పూర్వం అవంతీ రాజ్యంలో, మహారాజు ఆంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది. అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్థక్య భారానికి తోడు, అనారోగ్యానికి గురి కావడంతో, ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది. ఈ విషయం రాజు వీరవర్మకొక సమస్యగా మారింది. కారణం, ఎంతో సూక్ష్మ బుద్ధిగల జయానందుడు, ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు.
ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్థావించగా, ఆయన, "మహారాజా! ముందు దేశంలో రాజనీతి, ఆర్థిక, న్యాయ శాస్త్రాలను అభ్యసించిన వారినందరినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విషయమై పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ తర్వాత జయానందుడి సలహాపై, వారిలో ఒకరిని తమ ఆంతరంగిక సలహాదారుగా నియమించవచ్చు" అని సలహా ఇచ్చాడు.
రాజు ఇందుకు సమ్మతించగానే, మంత్రి వెంటనే దేశమంతటా చాటింపు వేయించాడు.
ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేకమంది యువకులు వచ్చారు. వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా, జయుడు, విజయుడు అనేవాళ్లు ప్రథములుగా నిలిచారు. వాళ్లిద్దరూ సమ ఉజ్జీలు కావడంతో మంత్రి సుబుద్ధి, జయానందుడిని కలుసుకుని సంగతి వివరించాడు.
జయానందుడు అంతా విని, "ఆంతరంగిక సలహాదారుడన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు. క్లిష్ట మైన సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి. శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరు పరీక్ష నిర్ణయిస్తుంది " అని, ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు.
మర్నాడు మంత్రి జయుణ్ణీ, విజయుణ్ణీ పిలిపించి, కొద్దిసేపు వాళ్లతో, ఆ మాటా, ఈమాటా మాట్లాడిన తర్వాత ముఖం విచారంగా పెట్టి, "ఈమధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురి అయ్యాడు. అది మీరిద్దరూ వినదగిన సంగతి!" అన్నాడు.
తర్వాత మంత్రి సుబుద్ది, తన మిత్రుడి గురించి చెప్పిన వివరరాలిలా ఉన్నాయి.
మంత్రి సుబుద్ధి మిత్రుడైన దానశీలి వయోవృద్ధుడు; ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బులాంటిది కూడా ఉన్నది. ఒకనాటి రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆయన, ఒక కారడవిలో దారి తప్పిపోయాడు. ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి, చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు. పైన నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నవి. ఆ గుడ్డి వెలుగులో ఆయనకు నాలుగు దారులు గల, ఒక కూడలి ప్రదేశం కనిపించింది. ఆయన ఆ దారులలో ఒకదాని వెంట నడవసాగాడు. కొంతదూరం వెళ్లేసరికి, దారే కనిపించనంతగా పొదలూ, చెట్ల గుబుళ్లతో నిండిన ప్రదేశం వచ్చింది. అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నవి. వాటిలో ఒక సింహం దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ, ఆయన కేసి రాసాగింది.
దానశీలి ప్రాణభయంతో వెనుదిరిగి పరిగెత్తి, కొంత సేపటికి కాలిదారుల కూడలికి చేరాడు. సింహం జాడలేదు. ఆయన అలసట తీర్చుకున్నాక, రెండో దారి వెంట నడవసాగాడు. కొంతదూరం వెళ్లాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది. దానశీలి ఒక పొదచాటుకు చేరి, ఆ వెలుగు వస్తున్న వైపు చూశాడు. ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పెద్ద పుట్టలున్నవి. వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నవి. ఆ పడగలపై ఉన్న మణులు, కాంతులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్నవి.
ఆశ్చర్యంతో, ఆ దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని, పుట్టల మధ్య ఆడుతున్న ఐదు తలల మహాసర్పం ఒకటి చూసి, బుసలు కొడుతూ అమితవేగంతో ఆయనకేసి రాసాగింది. ఆయన గిరుక్కున వెనుదిరిగి, శక్తికొలదీ పరిగెత్తి, తిరిగి నాలుగు దారుల కూడలిని చేరాడు. మహాసర్పం జాడలేదు.
ఈసారి దానశీలి మూడవ దారిగుండా నడవసాగాడు. కొంతదూరం వెళ్లాక, ఆ దారి ఓ కొండ దగ్గర ఆగిపోయింది. ఆ ప్రదేశాన ఆయనకు, కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి. కీడు శంకించిన దానశీలి, వెనుదిరిగేలోపలే, దాపుల వున్న గుహలోంచి భయంకరాకారుడైన రాక్షసుడొకడు ముక్కు పుటాలు ఎగరవేస్తూ బయటకి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే దానశీలి కెవ్వుమంటూ అరిచి, పరిగెత్తి నాలుగు దారుల కూడలిని చేరాడు.
అయితే, రాక్షసుడు పెద్దగా హుంకరిస్తూ, తనకేసి రావడం చూసిన వెంటనే అక్కడున్న నాలుగవ దారి వెంట పరిగెత్తాడు. ఆ దారి అతణ్ణి కొండ అంచుకు చేర్చింది. దానికి దిగువన పెద్ద అగాధమున్నది. వెనుక రాక్షసుడు; ముందు అగాధం! ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దానశీలి నిలువెల్లా గజగజ వణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంతలో, కాళ్ల కింద ఉన్న రాయి జారింది. ఆయన కెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు.
మంత్రి ఇలా చెప్పి, ఒక క్షణం ఆగి జయ, విజయులతో, "చూశారా, ఎంత భయంకరమైన కలో! అసలే గుండెజబ్బుతో బాధపడుతున్న, నా మిత్రుడు దానశీలి, కల నుంచి మెలకువ వస్తూనే, గుండెపోటుకు గురి అయి మరణించాడు" అన్నాడు.
అప్పుడు జయుడు ఎంతో విచారంగా, "స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనవుతుందని, మనస్తత్వ శాస్త్రం చెబుతున్నది. తమ మిత్రుడు కలలో నాలుగుసార్లు ప్రాణ భయానికి లోనయ్యాడు. అసలే గుండెజబ్బు మనిషి కనుక, ఆ వత్తిడికి తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మరణానికి, నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను" అన్నాడు.
మంత్రి తలపంకించి, విజయుడికేసి చూశాడు.
విజయుడు చిరునవ్వు నవ్వుతూ "క్షమించాలి, మహామంత్రీ! మీరు చెప్పినదంతా ఒక కట్టుకథ" అన్నాడు.
మంత్రి కోపంగా, "అదెలా కట్టుకథో నిరూపించగలవా? "అన్నాడు.
దానికి విజయుడు వినయంగా, "మీ మిత్రుడు మెలకువ వస్తూనే, గుండెపోటుకు గురై వెంటనే చనిపోయినప్పుడు, ఆయనకు కల వచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా!" అన్నాడు.
మంత్రి సుబుద్ధి, విజయుణ్ణి అభినందించి, అప్పటికప్పుడే అతణ్ని రాజు వీరవర్మకు ఆంతరంగి సలహాదారుగా నియమించాడు.
Published in "CHANDAMAMA" children's Magazine in April, 1992.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి