మంగళవారం, డిసెంబర్ 24, 2013

అసలైన ఆత్మవిమర్శ


'నమస్కారం గురూగారూ!' 
'ఏంట్రోయ్‌... చాలా కాలానికి కనిపించావ్‌. ఎక్కడికి పోయావ్‌?' 
'ఇంట్లోనే తలుపులు మూసుకుని కూర్చున్నాను గురూగారూ...' 
'వార్నీ... అదేం బుద్ధి, ఒంట్లో బాగానే ఉందా?' 
'ఆరోగ్యానికేం ఢోకా లేదండి. కానీ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండిపోయా...' 
'ఆత్మవిమర్శా!! నీకిలాంటి విద్యలు కూడా వచ్చునేంట్రా?'
'ఏముంది గురూగారూ... రాజకీయాలు నేర్చుకోవాలంటే పాఠాలు చదవడం కాదూ, సమకాలీన నేతల్ని గమనించి వాళ్ల అడుగుజాడల్లో నడవాలని చెప్పారు కదండీ మీరు? దాన్నిబట్టే అలా చేశానండి...'

'అది సరే కానీ, ఈ కాలంలో ఆత్మవిమర్శ చేసుకునేవాళ్లు ఎవరున్నార్రా?' 
'ఎందుకు లేరండీ? మొన్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాక దేశ మహారాణమ్మ, ఆవిడగారి సుపుత్రుడు అదే అన్నారు కదండీ? ఇదేదో కొత్తగా ఉందని గది తలుపులు బిడాయించుకుని కూర్చున్నానండి. కానీ ఆత్మవిమర్శ ఎలా చేసుకోవాలో మాత్రం తెలియలేదండి...'

'నీ తెలివి తెల్లారినట్టేఉంది. వాళ్లనుంచి నువ్వు నేర్చుకోవలసింది ఆత్మవిమర్శ చేసుకుంటాననడమే. చేసుకోవడం కాదు...'

'రెండింటికీ తేడా ఏంటండీ?' 
'మైసూర్‌పాక్‌ ఫొటో చూసినదానికి, దాన్ని తినడానికి ఉన్నంత. ఫొటో నోరూరించినా తినడానికి పనికిరాదు కదా! అలాగన్నమాట...'

'అంటే వాళ్లు దేశ ప్రజలందరికీ మైసూర్‌పాక్‌ పెట్టినట్టేనంటారా?' 
'మాటల మైసూర్‌పాక్‌. వాళ్లేదో అన్నారని నువ్వు గదిలో దూరి కిందా మీదా పడ్డం చూస్తే నువ్వింకా ఏమీ ఎదగలేదని తేలిపోయిందిరా...'

'అంటే వాళ్లు సందర్భానికి తగినట్టు ఆ పదాన్ని చక్కగా ఉపయోగించుకున్నారని నాకిప్పుడు అర్థమైంది గురూగారూ...' 
'పోన్లే... ఆమాత్రం గ్రహించావ్‌ అంతేచాలు. కానీ వాళ్లు మాత్రం నీలా నీచరాజకీయ నేతగా ఎదగాలనుకునేవాళ్లకు రాచమార్గం చూపించినట్టే. సమకాలీన నేతల నుంచి నేను నిన్ను నేర్చుకోమన్నది అందుకే...'

'అర్థమైందండి. కానీ వాళ్ల నుంచి ఏం నేర్చుకోవచ్చో కాస్త నా మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెబుదురూ?' 
'సర్లె... కాగితం, కలం పుచ్చుకొని అఘోరించు. మనం చేసిన వెధవ పన్లేంటో, వాటి ఫలితాలెలా ఉంటాయో తెలిసినప్పుడు గబుక్కున పరిగెత్తుకుని పోయి బజార్లో నిఘంటువొకటి కొనుక్కుని అందులో పవిత్రమైన పదాలేంటో వెతుక్కోవాలి. ఆత్మవిమర్శ చేసుకుంటాం, ప్రజల తీర్పు శిరసావహిస్తాం, జనాభిప్రాయాన్ని గౌరవిస్తాం... లాంటివన్నమాట. వీలైనంత గంభీరంగా మొహం పెట్టి, మైకు ముందు నిలబడి, ఈ పదాలను పలికేశాక, ఆనక నువ్వు మనసులో కిసుక్కున నవ్వేసుకున్నా పర్వాలేదు. భర్త చిటికెన వేలుచ్చుకుని వచ్చి, చూపుడువేలుతో దేశాన్నే శాసిస్తున్న ఆ మహారాణమ్మ నుంచి, ఆవిడగారి ఏలుబడి నుంచి నీలాంటి బడుద్ధాయ్‌లు ఎంతైనా నేర్చుకోవచ్చురా. పదిమంది మోసే పల్లకిలో ఓ బొమ్మరాజును పెట్టి, తెర వెనక నుంచి అధికారం చలాయించడం మీద వఠ్ఠి పాఠమేంటి, ఓ ఉద్గ్రంథమే రాయవచ్చు. పార్టీలో అనుభవజ్ఞులైన పెద్దలందరినీ నోరెత్తనీయకుండా అడుగులకు మడుగులొత్తించుకునే విద్యల్లో కొన్ని నేర్చుకోవడానికైనా నీ జన్మ సరిపోదు. తన కొడుకు తప్ప దేశానికి కానీ, పార్టీకి కానీ వేరే దిక్కులేనంతగా రాజకీయం నడుపుతున్న తీరుతెన్నులు నీలాంటివారికి పెద్దబాలశిక్షలు కాదా చెప్పు? చేతకాని విధానాల వల్ల ధరవరలు పెరిగిపోయి సామాన్యులు అతలాకుతలమైపోతున్నా పొద్దున్నే అట్టు తినేవాడెవడూ పేదోడు కాదనే కాకిలెక్కల హయామును ఏమనాలి? మద్దతిస్తున్నవాళ్లు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినా నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా ఉండటం ఎంత గొప్ప పాఠమో అర్థం చేసుకుంటే మనలాంటివాళ్లం ఎంత వెనకబడి ఉన్నామో తెలుస్తుంది. అధికారం కోసం జైల్లో ఉండేవారినీ విడిపించి జతకట్టడం, అవినీతి అక్రమార్కులతో కుమ్మక్కైనా సరే అధికారం కోసం పాకులాడటం, గెలవలేమని తెలియగానే ప్రత్యర్థులపై కులమతాలనైనా అడ్డంపెట్టి బురదజల్లడం, అవసరమైతే ప్రజల మధ్యే చిచ్చుపెట్టడం, నియంతలకు నియంతలాగా వ్యవహరించడం... అబ్బో- ఇలా ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని ఒంటపట్టించుకోవాలి? వీటిలో లవలేశమైనా నేర్చుకుంటే నీ ఎదుగుదలకు డోకా ఉండదనుకో!'

'అబ్బ... ఎంత బాగా చెప్పారండీ! ఇంగితం ఉన్నవాళ్లందరికీ ఇన్ని సంగతులు తెలిసిపోతున్నా వాళ్లు మాత్రం నిజమైన ఆత్మవిమర్శ చేసుకోలేదంటారా గురూగారూ?' 
'ఓరెర్రోడా! ఆత్మవిమర్శ చేసుకునే బుద్ధి, నిజాయతీ, చిత్తశుద్ధి ఉండుంటే అధికారంలో ఉండి ఇలాంటి అవకతవక, అయోమయ, అధ్వాన, అవినీతి, అక్రమ, అన్యాయ, అతలాకుతల, అకృత్య కార్యకలాపాలను అఘోరిస్తారా చెప్పు? సరే... ఒకవేళ నిజంగానే ఆత్మవిమర్శ చేసుకోవాలని వాళ్లు అనుకున్నారనే అనుకో. వాళ్లని వాళ్లు తిట్టుకోవడానికి ఏ భాష మాత్రం సరిపోతుందో చెప్పగలవా? మరి వాళ్ల తాజా మాటలు కూడా ఓసారి గుర్తు తెచ్చుకో. జరిగిందేదో జరిగినా ముందు జరగబోయే కార్యక్రమానికి సమాయత్తం కావాలని ఆ మహారాణమ్మగారు తమ అనుచరవర్గానికి పిలుపు ఇవ్వలేదూ. అంటే ఏంటర్థం? తిరిగి ప్రజల నెత్తిన మాటల టోపీ పెట్టడానికి ఎన్ని రకాల టక్కుటమార విద్యలున్నాయో, అన్నీ ఉపయోగించమనేగా? కాబట్టి సందేహాలు పక్కన పెట్టి ఆ మహనీయుల అడుగుజాడల్లో నడవడానికి సమకట్టు. అర్థమైందా?'

'అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థమైంది గురూగారూ! ఇక చూస్కోండి. నేను చేసిన ఎన్ని పనులు బయటపడినా నిజమైన ఆత్మవిమర్శ జోలికి మాత్రం పోను. కానీ ఆ పదాన్ని మాత్రం ఎడాపెడా వాడేసుకుంటాను. వస్తానండి, అర్జంటుగా సభొకటి పెట్టాలి!'

PUBLISHED IN EENADU ON 24.12.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి