ఓసారి ముళ్లపూడి వెంకట రమణకి ఓ మంచి ఆలోచన వచ్చింది. త్యాగయ్య జీవితాన్నీ, రాముడి కథనూ సమాంతరంగా చూపిస్తూ ఓ సినిమా చేయాలని! అందులో రాముడిగా ఎన్టీఆర్, త్యాగయ్యగా ఏఎన్నార్ అయితే బాగుంటుందని కూడా అనుకున్నారు. 'త్యాగరాజ రామాయణం' అని పేరు కూడా ఊహించారు. అనుకుంటే సరిపోతుందా? లెక్కలు వేసుకోవాలి కదా! అలా బడ్జెట్ ఎంతవుతుందో చూస్తే అదొక భారీ సినిమా అవుతుందని తేలింది. నిర్మాతల కోసం అన్వేషణ మొదలైంది. ఎమ్వీఎల్ గా ప్రసిద్ధుడైన రచయిత, నిర్మాత మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహ రావు అప్పట్లో నూజివీడు కాలేజీలో పనిచేస్తుండేవారు. ఆయన అక్కడి జమీందారీ వంశానికి చెందిన యువకుల్ని ఈ సినిమా నిర్మాణానికి ఒప్పించారు. అన్నీ కుదురుతున్నాయనుకునే సమయానికి 1974లో ఏయన్నార్ గుండె జబ్బు చికిత్స కోసం అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ప్రాజెక్ట్ ఆగింది. ఆయన తిరిగి వచ్చే లోగా తక్కువ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించాలని నిర్మాతలు ముళ్ళపూడిని కోరారు. అప్పుడు ఆయన వాళ్లకి చెప్పిన కథే 'ముత్యాల ముగ్గు'. 'ముత్యాల ముగ్గు' మరపురాని సినిమాగా మిగిలిపోయినా, ముళ్లపూడి ఊహించిన త్యాగరాజ రామాయణం మాత్రం మరుగున పడిపోయింది.