మంగళవారం, జూన్ 23, 2020

ఆ క‌ష్టం... ప‌డాల్సిందే!


బాబుకి స్నానం చేయించింది అమ్మ‌. మెత్త‌ని తువ్వాలుతో సుతారంగా తుడిచింది. మురిపెంగా చూస్తూ పౌడ‌ర్ పూసింది. చ‌క్క‌గా విస్త్రీ చేయించిన‌ చొక్కా తొడిగింది. ఆస‌రికి బాబుకి అర్థం అయింది. 
"తా... తా..." అన్నాడు. 
అమ్మ హాయిగా న‌వ్వేసింది. 
"అరె... బుజ్జిక‌న్న‌కి తెలిసి పోయిందీ... మ‌నం టాటా వెళుతున్నామ‌నీ..." అంటూ ముద్దుపెట్టుకుంది. 
బాబు కేరింత‌లు కొట్టాడు. ఇంత‌లో ఇంటి ముందు స్కూట‌ర్ ఆగింది. 
"నా...న‌..." అన్నాడు బాబు ఉత్సాహంగా ఊగుతూ.
బ‌య‌ట‌కు చూసిన అమ్మ‌, అప్పుడే లోప‌లికి వ‌స్తున్న నాన్న‌కి ఎదురెళ్లింది.
"మీ స్కూట‌ర్ చ‌ప్పుడు విన‌గానే వీడు గుర్తు ప‌ట్టేశాడండోయ్‌! నాన్న అంటున్నాడు" అంటూ న‌వ్వుతూ అంది. 
నాన్న హెల్మెట్ తీసి ప‌క్క‌న పెడుతూ, "అవునాలాలే... క‌న్న‌... నేనొత్తేతాన‌ని తెల్సి పోయిందాలే" అంటూ బాబును తీసుకుని బుగ్గ‌మీద ముక్కు రాశాడు.
బాబు వెన్నెల‌లా న‌వ్వుతూ నాన్న భుజం మీద వాలిపోయాడు.
"ప‌ద‌.. వెళ్దాం. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైపోయింది" అన్నాడు నాన్న‌.
అమ్మ ఓ చిన్న బుట్ట పట్టుకుని బ‌య‌ట‌కు అడుగుపెడుతూ, "పాపం... వీడి సంబ‌రం చూస్తుంటే జాలేస్తుంది. అక్క‌డ మాత్రం మీరే ఎత్తుకోవాలి. నాకు ఏడుపు వ‌చ్చేస్తుంది" అంది.
"స‌ర్లే... ప‌ద‌... త‌ప్ప‌దుగా మ‌రి? " అన్నాడు నాన్న‌.
స్కూట‌ర్ స్టార్ట్ చేశాడు నాన్న‌. అమ్మ ఒడిలో హాయిగా కూర్చుని విప్పారిన క‌ళ్ళ‌తో అన్నీ చూస్తున్నాడు బాబు. స్కూట‌ర్ వెళుతుంటే రివ్వుమని త‌గులుతున్న చ‌ల్ల‌ని గాలికి కేరింత‌లు కొడుతున్నాడు. అమ్మ వెచ్చ‌ని ఒడిలో, భ‌ద్ర‌మైన చేతుల మ‌ధ్య ఒద్దిక‌గా ఒదిగి పోయి, క‌ళ్ల ముందు క‌దిలిపోతున్న లోకాన్ని వింత‌గా చూస్తున్నాడు. ఏదో తెలియ‌ని ఆనందంతో ఉత్సాహ‌ప‌డుతున్నాడు. 
స్కూట‌ర్ ఆగింది. అమ్మ బాబును జాగ్ర‌త్త‌గా పొదివి ప‌ట్టుకుని దిగింది. అమ్మ భుజం మీద త‌ల‌పెట్టి చూస్తున్నాడు బాబు. 
లోప‌లికి వెళ్లి అమ్మ కూర్చునేస‌రికి నాన్న వ‌చ్చి, జేబులోంచి చాక్లెట్ తీసి బాబు నోట్లో పెట్టాడు. తీయ‌గా, హాయిగా చ‌ప్ప‌రిస్తూ ఆడుతున్నాడు బాబు. 
కాసేపటికి న‌ర్స్ వ‌చ్చి, "రండ‌మ్మా..." అంది.
అమ్మ చేతుల్లోంచి నాన్న భుజం మీద‌కి మారాడు బాబు. 
గ‌దిలోప‌లికి వెళ్లారు. 
"ఏమంటున్నాడు మీ వాడు?" అన్నాడు అక్క‌డున్న డాక్ట‌ర్‌. 
"ఇప్ప‌టికి దాకా హుషారుగానే ఉన్నాడు సార్‌. ఇప్పుడు చూడాలి..." అంటూ స‌న్న‌గా న‌వ్వాడు నాన్న‌. డాక్ట‌ర్ కూడా న‌వ్వేస్తూ స్టెత‌స్కోప్ బాబు గుండెల మీద పెట్టాడు. ఆ గొట్టాన్ని ప‌ట్టుకుని ఆడసాగాడు బాబు. ఆయ‌న అన్నీ ప‌రీక్షించి, "ఓకే... " అని, ఆ త‌ర్వాత న‌ర్స్‌ని పిలిచాడు. న‌ర్స్ వ‌చ్చింది. ఆమె చేతిలో ఇంజ‌క్ష‌న్‌! బాబుని భుజం మీద పెట్టుకుని త‌ల నొక్కి ప‌ట్టాడు నాన్న‌. అమ్మ ఆ ప‌క్క‌కి తిరిగిపోయింది. న‌ర్స్ బాబు లాగుని కొంచెం కిందికి లాగింది. దూదితో స్పిరిట్ రాసింది. చ‌ల్ల‌గా త‌గిలింది బాబుకి. ఆ వెంట‌నే... చురుక్కుమంటూ సూది దిగింది. ఆ బాధ ఒక్క‌సారిగా తెలిసేస‌రికి కెవ్వుమ‌న్నాడు బాబు. లేద్దామంటే న‌న్న చేయి బిగుసుకుంది. గ‌ట్టిగా త‌ల అదిమి పెట్టింది. 
బాబుకి ఏదో తెలియ‌ని బాధ‌. అంత‌కు మించి కోపం. ఏం చేయాలో తోచ‌క నాన్న మొహం మీద గుద్ద‌డం మొద‌లు పెట్టాడు. చిట్టి గోర్ల‌తో ర‌క్కేశాడు. ఇంతలో అమ్మ వ‌చ్చి బాబుని తీసుకుంది. అమ్మ చేతుల్లోనూ గింజుకున్నాడు. కాళ్ల‌తో త‌న్నాడు. చేతుల‌తో కొట్టాడు. "లేదు... నాన్నా... త‌గ్గిపోతుందిలే..." అంటూ బాబు కొడుతున్న‌కొద్దీ గుండెల‌కు హ‌త్తుకుంది అమ్మ‌. అమ్మ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు. నాన్న క‌న్నుల్లో స‌న్న‌టి నీటి తెర‌. 
బాబుకి మాత్రం కోపం త‌గ్గ‌లేదు. టాటాకి బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్ప‌టి ఉత్సాహం ఇప్పుడు లేదు. పైగా ఎందుకో అమ్మా, నాన్న‌ల మీద  విప‌రీత‌మైన కోపం, ఉక్రోషం!!
******
మ‌న ప‌రిస్థితీ ఆ బాబులాంటిదే. మ‌న జీవితంలో కూడా ఉన్న‌ట్టుండి ఏదో తెలియ‌ని బాధ చ‌టుక్కున ఎదుర‌వుతుంది. ఉత్సాహంగా ఉన్న మ‌న‌కి చురుక్కుమ‌నిపిస్తుంది. అప్పుడు ఆ బాబులాగే మ‌నకి కూడా భ‌గ‌వంతుడి మీద కోపం వ‌స్తుంది. మ‌న న‌మ్మ‌కం అంతా ఒక్క‌సారిగా వీగిపోయిన‌ట్టు అనిపిస్తుంది. ఏదో మోసం జ‌రిగిపోయిన‌ట్టు బాధ‌ప‌డ‌తాం. కానీ ఆ అమ్మా నాన్న‌ల లాగే ఆ భ‌గ‌వంతుడు కూడా బాధ ప‌డ‌తాడు. బాబు ఆరోగ్యంగా పెర‌గాలంటే అలాంటి ఇంజెక్ష‌న్ అవ‌స‌ర‌మ‌ని అమ్మానాన్న‌ల‌కి తెలుసు. అందుకే ద‌గ్గ‌రుండి మ‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి నెప్పి క‌లిగించారు. మ‌నం జీవితంలో మ‌రింత రాటుదేలాలంటే ఆ క‌ష్టం అనివార్య‌మ‌ని భ‌గ‌వంతుడికి తెలుసు. కానీ ఆ బాబులాగే... మ‌న‌కి మాత్రం ఆ క్ష‌ణంలో అర్థం కాదు. ఎందుకంటే మ‌నం కూడా ఆ బాబులాగే ఎదిగీఎద‌గ‌ని వాళ్లం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి