శుక్రవారం, నవంబర్ 22, 2024
సోమవారం, నవంబర్ 11, 2024
రాముడికి దాసులైన దివ్యాస్త్రాలు! (పిల్లల కోసం రాముడి కథ-10)
తాటకను వధించిన రాముడుని దేవతలు, సిద్ధులు ఎంతగానో ప్రశంసించారు. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడితో కలసి ఆ రాత్రికి తాటక వనంలోనే విశ్రమించారు. అయోధ్య నుండి బయల్దేరిన వారికిది మూడో రాత్రి. ఆ మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడితో, ''నాయనా! నువ్వు తాటకను చంపినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నీకు దివ్యమైన అస్త్రాలను అందిస్తాను. వాటి వలన యుద్ధంలో నిన్ను ఎదిరించేవారు ఎవరైనా నీకు వశమవుతారు. దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలైన వారినైనా నువ్వు అవలీలగా జయించగలుగుతావు'' అన్నడు. ఆపై ఆయన తూర్పు ముఖంగా కూర్చుని ఆయా అస్త్రాలకు సంబంధించిన మంత్రాలను రాముడికి ఉపదేశించాడు. దండ చక్రము, కాల చక్రము, విష్ణు చక్రము, ఇంద్రాస్త్రము, శివునికి చెందిన మహా శూలము, బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, నారాయణాస్త్రము, వాయువ్యాస్త్రము, మానవాస్త్రము లాంటి అనేక రకాల పేర్లు ఉన్న దివ్యాస్త్రాలను అందజేశాడు. కామరూప శక్తి గలవి, మహా బల సంపన్నమైనవి అయిన ఈ అస్త్రాలన్నింటినీ పొందడం దేవతలకు కూడా సైతం సాధ్యం కాదు. ఆ అస్త్రాలకు సంబంధించిన దేవతలందరూ వచ్చి, రాముడికి నమస్కరించి, ''ఓ రామా! ఇక నుంచి మేమంతా నీ సేవకులం. ఏ పని చెబితే అది చేస్తాం''అన్నారు. రాముడు ఆ అస్త్రాలన్నింటినీ చేతితో తాకి, ''నేను తలుచుకున్నప్పుడు రండి'' అంటూ వారిని పంపివేశాడు. తిరిగి వాళ్లు ముగ్గురూ తమ ప్రయాణం కొనసాగించారు. మార్గమధ్యంలో రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించి, తను పొందిన దివ్యాస్త్రాలను ఉపసంహరించే విద్యలను కూడా అడిగి పొందాడు. తర్వాత విశ్వామిత్రుడి సూచనతో రాముడు, ఆయా అస్త్రాలకు సంబంధించిన మంత్రాలను లక్ష్మణుడికి కూడా బోధించాడు.
అలా వారు ముగ్గురూ కొంత దూరం ప్రయాణించాక ఓ కొండ పక్కగా ఒక అందమైన వనం చేరుకున్నారు. రాముడది చూసి, ''స్వామీ! ఈ వనం చూడ ముచ్చటగా ఉంది. ఇదొక ఆశ్రమమని కూడా తోస్తున్నది. దీని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది'' అని అడిగాడు.
విశ్వామిత్రుడు ఆ కథంతా చెప్పాడు.
''రామా! మహా విష్ణువు, లోక కళ్యాణం కోసం చాలా కాలం ఇక్కడ తపస్సు చేశాడు. అదే సమయంలో ప్రహ్లాదుడి మనుమడు, విరోచనుడి కొడుకు అయిన బలి చక్రవర్తి, ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకాలకు రాజయ్యాడు. పరాజయం పొందిన దేవతలందరూ కలిసి ఇక్కడ తపస్స చేసుకుంటున్న మహావిష్ణువుని ప్రార్థించి తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడు మహా విష్ణువు, ఇదే ప్రాంతంలో తపస్సు చేసి సిద్ధి పొందిన కశ్యపుడనే మహర్షికి పుత్రుడిగా అవతరించాడు. అతడే వామనుడు. బలి చక్రవర్తి గొప్ప యాగాన్ని తలపెట్టి, అడిగిన వారికి అడిగినట్టు దానాలు చేస్తున్న సమయంలో వామనుడు అక్కడికి వెళ్లి మూడడుగుల భూమిని యాచించాడు. బలి ఇవ్వగానే వామనుడు, అంతకంతకు ఎదిగిపోయి, రెండడుగులతో భూమినీ ఆకాశాన్నీ కొలిచి మూడో అడుగును బలి చక్రవర్తి తలపై మోపి, అతడిని అధోలోకానికి అణగదొక్కాడు. ముల్లోకాలనూ తిరిగి ఇంద్రుడికి ఇచ్చేశాడు. వామనుడి పాద స్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది. తపస్సులకు సిద్ధి కలిగించే ఈ ఆశ్రమం, సిద్ధాశ్రమంగా పేరు పొందింది. అందుకే నేను కూడా ఇక్కడికే వచ్చి ఉంటున్నాను'' అంటూ వివరించాడు.
ఈ కథను వింటూనే రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుడితో పాటు సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. వారిని చూడగానే అక్కడి మునులందరూ ఆనందంతో సంబర పడుతూ స్వాగతం పలికారు. రామలక్ష్మణులు కొంత సేపు ప్రయాణపు బడలిక తీర్చుకున్నాక, విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించి, ''మహాత్మా! ఇక మీరు నిశ్చింతగా యాగాన్ని ప్రారంభించడండి. రాక్షసుల బెడద లేకుండా మేము రక్షిస్తాం'' అన్నారు. విశ్వామిత్రుడు ఎంతో ఆనందించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రి రామలక్ష్మణులిద్దరూ అక్కడే విశ్రమించారు. మరునాటి నుంచి రామలక్ష్మణులు ఏ విధంగా యాగ సంరక్షణ చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)