రాజకీయ ఒలింపిక్స్. స్టేడియంలో ప్రేక్షకులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. మైకుల్లో క్రీడల వివరాలు ప్రకటిస్తున్నారు. 'ఇప్పుడు పరుగు పందెం' అని వినిపించింది. వెంటనే ప్రధాని మన్మోహన్ స్టేడియంలోకి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చారు. కానీ... ఆశ్చర్యం! ఇంకెవరూ పోటీలో లేరు. పైగా ఒకే ఒక ట్రాక్ ఉంది. ఇంతలో సోనియా గాంధీ వచ్చి విజిల్ వేశారు. మన్మోహన్ సింగ్ నెమ్మదిగా నడవసాగారు. ట్రాక్‌కి బయట సోనియా గాంధీ నడుస్తూ 'అడుగులు వేయండి. అలుపు తీర్చుకోండి. మలుపు తిరగండి' అంటూ చెబుతున్నారు.
ఇదంతా చూస్తున్న గుంపులో గోవిందానికి సందేహం వచ్చింది. 'ఇదెక్కడి పందెం గురూ?' అన్నాడు పక్కవాడితో.
'అదంతేనోయ్! పనిగట్టుకుని స్టేడియానికి వచ్చాక నోరు మూసుకుని చూడటమే. ఆయన్ని పోటీకి ఎంపిక చేసింది ఆవిడే. ఇంకెవరూ పక్కన లేరు. ఇక పరుగెట్టినా, నడిచినా, డేకినా ఆయనేగా విజేత?' అన్నాడా అనుభవజ్ఞుడైన పక్కవాడు.
ఇంతలో కొందరు రాహుల్ గాంధీని చంకనేసుకుని వచ్చారు. నోట్లో వేలేసుకుని ఉన్న అతడికి స్పోర్ట్స్ షూ తొడిగి మన్మోహన్ వెనకాల ట్రాక్‌పైకి వెళ్లమని బతిమాలుతున్నారు. అతడేమో సోనియాకేసి చూస్తున్నాడు. ఆమె ఎటూ చెప్పకుండా 'ట్రాక్‌లోకి దిగాలో లేదో నిర్ణయించుకోవాల్సింది అతడే. ఎప్పుడు దిగుతానంటే అప్పుడే దింపండి' అంటున్నారు.
'వార్నీ! ఆవిడ చుట్టూ అంతమంది పెద్దపెద్దవాళ్లు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరూ ట్రాక్‌లో పరుగెత్తలేరా? మారాం చేస్తున్న ఆ పిల్లాడినెందుకు దిగమంటారు?' అన్నాడు గోవిందయ్య.
'వారసత్వ వీరుడు ఉండగా ఇంకెవరు దిగుతారయ్యా? అమ్మగారి ఆనందం కోసం ట్రాక్‌ను ఎప్పుడూ ఖాళీగానే ఉంచుతారు. ఆ పిలగాడు పరుగు నేర్చుకునే వరకూ అంతే. ఈలోగా మన్మోహన్‌గారి నత్తనడకలు చూడాల్సిందే మనం. ఓపికుంటే చప్పట్లు కొట్టు, లేదా మరో పోటీ చూడు' అన్నాడు అనుభవజ్ఞుడు.
గోవిందయ్య మరోవైపు తల తిప్పాడు. అక్కడ షూటింగ్ జరుగుతోంది. కేంద్రమంత్రులందరూ వరసగా నిలబడి తుపాకులు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న లక్ష్యాలను గురి చూసి పేల్చారు. చిత్రం! వాటిలో ఒక్కటీ బోర్డుకు తగల్లేదు. అప్పుడే అక్కడికి వచ్చి చూస్తున్న సోనియా, మన్మోహన్ మాత్రం ఆనందంగా చప్పట్లు కొట్టసాగారు.
'గురి తప్పినా సంబరమేంటి?' అన్నాడు గోవిందయ్య.
'వాళ్లంతా వేర్వేరు పార్టీలనుంచి వచ్చిన సంకీర్ణ షూటర్లు. ప్రగతి లక్ష్యాలు సాధించడానికే గురిపెట్టి తూటాలు కాల్చారు. కానీ, ఏ లక్ష్యమూ ఇంకా అందలేదు మరి. అయితే బోర్డుకు బారెడు దూరం నుంచైనా తూటాలు దూసుకుపోయాయని వాళ్లిద్దరూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతానికివాళ్లకు ట్రిగ్గరైనా నొక్కడం చేతనైందని మనం ఆనందపడాలంతే' అన్నాడు అనుభవజ్ఞుడు.
గోవిందయ్య మరోవైపు చూశాడు. అక్కడ హర్డిల్స్ జరుగుతున్నాయి. ట్రాక్ మీద ముందుగానే అమర్చిన హర్డిల్స్ కాకుండా పరిగెడుతున్నవారికి కాళ్ల ముందు వేరేవాళ్లు అడ్డంకులు పెడుతున్నారు. 'అరె... క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందే ఈ వ్యవహారం?' అన్నాడు గోవిందయ్య.
'అది ఆంధ్రా మైదానం నాయనా! అక్కడ తలపడుతున్నవాళ్లంతా ఒకే జట్టు. కానీ, ఎవరు పరుగెడుతున్నా మరొకరు అడ్డాలు కల్పిస్తారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. అక్కడి అధికార పార్టీ సంస్కృతే అంత. అడిగితే అదంతా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. కళ్లప్పగించి చూడ్డమే' అంటూ వివరించాడు అనుభవజ్ఞుడు.
ఆ పక్క ఈత కొలనులో అంతా గందరగోళంగా ఉంది. అందులో ఓ గెడ్డపాయన ఈదుతుంటే మరికొందరు అడ్డంగా ఈదుతున్నారు. కొందరు ఉన్నచోటనే ఉంటూ నీళ్లని తపతపా కొడుతూ అల్లరి చేస్తున్నారు. 'దయచేసి అందరం ఒకే దిశగా కలిసికట్టుగా ఈదుదాం' అని ఆయన చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు.
'ఇలాటి ఈతను నేనెప్పుడూ చూడలేదు' అన్నాడు గోవిందయ్య.
'ఆయనే చెయ్యి తిరిగిన క్రీడాకారుడు చంద్రబాబు. ఆయనది, ఆయన అనుచరులది ఇప్పుడు ఎదురీతే. వీళ్లు మునుగుతారో, తేలుతారో, ఎప్పుడు గట్టెక్కుతారో తెలియకుండా ఉంది కాబట్టే కొలనంతా సుడిగుండంలా మారింది' అన్నాడు అనుభవజ్ఞుడు.
ఇంతలో ఆ మైదానంలో పెద్ద కలకలం రేగింది. కొందరు 'దొంగ... దొంగ' అని అరుస్తున్నారు. పోలీసులు విజిల్స్ వేసి పరిగెడుతున్నారు. ఓ యువ క్రీడాకారుడు అక్కడి పతకాలను చేజిక్కించుకుని పారిపోతుంటే పట్టుకున్నారు. మరి కొందరు ఆ యువకుడికి వత్తాసుగా జేజేలు పలుకుతున్నారు.
ఆ యువక్రీడాకారుడు పోలీసుల చేతుల్లో గింజుకుంటూ, 'ఎలాగూ ఇక్కడి పతకాలన్నీ నాకే వస్తాయి. ఈ మాత్రం దానికి ఆటలెందుకని ముందే పట్టుకుపోతున్నా. ఏం తప్పా? కావాలంటే స్టేడియంలో ప్రేక్షకులను అడగండి' అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు.
'వీడెవడడండీ బాబూ?' అన్నాడు గోవిందయ్య.
'అతడు ఒకట్రెండు ఆటల్లో గెలిచిన మాట వాస్తవమే. దాంతో తన శక్తి మీద తనకు నమ్మకం పెరిగిపోయింది. మొత్తం ఆటలన్నీ గెలిచేస్తాననుకుంటున్నాడు. గెలవకుండానే పతకాలు దోచేద్దామనుకున్న వాడు, తీరా గెలిస్తే ఏం చేస్తాడోననే చాలామంది దిగులు పడుతున్నారు' అన్నాడు అనుభవజ్ఞుడు.
'ఏంటో? ఈ ఆటలన్నీ చూస్తుంటే నాకు ఆయాసంగా ఉంది. చివరికి ఆటల్లో అరటిపండులా మిగిలిపోయేలా ఉన్నా. ఇక ఇంటికి పోతా' అంటూ గోవిందయ్య బయల్దేరాడు.
ఇంతలో తొలికోడి కూయనే కూసింది!
PUBLISHED IN EENADU ON 10.08.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి