ఆదివారం, నవంబర్ 05, 2023

పొలిటికల్‌ క్రిటికల్‌ క్రికెట్‌!


''ఏరా... నిన్న రాలేదు? అప్పుడే రాజకీయాల్లో రాటుదేలిపోయాననుకున్నావా? పాఠాలు నేర్చుకునేప్పుడే ఇంత అశ్రద్ధయితే, రేప్పొద్దున్న సీఎం అయితే ఇంకేం సంపాదిస్తావ్‌?''

''అయ్యబాబోయ్‌... కోప్పడకండి గురూగారూ! ఎప్పటికైనా నన్నొక నికార్సయిన నీచ నేతగా తీర్చిదిద్దుతారనుకుంటే, ఒక్క రోజు రాకపోతేనే ఇలా తిట్టేస్తే ఎలాగండీ?''

''ఒరేయ్‌. జీవితమే చిన్నది. అందునా కుర్చీ మీద కులాసాగా కూర్చోగలిగే కాలం ఇంకా చిన్నది. పట్టుమని ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. ఒక్క రోజు వేస్టు చేసినా వేలాది కోట్లు చేజారిపోతాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందు ఈ సంగతి గుర్తెట్టుకోవాలి. అలాంటిది ఆలు లేదు సూలు లేదు స్టూడెంటు దశలోనే డుమ్మాలు కొడితే ఇంకేం ఎదుగుతావురా? ఇంతకీ నిన్నెందుకు తగలడలేదో చెప్పేడవ్వేం?''

''అబ్బే... ఏం లేదు గురూగారూ! క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి కదండీ. నిన్న ఇండియా మ్యాచ్‌ ఉందండి. అది చూద్దామని రాలేదండి...''

''ఏడిసినట్టుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ గేమ్‌ కాదురా మనక్కావలసింది, పొలిటికల్‌ క్రిటికల్‌ గేమ్‌ కావాలి. అందులో నువ్వు ప్రపంచ ఛాంపియన్‌ కావాలనేది ఆ కోరిక. నువ్వు చూస్తే వన్‌ డే మ్యాచులు చూస్తూ, పోలిటిక్స్‌ క్యాచ్‌లు వదిలేసేలా ఉన్నావు. అదే నా బెంగ''

''అమ్మమ్మ... అంతమాటనకండి గురూగారూ! ఇక ఎప్పుడూ మీ క్లాసులు మానేయనండి. శాంతించి పాఠం చెప్పండి...''

''సర్లె... నిన్న నువ్వు చూసిన మ్యాచ్‌ సంగతేంటో చెప్పు...''

''అబ్బబ్బబ్బ... ఏం మ్యాచ్‌ గురూగారూ! మనోళ్లు అదరగొట్టేశారండి. ఏకంగా మూడొందల పరుగుల తేడాతో గెలిచారండీ బాబూ. బౌండరీలు, సిక్సర్లతో చితగ్గొట్టేశారండి. ఇక బౌలింగ్‌ ఏం చేశారండీ బాబూ. అందర్నీ ఆలౌట్‌ చేసేశారండి. నిజంగా చూసి తీరాల్సిన మ్యాచండి. ఆయ్‌...''

''బాగుందిరా. ఒరే ఇంతకీ నువ్వు కానీ క్రికెటరయ్యావనుకో. మంచి బౌలరవుతావా? బ్యాట్సమన్నవుతావా?''

''అబ్బే... నాకసలు సరిగ్గా క్రికెట్టే రాదండి. ఊరికే చూసి ఆనందపడ్డమేనండి...''

''ఏడిశావ్‌. క్రికెట్ సంగతలా ఉంచితే, పొలిటికల్‌ క్రికెట్లో మాత్రం నువ్వు ఆల్‌రౌండర్‌ కావాలిరా, మీ అధినేతలాగా అర్థమైందా?''

''సార్‌... అంటే అన్నానంటారు కానీ, మా అధినేతకి, ఈ క్రికెట్‌ కి ఏంటండీ సంబంధం?''

''ఎందుకు లేదురా? రాజకీయమన్నాక అన్నాటలూ ఆడాలి మరి. అందులోనూ నీ పరగణాలో అధికారం చేపట్టి నాలుగేళ్లుగా పొలిటికల్‌ క్రిటికల్‌ క్రికెట్‌ ఆడుతున్న మీ జగజ్జెంత్రీ 'జె' టీమ్ గురించి ఎంతైనా చెప్పుకోవాలి. అరాచకంలో మీవాడు ఆల్‌రౌండరు కదరా? ఆయనే నీకు ఆదర్శమొరేయ్‌. ఇండియన్‌ టీమ్‌ ఆడే వన్‌డే కాదురా, మీ నేత ఆడే తొండియన్‌ ఫైవ్‌డే క్రిటికల్‌ ఆటనే  నువ్వు లైవ్‌లో చూస్తుండాలి.   నీకు అసలు క్రికెట్‌ వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ ఇది మాత్రం నేర్చుకోవలసిందే...''

''అర్థమైంది గురూగారూ! మాటల్లో పెట్టి మీరు పాఠం మొదలెట్టేశారండి. మరయితే చెప్పండి రాసుకుంటాను...''

''ఏముందిరా నిన్న నువ్వు చూసిన ఆటలో మన వాళ్లందరూ టీమ్‌ స్పిరిట్‌ చూపించారు కదా? మరి మన 'జె' టీమ్‌లో మాత్రం ఇది తక్కువా చెప్పు? కెప్టెన్‌ గ్యాలరీలోంచి సైగ చేస్తే చాలు, దాన్నందుకుని మంత్రులు, నేతలు అల్లుకుపోవడం లేదూ? ఎవడైనా ఏదైనా సమస్య గురించి ప్రస్తావించగానే మీ వాడు ముసిముసిగా ఓ నవ్వు నవ్వుతాడు. దాంతో ఆయన అనుచరులందరూ ఆ ప్రశ్నించిన వాడిని ఆడిపోసుకుంటూ ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి తిట్ల పురాణం అందుకుంటున్నారా లేదా? మరందంతా ఫాస్ట్‌ బౌలింగ్‌ లాంటిదే కదా? ఎవరినైనా నోరెత్తనిస్తున్నారా అని. ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్న ఆ సమస్యనో, ఆరోపణనో పరిశీలించి పరిష్కరిద్దామని ఎక్కడైనా ఉందా? అందులో నిజాల్ని మరుగున పెట్టేసి, అబద్ధపు అంకెల ప్రచారంతో జనాన్ని గందరగోళం చేయడం లేదూ? మరి దీన్ని మించిన 'రివర్స్‌ స్వింగ్‌' ఫాల్స్‌ బౌలింగ్‌ ఎక్కడుంటుంది? పాపం ఎగస్పార్టీ బ్యాట్స్‌మన్‌ ఆడడానికి నుంచున్నాడనుకో, మీ నేతలు బౌలింగ్ పద్ధతి ప్రకారం చేస్తున్నారా అని? బౌలర్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాట్స్‌మన్‌ని తోసేసి, అక్కడున్న వికెట్లు బంతితో కొట్టేసి, 'నువ్వు ఔటయిపోయావ్‌... పో' అంటున్నారు. వెళ్లకపోతే బరబరా ఈడ్చుకుపోయి గ్రౌండు బయటకి నెట్టేస్తున్నారు. మామూలు క్రికెట్లో ఒకసారి ఒకడే బౌలింగ్‌ చేస్తాడు. మరి మీ వాడి పాలనలో మంత్రులు, అనుచరులు, నేతలు అందరూ ఒకేసారి బౌలింగ్‌ చేసేస్తున్నారు కదా? 'జె' టీమ్‌ తొండాటలో అడుగడుగునా కనిపించే ఈ టీమ్‌ స్పిరిట్‌ను నువ్వు చూసి నేర్చుకోవాలి. రేప్పొద్దున నువ్వు సీఎం అయ్యావనుకో, మీ టీమ్‌ అందరికీ ఇలాంటి ఆటే నేర్పాలి మరి. అర్థమైందా?''

''అర్థమైంది కానీ గురూగారూ! మీరు బొత్తిగా ఇండియన్‌ క్రికెట్ టీమ్‌ని ఈ అరాచక పొలిటికల్‌ టీమ్‌తో పోల్చడం నాకు నచ్చలేదండి...''

''ఓరెర్రోడా! నేను నీకంటే ఎక్కువగా ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ అభిమానినిరా. కానీ రాజకీయ పాఠం నేర్చుకునేప్పుడు నిజమైన ఆట గురించి చెప్పుకుంటే ఎలారా? అందులోంచి మనం నీచమైన టీమ్‌ స్పిరిట్టే తీసుకోవాలి. మధ్యలో అడ్డొస్తావేంట్రా బడుద్ధాయ్‌...''

''బుద్ధొచ్చింది చెప్పండి సార్‌. మరయితే బ్యాటింగ్‌ గురించి కూడా చెప్పండి మరి...''

''అందులో కూడా మీ నేత తక్కువవాడేం కాదురోయ్‌. అధికారం అందుకుంటూనే అడ్డదిడ్డమైన బ్యాటింగ్‌ మొదలెట్టాడు. ప్రతిపక్షాలు బౌల్‌ చేయడానికి వీల్లేకుండా వికెట్లకి అడ్డంగా నుంచున్నాడు. ఏదైనా బాలొస్తే చాలు అటు కాళ్లతోను, ఇటు బ్యాటుతోను కొట్టేస్తున్నాడు. అలా ఆడకూడదంటే వింటున్నాడా? నా ఆట నా ఇష్టం అంటున్నాడు. మేం అధికారంలోకి వస్తే చాలా బాగా ఆడి చూపిస్తామంటే ఆశపడి అవకాశమిచ్చి ఆశతో గ్యాలరీలోకి వచ్చి కూర్చున్న అఖిలాంధ్ర ప్రేక్షకులంతా బిత్తరపోయేలా ఇష్టమొచ్చినట్టు ఆడేస్తున్నాడు. వస్తూనే ఆట  నిబంధనలన్నీ మార్చేశాడు.  ఎదుటి వాడు బంతేయడానికి వస్తుంటేనే ఎదురెళ్లి వాడి చేతిలో బంతి లాక్కుని బ్యాటుతో బాదేసి బౌండరీ వచ్చేసిందంటున్నాడు. లేదా ఆ బంతిని పట్టుకుని తానే పరుగెత్తికెళ్లి బౌండరీ లైన్‌ అవతలకి విసిరేసి సిక్సర్‌ అని అరుస్తున్నాడు.  ఒకోసారి బ్యాటుతో బౌలర్‌ తల బద్దలు కొట్టేస్తున్నాడు. వీళ్లు ఆడే ఆటకి ఎంపైర్లు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. ఎందుకంటే మీ వాడు ముందరగానే వాళ్లని బెదిరించి మచ్చిక చేసేసుకున్నాడు మరి. అసలు మీ వాడు ఆడే పొలిటికల్‌ క్రిటికల్‌ క్రికెట్‌లో ఓ రూలూ లేదు, పాడూ లేదు. ప్రతిపక్షం టీమ్‌ వాళ్లు గ్రౌండులో ఫీల్డింగుకి పొజిషన్స్‌లో నిలబడితే వాళ్ల మీద అడ్డమైన కేసులు బనాయించి తరిమి తరిమి కొడుతున్నాడు. మీ వాడు ఆడుతుంటే అసలు మైదానంలో ఫీల్డర్లు అంటూ ఎవరూ ఉండకూడదన్నంత దౌర్జన్యంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.  ఎవరైనా థర్డ్‌ ఎంపైర్‌ నిర్ణయం కోసం క్లెయిమ్‌ చేస్తే డెసిషన్‌ తీసుకునే లోగానే అక్కుడున్న స్క్రీన్లు బద్దలు కొట్టేస్తున్నాడు. అక్రమ కేసులు, కోర్టుల నిర్ణయాలపై కూడా ధ్వజమెత్తడాలు ఇలాంటివే కదరా? రాజకీయాలు నేర్చుకోవాలనుకుంటున్న నువ్వు చూడాల్సింది ఈ కిరికీల కిరికెట్టుని రా సన్నాసీ! తెలిసిందా?''

''వార్నాయినో! ఎలాంటి క్రికెట్‌ చూపించారండీ బాబూ. దిమ్మతిరిగిపోతోంది. అయినా నాకు తెలియక అడుగుతాను గురూగారూ, చూస్తూ చూస్తూ అసలు ఆట రాని ఇలాంటి వాళ్లని ఎలా గ్రౌండులోకి రానిచ్చారండీ జనం? ఇప్పుడు వీళ్ల అడ్డదిడ్డమైన ఆట చూడలేక గ్యాలరీలోంచి ఎన్ని కేకలేస్తే మాత్రం ఏం లాభమండీ?''

''అదేరా నువ్వు నేర్చుకోవలసింది. అసలు తనకు ఆట రాదని సంగతి తెలియనీకుండా... 'ఒక్కసారి ఛాన్సిచ్చి చూడండి. కనీవినీ ఎరుగని ఆట ఆడి చూపిస్తా' అంటే... పాపం నిజమనుకుని నమ్మార్రా వెర్రిజనం. వాళ్లనలా మభ్యపెట్టి, మాయ చేసే టక్కుటమార మాటల గారడీ విద్య నేర్చుకోవాలిరా ముందు నువ్వు. అప్పుడే పవర్‌ పోలిటిక్స్‌ గేమ్‌లోకి ఎంటరవగాలవు. ఒకసారి జనాన్ని నమ్మించి అధికారమనే మైదానంలోకి రాగలిగావా, ఇదిగో ఇలాంటి నీచ నికృష్ట నిబంధనలు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. పైకి ప్రజల కోసమే ఆటాడుతున్నట్టు ప్రచారం చేసుకుంటూ, టికెట్ డబ్బులన్నీ దోచుకోవచ్చు. ఆపై గ్యాలరీ తలుపులు మూసేసి నీకు ఎదురాడే టీమ్‌ అనేదే లేకుండా చేసి, వాళ్లని చితకబాదుతూ అధికార అరాచక అఘాయిత్య అక్రమ క్రీడా విన్యాసాలతో చెలరేగిపోవచ్చు. ఆపై నువ్వు బ్యాట్‌ పట్టుకుంటే బౌండరీలు, సిక్సర్లు నీవే. ఇక నువ్వు బంతి పట్టుకుంటే ఎదుటివాడిని ఎల్‌బీడబ్ల్యూ అంటావో, రనౌట్‌ అంటావో, డకౌట్‌ అంటావో, స్టంప్స్‌ ఎగరగొడతావో నీ చిత్తం. అడిగేవాడెవడు? అడ్డుకునే వాడెవడు? ఆంధ్రా పొలిటికల్‌ క్రిటికల్‌ క్రికెట్‌ గేమ్‌లో ఆరితేరాలంటే నువ్వు కూడా ఇలాంటి కిరికెట్‌ కిటుకులే నేర్చుకోవాలి. బుర్రకెక్కిందా?''

''బుర్ర గిర్రున తిరుగుతోందండీ బాబూ. కానీ చివరాఖరిగా నాదొక సందేహమండి. మరీ ఇంత చెత్తగా, చెడ్డగా, చెండాలంగా ఆడితే ఎంత కాలం సాగుతుందండీ? ప్రజలు గమనించలేరంటారా?''

''మంచి ప్రశ్న వేశావురా. ఒక్కటి మాత్రం తెలుసుకో. గ్యాలరీలోకి వచ్చి ఆట చూస్తున్న జనమంతా అమాయకులనుకోకు. వాళ్లు నీ నేతని  మించిన ఫాస్టు బౌలర్లు. నీ నాయకుడిని మించిన బ్యాటింగ్‌ నిపుణులు. వాళ్ల చేతిలో ఓటు అనే కార్క్‌ బాల్‌ ఉంది. దాన్ని సరిగా స్పిన్‌ చేశారంటే నిన్నేలుతున్న నీచ నేతల వికెట్లు అన్నీ విరిగి అవతల పడతాయి. ప్రజలనే పేస్‌ బౌలర్ల ముందు నువ్వెంత, నీ నేత ఆటెంత? ఇక జనం గనుక నీ నేత నిజస్వరూపం తెలుసుకుని ఓటింగనే బ్యాటింగ్‌ చేశారనుకో. నెత్తికెక్కి తైతక్కలాడుతున్న నేతలందరూ బౌండరీలు దాటి పరుగులు పెట్టాల్సిందే. ఏకంగా ఎగిరి గ్రౌండ్‌కి అవతల పడాల్సిందే. ప్రజాస్వామ్యమనే ఆ అసలైన క్రికెట్‌ ఆట త్వరలోనే మొదలవుతుంది. అప్పుడు చూద్దువుగాని అసలైన లైవ్‌ ఆట! అరాచక నేతల ఆటకట్టించే నిజమైన నికార్సయిన 'ఇంటర్నల్‌ విన్‌డే డెమొక్రటికల్‌ క్రికెట్‌ ఆట!!''

-సృజన

PUBLISHED ON 5.11.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి