‘ఏందే ఎంకీ, నులక మంచమ్మీద దుప్పటేసినావా?’
‘ఏసాను మావా, ఎల్లి తొంగో’ అంది ఎంకి.
గుడిసె బయట నులక మంచం మీద నడుంవాల్చి, కాలుమీద కాలేసుకుని ఆకాశంలోకి చూశా.
పైన లెక్కలేనన్ని చుక్కలు! మిణుకుమిణుకుమంటున్న వాటిని చూస్తూ రెప్పవాలుద్దాం అనుకునేసరికి, ఆ చుక్కల్లో ఒకటి నెమ్మదిగా పెద్దదై, వెలుగులు విరజిమ్ముతూ కిందికి వచ్చేస్తోంది.
దాని జిగేల్మనే కాంతికి కళ్లు తెరవలేక తెరుస్తూ, భయపడుతూ లేచి నుంచున్నా.
ఎదురుగా ఓ మహాపురుషుడు! వేలాది తలలు... అంతకు మించి చేతులు!
‘నేను కాలపురుషుణ్ని! పాత సంవత్సరం కనుమరుగై కొత్త ఏడాది అడుగుపెడుతున్న శుభవేళ నీచేత మాట్లాడిద్దామని ఇలా వచ్చా! చెప్పు... నీకేం కావాలో కోరుకో! వరాలు ప్రసాదిస్తా’ అన్నాడు కాలపురుషుడు.
అంతే, ఒక్కసారిగా కడుపు పట్టుకుని పగలబడి నవ్వుతూ, కిందపడి దొర్లుతూ- ‘ఎహేమిటీ... హ హ్హ... నుహువ్వు... నహాకు వర...హ్హ...హ్హ మిస్తావా?’ అన్నా.
కాలపురుషుడు కంగుతిన్నాడు. ‘అదేమిటి! అలా ఆశ్చర్యపోతావేం?’ అన్నాడు.
అప్పటికి తేరుకుని, ‘చాల్చేలేవయ్యా... వూరుకో! ఆకు మీద ఆకు మారాకు ఏసినట్టు, ఏటి మీద ఏడాది వచ్చిపోతానే ఉంది. మా బతుకులు ఏం మారాయి సెప్పు? ఇన్నేల్లుగా మారని మా బతుకులు ఇయ్యాల నువ్వొచ్చి వరాలిచ్చేత్తే మారిపోతాయా అంట!’ అన్నా.
కాలపురుషుడు చిద్విలాసంగా నవ్వి, ‘నీ అసహనం అర్థమైంది నాయనా! ముందు నీ బాధలేమిటో చెప్పు. అప్పుడుగానీ నీ మనసు కుదుట పడేలా లేదు’ అన్నాడు.
‘ఏముంటది కాలపురుసా! సూత్తానే ఉన్నావుగా? మొన్నా పక్కసందులో బక్కరైతన్న ఉరిపోసుకుని ఉసురు తీసుకున్నాడు. నిన్న మాపటేల ఎదురింట్లో పురుగులక్కొట్టే మందు మింగేసి కౌలుకూలన్న కళ్లు తేలేశాడు. ఎన్నాళ్లయ్యా... ఎన్నేళ్లయ్యా సెప్పు! ఎప్పుడయ్యా అందరికీ అన్నం పెట్టే ఈ రైతన్నల కట్టాలు తీరేది? ఏమన్నా అంటే వరాలంటావ్! ఇదేదో మా ఒక్క వూర్లో సంగతే కాదయ్యోయ్! దేశమంతా ఇట్టాగే ఉంది. ఏ పుస్తెలో తాకట్టు పెట్టి, విత్తనాలు తెచ్చి జల్లితే, అయ్యి మొలకెత్తుతాయో తెలీదు. ఒకేల మొలకెత్తినా పంట సేతికందేదాకా నమ్మకం లేదు. పాణాలుగ్గబట్టి పెట్టుబడి పెడితే- గిట్టుబాటు ధరేదీ? నోటికాడ కూటిని దళారులొచ్చేసి రుణానికి జమేసేసుకుంటారు. ఇట్టాంటి కట్టాలు తట్టుకోలేక బలవంతంగా సచ్చిపోయాక పరిహారాలు ఇత్తేమాతరం ఉపయోగం ఉంటదా? ఎంతిస్తే రైతుల రుణం తీరుద్దయ్యా... ఈ జాతికి! ఎంతిస్తే ఆ కుటుంబాల కన్నీటిధార ఆగిపోద్దయ్యా సెప్పు! పోనీ, వానదేవుడైనా అదను సూసి కరునిత్తాడా అంటే అదీ లేదు. అయితే కుండపోత... లేకపోతే అదే పోత!’
కాలపురుషుడు ఏమీ మాట్లాడలేకపోయాడు.
‘ఇక నువ్వు చేసే సిత్రాల గురించి ఏం సెప్పమంటావయ్యా కాలపురుసా! ఉన్నట్టుండి రోజుల తరబడి ఆకాశం నుంచి వానలు ఒంపేసి, వరదల్లో ముంచి పారేస్తావ్! మరోపక్క జిల్లాలకు జిల్లాల్లో కరవు కాటకాలు కాళ్లకు గజ్జెలు కట్టి నాట్యమాడేలా సేత్తన్నావ్. ఇంకా ఏం సెప్పమంటావయ్యా! వందలాది వేలాది మందిని మతవిద్వేషాలతో సంపేసే ఉగ్రవాదాన్ని కళ్ల ముందు నిలుపుతున్నావ్. ఈ ఘోరాలు, నేరాలన్నీ నీ అడుగుజాడల్లో మడుగులు కట్టి కనిపిస్తన్నవే కదయ్యా... ఏటంటావ్?’
కాలపురుషుడు కట్రాటలా నుంచుండిపోయాడు- నా వాగ్ధాటికి!
‘సరేలేవయ్యా... నేన్నీకు సెప్పాల్నా? నీకు మాత్రం తెల్దూ? కిందటేడుకి, ఈ ఏడుకి సరకుల ధరలు ఎంతలేసి పెరిగిపోయాయో నువ్వు మాతరం సూడట్లేదూ? గంజిలోకి నంజుకునే ఉల్లిపాయ ధర కూడా ఉసూరుమనిపిస్తోంది. ఇక పప్పుల పరాసికాలు సెప్పాలా? కాయగూరల కస్సుబుస్సులు సూపాలా? వూరగాయలోకి చెంచాడైనా నూనేసుకుందారంటే ఎనకాముందూ సూడాల్సి వస్తోంది. ఇక నెయ్యేసుకుని పప్పు కలిపే రోజు పండగనాడైనా కరవే అయిపోతాంది. మరి ఎట్టాగయ్యా మా బతుకులు బాగుపడేది? వరాలిత్తాడంట వరాలు!
అయినా నువ్వన్నావు కాబట్టి అడుగుతాన్లే- వచ్చే ఏడాదైనా అయ్యన్నీ జరుగుతాయేమో సూడు మరి! మాలాంటి పేదోళ్లందరికీ సేతి నిండా పనుండేలా సూడు. సేతుల్లో పైసలాడేలా సెయ్యి. రెండు పూటలా కడుపునిండా కూడు దొరికేలా సూడు. మా నేతలందరూ మా కట్టాలు పట్టించుకునేలా ఆళ్ల బుద్ధులు మార్చు. అవినీతి, అక్రమాలు లేని మంచి రోజులియ్యి. మా రైతన్నల బతుకులు పండించు. ధరలు అందుబాటులో ఉండేలా సెయ్యి. బిడ్డల్ని సదివించుకునే వీలు కలిగించు. అందరూ సల్లంగా ఉల్లాసంగా బతికేలా సెయ్యి... సరేనా?’ అన్నా!
‘మాన్యా! జనహితాన్ని కోరే నీ కోరికలు విని సంతోషంగా ఉందయ్యా! నువ్వు కోరేవన్నీ కాలనుగుణంగా జరిగి తీరుతాయి. ఈలోగా నీకు తోడుగా ఆశను వరంగా ప్రసాదిస్తున్నా. దానివల్ల రేపటి నుంచి మంచిరోజులు వస్తాయనే భావన కలిగి ఇవాళ్టి నిరాశ నిన్ను బాధించదు’ అంటూ కాలపురుషుడు మాయమయ్యాడు.
* * *
‘ఒసే... ఎంకీ! కొత్తేడాది నుంచి మనకన్నీ మంచిరోజులేనంటే... కాలపురుషుడు చెప్పాడు’ అన్నా సంబరంగా!
‘సాల్లే మావా... సంబడం! కలవరింతలు ఆపి పడుకో. పొద్దుటే పనికిబోవాల’ అంది ఎంకి.
Published in EENADU on 31.12.2016
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి