"భగభగా మండాలి భోగి మంటల్లు...
భోగి మంటల్లోన కాలాలి కట్టాలు..."
సంబరంగా భోగి మంట చుట్టూ తిరుగింది ఎంకి. చటుక్కున
ఇంట్లోకి వెళ్లి కొన్ని ఆవుపిడకలు తెచ్చి మంట దగ్గర కూర్చున్న మావ చేతికిచ్చి, "మావా... ఇవి మంటల్లో పడేత్తే ఈటితో పాటు మన కట్టాలు కూడా కాలిపోతాయంట..." అంది.
మావ వాటిని అందుకుని మంటల్లో వేసి, "ఇలాంటివి ఎన్నేసినా మన బాధలోపట్టాన
తీరేవి కాదే ఎంకీ..." అంటూ చలి కాచుకోసాగాడు.
"ఊరుకో మావా... పండగ రోజుల్లో కూడా ఉసూరుమంటే ఎలా? పద... అలా వెళ్లి ఎవరెలాంటి
మంటలేత్తన్నారో చూసొద్దాం... " అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లింది.
ఇద్దరూ కలిసి ఓ ఇంటికెళ్లారు. అది ఓ ముఖ్య నాయకుడి
ఇల్లు. ఆయన అనుచరులంతా కలిసి మంటల్లో ఏవేవో వేస్తున్నారు. మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
"ఏంటి మావా ఏత్తన్నారు?" అంది ఎంకి.
మావ పరిశీలనగా చూసి, "ప్రజలకిచ్చిన వాగ్దానాలు" అన్నాడు.
"అదేటి మావా? ఎవరైనా భోగి మంటల్లో పుడకలేత్తారు,
పిడకలేత్తారు కానీ ఇయేంటీ?" అంది.
"సర్లేవే... ఈ ఇల్లు ఎవరిదనుకున్నావు? మన ముఖ్యనేతలుంగారి ఇల్లు. ఎన్నికలప్పుడు
ఈయన ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలయ్యేనా, చచ్చేనా? ఆయన దగ్గర తగలెట్టడానికి ఇంకేం మిగిలాయి
సెప్పు?" అన్నాడు.
"అదేంటి మావా? జనాలకిచ్చిన మాటలన్నీ నిలబెట్టేసుకున్నాం...
సెప్పినవన్నీ సేసేత్తన్నాం... అసలిన్నేసి మంచి పనులు చేసే పార్టీ మాదే కానీ మరోటి
దేశంలోనే లేదని సెబతా... ఓ ఊదరగొట్టేత్తన్నారు గందా? మరి
నువ్వేటి అలా తీసి పారేత్తన్నావు?"
"ఊరుకోయే... ఇన్నాళ్లూ ఆల్ల పాలన సూసి
కూడా బుద్ది రాలేదేటే? మూడేళ్ల నాడు నేను సంపాదించే రూకల్తో
ఇల్లంతా గడిచేది. పైగా పదో పరకో ఎదర కర్సుల కని ముంతలో వేసేటోల్లం. మరియ్యాల
అలా వచ్చేదిలా ఎలిపోతాంది. బియ్యం ధర సూత్తే కొనేలా ఉందా అని? కంచం నిండా పప్పు కలుపుకుని తిని
ఎన్నళ్లయిందో సెప్పు? సూసి సూసి కొనగలుగుతున్నామా అంట? పోపులోకి నూని కోసం గిజగిజలాడిపోతన్నావు.
కూరగాయలు ధరలకి పొంతనంటూ ఉందంటే?"
ఎంకి ఏదో అనేంతలో మరి కొందరు అనుచరులు మరిన్ని
కట్టలేవో తెచ్చి మంటలో పడేశాడు. మంటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
"ఓయబ్బో... పెద్ద భోగిమంటే. ఇప్పుడేటి
తెచ్చి పడేశాడు మావా?" అంది ఎంకి.
"ఇయ్యా... ఆళ్లు ప్రజల కోసం పెట్టిన పథకాలే.
ఆటి అమలు లాగే ఇయ్యీ తగలడుతున్నాయి సూడు..."
"అంటే మావా? ఈల్లు పెట్టి పథకాలు సరిగా
లేవంటావా?"
"నువ్వు మడిసివైతే ఎదిగావు కానీ, బుర్ర ఇసక పర్రే. భోగి మంటలు
సూద్దారనే సరదానే కానీ, మన సుట్టూ ఉన్న కట్టాల మంటల సెగని
కానుకున్నట్టు లేదు..."
"అట్టా కోప్పడకు మావా... కూసింత తెలిసేట్టు
సెప్పొచ్చు కదా?"
"మరదే... ఏమన్నా అంటే బుంగమూతెడతావు.
కాస్త నీ సుట్టూతా ఏం జరుగుతాందో సూత్తా ఎరిక పెంచుకోవాలని ఎంత సెప్పినా బుర్రకెక్కించుకోవు.
ఈల్లంతా కలిసి ఊరూవాడా నానా కంగాలీ సేసి బోలెడన్ని పధకాలెట్టేశారా? తామసలు పుట్టిందే పెజానీకం కోసమన్నట్టు పోజులు కొడతన్నారా? మరి ఈ మూడేళ్లలో మనకి కానీ,
మన సుట్టూతా ఉన్న మనలాంటి బడుగులకి కానీ కూసింతైనా ఎదుగుదల ఉందా
సెప్పు? కానీ ఓపాలి ఈ
నేతలు, ఈల్ల అనుచరులు, ఆల్ల బంధువులు,
సుట్టాలు, తోకగాళ్ల కేసి సూడు. మొన్నటిదాకా నడుచుకుంటా
పోయేటోడు ఇయాల స్కూటరెక్కి బర్రున పోతన్నాడు. సైకిల్ బెల్లు కొట్టేటోడల్లా కారు
హారను మోగిత్తన్నాడు. కిరాయింట్లో ఉండేటోడు సొంతింట్లోకి మారాడు. గమనించావా?"
"అవ్... మావా! నువు సెబతాంటే తెలుస్తాంది.
మనవేంటో మన బతుకులేంటో, ఎక్కడ వేసి గొంగడి అక్కడే అన్నట్టున్నాం..."
"మరదేనే సెబుతాంట... ఈల్లంతా మన పేదోల్ల
పేరు జెప్పి అయినకాడికి నొల్లు కుంటున్నారు. పేదోళ్లకి ఇల్లిత్తామని ఊరూవాడా ఊరేగుతూ
హామీలిచ్చి చేతులూపారా? మనమంతా కామోసనుకున్నాం. ఇప్పుడేమైంది? మనగ్గానీ,
మన పక్కోడికి కానీ వచ్చిందా? పైగా ఎప్పుడో ముప్పై ఏళ్ల నాడు వేరే
పార్టీలోళ్లు ఇచ్చిన ఇల్ల మీద కూడా ఇప్పుడు డబ్బులు కట్టాలని బెదిరిత్తన్నారు.
ఎప్పటి నుంచో ఉంటున్న ఇల్లని, సోట్లని ఇప్పుడు కొత్తగా రిజిట్రేషన్
సేయించుకోవాలంట. పైగా ఎంత కట్టాలో కూడా ఆల్లే సెబతన్నారు. ఉన్నట్టుండి అంతలేసి
సొమ్ములు తెచ్చి పోయాలంటే మనలాగా రెక్కడితే కానీ డొక్కాడని వోల్లకి ఎంత కట్టమో
ఆలోసించు. పైగా అలా సెయ్యకపోతే రేషనాగిపోద్ది, పించనాగిపోద్ది
అంటూ ఇల్లకాడకొచ్చి జమాయిత్తన్నారంట. ఇదెక్కడి దిక్కుమాలిన సిత్రమో నువ్వే సెప్పు?"
"అవ్... మావా! మొన్న ఊర్నుంచి మా అన్నయ్యొచ్చాడు
కదా, ఆడు కూడా ఇలాగే
సెబుతుంటాడు. ఆడికి గవర్నమెంటు
నుంచి రావలసిన సొమ్ముకి అతీగతీ లేదంట. అంత పెద్ద ప్రెబుత్వం ఈడికి బాకీ పడ్డమేంటో?"
"మీ అన్నయ్యే కాదే... ఆడిలాంటి ఎందరో
రైతుల గోసేనే అది. ఆళ్ల కాడ నుంచి సేకరించిన ధాన్యం తాలూకు డబ్బులు సానా మందికి అందనేదంట.
అలా రాట్రమంతా సూత్తే కొన్ని కోట్లకి కోట్లు బకాయిలంట. ఆ డబ్బులెప్పుడొత్తాయోనని
సానా మంది సిన్నకారు రైతన్నలు ఆశలెట్టుకు సూత్తన్నారు. అట్టాగే పొలాల్లో బోర్లు
వేయిత్తామని హడావుడి సేశారా? ఏదీ, ఒక్క బోరు బిగించారేమో సూపించు. ఒకటో అరో సోట బోర్లేసినా
ఆటికి కరెంటు కనెక్షన్ లేదు. ఇలా సెప్పుకుంటాపోతే రైతన్నల కట్టాలు మరీ ఎక్కువే. అన్నట్టు
నీకో సిత్రమైన సంగతి తెలుసా? ఈ గవర్నమెంటు సేతిలో డబ్బులాడ్డం
లేదంట. ప్రతి నెల మనం అక్కడా ఇక్కడా తడుముకుంటాం సూడు... అట్టాగే ఈ గవర్నమెంటు
కూడా జీతగాళ్లకి జీతాలివ్వడానికి కూడా కటకటలాడిపోతోందంట. మనం సేబదుళ్లు తీసుకున్నట్టే
ఈల్లు కూడా అయిన సోటల్లా అప్పులు సేసేత్తన్నారంట. ఇలా అప్పులు సేయడంలో దేశం మొత్తంమీద
ఈల్లే గొప్పోళ్లంట..."
"అయ్యో పాపం... ఈ గవర్నమెంటు
కూడా పేదైపోయిందన్నమాట... అంతేనా మావా?"
"ఏడిశావే... గవర్నమెంటు కాడ డబ్బులాడ్డంలేదు
కానీ, దాన్ని నడుపుతున్న
నేతలు, నాయకులు మాత్రం కోట్లకు కోట్లు వెనకేత్తన్నారంట,
తెలుసా?"
"అదెట్టా మావా?"
"అధికారమే... అధికారం. మన రాట్రంలో ఎన్నో
విలువైన బూములు, గనులు
ఉంటాయా? ఆటిని ఈ నేతలు ఎవురెవురికో అప్పజెప్పుతారంట. అలా అప్పజెప్పడానికి
కోట్లకు కోట్లు దండుకుంటారంట..."
"కానీ మావా! నాకు తెలీక అడుగుతానూ, మరీళ్లంతా ఇలా అడ్డగోలుగా సేత్తా
ఉంటే ఆపే వాళ్లుండరా? మరి సెట్టాలు గట్రా ఉంటాయి కదా?"
"ఓసెర్రి మొగవా! ఇదంతా పైకి సెట్ట ప్రకారమే
జరుగుతుందే. ప్రజల పేరు సెప్పి, అభివృద్ధి పేరు సెప్పి సేత్తారన్నమాట.
లోపాయికారీగా మాత్రం సొమ్ములు సేతులు మారిపోతాయి. తెలిసిందా?"
మావ చెప్పిందంతా విని ఎంకి నోరెళ్లబెట్టింది. ఈలోగా
ముఖ్యనేత మరి కొందరు అనుచరులతో వచ్చి
మంటల్లో ఇంకేవో పడేశాడు. దాంతో భోగిమంట ఆకాశానికెక్కింది.
"ఓలబ్బోలబ్బో... ఎంతలేసి మంటలు మావా? ఈయనేంటి పడేశాడో?" అంది ఆశ్చర్యంగా.
"ఈయనెవరుకున్నావే? అందరికంటే పెద్ద నేత. ఈయనగారి
మీద బోలెడన్ని కేసులు కూడా ఉన్నాయి. అయ్యన్నీ ఓ కొలిక్కి తేడానికి కోర్టుల్లో కిందా
మీదా పడుతున్నారంట. బహుళా ఈయన సేసిన అవకతవకలు, మోసాలు,
కుట్రలకు సంబంధించిన సాచ్చికాలు, రుజువులు పడేసుంటాడు.
అందుకే అంతలేసి మంటలు..."
ఎంకి ఏదో అనబోయేంతలో ఆ నేత, ఆయన అనుచరులు అందరూ కలిసి
భోగి మంట చుట్టూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేయసాగారు.
"గొబ్బీయలో... గొబ్బీయలో...
జనం సొమ్ము జెల్ల కొట్టి దొబ్బేయాలో!
గనులన్నీ కొల్లగొట్టి దోచేయాలో!
భూములన్ని చుట్టబెట్టి నొక్కేయాలో!
పథకాల పేరు చెప్పి గొబ్బీయలో...
ప్రజలను ఏమార్చాలో గొబ్బీయలో!
ఖజానా సొమ్ములన్ని గొబ్బీయలో...
ఖర్చు రాసి లాగాలో గొబ్బీయలో!
ఎవరైనా ప్రశ్నిస్తే గొబ్బీయలో...
ఎదురెట్టి ఏకాలో గొబ్బీయలో!
కేసులెట్టి కుళ్లబొడిచి గొబ్బీయలో...
నోరెత్తకుండ చేయాలో గొబ్బీయలో!
గొబ్బీయలో...గొబ్బీయలో!
పాట వింటుంటే ఎంకికి చిర్రెత్తుకొచ్చింది.
"సాల్లే మావా! ఇక భోగి మంటలేం సూడక్కర్లేదు.
ఈల్ల పాలన కంటె పెద్ద మంట ఇంకేముంటది?
అసలు ఈల్లందర్నీ వేయాలి భోగిమంటల్లో. పద ఇంటికి పోయి ఉన్నదేదో తిని
తొంగుందాం. మనలాంటోల్లకి పండగైనా ఒకటే, పబ్బమైనా ఒకటే.
ఇలాంటి నేతలందర్నీ వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించాకే మనందరికీ నిజమైన సంక్రాంతి!" అంది ఎంకి
కోపంగా.
"నీకు బుద్దొచ్చిందిగా... ఇక మనకన్నీ
పండగ రోజులే. పద..." అన్నాడు మావ హుషారుగా.
-సృజన
PUBLISHED ON 11.1.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి