శిష్యడు రాగానే గురువుగారు
రెండు పుస్తకాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అవి సుమతి, వేమన శతకాలు.
శిష్యుడు వాటిని తిరగేసి, "ఇదేంటి గురూగారూ!
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యాల పుస్తకాలిచ్చారూ? ఇప్పుడేం పనికొస్తాయి?" అన్నాడు.
"భలేవాడివిరా... ఇవి ఇప్పుడే కాదురా, ఎప్పటికైనా పనికొస్తాయి తెలుసా?"
"ఊరుకోండి గురూగారూ! నేనేదో నాలుగు రాజకీయ
పాఠాలు నేర్చుకుని నీచ నేతగా నిగ్గుతేలాలని ఆశపడుతుంటే, నన్ను చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటున్నారా?
ఇవన్నీ నీతులు కదండీ?
వీటితో మనకేం పని?"
"ఓరి నా వెర్రి శిష్యా! అప్పుడెప్పుడో ఆత్రేయగారు
ఏదో పాటలో ఏమన్నారు? ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి... అన్నారు కదా? అసలదెంత గొప్ప నీతిరా?"
"అవునండి... ప్రేమనగర్ సినిమాలోనండి.
నేను పుట్టాను... ఈ లోకం మెచ్చింది... అనే పాటండి. గొప్ప హిట్టండి బాబూ..."
"కదా? కాబట్టి
ఎదుటి వాడికి చెప్పడానికైనా నీకు నీతులు రావాలి కదరా? ఇలాంటి
నీతులు వల్లించావనుకో, జనం మాయలో పడి ఓట్లు గుద్దేశారనుకో.
ఏకంగా కుర్చీ ఎక్కేయొచ్చు. ఆపై వాటితో పని ఉండదు. ఆనక నీ నీతులే... అవినీతులవుతాయి.
అర్థమైందా?"
"అర్థమైందండి... అయితే వీటిని ఇంటికి తీసుకెళ్లి
బట్టేపట్టేస్తానండి. మరి ఇవాల్టి పాఠం చెప్పండి..."
"ఎప్పుడో బట్టీ పట్టడం కాదురా... ఇప్పుడే
చదువు. వీటి ద్వారా నవీన రాజకీయ నీతి సూత్రాలు నేర్చుకుందువుగాని... సరేనా?"
శిష్యుడు బుర్ర గొక్కున్నాడు. గురువుగారు ఇక వదిలేలా
లేరని, ఓ పుస్తకం
తెరచి కనిపించిన పద్యం చదివాడు.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్
దొనరగ బట్టము కట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
గురువుగారు తాపీగా పడక్కుర్చీలో వెనక్కి వాలి
అందుకున్నారు.
"చూశావురా... ఎప్పటిదో పాత పద్యం అన్నావ్.
కానీ ఇప్పుడు నీ పరగణాలో జరిగింది,
జరుగుతున్నది ఇదే కదరా? అధికారం కోసం అంగలార్చుకుపోయి...
కుర్చీ కోసం కలలు కనీ కనీ... ఊరూవాడా వెర్రెత్తినట్టు తిరుగుతూ... ఎవరూ ఏడవకపోయినా
ఓదార్చుతూ... బుగ్గలు నిమురుతూ... ముద్దులు పెడుతూ... మీ అధినేత చెప్పిన నీతులు ఓసారి
గుర్తుకుతెచ్చుకో. అబ్బో... ఎన్ని నీతులు, ఎన్ని సుద్దులు,
ఎన్ని ఆశలు, ఎన్ని హామీలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఊరింపులు! అదిగో స్వర్ణయుగమన్నాడు.
అల్లదిగో ప్రత్యేక హోదా అన్నాడు. జీవితాల్ని మార్చేస్తానన్నాడు. బతుకులు ఉద్ధరిస్తానన్నాడు.
ఆ నీతులు విని, ఆ మాటలు నమ్మి, నిజమేగామాలనుకుని,
ఇన్నాళ్లకి మన గురించి ఆలోచించే నాయకుడొచ్చాడనుకుని... ఆశపడి,
సంబరపడి, ఆనందపడి, సంతోషపడి,
కిందా మీదా పడి... పడీ పడీ మరీ జనం ఓటేసి గెలిపించారు కదా?
ఏమైంది... ఇప్పుడా జనమే దగాపడ్డారు. దిగాలు పడ్డారు. బెంగ పడ్డారు. బెంబేలు
పడ్డారు. కలవర పడ్డారు. బొక్క బోర్లా పడ్డారు. .
పాదయాత్రకు ముందే పాతిక అక్రమార్జన కేసుల సాక్షిగా
జైలుకెళ్లొచ్చిన నిందితుడైనా... అధికారం లేని రోజుల్లోనే కుర్చీ వెనుక చక్రం తిప్పి
లక్షల కోట్లు కొల్లగొట్టి, ప్యాలస్ లు కట్టిన ఘన చరిత్ర ఉన్నవాడైనా జనం తీసుకొచ్చి సింహాసనం మీద
కూర్చోబెట్టి పట్టం గట్టారు కదా... మరి సింహాసనం ఎక్కిన మీ అధినేత తన వెనకటి గుణమేదైనా మార్చుకున్నాడా? లేదే!
నాలుగు గింజలు చల్లి, ఆశ పడి వచ్చిన పావురాల్ని పట్టుకునే
వేటగాడిలా... మీ అధినేత ఏవేవో పథకాలు పెట్టినట్టే పెట్టి... ఆ తర్వాత పన్నులు
పెంచి, ధరలు దంచి, కొత్త కొత్త చెత్త
సుంకాలు విధించి, ఛార్జీలు ఛెళ్లు మనిపించి, ఒకేసారి సెటిల్‌మెంటని, మరోసారి రిజిష్ట్రేషన్ అని నోటీసులు
ఇచ్చి, తాఖీదులు జారీ చేసి, జీవోలు మార్చి,
జెల్లకొట్టి జేబులు ఖాళీ చేసి గూబ గుయ్యిమనిపించడం లేదూ? అదిగో ఆ అధినేతలాగే నువ్వు ముందు
నీతులు చెప్పి, ఆనక అధికారం అందాక ప్రజలకే గోతులు తవ్వాలన్నమాట.
అర్థమైందా?"
శిష్యుడు నోరెళ్లబెట్టాడు.
"అయ్యబాబోయ్ గురూగారూ! భలే తాత్పర్యం
చెప్పారండీ. పాత పద్యం వెనక కొత్త రాజకీయం ఇంతదన్నమాటండి... అయితే మరోటి చదువుతాను
దాని అంతరార్థం కూడా చెప్పండి..." అంటూ పేజీలు తిరగేసి మరో పద్యం చదివాడు.
అల్పజాతి వాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల దోలి తిరుగు
చెప్పుతినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ
గురువుగారు కళ్లు మూసుకుని చెప్పారు.
"ఇది కూడా నీ పరగణా కథేరా శిష్యా! సరైన
గుణము లేని వారికి అధికారమిస్తే ఏమువుతుందో చూస్తున్నావు కదా? తన మాట వినని అధికారులందర్నీ
వేధిస్తున్నాడు మీ అధినేత. తనకు దాసోహమనని వారిని తరిమి కొడుతున్నాడు. ఆఖరికి
తన పార్టీ వాడైనా సరే, ఎదురు మాట్లాడాడా, తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఇక దానికి రాజకీయ తాత్పర్యం చెప్పుకోవాలంటే,
అధికారం చేజిక్కిన తర్వాత నీ మాటే శాసనంగా మారిపోవాలి. అప్పుడే ఎవరూ
కిక్కురుమనకుండా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా నేర్చుకోవలసింది ఆ పాఠమే. ఇప్పుడు
మరో పద్యం చదువు"
శిష్యుడు మరో పద్యం ఎంచుకుని చదివాడు.
వేరు పురుగు చేరి వృక్షంబు జెరచును
చీడపురుగు చేరి చెట్టు చెరచు
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ
పద్యం వినగానే గురువుగారు మొదలుపెట్టారు.
"ఒరేయ్... ఒక విధంగా ఇది కూడా నీ ప్రాంతం
గురించేరా. వేరు పురుగు, చీడ పురుగులు ఆశిస్తే ఎంత పెద్ద చెట్లయినా నాశనం అవ్వాల్సిందేరా. ఇప్పుడదేగా
జరుగుతోంది? ఒకప్పుడు అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణలాంటి
ప్రదేశం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. ఏకంగా ఏడు లక్షల కోట్ల రుణ భారం ప్రజల
మీద పడింది. జీతాలు, పింఛన్లు చెల్లించడానికి కూడా కిందామీదా
పడుతోంది ప్రభుత్వం. పచ్చని చెట్టులాంటి రాజ్యం ఇలా పీల్చిపిప్పి చేసినట్టు ఎండిపోయింది.
అసలు అర్థం ఇదే అయినా... నువ్వు నేర్చుకోవలసిన రాజకీయ అంతరార్థం మాత్రం వేరేరోయ్!
నీకు ఎప్పుడైనా అధికారం చేజిక్కిందనుకో. అచ్చం ఆ చీడపురుగులాగే చెట్టు మొత్తం సారాన్ని
పీల్చుకోవాలని తెలుసుకో. రాష్ట్రం ఏమైతే నీకేం? జనం ఏమైపోతే
నీకేం? అనుకున్నట్టు ముందుకు సాగిపోయే ఆ వేరుపురుగే నీకు ఆదర్శం"
"భలే బాగున్నాయ్ గురూగారూ! నీతి పద్యాలకు
మీరు చెప్పే విపరీత వ్యాఖ్యానాలు. మరైతే దీనికేం అర్థం చెబుతారో చెప్పండి..." అంటూ శిష్యుడు
మరో పద్యం చదివాడు.
మేడి పండు చూడ మేలిమై ఉండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు...
గురువుగారు నవ్వి చెప్పారు, "మీ అధినేత హామీలు కూడా ఇలాగే మేడి పండులాంటివేరా.
తీరా చేసి అమలు దగ్గరకి వచ్చేసరికి అనేక లోపాలు. ఇక రాజకీయ తాత్పర్యం ఏంటంటే...
నువ్వు కూడా అలాంటి మేడిపండులాంటి వాగ్దానాలు చేయడం నేర్చుకోవాలి. తెలిసిందా?"
శిష్యుడు మరో పద్యం చదివాడు...
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
గురువుగారు నిట్టూర్చారు.
"ఈ పద్యం వింటే పాపం నీ దేశంలో ప్రజల
దుస్థితి గుర్తొస్తోందిరా. ప్రశ్నిస్తే తప్పు... అడిగితే తప్పు... ఎదిరిస్తే తప్పు...
అన్యాయం జరిగితే చెప్పుకోడానికి కూడా భయపడుతున్నార్రా. ఇదెలా ఉందంటే పాము పడగ
నీడలో కప్ప ఉన్నట్టుగానే ఉంది. అధికార పార్టీ నేతల అహంకారం వల్ల సామాన్యులు నానా
పాట్లూ పడుతున్నారు. నేతలను ప్రశ్నించిన నేరానికి తప్పుడు కేసుల్లో చిక్కుకుని
అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు వింటున్నావు కదా? అధికారం అందాక ఎలా బరితెగించాలో,
ఎలా చట్టాన్ని నీ గుప్పెట్లో పెట్టుకోవాలో, ఎలా
భయభ్రాంతులు సృష్టించాలో అనేది నువ్వు నేర్చుకోవలసిన పాఠమనుకో..."
"ఆహా... ఎంత గొప్ప నీచ రాజకీయ పాఠాలు చెప్పారు
గురూగారూ! ఇవన్నీ వంట పట్టించుకుని మా అధినేత అడుగుజాడల్లో దూసుకుపోతాను చూస్తుండండి..." అంటూ శిష్యుడు
సంబరపడ్డాడు.
అప్పుడు గురువుగారు నిదానంగా చెప్పారు.
"ఒరేయ్... నీచ రాజకీయ సూత్రాలు సరే.
కానీ నువ్వు గుర్తుంచుకోవలసిన అసలైన పద్యం ఒకటుందిరోయ్. అది కూడా నేర్చుకున్నప్పుడే
నీ పాఠం సంపూర్ణమవుతుంది..."
"అదేంటండి గురూగారూ?"
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
"దీనర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి గురూగారూ?"
"ఇందులో అంతరార్థం లేదురా. ఒకటే అర్ధం.
నువ్వెంత నీచంగా ఎదిగినా, ఎంత నికృష్టంగా అధికారం చెలాయించినా, ఎన్ని వెధవ్వేషాలు
వేసినా, ఎన్ని దారుణాలు చేసినా, రాష్ట్రాన్ని
దోచుకుని ఎన్ని ఆస్తులు వెనకేసినా... అది
కొంత కాలమే అని గుర్తుంచుకో. ప్రజలు చలిచీమల లాంటి వాళ్లు. ఎంత పెద్ద విష సర్పమైనా
చలిచీమలన్నీ కలిసి దాడి చేస్తే చచ్చిఊరుకున్నట్టు... జనంలో చైతన్యం పెరిగి
నీ నీచ స్వరూపాన్ని గ్రహిస్తే తమ ఓటు హక్కుతో నిన్ను తరిమి తరిమి కొడతారు. ఇది
రాజకీయ పాఠం కాదురోయ్... అసలైన గుణపాఠం!"
-సృజన
PUBLISHED ON 31.5.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి