“ఆహా... ఓహో... ఒళ్లు గగుర్పొడుస్తోంది గురూగారూ! ఏం ప్రసంగం? ఏం జేజేలు? ఏం హంగామా? ఏం సందడి? ఆంధ్రుడిగా పుట్టినందుకు జన్మ
ధన్యమైపోయిందంటే నమ్మండి...” అంటూ శిష్యుడు వచ్చాడు ఒగరుస్తూ.
“ఒరేయ్... తెగ పులకరించిపోతున్నావు
కానీ, ముందు కాసిని మంచి నీళ్లు తాగి
నిదానించు. లేకపోతే కళ్లు తిరిగి పడిపోగలవు...” అంటూ గురువుగారు మంచి నీళ్ల సీసా
అందించారు.
శిష్యుడు గటగటా తాగేసి కూలబడ్డాడు.
“ఇప్పుడు చెప్పారా...
ఏంటి ఇంతలా కిందా మీదా పడిపోతున్నావు? ఎక్కడికెళ్లావు, ఏం చూశావు? ఏం విన్నావు? ఏం ఆకళింపు చేసుకున్నావు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు గురువుగారు.
“మీరేకదండీ... రాజకీయ
శిక్షణలో భాగంగా ప్లీనరీ సమావేశాలకు వెళ్లి రమ్మన్నరు? అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వస్తున్నానండి...”
“అదా సంగతి? మరి అక్కడ నువ్వు గ్రహించిన
సూత్రాలేంటో చెప్పు... వింటాను...”
“అబ్బబ్బబ్బ... ఏం
చెప్పనండి బాబూ! అసలు ఒక మనిషి తల్చుకుంటే ఇంతలేసి గొప్ప గొప్ప పనులు చేయగలడా
అని చెప్పేసేసి అనుమానం వచ్చేసిందండి. అసలు హోలాంధ్రా ప్రజానీకం బతుకులు ఇంత బాగుపడిపోయాయా
అనేసి ఆశ్చర్యం వేసేసిందండి... ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మేశాయండి. ఒళ్లు పూనకం
వచ్చినట్టు ఊగిపోయిందండి...”
“చాలా సంతోషంరా... ఇంతకీ
అక్కడ అన్నింటిలోకీ నీకు నచ్చినదేంటో చెప్పు?”
“ప్రసంగమండీ బాబూ...
ప్రసంగం! ఎంత గొప్పగా ఉందండీ! ఆయనగారు మెత్తగా నవ్వుతూ, చేతులూపుతూ, మాట్లాడుతుంటే మంత్రముగ్దుడినైపోయానండి...”
“మరి ఆ ప్రసంగంలో నీకు
బోధ పడిందేంటో చెప్పు?”
“మార్పండి... ఆయనొచ్చాక స్థితిగతులు ఎలా మారాయో చెప్పుకొచ్చారండి...రాజకీయ
వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించార్టండి... అక్కచెల్లెమ్మలకు సాధికారత అంటే
ఏంటో చూపించార్టండి... రైతులపై మమకారమంటే ఏంటో చూపించార్టండి... విద్యా విధానం ఎలా ఉండాలో చూపించార్టండి... అన్ని
రంగాలపైనా తనదైన ముద్ర వేశార్టండి... ఎంత గొప్ప ప్రసంగమో కదండీ?”
“అద్భుతమైన ప్రసంగంరా...
అందులో ఏమాత్రం సందేహం లేదు. మరిప్పుడు చెప్పు, ఆ ప్రసంగం వినడం ద్వారా నువ్వు నేర్చుకున్న రాజకీయ పాఠం ఏమిటో?”
“ఏముందండీ? అధికారంలోకి వస్తే ఎలా ప్రజాసేవ
చేయాలో తెలిసిందండి... అంతేనాండీ?”
“ఏడిశావ్... ఏదో నా దగ్గర
ఇన్నాళ్లూ కాస్తో కూస్తో రాజకీయాలు నేర్చుకుని
ఉంటావనుకుని ప్రాక్టికల్ నాలెడ్జి కోసం నిన్ను గుంటూరు పోయిరమ్మంటే, గుడ్డెద్దు చేలో పడ్డడ్డు వినేసి
వచ్చేశావన్నమాట... నీ మాటలు వింటుంటే నాకే సిగ్గుగా ఉందిరా...”
“అందేంటి గురూగారూ...
అలా తీసి పడేశారు? నేనన్నదాంట్లో ఏదైనా పొరపాటు ఉందాండీ?”
“మరి కాదట్రా... నువ్వు
నేర్చుకోవలసింది ఏం చేయాలో కాదురా, ఎలా చెప్పుకోవాలో తెలుసుకోవాలి. అర్థమైందా?”
“ఆ రెండింటికీ ఏంటండి
తేడా? చేస్తేనే కదా చెప్పుకోగలుగుతాం? చెప్పిందే కదా చేస్తాం? చేసిందే కదా చెబుతాం?”
“ఓరి సన్నాసీ... చేయడం
వేరు, చెప్పడం వేరు. చెప్పింది చేయాలని
లేదు. చేసేది చెప్పాలని లేదు. చేసింది చెప్పుకునేంత లేకపోయినా, చేసేసినట్టు చెప్పుకోగలగాలి.
చెప్పిందంతా చేయకపోయినా, చేసినదెంతో ఉందనే చెప్పాలి. అంటే చేయడం కన్నా చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఇదే
రాజకీయాల్లో ప్రధాన సూత్రం. తెలిసిందా?”
“ఏమో గురూగారూ! మీ మాటలెప్పుడూ
మతలబుగానే ఉంటాయి. ఇంతకీ ఆయన చేసేసినట్టు చెప్పుకున్న మార్పు అబద్ధమంటారా?”
“అమ్మమ్మ ఎంత మాట! అది
అబద్ధం కాదురా... పచ్చి నిజం. ఆయనొచ్చాక
మార్పు జరిగిందన్నది నిజం. అయితే ఆ మార్పు ఆయనచెప్పినట్టు ఉందా, లేదా అనేదే కీలకం...”
“అదిగో మళ్లీ మడత పేచీ
పెడుతున్నారు... మార్పుకి, మారడానికి ఏంటండి తేడా?”
“చెప్పడానికి, చేయడానికి ఉన్నంత తేడారా...”
“అయ్యబాబోయ్... గురూగారూ!
ఈ మార్పేంటో, మారకపోవడమేంటో, చెయ్యకపోవడమేంటో, చెప్పుకోవడమేంటో, నిజమేంటో, అబద్ధమేంటో కాస్తనా మట్టి
బుర్రకు అర్థమయ్యేలా చెప్పండి బాబూ...”
“అలారా దారికి! ఇది అర్థం
చేసుకోవాలంటే అసలు మార్పంటే ఏంటో తెలుసుకోవాలిరా. అంతకు ముందున్న పరిస్థితి నువ్వొచ్చాక
మారితే దాన్నే మార్పు అంటారు. కానీ ఆ మార్పు వల్ల పరిస్థితి దిగజారిందా, మెరుగయ్యిందా అనేది నిశితంగా
పరిశీలిస్తేనే కానీ అర్థం కాదు. అది అర్థం కావాలంటే నువ్వు పులకరించిపోయేలా ప్రసంగం చేసినాయన కుర్చీ ఎక్కా జరిగిన నిజమైన
మార్పు ఏంటో తెలుసుకోవాలి. ఆయనేమన్నాడూ? రాజకీయ వ్యవస్థలో మార్పు ఏంటో చూపించానన్నాడు. అది నిజమే కదా? ఆయనొచ్చాక రాజకీయాలకు అర్థమే
మారిపోలేదూ? అధికారంలోకి రాగానే చేయాల్సింది
ప్రజాసేవ కాదూ, దానికన్నా ముఖ్యం ప్రతిపక్ష నాయకులపై కక్ష కట్టడమని కాదూ చూపించింది? ఎప్పటెప్పటి కేసులో తిరగదోడి, వెంటాడి వేధించడం ద్వారా రాజకీయ
వ్యవస్థలో కనీవినీ ఎరుగని మార్పు చూపించలేదూ? అదేమిటని ప్రశ్నించిన వారిపై అడ్డగోలు కేసులు పెట్టడం ద్వారా వ్యవస్థను
ఎలా ఉపయోగించుకోవచ్చో చూపించలేదూ? సమస్యలను పట్టించుకోకపోగా, వాటి పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు చేసే ప్రజానీకం మీదకి రౌడీలను, పోలీసులను సైతం ఉసిగొల్పిన అరాచక రాజకీయాన్ని ఎప్పుడైనా చూశామా? అది మార్పు కాదూ? అక్కచెల్లెమ్మలకు సాధికారమంటే ఏంటో చూపించానన్నాడా? అంటే ఏంటి... అధికార పార్టీ నేతలు, అనుచరులు, కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై సాధికారికంగా అత్యాచారాలు, దౌర్జన్యాలు చేయడమన్నమాట.
మరి మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో మన రాష్ట్రం టాప్ టెన్‌లో ఉండడం మార్పు
కాదూ మరి? ఆడవాళ్లపై అత్యాచారాలు పెరగడానికి
దోహదం చేసే మద్యాన్ని కనుమరుగయ్యేలా చేస్తానంటూ నమ్మించి, అధికారంలోకి వచ్చాక మద్యం, సారా ఏరులై పారేలా చేస్తున్న
విధానాలు ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలుసుకోవద్దూ? ఇక రైతులపై మమకారమంటే ఏంటో చూపించారని చెప్పుకోవడం ద్వారా ఎంత గొప్ప ప్రసంగం
చేయవచ్చో నేర్చుకోవద్దూ? మూడేళ్లలో మూడు వేల మంది కౌలు
రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నా, ఆ విషయం చెప్పలేకపోవడం ఎంత
నైపుణ్యం? రైతు భరోసా పథకం ద్వారా సాయం
అందుకున్న వారి సంఖ్యకి, ఆయన చెప్పుకుంటున్న సంఖ్యకి లక్షల్లో తేడా ఉందంటే... ప్రజా వేదికపై ఎంత నిబ్బరంగా
బొంకవచ్చో ఢంకా బజాయించి చెప్పడం కాదా? జనాలు అప్పటికప్పుడు లెక్కలేసుకోలేరనేగా ధీమా? మరి ఆ నిస్సిగ్గు నిబ్బరం, ఆ దుందుడుకు ధీమా నీలాంటి వాళ్లకి నికార్సయిన నీచ పాఠం కాదూ? మరి ఆర్థిక రంగంలో జరిగిన మార్పును
మర్చిపోగలమా? మూడేళ్లలో అయిదు లక్షల కోట్లకు
పెరిగిన అప్పులకు లెక్కా, జమా ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇహ...విద్యా విధానం ఎలా ఉండాలో చూపించామన్నాడు
కదా, అదేదో బడులు రద్దయి బెంబేలు
పడుతూ రోడ్ల మీద బైఠాయిస్తున్న విద్యార్థులను చూస్తుంటే తెలియడం లేదూ? పాఠశాలలకు తాళాలు వేసి మరీ ఆందోళనలు చేస్తున్న తల్లిదండ్రులను అడిగితే తెలియదూ
ఆ మార్పేదో? విద్యావ్యవస్థను విఛిన్నం చేస్తున్నారంటూ
బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్న టీచర్లు చెప్పరూ అసలు మార్పంటే ఏంటో? ఉన్నట్టుండి 8 వేల బడుల్ని మూసేసిన విద్యా
విధానం మునుపెప్పుడైనా చూశామా మరి? ఇహ... అవ్వా, తాతలకు డబ్బులిస్తున్నామని చెప్పుకుంటున్నాడే... మరి అదే చేత్తో ధరలు పెంచి, పన్నులు విధించి వాళ్ల బిడ్డల
జేబుల్నుంచి ఊడబెరుక్కుంటున్న దుడ్ల సంగతేంట్రా? ఏకంగా 5 లక్షల పింఛన్లను రద్దు చేసిన
లెక్కలు ఎక్కడా చెప్పలేదు కదరా! కాబట్టొరే... ఇప్పటికైనా నీకు అర్థమైందా... చెప్పడానికి, చెయ్యడానికి, చెయ్యకపోయినా చేసినట్లు చెప్పుకోడానికి
ఉన్న తేడా?”
“అర్థం కావడమేంటండి
బాబూ... దిమ్మదిరిగిపోతేను. చెప్పింది చేయక్కరలేదని, చేసేది చెప్పక్కర్లేదని, చెయ్యకపోయినా చేసేసినట్టు చెప్పుకోవచ్చని, చెప్పుకున్నంత మాత్రాన చేసినట్టు కాదని, చేయనంత మాత్రాన చెప్పుకోకుండా ఉండక్కర్లేదని, చెప్పుకోడానికి చేయక్కరలేదని... బాగా అర్థమైంది గురూగారూ!”
“శెభాష్‌రా... నేను చెప్పకపోయినా
చెప్పినట్టు గ్రహించావు. నువ్వు చెప్పినట్టు చేసుకుపోయావనుకో, జనాల్ని మభ్య పెట్టడంలో చెయ్యితిరిగిపోతావు.
ప్రజల్ని ఏమార్చడంలో చెలరేగిపోతావు. ఊకదంపుడు ప్రసంగాల్లో ఉద్ధండుడివి అవుతావు.
ఇక పోయిరా!”
-సృజన
PUBLISHED ON 10.07.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి