ఉపవాసం ఎంత మంచిదో ఇప్పటికే సైన్స్ పరిశోధనలు ఎన్నో నిరూపించాయి కదా! ఉపవాసం ఉపయోగాల గురించి రెండు నోబెల్ బహుమతులు కూడా వచ్చినట్టు చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు మరో శాస్త్రీయ పరిశీలన తిరిగి ఉపవాసం సత్ఫలితాల గురించి కొత్తగా బయటపెట్టింది. చాలా మంది బరువును నియంత్రించుకోడానికి ఉపవాసాలు చేస్తుంటారు కదా. కానీ దాన్ని మించిన ప్రయోజనం ఉందని తాజాగా తేలింది. సరైన పద్దతిలో నియంత్రణతో చేసే ఉపవాసాలు హార్ట్ ఎటాక్‌ల ప్రమాదాన్ని కూడా చాలా తగ్గిస్తుందని నిరూపణ అయింది. గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే బ్లడ్ క్లాట్స్‌ను ఉపవాసాలు నివారిస్తాయని తేలింది. ఉపవాసాల సమయంలో శరీరం తనను తాను బాగు చేసుకుంటుంది. రక్తంలో హాని కరమైన ఫ్యాట్స్, ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను ఉపవాసం తగ్గిస్తుంది. ఇందువల్ల రక్తంలో ప్లేట్ లెట్లు ఒక చోట పోగుపడి క్లాట్స్ గా మారే ప్రమాదం తగ్గిపోతుంది. రక్తం సులువుగా ప్రవహించడంతో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇలా గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి అవడానికి, కొవ్వు నియంత్రణకి కూడా ఉపవాసాలు ఉపయోగపడతాయి. మొత్తానికి వైద్య పరిభాషలో చెప్పే ఓవరాల్ మెటాబాలిక్ హెల్త్ కూడా బాగుపడుతుంది. అయితే ఉపవాసాలను సరైన పద్ధతిలో, నియంత్రణతో చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద సరైన ఆహార అలవాట్లు ఆరోగ్యకరమైన గుండెకు దోహదపడతాయని తేలిందన్నమాటే. అంటే మంచి న్యూట్రిషన్స్‌తో కూడిన ఆహారం, తగిన వ్యాయామం హృద్రోగాల నుంచి సురక్షితంగా ఉంచుతాయని మరోసారి తేటతెల్లమైంది.