శుక్రవారం, జూన్ 27, 2014

పరాజయ పాఠాలు




'నమస్కారం గురూగారూ'
'రారోయ్‌ రా! ఏంటీ చాలా కాలమైంది. మొహం అలా వేలాడేసుకుని ఉన్నావేం?'

'మీకు తెలియనిదేముంది గురూగారూ! ఫలితాలు గూబ గుయ్యిమనిపించాయి. పరువు, పవరు కూడా పరారయ్యాయి. అత్త తిట్టినందుకు ఏడవాలో, ఆడపడుచు నవ్వినందుకు ఏడవాలో తెలియని పరిస్థితిలో పడ్డా. ఎవరికీ మొహం చూపించలేక యాత్రలకు పోయి వచ్చా'

'అంతేలేరా, లోకం తీరే అంత. కానీ, అలా బెంబేలు పడిపోయి మొహం దాచేసుకుంటే ఎలారా?'

'ఇంకేం చేయమంటారు చెప్పండి. సిగ్గుతో చితికిపోయాననుకోండి. పైగా ప్రచారంలో రెచ్చిపోయి మరీ, కుర్చీ నాదేనన్నట్టు ఎడాపెడా వాగేశాను కదండీ? దాంతో అద్దంలో కూడా నా మొహం నేనే చూసుకోలేకపోయానంటే నమ్మండి'

'వార్నీ, ఆత్రగాడికి బుద్ధి మట్టం అన్నట్టు, నా దగ్గర రాజకీయ పాఠాలు పూర్తిగా నేర్చుకోరా ఆ తరవాత కాస్తో కూస్తో అనుభవం ఏడిశాక బరిలోకి దిగచ్చునంటే వినకుండా, మహా నేతలాగా పోజెట్టి దూకేశావు. బొక్కబోర్లా పడ్డావు. కుర్చీ ఏక్కేద్దామన్న దురదేగానీ, ఎక్కేందుకు దమ్ముందో లేదో చూసుకోలేదు మరి. ఏం చేస్తాం...'

'ఏంటి గురూగారూ మీరు కూడానూ. చచ్చిన పామును ఇంకా ఎందుకండీ చంపడం? ఇప్పుడేం చేయాలో చెప్పుదురూ'

'సర్లేరా, నీ అరకొర బుద్ధితో వేసిన గెలుపు సూత్రాలు బెడిసికొట్టినా, పరాజయ పర్వంలో పాఠాలు బోలెడున్నాయి. అవైనా ఒంటపట్టించుకో మరి'

'పరాజయంలో పాఠాలేముంటాయండీ, మీది మరీ చోద్యం కాకపోతేనూ?'

'ఓరమాయకుడా, రాజకీయం అంటే అదేరా! సమకాలీన నేతల్ని చూసైనా నేర్చుకునే తెలివిడి ఏడ్వాలి. గెలిచినోడు ఎంత సందడిగా మీటింగులు గట్రా పెడతాడో, అంతకంటే హడావుడిగా నువ్వు మీటింగులు పెట్టుకోవాలి'

'ఓడినోడికి మీటింగులేంటండీ?'

'ఎందుకుండవురా... చతికిల పడ్డానికి కారణాలు విశ్లేషించుకుంటున్నట్టు కనబడాలి. ప్రజలు ఛీ కొట్టడమే ఏకైక కారణమని నీకు తెలిసినా, ఏవేవో కారణాలు వెతికి మైకుల ముందు పళ్లికిలిస్తూ చెప్పాలి'

'మరి ఎలాంటి కారణాలు చెప్పాలండీ?'

'ఓడిన నేతల్ని గమనించలేదురా? గెలిచినోడు ప్రజల్ని హామీల మత్తులో ముంచేశాడని వాగొచ్చు. ఆ హామీలని జనం పాపం... అమాయకంగా నమ్మడంవల్లే వాళ్ల గెలుపు సాధ్యమైందని వదరచ్చు. వాళ్లు చెప్పినవేమీ చేయలేరని, ఆ సంగతి ప్రజానీకానికి నిలకడ మీద తెలుస్తుందని బోర విరుచుకుని మరీ మాట్లాడొచ్చు. దీన్ని నిస్సిగ్గు నిబ్బరమంటారు'

'కానీ గురూగారూ, ప్రచారంలో నేను కూడా అడ్డదిడ్డమైన హామీలిచ్చా కదండీ? నా మాటలు విని జనం నవ్వుకోరాండీ?'

'ఒరే జనానికన్నీ తెలుసురా. కానీ, వాళ్లు నవ్వుకుంటారని, ఏదేదో అనుకుంటారనీ నువ్వనుకుంటే ఎలారా? నీకేదో గొప్ప చిత్తశుద్ధి గట్రా ఉన్నట్టు బిల్డప్పులివ్వద్దూ? అంచేత నువ్విచ్చిన హామీలే నికార్సయినవన్నట్టు, అవతలివాళ్లవి వట్టి డొల్ల మాటలన్నట్టు నోటికొచ్చినట్టు పేలడమే. ఈ విద్యను ఒంటపట్టించుకోడానికి కావలసిన అర్హతలన్నీ ఇప్పుడు నీలో ఉన్నాయి మరి'

'ఆహా... ఓడినవాడిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు గురూగారూ మీరు'

'ఏడిశావ్‌లే... ఆత్మవిశ్వాసం లాంటి మంచి పదాలెందుకు? మనలో మాటగా అనుకోవాలంటే ఇది ఆత్మవంచననుకోవాలి'

'అర్థమైంది గురూగారూ! మనం ఓడించినా ఇతడు పాపం మన గురించే ఆలోచిస్తున్నాడని ప్రజలు జాలిపడేలా మాట్లాడాలన్నమాట'

'జనం అలా జాలి పడతారనేది వట్టి భ్రమేనని నీకు తెలిసినా, నువ్వు మాత్రం గెలిచినా ఓడినా నీ మనసంతా ప్రజల కోసమే దిగులు పడుతున్నట్టు పైకి కనిపించాలి. కాబట్టి లోలోపల నీ మనసు భగభగలాడిపోతున్నా, పైకి మాత్రం వినయంగా మొహంపెట్టి ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు సెలవీయాలి. అసలింతగా జనం నువ్వంటే కుతకుతలాడిపోతున్నట్టు ఫలితాలనుబట్టి తెలిసినా, నువ్వు మాత్రం మెత్తగా మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకతను ముందుగా గమనించలేకపోయామని నమ్రత చూపించాలి. నిజానికి వినయం, నమ్రత నీ ఒంటికి సరిపడవనుకో... కానీ అవన్నీ నీలో ఉన్నట్టు సాధ్యమైనంత భ్రమ కల్పించడానికి ఎక్కడలేని కృషీ చేయాలి. అర్థమైందా?'

'బాగా తెలిసిందండి. ఇక మీదట నేనేం చేయాలో కూడా సెలవిద్దురూ'

'ఇక నీకెలాగూ చేయడానికి ఏమీ లేదు కాబట్టి, గెలిచినోడు ఏం చేసినా అందులో తప్పు పట్టాలి. మంచి చేసినా అందులో చెడు వెతకాలి. ఆడు ఏం మాట్లాడినా దానికి లేనిపోని దురుద్దేశాలు అంటగట్టాలి. ఏ పథకం పెట్టినా బొక్కలెతకాలి. లేనిపోని లెక్కలు, నిజాలు తీసి మసి పూసి మారేడుకాయ చేసి ఏకడానికి ఎలాంటి వీలు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నట్టు రెచ్చిపోవాలి... తెలిసిందా?'

'బ్రహ్మాండంగానండి. కానీ గురూగారూ, జనం నమ్ముతారంటారా?'

'ఓరెర్రోడా... నిన్ను జనం నమ్మితే ఓడేవోడివే కాదు కదరా, ఆ సంగతి నీకేల? ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఇంతకు మించి చేయడానికేం లేదు మరి'

'అర్థమైంది గురూగారూ! ఇక రెచ్చిపోతా చూడండి'

PUBLISHED IN EENADU ON 27/06/2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి