గణతంత్ర దినోత్సవం. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఆశీనులయ్యారు. ప్రజల కోసం ఏర్పాటు
చేసిన గ్యాలరీలో సామాన్యుడు ఒదిగి కూర్చున్నాడు. ముఖ్యుల ప్రసంగాలయ్యాక ఓ అధికారి
లేచి, “ఇప్పుడు శకటాల ప్రదర్శన. మన ప్రభుత్వం సాధించిన
ప్రగతిని ప్రతిబింబించే శకటాలివి. అందరూ తిలకించి పులకించాలి” అంటూ ప్రకటించారు. వరసగా శకటాలు రాసాగాయి. వాటిని చూస్తున్న సామాన్యుడు
పకాల్మని నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావ్?” అని అడిగాడు పక్కనున్నవాడు.
“నా కళ్లతో చూస్తే తెలుస్తుంది...”
“అయితే ఆ దృశ్యాలేంటో నాకూ చూపించు...”
“సరే చూడు మరి...”
******
అలంకరించి ఓ శకటంపై పెద్ద పెద్ద పీపాలున్నాయి.
వాటిలో ఉన్న ద్రవాన్ని కొందరు మగ్గులతో తీసి మరికొందరి నోళ్లలో పోస్తున్నారు.
వాళ్లంతా జోగుతున్నారు. ఆ పక్కనే మరి కొందరు నోట్ల కట్టలు లెక్కపెడుతున్నారు.
“ఆ పీపాలేంటి? ఆ పోసేదేంటి?”
“మద్యం. మరి అదే కదా మన ప్రభుత్వానికి
ప్రధాన ఆదాయాన్ని అందించేది. మద్య పాన నిషేధాన్ని అంచెలంచెలుగా సాధిస్తానని వాగ్దానాలు
గుప్పించిన ముఖ్యమంత్రి, కుర్చీ ఎక్కగానే ఏం చేశాడు? అస్మదీయులకు మద్యం కాంట్రాక్టులు
కట్టబెట్టాడు. వాళ్లేమో రకరకాల కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. వాటి ఖరీదు
ఎక్కువైనా జనానికి తాగక తప్పని పరిస్థితి. అలా కుప్పలు తెప్పలుగా వస్తున్న
డబ్బుని కాంట్రాక్టర్లు లెక్క పెట్టుకుంటున్నారు చూశావుగా? ఇది మన రాష్ట్రంలో మద్యపాన విధానం మరి...”
ఇంతలో ఆ శకటం మీద కొందరు నృత్యం చేస్తూ పాటందుకున్నారు...
“తాగవోయి భారతీయుడా... తాగి సాగవోయి
మత్తు దారులా....
ఎంతయినా తాగవయా... తాగి జోగవయా...
నీ జేబుకి చిల్లులే... మా పాలిట కాసులయా!”
అంటూ పాట సాగుతుండగా ఆ శకటం వెళ్లిపోయింది.
నోరెళ్ల బెట్టిన పక్కోడితో సామాన్యడు చెప్పసాగాడు...
“కిందటేడు మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
17,600 కోట్లు! మద్యం రేట్లను ఏకంగా 125 శాతం పెంచేశారు. ఓ పక్కన ముఖ్యమంత్రి
మద్యం వాడకాన్ని నియంత్రిస్తామని చెబుతుంటే మర పక్క బెల్టు షాపుల్లో యధేచ్చగా
దొరుకుతోంది. మరి ఇలాంటి కబుర్లు వింటుంటే నవ్వు రాదా మరి” అన్నాడు సామాన్యడు.
నిజమే అంటూ పక్కవాడు కూడా నవ్వేశాడు.
****
ఇంతలో మరో శకటం వచ్చింది. దాని మీద పోలీసులు
లాఠీలతో హడావుడి చేస్తున్నారు. శకటం మీద అటూ ఇటూ పారిపోతున్న వారిని వెంట పడి
మరీ కొడుతున్నారు. మరో పక్క రౌడీలు కొందర్ని
వేధిస్తుంటే పోలీసులు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నారు.
మరో పక్క నుంచి మైకులో పాట వినిపిస్తోంది.
“చట్టాల్ని తిరగరాయి... కేసుల్ని మోపవోయి...
అడిగితే విరగదీయి... నీదేను పైచేయి!”
పక్కోడు తెల్లబోయి “ఇదేం విచిత్రం?” అన్నాడు.
“ఆ పారిపోతున్న వారంతా ప్రభుత్వ విధానాలలో లోపాలను
ప్రశ్నించిన వాళ్లు. వాళ్లు లేవనెత్తిన విషయాలపై నిజానిజాలు తేల్చుకుని సరిదిద్దుకోవాల్సిన
ప్రభుత్వం ఏం చేస్తోంది? అడిగిన వాడిపైనే కేసులు పెట్టిస్తోంది.
విమర్శించిన వాడిని తీసుకొచ్చి కుళ్లబొడుస్తున్నారు. ప్రశ్నించిన వాడిని నేతల అనుచరులు
రౌడీల్లా వేధిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలాటి చిత్రమైన పాలన చూస్తుంటే
నవ్వు రాదంటావా?” అంటూ నవ్వేశాడు సామాన్యుడు.
******
ఈలోగా మరో శకటం వస్తుంటే పాట గట్టిగా వినిపించసాగింది.
“గనులు కనులలో కనబడితే ఆ కలయికఫలమేమి?
పనులే...
ఆ పనిలో నీవే జొరబడితే ఆ చొరవకు బలమేమి?
కాసులే...
ఆ కాసులు నీవే కొల్లగొడితే ఆపై జరిగేదేమి?
దోపిడీ... దోపిడీ...
ఆ దోపిడికి అందరు జతగడితే అందుకు కారణమేమి?
అధికారం!”
ఆ శకటంపై ఉన్న వారి చేతిలో గునపాలు ఉన్నాయి. వాళ్లు
ఆ శకటం మీద ఉన్న కొండలను తవ్వుతున్నారు. అలా
తవ్వుతున్న కొద్దీ నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. వాటిని విరగబడి నవ్వుతూ
జేబుల్లో కుక్కుకుంటున్నారు కొందరు.
“కొండలు తవ్వుతుంటే మట్టి రావాలి కానీ నోట్లు రావడమేంటి
గురూ?” అని అడిగాడు పక్కనోడు.
“అదే మరి చిత్రం. రాష్ట్రంలో అధికారికంగా 44 గనులు ఉన్నాయి. వాటికి ఇచ్చిన అనుమతులను అడ్డం
పెట్టుకుని అడ్డగోలుగా పరిమితికి మించి తవ్వేసుకుంటున్నారు కాంట్రాక్టర్లు. వాళ్లంతా
అధికార పార్టీకి కావలసిన వాళ్లే. ఇలా ఇసుక, కంకర, తెల్లరాయి, గ్రానైట్, గ్రాఫైట్... ఇలా ఒకటేమిటి, ప్రకృతి సంపదనంతా
ఇష్టారాజ్యంగా తవ్వేసుకుని మార్కెట్లో అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో
కింది నుంచి పై వరకు మామూళ్లు అందుతాయి. పైకి మాత్రం తూతూ మంత్రంగా అప్పుడప్పుడు
కొన్ని లారీలు పట్టుకుని గొప్పగా చెప్పుకుంటుంటే నవ్వు రాదా చెప్పు?”
**************
ఈలోగా ఇంకో శకటం రాసాగింది. అందులో బక్కడిక్కిన
కొందర్ని కొరడాలతో బాదుతున్నారు రౌడీలు. దెబ్బలు తింటున్న వాళ్లంతా లబోదిబో అంటున్నారు.
పక్కనుంచి పాట బిగ్గరగా వినిపించ సాగింది.
“దులపర బుల్లోడా దుడ్లు దులపర బుల్లోడా...
దొరికిన వారిని దొరకబుచ్చకుని...
దౌర్జన్యంగా పీక పట్టుకుని...”
“అయ్యో పాపం ఎందుకలా కొడుతున్నారు? వాళ్లేం చేశారు పాపం...” అన్నాడు పక్కోడు.
సామాన్యడు గట్టిగా నవ్వి, “వాళ్ల చేసిన పాపం ఒక్కటే...
అది పాదయాత్రలు చేసిన అధినేతను నమ్మడం. ఆ పాపమే వాళ్ల పాలిట శాపమైంది. అందుకే
అనుభవిస్తున్నారు. వాళ్లంతా నేరస్థులు కాదు. అతి సామాన్యులు. రెక్కాడితే కానీ డొక్కాడని
వాళ్లు. వాళ్లకి గత ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్లని ఇప్పటికిప్పుడు కొత్తగా రిజిష్టర్
చేయించుకోవాలని ఇంటింటికీ వెళ్లి బెదిరిస్తున్నారు పాలకుల అనుయాయులు. అలాగే ఆక్రమిత
ప్రభుత్వ స్థలాల్లో చిన్న చిన్న గూళ్లు కట్టుకున్న వారిని క్రమబద్ధీకరణపేరుతో
లక్షలకు లక్షలు కట్టాలని నోటీసులు ఇస్తున్నారు. అలా కట్టక పోతే పథకాలను
రద్దు చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బెంబేలెత్తిస్తున్నారు. స్వర్ణయుగం
తెస్తానంటూ సింహాసనం మీద కూర్చుని బడుగు ప్రజలను పీడించుకు తింటూ కూడా అదేదో పేదల కోసమే అన్నట్టు ప్రచారాలు చేసుకుంటుంటే
తెగ నవ్వొస్తోంది” అన్నాడు సామాన్యుడు.
******
ఇంతలో మరో శకటం మీద ముఖ్యమంత్రి, మంత్రులు కూడా నుంచుని
కనిపించారు. వాళ్లందరి చేతుల్లో బొచ్చెలున్నాయి. వాటిని కిందికీ మీదకీ ఊపుతూ వాళ్లంతా
ముక్తకంఠంతో పాడసాగారు.
“ధర్మం చెయ్ బాబూ...
పైసా ధర్మం చెయ్ బాబూ...
ధర్మం చేస్తే వడ్డీ వస్తది...
కాసులు దొరుకును బాబూ!”
పక్కోడు ఆశ్చర్యపోతూ, “ఇదెక్కడి ముష్టిరా
నాయనా...” అన్నాడు.
“ఇది మా ప్రభుత్వం దుస్థితి మరి... తీవ్రమైన ఆర్థిక
సంక్షోభంలో కూరుకుపోయింది మా సర్కారు. అందుకోసమే
అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పుల కోసం తిప్పలే ఇవన్నమాట. సరైన సమయానికి
జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి కూడా కిందా
మీదా పడాల్సి వస్తోంది. అంతెందుకు మొన్న సంక్రాంతి పండక్కి కూడా జీతాలు వేయలేక
ఎందరినో ఉసురు పెట్టారు. వాస్తవం ఇలా ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగిందంటూ ప్రచారాలు
చేస్తుంటే పగలబడి నవ్వాలనిపించదా?” అన్నాడు సామాన్యుడు.
ఆసరికి పక్కోడికి చిర్రెత్తుకొచ్చింది. “అయినా నాకు తెలియక అడుగుతాను... కళ్ల ముందు ఇన్ని
దారుణాలు జరుగుతుంటే నీకు నవ్వెలా వస్తోంది?” అని అడిగాడు.
“ఏడవలేక!” అంటూ తువ్వాళు దులుపుకుని
చక్కాపోయాడు సామాన్యుడు.
-సృజన
PUBLISHED ON 22.1.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి