పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టాడు. అతడిని చూడగానే సమాధుల మీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న పిశాచాలన్నీ ‘కెవ్వు...’ మంటూ కేక వేసి తలో దిక్కూ పారిపోయి, చెట్టు కొమ్మల చాటున, గుబురు తుప్పల మాటున దాక్కున్నాయి.
“వీడేమిటిలా వచ్చాడు? కొంపదీసి మనని కూడా ప్రజలనుకోలేదు కద?” అంది రక్తాక్షి అనే కుర్రపిశాచి.
“ఈ శ్మశానాన్ని ఎవరికో
ధారాదత్తం చేస్తాడేమో? వారి నుంచి భారీగా ముడుపులు అందుకుంటాడేమో?” అంది దీర్ఘనఖి అనే ఓ నడివయసు పిశాచి.
“ష్... నోర్ముయ్యండి.
అతడొచ్చింది అందకు కాదు. రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. తిరిగి అధికార పీఠం
కావాలని ఆశ పడుతున్నాడు. అందుకనే శ్మశానం నడిబొడ్డులో ఉన్న ఊడల మర్రి మీద వేలాడుతున్న
రాజకీయ బేతాళుడిని వశం చేసుకోడానికి వచ్చాడు. ఇక మనకి బోలెడంత కాలక్షేపం...” అంటూ అసలు సంగతి వివరించింది
శ్వేతకేశి అనే ఓ వృద్ధ పిశాచి.
ఈలోగా అక్రమార్కుడు ఊడల మర్రి
దగ్గరకు వచ్చి కొమ్మపై వేలాడుతున్న ఆశల శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
మరుక్షణమే ఆ ఆశల శవాన్ని
ఆవహించిన రాజకీయ బేతాళుడు “హీ... హీ... హీ...” అంటూ వికటంగా నవ్వి
అందుకున్నాడు.
“అక్రమార్కా! నీ పట్టుదల
చూస్తే ముచ్చటేస్తోంది. నీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. అందుకని నీకొక అవకాశం
ఇస్తున్నాను. అలనాటి విక్రమార్కుడిలాగా నువ్వు మౌనంగా నడవక్కరలేదు. శ్రమ తెలియకుండా
ఎంచక్కా నాతో కబుర్లు చెప్పవచ్చు. కానీ నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు నిజమే
చెప్పాలి. నీ మనసులో మాట ఉన్నదున్నట్టు చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుంది.
ఎప్పుడైతే నువ్వు జవాబు చెప్పలేకపోతావో, అప్పుడే నీకు వశం అవుతాను. సరేనా?”
అక్రమార్కుడు ఎప్పటిలాగే నవ్వో, ఏడుపో తెలియని మొహం పెట్టి, “సరే బేతాళా! నువ్వు ఎలా చెబితే
అలాగే. కానీ ఎన్నళ్లీ ఊడల మర్రిని పట్టుకుని వేలాడుతావు చెప్పు. నువ్వు కానీ నాకు
వశం అయితే బేతాళ భరోసా పథకం పెట్టి నీతో పాటు నీ అనుచరగణమైన పిశాచాలన్నింటికీ
నెలనెలా పింఛన్ల కింద బొమికలు అందిస్తా...” అన్నాడు.
బేతాళుడు వికవికా నవ్వాడు.
“వ...హా...ర్నీ అక్రమార్కా!
నీ బుద్ధి పోనిచ్చుకున్నవు కాదయ్యా. నేనేమన్నా నీ మాటలు నమ్మి బోల్తా కొట్టిన
నీ అమాయక ప్రజల్లో ఒకడిననుకున్నావా? నీ మాటల్ని, వాటి వెనుక ఉన్న ఉద్దేశాల్ని కూడా పసిగట్టే రాజకీయ బేతాళుడిని. కాబట్టి ఒళ్లు
దగ్గర పెట్టుకుని మాట్లాడు...”
“ఏదో అలవాటైపోయింది బేతాళా, కోపగించుకోకు. సరే... ఏవో ప్రశ్నలు
అడుగుతానన్నావుగా అడుగు...”
“అక్రమార్కా! అసలెందుకు
ఇక్కడకి వచ్చావు? ఏం సాధించాలనుకుంటున్నావు? అసలింత వరకు ఏం సాధించావు? అది చెప్పు ముందు...”
అక్రమార్కుడు రెచ్చిపోయాడు.
లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని, “ఈ అమాయక ప్రజలను ఉద్దరించడమే నా జీవిత లక్ష్యం. వాళ్లకి స్వర్ణయుగమంటే
ఏంటో చూపించడమే నా బతుకుకు పరమార్థం. వాళ్ల అభివృద్ధి కోసమే నా శ్రమంతా...” అంటూ చకచకా చెప్పసాగాడు.
రాజకీయ బేతాళుడు శ్మశానం దద్దరిల్లిపోయేట్లు
పకపకా నవ్వాడు. అక్కడక్కడ దాక్కున్న పిశాచాలు కూడా పగలబడి నవ్వసాగాయి.
అక్రమార్కుడు అవాక్కయ్యాడు.
బేతాళుడు అతి కష్టం మీద నవ్వాపుకుని, “ఆహా... ఆహా... ఎన్నాళ్లకి మేమంతా
హాయిగా నవ్వుకునేలా చేశావయ్యా అక్రమార్కా! నువ్వేంటో నీ పాలనేంటో మాకు తెలియదనే
చెబుతున్నావా? ఇప్పుడు నీ మనసులో అసలు మాటేంటో చెప్పు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా?” అన్నాడు.
అక్రమార్కుడు నిట్టూర్చాడు.
“సరే... చెబుతాను విను
బేతాళా! నువ్వు శాపం పెట్టాక తప్పుతుందా? మూడేళ్ల క్రితం నేను ఊరూవాడా తిరుగుతూ ఇలాగే నానా హామీలూ ఇచ్చాను. వాటన్నింటినీ
పాపం మా ప్రజలు నమ్మేసి, మురిసిపోయి, ముచ్చటపడి, ఓట్లన్నీ గుద్దేసి నన్ను గెలిపించారు. కానీ ఇప్పుడు మరోసారి ఎన్నికలను ఎదుర్కోబోతున్నాను.
కానీ అంతకు ముందులాగా పరిస్థితి లేదని తెలుస్తూనే ఉంది. పైకి బింకంగా ఓట్లన్నీ
నావేనని, సీట్లన్నీ మనవేనని చెబుతున్నానే
కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలే వాటిని
నమ్మేలా లేరు. గడప గడపకీ వెళ్లి రావాలని నేనే వాళ్లని పంపితే, ప్రజలంతా ముక్తకంఠంతో మా పరిపాలనలో
లోపాలను దుయ్యబడుతున్నారు. పథకాల పేరు
చెప్పి నచ్చచెప్పబోతుంటే, వాటి చాటున సాగుతున్న లోపాలను తూర్పార పెడుతున్నారు. ఎక్కడికక్కడ నిలదీసి, నుంచోబెట్టి, ప్రశ్నించి, ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఏవేవో పథకాలను ప్రవేశపెట్టినా, ఎక్కడలేని డబ్బూ వాటికే పోతోంది.
అప్పులు చేయడమే తప్ప సంపద పెంచే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ
పథకాల సొమ్ముని కూడా దారి మళ్లించాను. ఎన్నికల్లో గెలవాలని నోటికొచ్చినట్టు వాగాను.
ఆ వాగుడే ఇప్పుడు నాకు ముందరి కాళ్లకి బంధంగా మారింది. అప్పట్లో నేను కుర్చీ ఎక్కగానే
సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు పరుస్తానని ఆడపడుచులను నమ్మించాను. కానీ ఇప్పుడు
ఆ మద్యమే ప్రభుత్వం నడవడానికి ప్రధాన వనరుగా మారిపోయింది. ఏం చేయను? మద్యం అమ్మకాల ద్వారా రాబోయే
ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి ఏకంగా ఎనిమిది వేల కోట్ల అప్పులు పుట్టించాను. అలా నా
వాగ్దానానికి నేనే గండికొట్టాను. మిగతా పథకాలను కొనసాగించడం కూడా నా వల్ల కావడం
లేదు. కాబట్టి వాటిని ఎలాగోలా నీరుగార్చే ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒకో పథకానికి
ఏవేవో కొత్త పరిమితులు, నిబంధనలు పెట్టి ఆ పథకం లబ్దిదారులను తగ్గించేలా చేస్తున్నాను. అదనపు
ఆదాయం కోసం చీప్ లిక్కర్ అమ్మకాలని లోపాయికారీగా ప్రోత్సహించాను. కొత్త కొత్త బ్రాండ్ల
ద్వారా చవక మద్యాన్ని ప్రజల చేత తాగిస్తున్నాను. ఇన్ని చేసినా నెల నెలా జీతాలు, పింఛన్లకు కూడా కటకట లాడిపోయే
దుస్థితిలోకి ప్రభుత్వాన్ని నెట్టాను. మరింత ఆదాయం కోసం పన్నులు పెంచాను. ప్రజల్లో
కొందరికి పంచే పథకాల కోసం ప్రజల నెత్తినే భారం పెట్టడానికి రకరకాల ఆలోచనలు
తలపెట్టి నోటీసులు పంపించేలా చేశాను. పేదలు తరతరాలుగా అనుభవిస్తున్న కొన్ని
స్థలాలు, ఇళ్లపై కూడా డబ్బులు పిండుకోవాలని
చూశాను. ఆఖరికి ప్రజలను కులాల వారీగా, వర్గాల వారీగా విభజించి ప్రతిపక్షాల వారి బలాన్ని తగ్గించే ప్రయత్నం చేశాను.
ఇంత చేసి కూడా ప్రజా వ్యతిరేకతను తగ్గించలేకపోతున్నాను. ఆఖరికి మా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజల మనోభావాలను
చెప్పడానికి ప్రయత్నిస్తున్నా బింకంగా ఉంటున్నానే తప్ప, నిజం ఒప్పుకోలేకపోతున్నాను.
ఇక ఇంతవరకు ఏం సాధించావని
అడిగావు కదా బేతాళా! దానికి కూడా నా జవాబు విను. రాష్ట్రం ఆదాయం పెంచలేకపోయాను
కానీ, నా వ్యక్తిగత ఆదాయాన్ని, నన్ను నమ్ముకున్న వారి ఆదాయాన్ని
ఇబ్బడిముబ్బడిగా పెంచగలిగాను. గనులు, సెజ్‌లు, భూములు, కాంట్రాక్టులు... ఇలా ప్రభుత్వ
పరంగా అన్నీ అప్పచెప్పి వారి నుంచి లక్షల
కోట్లు దండుకున్నాను. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కూడా గెలిచి నా కలల్ని పండించుకోవడమే
నా ఉద్దేశం. అసలందుకనే నీ దగ్గరకి వచ్చాను...”
అక్రమార్కుడు తన మనసులోని
మాట ఉన్నదున్నట్టుగా చెప్పడంతో రాజకీయ బేతాళుడు వికవికా నవ్వి శవంతో సహా మాయమై
తిరిగి చెట్టెక్కాడు!
-సృజన
PUBLISHED ON 16.06.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి