పాపకి జ్వరంగా ఉంది. మూసిన కన్ను తెరవడం లేదు.
ఏవేవో పనుల మీద ఇల్లంతా తిరుగుతున్న అమ్మ చేతి మునివేళ్ళు ఆ చిన్నారి నుదిటి మీద, మెడ మీద
ఎన్ని సార్లు సుతారంగా తాకి చూశాయో.
ఎక్కడో ఆఫీస్ లో ఉన్న నాన్న ఎన్నిసార్లు ఇంటికి ఫోన్ చేసాడో, పాపకి ఎలా ఉంది అని.
చివరకి నాన్న మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు.
అమ్మా నాన్నా పాపకి చెరో పక్కనా కూర్చున్నారు. 'ఎలా ఉంది బంగారూ' అని అడుగుతూనే ఉన్నారు.
'బాధగా ఉందమ్మా' అని పాప అంటే, 'తగ్గిపోతుందమ్మా, కొంచెం ఓపిక పట్టు' అంటూ అమ్మ, పాప తల మీద రాస్తూ కూర్చుంది. పాపని మరిపించడానికి నాన్న ఏవో కథలు చెబుతూ పక్కనే పడుకున్నాడు.
'నాన్నా! ఈ జ్వరం నాకొద్దు. తీసేయ్' అంది పాప నీరసంగా. నాన్న, అమ్మ కేసి చూసి సన్నగా నవ్వాడు.
తర్వాత పాపతో అన్నాడు, 'ఎలా నాన్నా! అలా అనకూడదు. నిన్న ఐస్క్రీమ్ తినొద్దంటే విన్నావా? చూడు ఇప్పుడెలా బాధ పడుతున్నావో. అయినా తగ్గిపోతుందిలే సరేనా?' అంటూ ధైర్యం చెప్పాడు.
అంత జ్వరంలో ఉన్నా, ఆ పాపకి ఎంతో హాయిగా అనిపిస్తోంది.
అమ్మా నాన్నా దగ్గరే ఉండి, ప్రేమ చూపించడం బాగుంది.
'ఆమ్మా! నాకు బెండ కాయ వేపుడు తినాలని ఉంది' అని ఈ పాప అంటే,
'ఇప్పుడు కాదమ్మా! నీకు జ్వరం తగ్గిపోగానే చేసి పెడతానే' అని అమ్మ భరోసా ఇచ్చింది.
'నాన్నా! నాకేం బార్బీ బొమ్మ కావలి' అంది గోముగా.
'తప్పకుండా తల్లీ' అన్నాడు నాన్న వెంటనే. అమ్మా నాన్నా చేతులు పట్టుకుని ఆ పాప నిద్రలోకి జారుకుంది.
మర్నాడు లేచేసరికల్లా జ్వరం తగ్గింది. రెండు రోజుల్లో మామూలుగా అయింది. అమ్మ బెండ కాయ వేపుడు చేసింది. నాన్న బార్బీ బొమ్మ తెచ్సి ఇచ్చాడు. ఎందుకో తెలియదు కానీ జ్వరం రావడం ఆ పాపకి నచ్చింది.
********
దాదాపు ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కానీ ఒక విషయం గ్రహించాలి. అమ్మా నాన్నా ఆ పాపకి ఎన్నో సపర్యలు చేశారు, కానీ జ్వరాన్ని మాత్రం ఆమె నుంచి తీసేయలేక పోయారు. ఆ బాధను పాపే భరించింది. కానీ అమ్మా నాన్నా మాత్రం పక్కనే ఉండి ప్రేమ చూపించారు.
భగవంతుడు కూడా అంతే. మన కష్టాన్ని తీసేయలేడు . కానీ ఆ బాధని తట్టుకొనే ధైర్యాన్ని ఇస్తాడు.
భరోసా కల్పిస్తాడు.
ఎందుకంటే ఆ బాధ ఎప్పుడో మనం చేసిన పనుల ప్రభావమే!
ఆ బాధ తగ్గిపోగానే మనం కోరినవి అన్నీ ఇస్తాడు!
ఎందుకంటే ఆ బాధ ఎప్పుడో మనం చేసిన పనుల ప్రభావమే!
ఆ బాధ తగ్గిపోగానే మనం కోరినవి అన్నీ ఇస్తాడు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి