"దారా... నీలాంటి శిష్యుడిని పొందడం నా పూర్వజన్మ సుకృతంరా. పీడిత తాడిత దుర్బల దయనీయ దారుణ నిరుపేద నిర్బల నీరస సామాన్య జనులను ఉద్ధరించడానికి రాజకీయాలు నేర్చుకుంటున్న దయామయుడివి. ప్రజల శ్రేయస్సునే మనసా వాచా కర్మణా వంటబట్టించుకుని, వారి అభ్యున్నతి కోసమే కలలు కంటూ, కలవరిస్తూ, కలవరపడుతూ, కకావికలవుతూ, కాలక్షేపం చేస్తున్న కారణజన్ముడివి. నీకిదే నా స్వాగతం..." అంటూ ఆహ్వానించారు గురువుగారు.
రోజూలాగే చేతిలో పుస్తకాలతో, బుర్రనిండా ప్రశ్నలతో,
మనసంతా సందేహాలతో, రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి
వచ్చిన శిష్యుడు, గురువుగారి స్వాగత వచనాలు విని ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.
ఒళ్లంతా పులకరించింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
మొహం చేటంతయింది. ఓసారి తలెగరేసి గర్వంగా దర్పంగా విలాసంగా లోపలికి వచ్చి కూర్చున్నాడు.
ఆపై లేని వినయం నటిస్తూ, "అయితే ఇన్నాళ్లకి నా విలువేంటో మీకు తెలిసిందన్నమాట
గురూగారూ! అంతేనాండీ?" అన్నాడు
పెదాలు చెవులకంటుకునేంత విశాలంగా నవ్వుతూ.
గురువుగారు వాడి పోకడలన్నీ చూసి, "ఏడిశావ్ వెధవా! సిగ్గుమాలిన దరిద్రుడా!
నీచుడా! నికృష్టుడా! దగుల్బాజీ! నీ బతుక్కి రాజకీయాలు కావల్సి వచ్చాయంట్రా, నీతిమాలినోడా! ని ఇష్టం వచ్చినప్పుడు
వచ్చి పాఠాలు చెప్పమనడానికి నేనంత అలుసైపోయాన్రా అప్రాచ్యుడా! నువ్వెంత? నీ బతుకెంత? నిన్ను కన్నందుకు నీ కన్నతల్లి
కూడా లోలోపల కుమిలి కుమిలి ఏడుస్తుందిరా మూర్ఖుడా! తోడ బుట్టిన వాళ్లు కూడా నీ కపట
బుద్ధులు చూసి అసహ్యించుకుంటార్రా బాడ్‌కోవ్! పుండాకోర్, అక్కుపక్షీ!
నిరక్షర కుక్షీ!"
అంటూ తిట్టి పోశారు.
కులాసాగా వచ్చి కూర్చున్న శిష్యుడు బిత్తరపోయాడు.
కళ్లలో నీళ్లు తిరిగాయి. చెవులు ఆవిర్లు చిమ్మాయి. మొహం వెలవెలబోయింది. నిలువునా
కుంగిపోయాడు.
ఎలాగో మాట పెగల్చుకుని, "ఇదేంటి గురూగారూ! రాగానే పొగడ్తలతో
హోరెత్తించేశారు. ఇప్పుడేమో కాస్త ఆలస్యంగా వచ్చినందుకు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇదెక్కడి న్యాయమండీ..." అన్నాడు ఏడుపుమొహం పెట్టుకుని.
గురువుగారు తాపీగా పడక్కుర్చీలో వెనక్కి జారగిలబడి
కూర్చుని చిద్విలాసంగా నవ్వారు.
"ఓరెర్రోడా... ఇది కూడా పాఠమేరా సన్నాసీ!
ఆ పొగడ్తలూ నిజం కాదు, ఈ తిట్లూ నిజమైనవి కావు. కానీ రాజకీయాల్లో ఈ రెండూ కూడా కచ్చితంగా నేర్చుకోవాల్సిన
అంశాలురా. అందుకే రాగానే సింపుల్‌గా శాంపిల్ చూపించానంతే. అర్థమైందా?"
శిష్యుడు తేరుకుని, "చంపేశారండి బాబూ! రాగానే పాఠం మొదలెట్టేశారన్నమాట.
మీ పొగడ్తలు వింటే నేనంత గొప్పవాడినా అనిపించి కళ్లు నెత్తికెక్కాయండి. కానీ మీ తిట్లు వినగానే బుర్ర తిరిగిపోయిందండి. మొత్తానికి భలేవారండీ బాబూ
మీరు..." అన్నాడు.
"ఆ... ఇదింకో పాఠంరోయ్! రాజకీయాల్లో రాటుదేలాలంటే, పొగడ్తలు విని పొంగిపోకూడదు,
తిట్లు విని కుంగిపోకూడదు. ఎవరైనా నిన్ను పొగిడితే గుంభనంగా ఆనందించినా,
పైకి మాత్రం వినయం నటించాలి. ఇక ఎవరైనా నిన్ను తిట్టారనుకో,
అంతకు మించి రెచ్చిపోయి, ఛండాలమైన భాషతో వీరంగం
ఆడేయాలి. సమయానికి తగినట్టు ఈ రెండు విద్యలూ నేర్చుకున్నావనుకో, ఇక నీకు ఢోకా ఉండదు. తెలిసిందా?"
"భేషుగ్గానండి. మరి గురూగారూ! ఈ రెండు
విద్యల్లోనూ ఆరితేరినవారు ఎవరైనా ఉన్నారాండీ?"
"ఎందుకు లేర్రా... నీ పరగణా కేసి ఓసారి
కళ్లెట్టుకు చూడు. ఛోటా నేతల దగ్గర్నుండి, బడా నాయకుల వరకు నోరెత్తితే ఈ రెండే కదరా వినిపించేది.
అధినేతను పొగడ్డం, అవతలి వాడిని తిట్టిపోయడం. ఇంతకు మించి
పాలన ఏముందిరా? మొన్నటికి
మొన్న ప్లీనరీ సమావేశంలో కూడా జరిగిందిదేగా?"
"అవునండోయ్... మీరు చెబితే గుర్తొస్తోంది.
మొత్తం ఆ సమావేశాలు ఆశాంతం ఈ రెండేనండి. ఓ చర్చలేదు. ఓ ప్రణాళిక లేదు. ఓ పరిశీలన
లేదు. ఓ విజన్ లేదండి. విసుగొచ్చేసిందండి..."
"మరందుకే కదరా నిన్ను
పంపించింది? నీలాంటి ఔత్సాహిక రాజకీయాభిలాషులకి
నీ పరగణా ఓ పెద్ద బాలశిక్షరా. ఇక్కడ నువ్వు నేర్చుకునే పాఠాలు చాలా విలువైనవి.
మంచి నేతగా ఎదగదలుచుకుంటే రాజకీయాల్లో ఎలా ఉండకూడదో ఇక్కడే తెలుసుకోవచ్చు,
అదే నీచాతినీచమైన నాయకుడిగా రాటు దేలాలంటే ఎంతలా దిగజారవచ్చో కూడా
ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఏమంటావ్?"
"అక్షరాలా నిజమేనండి. మరైతే ఈ రెండు
విద్యల గురించి కాస్త విపులంగా చెబుదురూ,
రాసుకుంటాను..."
"ముందుగా పొగడ్తలనేవి ఎన్ని రకాలో తెలుసుకోవాలిరా.
అది 'స్వ... పర... పరస్పర' అని ముఖ్యంగా మూడు రకాలు. 'స్వ...' అంటే మనకి మనమే
పొగుడుకోవడం. ఎవరూ పొగిడేవారు లేనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. మరి మీ అధినేత
నుంచి అమాత్యుల వరకు పాటించేది ఇదే కదా? కుర్చీ ఎక్కిన దగ్గర్నుంచి ఇంత
చేసేశాం, అంత చేసేశాం అని ఊదరగొట్టడమేగా ఎక్కడ చూసినా. రాజకీయాలంటే
ఎలా ఉండాలో చూపించానని మీ అధినేత చెబుతున్నాడు. అసలు మార్పు అంటే ఏంటో చూపించామంటున్నాడు.
ఆడబిడ్డల బతుకులు మార్చేశానంటున్నాడు. అవ్వ, తాతల రుణం తీర్చుకుంటున్నానన్నాడు.
మహిళల జీవితాల్లో వెలుగులు విరజిమ్మేశానంటున్నాడు. విద్యా రంగంలో వినూత్న మార్పులు
తీసుకొచ్చేశానంటున్నాడు. మరివన్నీ నిజాలా చెప్పు?"
"ఛీ...ఛీ...నిజాలేంటండీ బాబూ! పచ్చి అబద్దాలు.
అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్నీఅతలాకుతలం చేసేసి వదిలిపెట్టాడు. అన్ని వ్యవస్థల్నీ
నాశనం చేసి పెట్టాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశాడు. మహిళలకు ఎక్కడా రక్షణ
లేకుండా చేసేశాడు. విద్యార్థులను వీధుల్లోకి నెట్టాడు. తల్లిదండ్రుల్ని అయోమయంలో
పడేశాడు. సామాన్యుడు గగ్గోలు పెట్టేలా పన్నులు పెంచేశాడు. పేదల నడ్డి విరిగేలా
ధరలు పెంచేశాడు. పాత ప్రభుత్వాలు జాలి పడి మంజూరు చేసిన స్థలాలు, ఇళ్లలో తరతరాలుగా హాయిగా ఉన్న
నిరుపేదల నుంచి కూడా డబ్బులు పిండుకుందామని చూస్తున్నాడు. రైతులకు ఆత్మహత్యలు
తప్ప దారి లేని పరిస్థితులు తీసుకొచ్చాడు. నకిలీ మద్యం, నాటు
సారాలను జీవనదుల్లా పారిస్తూ ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో
ఆడుకుంటున్నాడు. అసలీయన వెలగబెడుతున్న పరిపాలనలో సుఖంగా ఉన్నదెవరండీ?"
"అమ్మమ్మ... అంతమాటనకురోయ్! ఆయన పాలనలో
దిలాసాగా, కులాసాగా
ఉన్నవాళ్లు ఎందరు లేరు? అక్రమంగా గనులు తవ్వుకుంటున్న వాళ్లు
కోట్లకి కోట్లు వెనకేసుకోవడం లేదూ?
రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇసుక తవ్వకాలని లోపాయికారీగా సబ్
కాంట్రాక్టుకిచ్చి ఖజానాకి పన్నులు ఎగ్గొడుతూ, ధరలు పెంచేసి
దండుకుంటున్న దగాకోరు తమ్ముళ్లు కోట్లకి పడగలెత్తడం లేదూ? మన్యంలోని మండలాలన్నింటినీ గంజాయి సాగుకి గుత్తాధిపత్యం చేసేసి,
పోలీసుల కళ్లకు గంతలు కట్టి, దేశ విదేశాలకు
యధేచ్చగా సరఫరా చేస్తూ సంపాదిస్తున్న
స్మగ్లర్లు స్వేచ్చగా సుఖంగా లేరూ?
పేదలకిచ్చే రేషను బియ్యాన్ని కూడా బెదిరించి సేకరించి,
పోర్టుల ద్వారా నౌకలకెత్తించి విదేశాలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న
దగుల్బాజీలు లేరూ? దేశం
మొత్తం మీద ఎక్కడా కనిపించని వింత వింత బ్రాండ్ల
మద్యం రకాల్ని మార్కెట్లోకి దించి జనం గొంతులోకి పంపుతూ జేబులు నింపుకుంటున్న జగత్
కిలాడీలు ఆనందంగా లేరూ? ప్రజా పథకాల పేరిట పంపిణీ చేసే సామగ్రి సరఫరాకి ఘరానాగా కాంట్రాక్టులు
దక్కించుకుని నాణ్యతలేని నాసిరకం సరుకును అంటగడుతూ ఆర్జిస్తున్న అక్రమ వ్యాపారులు
హాయిగా లేరూ? ఏమాటకామాటే చెప్పుకోవాలి, నిజాలు విస్మరించకురోయ్..."
"అవునండోయ్... మరింతకీ ఈ వ్యవహారంలో
నేను నేర్చుకునే సూత్రమేమిటండీ?"
"అదేరా... ఎటు చూసినా విమర్శలే తప్ప
పొగడ్తలు లేకపోయినా, ఎవరూ పొగిడే వాళ్లు లేకపోయినా తనను తాను పొగుడుకోవడమెలాగో తెలుసుకోవాలంటే
నీ అధినేత మాటల్నే మననం చేసుకోవాలి. స్వీయ పొగడ్తల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్
ఈ పాటికే ఇచ్చేయాలి. ఇక పొగడ్తలో రెండో రకమైన 'పర...' అంటే అవసరాన్ని
బట్టి ఇతరులను పొగడ్డమన్నమాట. ఇందులో నీ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అమాత్యుల తర్వాతే ఎవరైనా. ఒకడు నీ అధినేత కారణజన్ముడంటాడు. మరొకడు ప్రజల
కోసమే ఆయన పుట్టాడంటాడు. ఒకరు ఈయన్ని అర్జనుడితో పోలిస్తే, మరో ఘనురాలు ఏకంగా రాముడితోనే ముడిపెట్టింది.
ఒకరు ఆయనకు పాదాభివందనం చేసి తరిస్తే, మరొకరు ఆయన చేతిని
ముద్దు పెట్టుకుని జన్మ ధన్యం చేసుకుంటారు. అధినేతను మెప్పించి పదవులు,
హోదాలు పొందడానికి ఈ రకమైన పొగడ్తను మించిన సాధనం మరొకటి లేదురా"
"మరి గురూగారూ! పొగడ్తలో మూడో రకం 'పరస్పర...' సంగతేంటండీ?"
"ఏముందిరా. ఒకరినొకరు పొగుడుకోవడం. ఎక్కడ
దురద పుట్టినా నీకు నువ్వు గోక్కోగలవు. కానీ వీపు మీద అయితే ఎలా? మరొకరి సాయం కావల్సిందే. అందుకనే
'నా వీపు నువ్వు గోకు... నీ వీపు నేను గోకుతా...' అనే అంతర్గత
ఒప్పందంలాంటిదన్న మాట. ఇందులో కూడా మీ నేతలు పండిపోయారురా. ఒకరినొకరు పొగుడుకోవడమే
కాదు, తమకు దన్నుగా
నిలిచే వాళ్లని కూడా వెనకా ముందూ చూడకుండా పొగడగలరు"
"మరి ఈ పొగడ్తలతో ఏమేమి ప్రయోజనాలు
సాధించవచ్చు గురూగారూ?"
"చాలా ఉంటాయిరా. పొగడ్తలో హెచ్చరికల్ని
కూడా కలగలపి రఫ్ఫాడించవచ్చు. ఉదాహరణకు మీ అధినేత ప్రసంగాలు విన్నావుగా? ప్రజలకు మేలు చేయడంలో తానెవరి
ప్రయత్నాలనీ సహించననీ, తనను విమర్శించే వాళ్లందరూ కలసినా
తన వెంట్రుక ముక్కను కూడా పీకలేరనీ చెప్పలేదూ? అంటే స్వీయ
పొగడ్తలో విమర్శని పోపెట్టాడన్నమాట. ఇలా స్వ, పర,
పరస్పర రకాలతో తారంగమాడుతున్న వాళ్లని చూస్తూ కూడా నువ్వు నేర్చుకోకపోతే
ఎలారా?"
"అవునండీ... చాలా విలువైన పాఠం. కానీ గురూగారూ...
రాజకీయాల్లో తిట్లు ఎలా ఉపయోగపడతాయండీ?"
"ఇది తెలుసుకోడానికి కూడా నువ్వు ఎక్కడికీ
పోనక్కర్లేదురా. నీ నేతలు, నాయకులు పెట్టే ప్రెస్ మీట్లకు వెళితే సరిపోతుంది. తమ పాలనపై ఏపాటి చిన్న
విమర్శ వచ్చినా, దాని వెనుక ఉన్న నిజానిజాలేంటో తెలుసుకుని,
అవసరమైతే సరిదిద్దుకుని, లేకపోతే నిజాలు వెల్లడించాల్సింది
పోయి... అన్నవాడిని అమ్మనా బూతులు తిడుతూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం
లేదూ? ప్రశ్నించిన వాడికి
లేనిపోని కులాలు, మతాలు, వర్గాలు కూడా
అంటగడుతూ నానా మాటలూ పేలడం లేదూ?
అలా తమను ధిక్కరించిన
వారిని బెంబేలెత్తించేలా కుయత్నాలు చేయడం
లేదూ? మొన్నటి సమావేశాల్లో
జరిగిందంతా ఆత్మస్తుతి, పరనిందలే కదరా? ప్రత్యర్థి తమను విమర్శించేప్పుడు
ఉపయోగించిన భాష బాగాలేదని ఓ పక్క చెబుతూనే, మరోపక్క అంతకుమించిన నికృష్టమైన
పదజాలం ప్రయోగిస్తూ మొరెత్తుకుని విరచుకుపడలేదూ? ఇలా ఎదురెట్టి
ఏకేయడానికి, విషయాన్ని విమర్శల నుంచి పక్కదారి పట్టించడానికి
తిట్లని మించిన అస్త్రం ఏముంటుంది చెప్పు? కాబట్టి ఎప్పుడెవర్ని ఎలా పొగడాలో,
ఎవర్నెలా ఉబ్బేయాలో, పొగుడుతూనే ఎలా పొగపెట్టాలో,
ఎవర్ని తిట్టి బెదిరించాలో, బూతులు ఉపయోగించి
ఎలా రెచ్చిపోవాలో ఇవన్నీ నేర్చుకుని రెచ్చిపోరా మరి..."
"ఆహా...గురూగారూ! అద్భుతంగా చెప్పార్సార్...
రాజకీయ పాఠాలు చెప్పడంలో మీకు మీరే సాటి..."
"ఏంట్రోయ్. నన్నే పొగుడుతున్నావు?"
"అబ్బే... ఇది పొగడ్త కాదండీ... పచ్చి
నిజం..."
"అది కూడా పొగడ్తేరా బడుద్ధాయ్! ఇక పో..."
"ఇది కూడా తిట్టు కాదని తెలిసింది సార్...
ఇక వస్తా!"
-సృజన
PUBLISHED ON 30.7.22 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి