శిష్యుడు వచ్చేసరికి గురువుగారు పడక్కుర్చీలో వెనక్కి
వాలి కూర్చుని సెల్‌ఫోన్‌లో పాటలు వింటున్నారు.
“రా.. రా... మంచి పాటపెట్టాను
విందువుగాని...” అన్నారు గురువుగారు.
సెల్‌ఫోన్‌లోంచి పాట వస్తోంది...
“అప్పులు గొప్పగచేయొచ్చండీ...
అసలుకు ఎసరే పెట్టొచ్చండీ...
పీపాలెన్నో తాగొచ్చండీ...
పాపాలెన్నో చేయొచ్చండీ...”
గురువుగారు సెల్‌ఫోన్‌లో పాజ్ పెట్టి శిష్యుడి కేసి
చూసి అడిగారు.
“ఏరా... ఈ పాట గుర్తుందిరా?”
“లేకేమండీ... పాత పాటండి. ‘రాజాధిరాజు’ సినిమాలోదండి. బాపూగారు దర్శకుడండి...” అన్నాడు శిష్యుడు ముక్తసరిగా.
“నీకు సినిమా నాలెడ్జి బాగానే
ఉందిరా...” అన్నారు గురువుగారు మెచ్చుకోలుగా.
శిష్యుడు ఆ మాటలు విని పొంగిపోలేదు సరికదా, విసుగ్గా మొహం పెట్టాడు.
“ఊరుకోండి గురూగారూ! నేనేదో మీ
దగ్గర నాలుగు రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని వస్తుంటే మీరేమో సినిమా పాటలు పెడతారు...
ఇలాగైతే నేనెప్పుడు నేర్చుకుంటాను? ఎప్పుడు ఎదుగుతాను? ఎప్పుడు కుర్చీ ఎక్కుతాను? ఎప్పుడు పాలిస్తాను? ఎప్పుడు వెనకేస్తాను?” అన్నాడు ఉక్రోషంగా.
గురువుగారు అదేం పట్టించుకోలేదు.
“సరేలేరా... నీ గోల ఎప్పుడూ ఉండేదే.
ఇంతకీ ఈ పాట వింటుంటే నీకేం గుర్తొస్తోందో
చెప్పు?”
శిష్యుడు తలగోక్కుని, “ఏముందండీ... హీరో విజయచందరు, హీరోయిన్ సుమలత, విలన్ నూతన్‌ప్రసాద్ వీళ్లంతా గుర్తొస్తారండి. సినిమా అప్పట్లో బాగానే ఆడిందండి.
నేను రెండు మూడు సార్లు చూశానండి...” అన్నాడు తప్పదన్నట్టు మొహం
పెట్టి.
“వెరీగుడ్... నువ్వు సినిమాల్లోకి
వెళ్లొచ్చురా... బాగా పనికొస్తావ్...” అన్నారు గురువుగారు.
ఆ సరికి శిష్యుడికి ఒళ్లు మండిపోయింది.
“అదేంటి గురూగారూ! పాఠాల కోసం
నేనొస్తే పాటలు పెడతారు. పైగా సినిమాల్లోకి పొమ్మంటారు. ఇందుకోసమేనాండీ మిమ్మల్ని
నమ్ముకుంట?” అన్నాడు చిరుకోపంతో.
“ఓరి సన్నాసీ... మరింకేమంటానురా...
పాట వింటే ఏం గుర్తొస్తోందో చెప్పమంటే యాక్టర్ల గురించి చెబుతావ్. నీకసలు బుద్ధుందిరా...
ఈ పాట పాతది కాదురా... సరికొత్తది. ఇప్పటి రాజకీయాలకు సరిగ్గా సరిపోయేదే. నేను
ఊరికే ఊసుపోక ఈ పాట పెట్టాననుకుంటున్నావురా...” అంటూ గురువుగారు గదిమారు.
అప్పటికి శిష్యుడికి తన తప్పేంటో తెలిసొచ్చింది.
“క్షమించండి గురూగారూ! నేను రాగానే
మీరు పాఠం మొదలు పెట్టేశారని తెలుసుకోలేకపోయాను. చెప్పండి సార్ రాసుకుంటాను...” అంటూ పుస్తకం తెరిచి
పెన్ను తీశాడు.
“ఓరెర్రెదవా... తెరవాల్సింది
పుస్తకం కాదురా. నీ మస్తకం! చెప్పింది రాసుకోవడం కాదురా, చుట్టూ జరుగుతున్నది చూసుకో... ఆ పాట వింటే నీకు ఇప్పటి సమకాలీన రాజకీయం
గుర్తుకు రావాలి. నీ పరగణా గుర్తుకురావాలి. దానిని ఏలుతున్న అధినేత గుర్తుకు రావాలి.
ఆయన పరిపాలన తీరు గుర్తుకు రావాలి. ఇవన్నీ కాకుండా హీరోహీరోయిన్లంట్రా నీకు గుర్తొచ్చేది?” అంటూ గురువుగారు గద్దించారు.
శిష్యుడు బిక్క మొహం పెట్టి, “తప్పయిపోయిందండి... కాస్త వివరంగా చెబుదురూ...” అన్నాడు.
గురువుగారు నవ్వి, “అలా రా దారికి! ఆ పాట చరణం ఓసారి చెప్పు...” అన్నారు.
“అప్పులు గొప్పగ చేయొచ్చండి...
అసలుకు ఎసరే పెట్టొచ్చండి... అని వేటూరి గారు రాశారండి...”
“మరిప్పుడు జరుగుతున్నదదే
కదరా... ఎంత గొప్పగా అప్పులు చేస్తున్నారో గమనించావా? ఒకటి కాదు, రెండు కాదు... లక్షలాది కోట్ల రూపాయల
అప్పులు చేశారా లేదా నీ పాలకులు? అందుకోసం కొత్త జీవోలు జారీ చేశారు. చట్టాన్ని ఏమార్చారు. రుణ సంస్థల్ని సైతం
బురిడీ కొట్టించారు. ఆఖరికి రాబోయే ఏళ్లలో ఆదాయాన్ని
కూడా తనఖా పెట్టి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చేశారు. అన్నేళ్లు వాళ్ల ప్రభుత్వం
ఉంటుందో లేదో తెలియదు. ఒక వేళ కుర్చీ దిగారనుకో. అసలుకు ఎసరే కదా? అప్పుడు తీర్చాల్సింది ఎవరు? పన్నుల రూపంలో ప్రజలే కదా? అప్పుల ఊబిలో ప్రజల్ని నిలువునా
దించేసి అధికారంతో మజా చేస్తున్నట్టే కదా? ఆ అప్పులకు వడ్డీలేమైనీ నీ అధినేత తన జేబులోంచి కడతాడా? అంచేత... నువ్వు రేప్పొద్దున్న
ప్రజల ఖర్మ కాలి కుర్చీ ఏక్కావే అనుకో... ఈ దారుణ రుణ నైపుణ్యాన్ని వంట పట్టించుకోవాలి
కదా? మరి ఇంతకన్నా గొప్ప పాఠం ఏముంటుంది
చెప్పు?”
“అవునండి... నిజమేనండి...” అంటూ శిష్యుడు తలూపాడు.
“తలూపడం కాదు... ఆ తర్వాతి
లైన్లు చెప్పు?”
“పీపాలెన్నో తాగొచ్చండి...పాపాలెన్నో చేయొచ్చండి... “
“ఇది కూడా ఇప్పుడు జరుగుతున్నదే
కదరా... ప్రజల చేత పీపాలకు పీపాలు తాగిస్తున్నారు. అలా తాగుతూ వాళ్ల కట్టే సొమ్ముతోనే
కదా, ప్రభుత్వం నడుస్తుంట? అందుకోసం మద్యం పాలసీ మార్చారు.
కొత్త కొత్త బ్రాండ్లు అలవాటు చేశారు. వాటి పేరుతో నాసి రకం మద్యం అంటగడుతున్నారు.
ఆ మద్యం శాంపిళ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తేలినా, బుకాయించి ఎదురెడుతున్నారు. అలా అన్న వాళ్లని తిట్టి పోస్తున్నారు. పైగా మద్యం
సొమ్ముతో అక్కచెల్లెమ్మలకు మేలు చేద్దామని చూస్తుంటే, గిట్టక ఆడిపోసుకుంటున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఓటేసి గెలిపిస్తే మద్యం
కనిపించకుండా చేస్తామని ప్రజల్ని నమ్మించి, అధికారం చేతిలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. కొత్త షాపులు పెట్టిస్తున్నారు. బార్లకు
తలుపులు బార్లా తెరిచారు. చివరికి రాష్ట్రాన్నే మద్యంలో ముంచి తెలుస్తున్నారు. ఇక
నీ పాలకుల పాపాల గురించి వేరే చెప్పాలా చెప్పు? చట్టాల్ని తుంగలో తొక్కి మరీ విజృంభిస్తున్నారు. గనులు, సెజ్‌లు, భూములు, పోర్టులు, ఫ్యాక్టరీలు, కాంట్రాక్టులు... అన్నీ అయిన వాళ్లకి కట్టబెడుతున్నారు. వాళ్ల నుంచి ముడుపులు
అందుకుని ప్యాలస్‌లు కడుతున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాలకు అండదండలు అందిస్తున్నారు. మరిలాంటి పాపాలన్నీ
నీకు పాఠాలే కదరా...”
శిష్యుడు తెల్లబోయాడు. “అయ్యబాబోయ్... ఆ పాటలో
ఇన్నేసి పాఠాలున్నాయాండీ... ఆ పాట పూర్తిగా వినిపిద్దురూ...” అన్నాడు.
గురువుగారు సెల్‌ఫోన్ ఆన్ చేశారు. పాట మొదలైంది...
“నేలకు సొరగం దించాడండీ...
దించిన సొరగం పంచాడండీ...
నెత్తిన చేతులు పెడతాడండీ...
నెత్తినెత్తుకుని ఊరేగండి...”
గురువుగారు పాట పాజ్ చేసి చెప్పసాగారు.
“చూశావురా... అచ్చం నీ పాలకులు
చేసుకుంటున్న ప్రచారంలాగే లేదూ ఈ చరణం? తమ పాలనలో స్వర్గాన్ని కిందికి దించేసిన లెవెల్లో ఆర్భాటం చేస్తున్నారు కదా? ఆ స్వర్గంలో ప్రజలకు ఏవేవో
పంచేస్తున్నట్టు గప్పాలు కొట్టుకోవడం లేదూ? ఆ పథకం అన్నారు, ఈ పథకం అన్నారు. చివరికి ఏం
జరుగుతోంది? అన్ని పథకాల్లోనూ ఏవో కొర్రీలు పెట్టి లబ్దిదారులను తగ్గించడం లేదూ? అధికారానికి ముందు ఇచ్చిన చాలా
హామీలకు మంగళం పాడుతున్నారంటే నెత్తిన చేతులు పెడుతున్నట్టే కదా? అటు పథకాల పేరుతో ప్రచారం
చేసుకుంటూనే ఇటు కొత్త కొత్త పన్నులు, సుంకాలు, ఛార్జీలు విధించి వేధిస్తున్నారు కదా? ఇక జనం మాత్రం ఏం చేస్తారు, నెత్తినెత్తుకుని ఊరేగక? ఏమంటావు?”
“ఏమంటానండీ... మీరింత బాగా చెబుతుంటే? పాట బాగుంది ఇంకా వినిపించండి
గురూగారూ...”
“ఇతడే దిక్కని మొక్కని వాళ్లకి
దిక్కూమొక్కూ లేదండండి...
దుష్ట రక్షణం... శిష్ట శిక్షణం...
చేసెయ్ చేసెయ్ మోసెయ్ మోసెయ్...”
“చూశావురా... ఎంత చక్కగా ఇప్పటి
పరిస్థితికి సరిగ్గా సరిపోయిందో. నీ పాలకుడి తీరిదే కదరా? తనే దిక్కని నమ్మిన వాళ్లకి
రక్షణ కల్పిస్తాడు. కాదని ప్రశ్నించే వాడికి దిక్కూ మొక్కూ లేదన్నట్టుగా నరకం
చూపిస్తాడు. అందరినీ తన పాదాక్రాంతం చేసుకోడానికి సజావుగా సాగిపోతున్న వ్యవస్థల్ని
కూడా కెలుకుతాడు. పైకి మాత్రం కొత్త విధానం తీసుకొస్తానంటాడు. ఆయా వ్యవస్థలకు చెందిన
వ్యక్తుల్ని కాళ్ల దగ్గరకు తెప్పించుకుంటాడు. పైకి మెత్తగా నవ్వుతూ, వాళ్ల విన్నపాలన్నీ విని ఆనందిస్తాడు.
వాళ్లు వినయంగా నమస్కారాలు గట్రా చేసి, ధర్మప్రభువులు కనికరించాలనే లెవెల్లో ప్రాధేయపడితే తెగ నవ్వుకుంటాడు.
ఆనక అవే వ్యవస్థల్ని ఏవో చిన్న చిన్న మార్పులతో వదిలేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులైనా, సినిమా సెలబ్రిటీలైనా, ఎంత పెద్దవాళ్లయినా అతడికి
ఒకటే. అతడి అనుచరులు ఎంతలేసి నేరాలు చేసినా కాస్తాడు. వాళ్ల చట్టాన్ని చేతుల్లోకి
తీసుకుని దౌర్జన్యాలు చేసినా పట్టించుకోడు. అంటే దుష్టరక్షణమన్నమాటే కదా.
ఇక తన తీరులో లోపాలు ఎవరైనా చెబితే చాలు సహించలేడు. వాళ్లెవరైనా సరే తప్పుడు
కేసుల్లో పెట్టి ఆడించాలని చూస్తాడు. మరదేకదా శిష్టశిక్షణమంటే. మరి నువ్వు రేప్పొద్దున్న
అధికారం అందుకుంటే అక్షరాలా పాటించాల్సిన అసలు సిసలు అవకతవక, అనర్థకర, అన్యాయ, అక్రమ, అధమాధమ విధానాలివే కదరా... అర్థమైందా?”
“అర్థమవడమేంటండి బాబూ... కళ్ల
పొరలన్నీ విచ్చుకుపోతేను. మొత్తానికి ఈ పాట మా గొప్ప సూత్రాలు చెప్పిందండీ...”
“ఆ పాటే కాదురా... ఆ సినిమాలో
ఈ పాట వచ్చే సందర్భం కూడా నీ పరగణాకి అచ్చం సరిపోతుంది తెలుసా?”
“ఆ... గుర్తొస్తోందండి గురూగారూ!
ఆ సినిమాలో ఈ పాట పాడేది నూతన్ ప్రసాదండి. అంటే కథ ప్రకారం సైతానండి. ఆడు జనాలందరినీ
రకరకాలుగా ప్రలోభ పెట్టి వశపరుచుకుంటూ ఉంటాడండి...”
“మరిప్పుడు జరుగుతున్న పాలన
కూడా అదే కదరా...”
“బాగా చెప్పారండి బాబూ... సైతాను
పాలనలో భలే సూత్రాలన్నమాట ఇవి!”
“చక్కగా గ్రహించావురా... ఇక
పోయిరా!”
-సృజన
PUBLISHED ON 1.7.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి