"ఏంట్రా అలా మొహం వేలాడేసుకుని ఉన్నావేం?"
"ఏముంది గురూగారూ! ఇంట్లో సమస్యలన్నీ
ఒకేసారి చుట్టుముట్టేసినట్టుందండి..."
"మరయితే... ఓ కొత్త సమస్య సృష్టించలేకపోయావా?"
"ఇదేం పరిష్కారం గురూగారూ! ఉన్నవాటితోనే
వేగలేకపోతుంటే కొత్తది పుట్టించమంటారు?"
"ఒరే... నీకిలా చెబితే అర్థం కాదు కానీ, నీకో కోతి కథ చెబుతాను. ఆ కోతిలాగా
నువ్వు ఉన్నదొదిలేసి కొత్తది పుచ్చుకున్నావనుకో. నీకెప్పటికీ ఢోకా ఉండదు. ఈ కథ
చిన్నప్పుడు విన్నదేలేరా. అనగనగా ఒక కోతి.
దానికోసారి కాల్లో ముల్లు గుచ్చుకుంది. తిన్నగా ఓ క్షురకుడి దగ్గరకు వస్తే,
అతడు తన కత్తితో ఆ ముల్లు తీసేశాడు. అప్పుడాకోతి ఆ కత్తి పుచ్చుకుని,
'ముల్లు
పోయి కత్తి వచ్చె, ఢాంఢాంఢాం...' అంటూ పారిపోయింది. ఆ కత్తిని కొబ్బరి
మట్టలు కొట్టేవాడికిచ్చి, ఈ సారి ఆ మట్ట పుచ్చుకుని ఉడాయించింది.
'ముల్లుపోయి కత్తి వచ్చె ఢాంఢాంఢాం... కత్తిపోయి మట్ట వచ్చె ఢాంఢాంఢాం...' అనుకుంటూ పాడుకుంది.
ఆ మట్టని బెల్లం తయారు చేసే వాడికిచ్చి,
వాడిచ్చిన బెల్లం అచ్చు తీసుకుని మళ్లీ పాట అందుకుంది.
'ముల్లు పోయి కత్తి వచ్చె ఢాంఢాంఢాం...
కత్తిపోయి మట్ట వచ్చె ఢాంఢాంఢాం...
మట్టపోయి అచ్చు వచ్చె ఢాంఢాంఢాం..."
"ఆపండి గురూగారూ! ఆపండి. ఆ కథ గుర్తొచ్చిందండి.
ఇలా ఆ కోతి ఆ అచ్చు ఇచ్చి బూరె, బూరె ఇచ్చి గోవు దొరకబుచ్చుకుని పారిపోతుందండి. అది పాడుకునే పాట కూడా పెరిగిపోతుందండి. ఆ కోతి పనుల వల్ల ఊరంతా గగ్గోలు పెడితీ,
ఆ కోతికి మాత్రం భలేగా కాలక్షేపం అవుతుందండి. ఈ కథని చిన్నప్పుడు
మా అమ్మమ్మ చెప్పిందండి. కానీ దానికీ నా సమస్యకి ఏంటండి లింకు? నా పరిస్థితి చూస్తే మీకంత నవ్వులాటగా
ఉందన్నమాటండి... "
"ఊరికే అలా ఉడుక్కోకురా... నేనేమీ నవ్వులాటకి
అన్లేదు... సీరియస్‌గానే చెప్పాను... ఓ సమస్యను ఎదుర్కోవాలంటే పనిగట్టుకుని కొత్త
దాన్ని తీసుకురావాలి... రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తూ కూడా తెలుసుకోలేకపోతే ఎలారా?"
"సార్... నాది కుటుంబ సమస్య. దానికి
మీరేమో రాజకీయ పరిష్కారం చెబుతున్నారు..."
"ఓరెర్రోడా... తెలివంటూ ఉండాలే కానీ కుటుంబమైనా, రాజకీయమైనా ఒకటేరా... నెగ్గుకు
రావాలంటే ఇలాంటి టక్కుటమార విద్యలు తెలుసుకోవాలి మరి..."
"సరే... గురూగారూ! మీరు రాజకీయ పాఠంలోకి
వచ్చేశారని అర్థమైపోయింది. కానీ మీ ఉదాహరణే అర్థం కాలేదు. ఓ సమస్యకి మరో సమస్య
ఎలా విరుగుడో చెప్పండి..."
"అలారా దారికి. ఏముందిరా? కాసేపు నీ కుటుంబం సమస్య సంగతి మర్చిపో. రాష్ట్రం కేసి చూడు. మొన్నమొన్నటి
దాకా ఏంటి సమస్య? కాస్త ఆలోచించి చెప్పు..."
"చెప్పడానికేముందండీ? ఆర్థిక సమస్యండి. మొన్నయినా, నిన్నయినా, రేపయినా అదే కదండి మరి. అవతల లక్షల కోట్ల అప్పులండి. తీర్చే దారి లేదండి.
కొత్త అప్పులు తెస్తే కానీ బండి నడవని దుస్థితండి. జీతాలు, పింఛన్లకి కూడా కటకటేనండి... అంతేనాండీ?"
"అంతేరా... కానీ ప్రభుత్వం నీలాగా బెంబేలెత్తిందా? లేదే... నిమ్మకు నీరెత్తినట్టు ఉందా లేదా? ఈలోగా ఆర్థిక
దుస్థితి గురించి ఎవరూ మాట్లాడుకోకుండా మరో సమస్య తెర మీదకి రాలేదూ?"
"ఏంటండీ అది?"
"ఏముందిరా... ఉన్నట్టుండి సినిమా హాళ్ల
మీద తనిఖీలు జరిగాయా లేదా? అలాగే సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించేసేసరికి అందరి కళ్లూ దాని మీద పడ్డాయాలేదా?"
"అవునండోయ్... జనం అడగనూ లేదు, పెట్టనూ లేదు కానీ ఉన్నట్టుండి
టికెట్ల ధరని టీ, కాఫీల కంటే చవగ్గా తగ్గించేసేసరికి ఆ యవ్వారం భలే హిట్టయిందండి. ఎక్కడ చూసినా దాని
మీదే చర్చలండి. సినిమా వాళ్లు ట్వీట్లండి. ఆ ట్వీట్ల మీద రాజకీయ నేతల రీట్వీట్లండి.
హీరోల ప్రకటనలండి. దాని మీద మంత్రుల వ్యాఖ్యలండి. డైలాగుల మీద డైలాగులు తెగ పేలాయండి.
సవాళ్ల మీద సవాళ్లండి. ఆఖరికి ఓ సంచలన దర్శకుడికి మంత్రిగారి అపాయింట్‌మెంట్
దొరికండి. ఇద్దరూ కలిసి చర్చలండి. ఆ తర్వాత ఓ పెద్ద హీరోగారే ఏకంగా వచ్చేసి ముఖ్యమంత్రిగారితో
విందారగించారండి. ఏం తిన్నారో,ఏం మాట్లాడుకున్నారో తెలీలేదండి
కానీ, ఓ సస్సెన్స్ సినిమా క్లైమాక్సంత బాగా నడించిందండి సీను. ఆఖరికి
విలేకరుల సమావేశం పెట్టి ఆ పెద్ద హీరోగారు త్వరలోనే సానుకూలమైన పరిష్కారం దొరుకుతుందని
చెప్పారండి. ఇంత వరకు అతీగతీ లేదండి..."
"బాగా చెప్పావురా... సరే, ఆ సమస్య అలాగే ఉంది. ఆ తర్వాత
ఏ సమస్య వచ్చిపడింది?"
"ఏముందండీ సంక్రాంతి వచ్చిందండి. జనం
కాసేపు పండగ చేసుకున్నారండి. ఈలోగా మంత్రిగారి కేసినో మీద మొదలయ్యిందండి గోల. అబ్బో...
అది కూడా ఓ పెద్ద సంచలనమేనండి. పండగ పేరు చెప్పి అమ్మాయిల డ్యాన్సలు, మధ్యలో పెద్ద పెద్దోళ్ల చిందులు
వీడియోల్లో కనువిందు చేశాయండి. ఆ వీడియోలు పట్టుకుని ప్రతిపక్షాలు దుమ్మూ గట్రా
ఎత్తిపోశాయండి. మీడియాలో తెగ వార్తలొచ్చాయండి. సదరు మంత్రిగారు అడ్డంగా బుకాయించారండి.
జనం ఓ పక్క సెల్‌ఫోన్లలో ఆ వీడియోలు చూస్తూనే, మరోపక్క మంత్రిగారి
మాటలు విని ఎంచక్కా నవ్వుకున్నారండి... అంతేకదండీ..."
"అంతేరా అంతే. కానీ ప్రభుత్వం ఏమైనా నీలాగా
కంగారు పడిందా? లేదే... బాధ్యతాయుతమైన మంత్రిగారి
ఆటల గురించి కానీ, మాటల గురించి కానీ పోలీసులు కూడా పట్టించుకోలేదు.
అవునా? మరి ఈ మొత్తం వ్యవహారం మీద నుంచి జనం దృష్టి మళ్లిస్తూ
మరో కొత్త సంగతి బయటకొచ్చింది గమనించావా? అదేంటో చెప్పు?"
"ఆ... పీఆర్సీ గోలండి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టారండి.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జీతాలు పెంచమంటే, ఉన్నవి తగ్గించారని
ఊరూ వాడా యాగీ చేశారండి. ధర్నాలు, నిరసనలు జరిగాయండి. జనం
నోరెళ్లబెట్టి చూశారండి. ఆఖరికి ఈ యవ్వారం సమ్మె దాకా చేరిందండి... అంతేనాండీ?"
"బాగానే చెప్పావురా. మళ్లీ ప్రభుత్వం
ఏమైనా నీలాగా బెంబేలెత్తిపోయిందా? లేదే.... కానీ ఉద్యోగుల సమస్య తీరనేలేదు,
మరో సంచలనం బయటకొచ్చింది గమనించావా?"
"అవునండి... జిల్లాల వ్యవహారమండి. ఉన్న
13 జిల్లాల్ని
26 జిల్లాలుగా
ఉన్నట్టుండి మార్చారండి. దాంతో జనం దృష్టి కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ కేంద్రాలు... వీటి మీద పడిందండి.
చాలా చోట్ల మళ్లీ కొత్త జిల్లాలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళలను మొదలయ్యాయండి. అసలు నాకు తెలీకడుగుతాను గురూగారూ, ఓ చర్చ కానీ, ఓ ప్రతిపాదనకానీ, ఓ హేతుబద్ధత కానీ, ఓ ప్రజాభిప్రాయ సేకరణ కానీ లేకుండా
ఉన్నట్టుండి జిల్లాల జీవో తేవడమేంటండీ?"
"నీలాగే చాలా మంది విమర్శించారురా... కానీ
ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? లేదే... కాబట్టి ఇన్నేసి సమస్యలు,
సంచలనాలు ఉన్న ప్రభుత్వమే నిదానంగా ఉంటే నీకెందుకురా దిగులు?
అర్థమైందా?"
"అమ్మ గురూగారూ! ఇప్పుడివన్నీ నా చేత ఎందుకు
చెప్పించారో అర్థమైందండి. మీరు మొదట్లో ఇచ్చిన సలహాలో లోతు కూడా తెలిసిందండి. అంటే
గురూగారూ... ఒక సమస్య నుంచి తప్పించుకోడానికి మరో సమస్యను తీసుకురావాలన్నమాట.
అంటే కావాలనే ఇలా ఒక దాని తర్వాత మరో దానిని తెరమీదకి తీసుకొచ్చి తైతక్కలాడిస్తున్నారంటారా?"
"నోర్ముయ్‌రా బడుద్ధాయ్. గూడార్థాలు తెలుసుకోరా
అంటే, గూడుపుఠానీలు
వెతుకుతావేంటి? ఎవరేం చేశారన్నది కాదురా కొశ్చను. ఇలాంటి
పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా సంబాళించుకోవాలనేదే పాయింటు. కుదురుగా పాఠాలు నేర్చుకో.
లోతుల్లోకి వెళ్లకు. మొదట్లో అధికారమే ఓ సమస్య. దానికి పాదయాత్రలే జవాబు.
అధికారం అందాక రాజకీయ కక్షలెలా తీర్చుకోవడమనేదే సమస్య. దానికి అమరావతే సమాధానం.
దాన్ని అటకెక్కించాక రైతుల ఆందోళన, ఆపై ఇసుక తవ్వకాల యవ్వారం,
ఆపై మద్యం పాలసీ, ఆపై మూడు రాజధానుల సంచలనం,
ఆపై గంజాయి, డ్రగ్స్ గొడవ, అది తెరమరుగయ్యేలా ఎయిడెడ్ పాఠశాలల నిర్ణయం, ఈలోగా
పేదల ఇళ్ల రిజిష్ట్రేషన్ పథకం, ఆపై స్థలాల రిగ్యులరైజేషన్
వ్యవహారం, సినిమా టికెట్లు, కేసినో,
పీఆర్సీ, జిల్లాలు... ఇలా ఒక దాని తర్వాత మరొకటి
సమస్యలు పుచ్చుకుని కోతికొమ్మచ్చి ఆటలాడ్డం నేర్చుకున్నావనుకో. పరిష్కారాల సంగతలా
ఉంచి నీకిక కాలక్షేపమే కాలక్షేపం. అర్థమైందా?"
"నిక్షేపంలా అర్థమైంది గురూగారూ! మీరింత
చెప్పాక నావేవీ సమస్యలే కాదనిపిస్తోందండి. పైగా హుషారుగా పాట కూడా పాడుకోవాలనిపిస్తోందండి..."
"ఏం పాటరా అది?"
"పాతది వదిలి కొత్తది పట్టుకో... ఢాంఢాంఢాం!
సమస్య వదిలి సంచలనం చెయ్యి... ఢాంఢాంఢాం!
సిగ్గును వదిలి మొగ్గలు వెయ్యి... ఢాంఢాంఢాం!
పాలన వదిలి గోలను చెయ్యి... ఢాంఢాంఢాం!
కుర్చీ ఎక్కి కాలక్షేపం చెయ్యి... ఢాంఢాంఢాం!
జనాన్ని మరచి జాతర చెయ్యి... ఢాంఢాంఢాం!"
"శెభాష్‌రా... మొత్తానికి నీకు రాజకీయం
వంటబట్టింది. ఇక ఇవాల్టికి పోయిరా"
-సృజన
PUBLISHED ON 1.2.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి