిమాలోని పాటలన్నీ (వేణువై వచ్చాను, కన్నీటి కాలువలు) బాగా ప్రాచుర్యం పొందినవే.  సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు ఏడ్చేవారు.

మాతృదేవోభవ సినిమా నిర్మాణ వ్యయం 1993లో కేవలం 30 లక్షలు మాత్రమే. ఆ రోజుల్లో ఇది చాలా తక్కువ మొత్తం. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, దాదాపు 7 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

సినిమాలోని భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  నేపథ్యం: మాతృదేవోభవ చిత్రం మలయాళంలో హిట్టయిన 'ఆకాశదూతు' చిత్రానికి రీమేక్. బ్లడ్ క్యాన్సర్ బారిన పడి తన రోజులు దగ్గరపడ్డాయని తెలుసుకున్న తల్లి (మాధవి), తన మరణానంతరం తన నలుగురు బిడ్డలు అనాథలు కాకూడదని వారిని వేరే కుటుంబాలకు దత్తత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఆమె పడే మానసిక సంఘర్షణకు అద్దం పడుతూ సినిమా సాగుతుంది. 


 

సోమవారం, ఫిబ్రవరి 02, 2026

అడుగడుగున గుడి... అందులో దీపం!





 

అద్వైతం...దీని గురించి చెప్పాలంటే మహా మహా గ్రంథాలున్నాయి. అవన్నీ చదివినా అర్థం చేసుకోవడం కష్టమే. దీన మీద ఎన్నో సిద్ధాంతాలు, వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి చాలా సులువుగా, సరళంగా అద్వైతం సారాన్ని ఓ సినిమా పాటలో అందించాలంటే ఆ రచయితలో ఎంత పరిణతి ఉండాలి?

అలాంటి రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన రాసిన పాట గురించి ఇక్కడ తెలుసుకుందాం.

‘దేవుడు ఎక్కడో లేడు... నీలోనే ఉన్నాడు...’ అంటుంది అద్వైతం. కానీ ఆ సంగతి సామాన్యులకు కొరుకుడు పడదు. అవగాహనకు రాదు. కానీ దేవులపల్లి ఎంత చక్కగా చెప్పారో చూడండి.

‘‘అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది...

ఆ గుడిలో దీపముంది... అదియే దైవం...’’

గుడిని, గుడి పరిసరాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం? ఎంత పవిత్రంగా భావించుకుంటాం? మరి మనలోనే గుడి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అదే చెబుతారు ఆయన చరణంలో....

‘‘ఇల్లు, వాకిలి, ఒళ్లు, మనసు ఈశుని కొలువనిపించాలి...’’ ఎంత చక్కని వ్యక్తీకరణ. పూజలు, వ్రతాలు చేసేప్పుడు ‘‘యత్ స్మరేత్ పుండరీకాక్షం... సబాహ్యాభ్యంతర శుచి:’’ అని చదువుతారు. మన ఇల్లు, వాకిలితో పాటు మన ఒళ్లు, మనసు కూడా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలని ఒకే ఒక వాక్యంలో చెప్పారు. మనసు కూడా ఈశుని కొలువనుకుంటే ఎవరిలోనైనా ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు, కక్షలు ఉంటాయా? వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలని చిన్న పిల్లలకి సైతం, ఏమీ చదువుకోని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా చెప్పారు కృష్ణశాస్త్రి.

అందరిలోనూ గుడిని, ఆ గుడిలో దేవుడిని చూడగలిగితే ఒకరినొకరం ఎంత గౌరవించుకుంటాం? ఎంత ప్రేమిస్తాం? ఆ సంగతిని రెండో చరణంలో చెప్పారు.

‘‘తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం’’

మొదట ఇంట్లోంచే మొదలు పెట్టారాయన. కుటుంబంలో అందరూ ఇది గుర్తిస్తే ప్రతి ఇల్లు అద్భుతంగా మారిపోతుంది కదా? ఇంటి సంగతి చెప్పిన తర్వాత ఆయన సమాజం కేసి దృష్టి సారించారు. ఆపై ఈ  సమస్త సృష్టిని కూడా కలిపారు, తర్వాతి వాక్యంలో...

‘‘ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..’’ అనేటప్పటికి మనిషి విశ్వమానవుడిగా మారిపోతాడు. అందరినీ, అన్నిటినీ, ప్రతి ప్రాణినీ గౌరవించి ప్రేమించే స్థాయికి మనిషిని తీసుకెళిపోతారు ఆయన.

ఇప్పుడు ఆ పాటను పూర్తిగా చదవండి.

‘‘పల్లవి:
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది

చరణం 1:
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి

ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది

చరణం 2:
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..



చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : దేవులపల్లి
గానం: పి.సుశీల

 

విశేషణాలు సరిపోని విశిష్ట వ్యక్తి ... ‘దేవులపల్లి’

కొందరి గురించి చెప్పాలంటే విశేషణాలు వెతుక్కోవాలి. అసలు అవి సరిపోవు కూడా. అలాంటి వ్యక్తుల్లో ఒకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన గురించి ఓ వ్యాసంలో చెప్పలేం. ఓ పుస్తకం రాయాల్సిందే. దానికి కూడా మన జ్ఞానం, విశ్లేషణ శక్తి లాంటివి సరిపోవు. కాబట్టి తెలిసినంత వరకు సూర్యుడికి దివిటీ చూపించినట్టు ప్రయత్నం చేయాల్సిందే.

భావకవిగా, రచయితగా, గీత రచయితగా ఇంకా బహుముఖంగా సాహితీ సేవ చేసిన కృష్ణశాస్త్రి గోదావరి జిల్లా వారే. తూర్పగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని చంద్రపాలెం పుట్టిన ఊరు. 1897 నవంబరు 15న పుట్టిన ఈయన పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్ననాటి నుంచే రచనలు ఆరంభించారు. లలిత గీతాలు, పాటలు, భావ కవితలు, రేడియోలో నాటకాలు, కావ్యాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియలను జీవితాంతం కొనసాగించారు. విజయనగరంలో డిగ్రీ చేశాక పెద్దాపురంలో ఉపాధ్యాయుడిగా కొంత కాలం ఉన్నారు. తర్వాత 1920లో వైద్యంకోసం రైలులో వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. దాంతో ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశారు. 1929లో విశ్వకవి టాగూర్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో బి.ఎన్. రెడ్డి  ప్రోత్సాహంతో మల్లీశ్వరి (1951) చిత్రానికి పాటలు వ్రాశారు. సినిమా పాటలకు కావ్య గౌరవాన్ని కల్పించారు.

మొత్తం మీద దాదాపు 170 పాటలు రాశారు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని ఆయన రచనా పరంపర కొనసాగింది. ఆయన కి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980లో మరణించారు. జీవిత సాఫల్యానికి గుర్తుగా కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ, పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. 


ఆదివారం, ఫిబ్రవరి 01, 2026

వేటూరి పాటల్లో అలంకారాలు



వేటూరి సుందరరామమూర్తి జయంతి నివాళిగా అయన పాటలలో ని కొన్ని అలంకారాలను గుర్తు చేసుకుందాం. ఇవి కేవలం కొన్నే.  తెలుగు భాషలో అలంకారాలు వేటూరి పాటల్లో సొబగులద్దుకున్నాయి. భాషలో ఆయా అలంకారాల గురించి పూర్తిగా తెలియకపోయినా, ఆయన పాటలను తల్చుకుంటే కొంత వరకు తెలిసే అవకాశం ఉంది.
పాటలు - అలంకారాలు 
.......
అర్ధాలంకారాలు 
ఉపమాలంకారం   

త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది బొమ్మ  (శుభోదయం చిత్రం -  కంచికి పోతావా కృష్ణమ్మా )

పాలకడలిలా వెన్నెల పొంగింది..
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలను?
మనసున మమతై కడతేరగలను! -  పంతులమ్మ (మానస వీణ మధుగీతం) 

ఉత్ప్రేక్షాలంకారం 
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా
(శంకర నాద శరీర పర - శంకరాభరణం)

రూపకాలంకారం  

కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం (సాగర సంగమం - నాద వినోదం )

శబ్దాలంకారాలు 

లాటనుప్రాసాలంకారం    

మారేడు నీవని ఏరేరి తేనా..
మారేడు దళములు నీ పూజకు  (భక్త కన్నప్ప శివ శివ శంకర)

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి (సప్తపది - వ్రేపల్లియ ఎద జల్లున్న )

యమకాలంకారం  

ఐలవ్ యు ఓ హారిక మన ప్రేమకే జోహారిక  (ఛాలెంజ్)

వృత్యనుప్రాసాలంకారం   

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ
ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా   (చైతన్య) 

ఛేకానుప్రాసాలంకారం 

తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన
పిల్లదాని కొచ్చిందీ కళ... పెళ్లికళా..
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్లికొడుకు నవ్వితే తళా... తళ తళా  (అడవి రాముడు కోకిలమ్మ పెళ్ళికీ  )

తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా(ఇంటింటి రామాయణం -మల్లెలు పూసే)

అతిశయోక్తి అలంకారం :
రవి వర్మ కె అందని ఒకే  ఒక  అందానివో (రావణుడే రాముడైతే )
సారాలంకారం
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..(నాలుగు స్తంభాలాట  )
ముక్తపదగ్రస్తలంకారం
గజ్జెఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటుంది
గజ్జెఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటే... కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది

అంత్యానుప్రాసాలంకారం 

ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో

మంగళవారం, జనవరి 20, 2026

అమ్మాయిని పొగడడంలో... అగ్రతాంబూలం!



 



అబ్బాయి ప్రేమలో పడితే, అమ్మాయిలో అన్నీ అందాలే కనిపిస్తాయి. ఆ అందాన్ని పోల్చడానికి ఎన్నో ఉపమానాలు వెతుక్కుంటాడు. ఆమె ముఖంలో చందమామను చూస్తాడు. నవ్వులో వెన్నెలను గమనిస్తాడు. ఆమె నడకను హంసలతో, ఏనుగులతో పోలుస్తాడు. ఇక ఆ అబ్బాయి సినిమా హీరో అయితే, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే ప్రేమ గీతాలు వెలువడుతాయి. తొలి సినిమా నుంచి తాజా సినిమా వరకు దేన్ని తీసుకున్నా, అమ్మాయిని పొగడని ప్రేమ గీతాలు ఉంటాయా? ఒకో పాటది ఒకో ఒరవడి. సినిమా తీరును బట్టి, నిర్మాత అభిరుచిని బట్టి, గీత రచయిత సత్తాను బట్టి మాటలు మారవచ్చు... పోలికలు మారవచ్చు... భాష మారవచ్చు... భావం మారవచ్చు... కానీ పొగడ్తలు మాత్రం మారవు. ఇలాంటి పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నవే.

మరి ఇలాంటి పొగడ్తల్లో అత్యుత్తమమైనవేవి?

అలా వెతుకుదామనుకున్నా... పుంఖాను ఫుంఖాను పాటలు గుర్తుకొస్తాయి.  ఫలానాదే గొప్పదని చెప్పలేం కూడా.

అయితే ఒక్కసారి ఈ పొగడ్తలను చూడండి...

‘‘వెన్నెలలో... చల్లని గాలిలో... వీచే మల్లెల పరిమళానికి నువ్వు’’ అంటే ఏ అమ్మాయి పొంగిపోదు?

‘‘ఆకాశంలో తారలన్నీ అమ్మాయిలైతే, వాళ్లంతా చక్కిలిగింతలు పెట్టుకుంటూ సంబర పడుతుంటే... ఆ పరవశం నేనైతే, ఆ పరిమళం నువ్వు’’ అంటే అమ్మాయి ఎంత ఆనందపడిపోతుంది?

‘‘కోయిల పాటలో మాధుర్యమే నువ్వు...‘‘

‘‘చందమామతో కలువలు కులికే సరసమే నువ్వు...‘‘

‘‘అసలు అమ్మాయిలందరూ తమకు ఉండాలని కోరుకునే అందాలన్నీ నీవే... నిన్ను అందుకునే ఆనందమంతా నేను...’’

అబ్బో...ఇలాంటి అపురూపమైన పొగడ్తలన్నీ కలిసి ఒకే పాటలో ఉంటే?అదొక మంచి పాట అవుతుంది కదా?

ఈ పాటికి ఆ పాట గుర్తుకొస్తే... సరే!

లేకపోతే దాని గురించి చెప్పుకుందాం. అంత మంచి పాట రాసిన ఆ గీత రచయితని తల్చుకుందాం. ఎందుకంటే... ఆ పాట, ఆ రచయిత భాష రెండూ గొఫ్పవే మరి.

ముందు ఆ పాటను చదవండి మరి...

పల్లవి :
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...
అనుపల్లవి :
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకలలాడగ
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...

చరణం : 1
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నేనే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...

చరణం : 2
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

చరణం : 3
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

బాగుంది కదా పాట. ‘జయభేరి’ సినిమాలోది. పి. పుల్లయ్య దర్శకత్వంలో 1959లో వచ్చింది.  రాసింది ‘‘వచన రచనకు మేస్త్రీ అని పేరు పొందిన మల్లాది రామకృష్ణ శాస్త్రి’’. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఈ పాటలో తెర మీద హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ అంజలీదేవి కనిపిస్తారు. పాత్రల పరంగా అతడు కాశీనాథ్. పండిత కుటుంబానికి చెందిన వాడు. గాయకుడు, స్వరకర్త. ఆమె మంజుల. నిమ్న కులానికి చెందిన నాట్య కళాకారిణి. 17వ శతాబ్దానికి చెందిన కథలో ఈ ఇద్దరి కళాకారుల ప్రేమ అప్పట్లో సామాజికంగా ఎలాంటి సంచలనం కలిగించిందో, కళనే నమ్ముకున్న ఆ ఇద్దరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో, ఎలా అత్యున్నతంగా ఎదిగారో అనేదే కథ. శారదా పిక్చర్స్ ద్వారా వచ్చిన ఈ సినిమా అప్పట్లో గొప్ప  కళాత్మక సినిమాగా పేరు తెచ్చుకుంది. వ్యాపారాత్మకంగా కూడా లాభాలు అందుకుంది. అంతేకాదు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది. నటీనటుల అభినయం గురించి కానీ, దర్శకత్వం గురించి కానీ, సంభాషణలు గురించి కానీ, నేపథ్య గాయకులు ఘంటసాల, సుశీల తదితరుల గాన మాధుర్యం గురించి కానీ చెప్పడం కష్టం. చూడడమే నయం. స్వయంగా అనుభూతి చెందడమే అత్యుత్తమం.

 

సుమధుర రచనల మేస్త్రి...

మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రతిభ అనేక రంగాల్లో ప్రస్ఫుటం. వేదవిద్య, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలను అభ్యసించిన ఆయనకు... నాట్యకళ, చిత్రలేఖనం, సంగీతంలో కూడా  ప్రవేశం ఉంది. అలంకార, వ్యాకరణ తర్క శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసారు. అంతే కాదు ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు కూడా వీరికి తెలుసు. చిన్నతనం నుంచే రచనలో రాణించారు. అవన్నీ పలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఇక నాటకాలు, నవలలు చిరకీర్తిని ఆర్జించి పెట్టాయి. ‘కృష్ణాతీరం’ నవల అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప పేరు పొందింది.

 కృష్ణా జిల్లాలో చిట్టి గూడూరు అనే కుగ్రామంలో 1905లో పుట్టిన ఆయన, మచిలీపట్నంలో బియ్యే చదివాక, మద్రాసు వెళ్లి సంస్కృతాంధ్రాలలో ఎమ్మే పట్టా అందుకున్నారు. పదిహేనేళ్లకే పెళ్లి. నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.  కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే ‘దేశాభిమాని’ పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ సినిమా రచనకు సంబంధించి సలహాల కోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు. మద్రాసులో ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణశాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలంపాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్"గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలా వాటిల్లో వీరి పేరు ఉండేదికాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. చిన్న కోడలు (1952) చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు. మద్రాసులోని పానగల్లుపార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్ల మీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావానికీ, అభివ్యక్తీకరణకీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఆ సమావేశాలకు హాజరైనవారిలో, పానగల్లు పార్కుకు వచ్చి తనను కలిసిన వారిలో ఆకలితో ఉండేవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపు నింపేవారు.  అలాంటి వాళ్లకి అన్నం పెట్టించడం కోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. రామకృష్ణశాస్త్రిగారు దాదాపు వందకి పైగా భాషల్లో పండితులని ప్రతీతి. సినీ రచయిత, కవి ఆరుద్ర మద్రాసులో మల్లాది రామకృష్ణశాస్త్రిగారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరిచేవారు. ఓ రోజున ఆరుద్ర నేరుగా "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం.

 ఆయన కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే ‘చలువ మిరియాలు’ పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన ‘డుమువులు’ కథ 14 భారతీయ భాషలలోకి అనువాదం అయింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.

సినీ సాహిత్య పరిమళాలు...

బాలరాజు (1948),చిన్న కోడలు (1952), (గీత రచయితగా తొలిచిత్రం)

·, కన్యాశుల్కం (1955), రేచుక్క (1955), చిరంజీవులు (1956), కార్తవరాయని కథ (1958), జయభేరి (1959), తల్లి బిడ్డ (1963), జ్ఞానేశ్వర్ (1963), దేశద్రోహులు (1964), రహస్యం (1967), వీరాంజనేయ (1968), అత్తగారు కొత్తకోడలు (1968) లాంటి చిత్రాల్లో పాటలు వింటే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది.

ఇంకా... పల్నాటియుద్ధం, దొంగరాముడు, సువర్ణసుందరి, రాజనందిని లాంటి పెక్కు సినిమాలకు మాటలూ, పాటలూ వ్రాసి, తెలుగు సినిమా సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

ఒకో పాట ఒకో రసగుళిక...

తెలుగు వారికి చిరకాలం గుర్తుండే పాట అయిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' (పాత దేవదాసు సినిమా లోనిది).  సముద్రాల వారు రాసినట్టు సినిమాలో ప్రకటించినప్పటికీ, ఆ పాట అసలు రచయిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారేనన్న విషయం సినీ పండితులందరికీ తెలుసు. తరువాత చాలా కాలానికి ఆ పాట అసలు, సిసలు రచయిత మల్లాది వారేనని అందరికీ తెలిసిపోయింది. ఆ పాటను గురించి అంతరార్ధాన్ని వేదాంత భాషలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తెలుగు భాషలో 'కుడి' అంటే శరీరం అనే అర్ధం కూడా ఉంది. 'యోగం', 'ధ్యానం' అంటే పూర్తి అవగాహన ఉన్నవారికి, ఆ'కుడి' యే ఒక గుడి. ఇక 'ఎడం' అంటే దూరం. శరీరం విడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. శరీరం పోయినా ప్రేమ మాత్రం ఎన్నటికీ ఓడదు. దేవదాసు తన్ను తాను ఓదార్చుకుంటూ పాడిన గొప్ప వేదనాభరితమైన గీతమది. పెళ్లి అనేది ప్రేమకు ముగింపు కాదు, కానేరదు! పార్వతిని పెళ్లి చేసుకోనంత మాత్రాన 'ప్రేమ యుద్ధం' లో తాను ఓడిపోలేదని, తన్ను తాను సముదాయించుకుంటాడు.  ఇలా ఈయన రాసిన ప్రతి పాటకూ ఇంత అర్ధం చెప్పవలసినదే! అంత గొప్పపాటలు అవి.

జయసింహ చిత్రంలో 'నడిరేయి గడిచేనే చెలియా' అనే పాట రాసారు. 'కన్యాశుల్కం' చిత్రానికి 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం', బికారి రాముడు చిత్రానికి 'వాడేనే చెలి వాడేనే', రంగేళి లీలల నా రాజా, టాక్సీరాముడు చిత్రం కోసం రావోయీ రావోయీ మనసైన రాజా - వంటి పాటలు రాసారు. ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్, భలే భలే పావురమా గడుసుపావురమా, నీ సరి నీవేనమ్మా, అల్లవాడే రేపల్లెవాడే, చికిలింత చిగురు సంపెంగి గుబురు, ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక అందాక, ఏనాటికైనా నీదాననే, మనసు నీదే మమత నాదే, నాదానవే నే నీవాడనే, మిగిలింది నేనా బ్రతుకిందుకేనా, తెల్లవారవచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, కనుపాప కరువైన కనులెందుకు... వంటి ఎన్నెన్నో పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రత్యేకతలను వివరిస్తాయి.
రచనల పరిమళం...
మల్లాది వారి తొలికథ ‘భారతి‘లో ప్రచురించినప్పుడు వారి వయస్సు పదిహేనేళ్లు. ఆయన సాహితీ విశ్వరూపం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 'కృష్ణాతీరం' చదవవలసినదే! అందులో వారి వ్యక్తిత్వపు ఛాయలు 'అప్పన్న' అనే ఒక వినయ శీలుడి పాత్రలో పూర్తిగా కనిపిస్తాయి. వారిలోని చతురత, విశాలభావాలు, అభ్యుదయ భావాలు, మానవీయ దృక్పథం, వీటినన్నిటినీ చూస్తే ' అప్పన్న' పాత్ర వారిదేనని అనిపిస్తుంది. 'తేజో మూర్తులు' అనే గ్రంధం కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది.  ఆయన పూర్తి చేయలేకుండా వెళ్ళిపోయిన మరొక్క గొప్ప గ్రంధం 'క్షేత్రయ్య'. షుమారుగా 200 లకు పైగా కథలు వ్రాసిన ఘనుడీయన. ఆయన కథలలో, సర్వమంగళ, ద్రౌపదీవస్త్రాపహరణం, ఆనందవల్లి, కూతఘనం, శిలువ లాంటి కథలన్నీ కృష్ణా తీరాన్నే నేపధ్యంగా తీసుకొని రాసినవే!