శనివారం, జనవరి 21, 2017

బీద అరుపులు



‘శిష్యా... చిరుగు అనగానేమి?’
‘చిల్లి, ఖాళీ ప్రదేశం లేదా రంధ్రం గురూ’
‘అనగా?’
‘శూన్యం అనీ అనవచ్చు గురూ!’
‘లెస్స పలికితివి. మరి చిల్లులు దేనికి ఉపయోగపడును?’
‘అది మాత్రం తెలియదు గురూ’
‘నేర్చుకోరా బడుద్ధాయ్‌! చిల్లులు... ప్రచారానికి ఉపయోగపడును. విమర్శకు ఆలంబనమగును. రాజకీయానికి పనికివచ్చును. నవ్వుల జల్లుల్నీ కురిపించును’
‘వావ్‌ గురూ! చూడగా చిల్లులు బహుళ ప్రయోజనకారులని అర్థమవుతున్నది’
‘చురుకైనవాడివే. మరి ఈ చిల్లులతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదెవరో చెప్పగలవా శిష్యా?’
‘బహు కష్టం గురూ! నాకంతటి పరిజ్ఞానమున్న, మీ దగ్గర ఎందుకు పడివుంటాను? వేరొక ఆశ్రమం స్థాపించి గురుస్థానంలో కూర్చుండేవాడిని కదా గురూ’
‘నీ బుర్ర అనే ఇసుకపర్రలో ఇలాంటి చెడు తలంపుల బెడ్డముక్కలు ఉన్నవని నాకు తెలుసుకానీ శిష్యా, ఆ మహానుభావుడి గురించి తెలిపెదను వినుము’
‘ధన్మోస్మి గురూ, సెలవిండు’
‘ఆతండు ఒక యువకుండు. తల్లి చాటునుండు. అధికారానికై ఆశపడుచుండు. అడపాదడపా విలేకరులను పిలిచి ఏదేదియో మాట్లాడుచుండు. సభలలో రెచ్చిపోయి ప్రసంగించుచుండు. అర్థమైందా శిష్యా?’
‘కాలేదు గురూ! ఈమధ్య అతడు మాట్లాడిన విషయాలేమైనా చెప్పినచో పోల్చుకొనగలను’
‘అట్లయిన అఘోరించు. మొన్నటికి మొన్న ఇతగాడు ఓ కుర్తా వేసుకుని ఉత్తరాఖండ్‌లో ఓ సభకు వచ్చెను’
‘వచ్చి ఏం చెప్పాడు గురూ’
‘ముందుగా జేబులో చెయ్యి పెట్టినాడు. ఆ జేబులో చిరుగు ఉన్నదన్నమాట. ఆ చిరుగు చిల్లులోంచి చెయ్యి బయటికి పెట్టి చూపించినాడు. అందరూ నవ్వసాగిరి’
‘అప్పుడేమైంది గురూ’
‘ఆ యువకుడు నోరు విప్పినాడు. ఇదిగో నా కుర్తా చిరిగింది. ఇది నాకు పెద్ద విషయం కాదు. ఇలాంటి చిల్లుల చొక్కాను మన ప్రధానమంత్రి ఎప్పుడైనా వేసుకున్నారా? వేసుకోరు. అయినా, తానొక పేదల ప్రతినిధి అని చెబుతూ ఉంటారు. పేదలపై రాజకీయం చేస్తూ ఉంటారు... అంటూ ప్రసంగించినాడు’
‘ప్రజాసభకు చిరిగిన కుర్తా వేసుకుని రావడమేంటి గురూ?’
‘మరి అదేరా శిష్యా... అతి తెలివి. కావాలని కుర్తాకు చిరుగు పెట్టి, అది వేసుకుని సభకు వచ్చి, ఆ చిల్లిలో చెయ్యిపెట్టి, దాన్ని బయటకు చూపించి మరీ దేశ ప్రధానిపై విమర్శలు కురిపించాడు చూశావా?’
‘అవును గురూ! చిరుగు ప్రచారానికి, రాజకీయానికి పనికివచ్చునని నిరూపించినాడు. మరి అతగాడి మాటల ప్రయోజనం నెరవేరిందా గురూ?’
‘ఓరి వెర్రి శిష్యా! మన ప్రజలు అంతకంటే అధికులు. చిల్లుల కుర్తా వేసుకొని వచ్చినా... అతడు మాత్రం పేదల ప్రతినిధి కాడని ఇట్టే గ్రహించినారు. ఆ పట్టున విరగబడి నవ్వి ఆతడినే వెర్రివాడిని చేసినారు’
‘ఎలా గురూ?’
‘ఆ యువకుండు ఈ మధ్యనే విదేశీయానం చేసి వచ్చాడు కదా. సామాజిక మాధ్యమాల్లో ఆ సంగతి గుర్తు చేసి మరీ ఎద్దేవా చేసినారు. కొందరు రూపాయి విరాళాలు ప్రకటించి వెక్కిరించినారు. ఇంకొందరు ఈ వికృత రాజకీయం ఏమిటని ఏకినారు. పాలకపక్ష యువనేతలైతే ఆతడికి కొత్త కుర్తాలు కొని పంపించెదమని ఉడికించినారు’
‘అనగా... చిల్లులతో జాగ్రత్తగా లేకున్నచో అది మన ఉద్దేశాన్నే అమాంతం హరించే పెనురంధ్రమగునని తేలినట్టే కదా గురూ?’
‘రాటుతేలివితిరా శిష్యా! చిల్లుల సాయంతో రంధ్రాన్వేషణ చేయాలనే అతగాడి ప్రయత్నం విఫలమైందన్న మాట’
‘లెస్స గురూ... ఆతడి వెటకారపు వెక్కిరింతలు, మాటలు, కూతలు, ఎక్కసెక్కపు కబుర్లు మరికొన్ని చెప్పినచో ఆతడిని పోల్చుకోవడానికి ప్రయత్నించగలను’
‘ఏమని చెప్పుదు శిష్యా! తానుగానీ నోరు విప్పినచో భూకంపాలే వచ్చునని చెప్పును. తానుగానీ నిజాలు చెబితే సునామీలు వచ్చునని బెదిరించును. కానీ నోరు విప్పలేడు... నిజాలు చెప్పలేడు’
‘చిత్రవిచిత్రంగా ఉంది గురూ... ఇంకా?’
‘ఓసారి విధాన సభలో రాసుకొచ్చిన ప్రసంగం చదువుతూ స్పీకర్‌ స్థానంలో మగవారు ఉండగా మేడమ్‌ అని సంబోధించి నాలుక కరుచుకొనును. మరియొకసారి గంభీరంగా మొహం పెట్టి మాట్లాడుతూ, రాజకీయం ఎక్కడ పడితే అక్కడ ఉంది... నీ జేబులో రాజకీయం ఉంది, నీ ప్యాంటులో రాజకీయం ఉంది అనెను. దేశమంతా ఘొల్లుమనెను. మరియొకమారు గుజరాత్‌తో పాల ఉత్పత్తి అంతా మహిళల వల్లే సాధ్యమైనదనును... ఇట్లు ఎన్నని చెప్పను శిష్యా ఆ యువకుడి మాటల మెరుపులు?’
‘ఆ... అతగాడు ఎవరో పోల్చుకున్నాను గురూ! ఇంతకుముందు యువరాజుగా పేరొందిన సుపుత్రుండు. ఆతడి గురించి మరియొక సంగతి గ్రహించాను గురూ! ఆ చిరుగు లేదా చిల్లి లేదా రంధ్రం లేదా శూన్యం అతడి జేబులో కాదు- నిజానికి అతడి ఆలోచనల్లో ఉందని! నిజమేనా గురూ?’
‘చక్కగా చెప్పి, నీ బుర్రలో చిల్లి లేదని నిరూపించుకున్నావురా శిష్యా! మరొక సంగతి చెప్పెదను వినుము. ఆతడు యువరాజుగా వెలుగొందిన కాలంలో సాగిన అవకతవక, అవినీతి, అస్తవ్యస్త రాజకీయ పరిపాలనా విన్యాసాల వల్లనే దేశ ఆర్థిక పరిస్థితి కుర్తాలో చిరుగు లాగా మిగిలినది. ప్రజాధనాన్ని ఆనాటి పాలకులు జేబుల్లో నింపుకొని, చివరికి అతడిలానే చిరుగు చిల్లుల్లో చెయ్యి చూపించి... చక్కాపోయినారు శిష్యా’
‘ఆహా గురూ... ఆఖరికి చిల్లి సైతం సుపరిపాలకులను ఎన్నుకోవాలని ప్రబోధిస్తోంది గురూ!’
PUBLISHED IN EENADU ON 21.01.2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి