కైలాసంలో వినాయకుడు తొండం గుండ్రంగా చుట్టి బుంగమూతి
పెట్టుకుని కూర్చున్నాడు. పార్వతి నచ్చచెప్పినా వినడం లేదు.
"అలా కాదు విఘ్నూ! ఏటా వినాయక చవితికి
భూలోకానికి వేంచేయడం నీకు అలవాటే కదా?
మరీసారి ఇలా మారాం చేస్తున్నావేం?" అంది పార్వతి
అతడి బొజ్జ నిమిరి బుజ్జగిస్తూ.
"నేను వెళ్లనంటున్నది భూలోకానికి కాదు.
ఆంధ్రదేశానికి..." అన్నాడు వినాయకుడు విసుగ్గా.
శివుడు జోక్యం చేసుకున్నాడు.
"అదేమిటి వినాయకా! ఆంధ్రదేశంలో మాత్రం
భక్తులు లేరా? అక్కడ
సైతం పండుగ జరగదా? అదీ కాక ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి వెళ్లననడం
సకల జన హితుడవు, దీన జన బాంధవుడవు అయిన నీకు తగునా?" అంటూ అడిగాడు
శివుడు.
"అదికాదు తండ్రీ... వెనకా ముందూ చూడకుండా
మీలా నేను వరాలు గుప్పించలేను. ఆనక చిక్కుల్లో పడలేను. అందుకే ఆలోచిస్తున్నాను..." అన్నాడు
వినాయకుడు.
శివుడు ఆశ్చర్యపోయి, "అదేమిటి విఘ్ననాయకా! ఆంధ్ర ప్రజలు
చేసుకున్న పాపమేమి? వారి కోరుకునే వరాలు అంత అసాధ్యమైనవా
ఏమి?" అన్నాడు.
"అస్సలు కాదు తండ్రీ! ఆ ప్రజల కోరికలు
అత్యంత సమంజసమైనవే. కానీ అవి అంత తొందరగా తీరేవి కావు. అందుకనే ఆలోచిస్తున్నాను..." అన్నాడు
వినాయకుడు తటపటాయిస్తూ.
"కారణం?" అన్నాడు శివుడు అయోమయంగా.
"అక్కడి నాయకుడు... అతడి పరిపాలన చిత్రవిచిత్రముగా
సాగుతున్నది. అక్కడి జనం నీరాజనం పట్టి మరీ అధికారం అందించిన నాయకుడతడు. కానీ
అధికార పీఠం ఎక్కగానే అతడి వ్యవహార శైలి కడు వింతగా మారినది. చెప్పేదొకటి, చేసేదొకటి. ఆతడి రాజకీయ విన్యాసాల
నేపథ్యంలో నా వరాలు సైతం వెంటనే ఫలించని వింత పరిస్థితులు అక్కడ రాజ్యమేలుతున్నవి.
నా మాటలు మీకు విచిత్రముగా తోచవచ్చు. కానీ మీరే ఒక్కసారి అక్కడి సామాన్యుల వెతలు
వినుడు..." అంటూ వినాయకుడు అక్కడ తారాడుగున్న మేఘాల దొంతరను
పక్కకు జరిపాడు. కింద ఆంధ్రదేశము స్పష్టముగా కనిపిస్తోంది. కైలాస వాసులందరూ
కిందకు చూశారు.
****
బక్కచిక్కిన ఓ రైతు వినాయకుడి పందిరిలోకి వచ్చి
కూర్చున్నాడు. అతడి మనసులోని కోరిక లౌడ్‌స్పీకరులో వినిపించినట్టు కైలాసంలో ప్రతిధ్వనించ
సాగింది.
"వినాయకా తండ్రీ... ఆరుగాలం శ్రమించినా
ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. దళారుల గుప్పెట్లో
చిక్కుకుని విలవిలలాడాల్సి వస్తోంది. ఆత్మహత్య తప్ప దిక్కులేని దుస్థితిలో నాలాంటి
రైతన్నలు ఎందరో ఉన్నారు తండ్రీ... కాస్త మా పరిస్థితి మారేటట్టు కనికరించు..."
వినాయకుడు వివరించాడు.
"చూశారా... ఎంత న్యాయమైన కోరికో. కానీ
అక్కడి అన్నదాతల పరిస్థితి ఒక్క వరంతో
చటుక్కున తీరేది కాదు. సమస్యల వలయంలో చిక్కుకుని పోయారక్కడి కర్షకులు.
ఓ పక్క సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఎరువుల ధరలు ఆకాశాన్నంటున్నాయి.
మరో పక్క వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచి
అమ్ముతున్నారు. రైతన్నల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అవసరాన్ని ముందుగానే
ఊహించి ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉంచాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. పైగా
తమది రైతు బాంధవ ప్రభుత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారక్కడి నేతలు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఇత్యాది సకల సామగ్రిని రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో
ఉంచుతామంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అక్కడి అధినేత దృష్టంతా ప్రచారం
మీదనే తప్ప ప్రజల మీద లేదు..." అంటూ నిట్టూర్చాడు వినాయకుడు.
****
ఇంతలో వినాయకుడి పందిట్లోకి ఓ మహిళ వచ్చింది.
ఆమె కోరిక కూడా కైలాసంలో వినబడసాగింది.
"ఈ నవరాత్రుల్లోనైనా నిషా జోలికి పోమాకురా
మగడా అంటే మా ఆయన వినడం లేదు వినాయకా. రోజూ తాగొచ్చి ఇల్లు గుల్ల సేత్తన్నాడు. పైగా కొత్త కొత్త బ్రాండ్లంటూ
ఎగబడి నాసిరకం మద్యం తాగతా ఆరోగ్యం పాడు చేసుకుంటన్నాడు. మద్యంలో అయ్యేవో రసాయనాలు
తెగ కలిపేత్తన్నారంట. సెబితే ఇనిపించుకోడు. నా సంసారం ఎప్పటికి బాగు పడుద్దో ఏంటో...
నువ్వే ఓ సూపు సూడాల సామీ..."
"పాపం... చూశావా అమ్మా. నాన్నగారు లోకోపకారం
కోసం కాలకూట విషాన్ని కంఠంలో పెట్టుకున్నారు కానీ, ఆంధ్ర దేశంలో నాసిరకం మద్యం, నాటు సారాలనే గరళాన్ని సామాన్యులు తాగకుండా మాత్రం నివారించలేరు. ఎందుకంటే...
ఎక్కడ పడితే అక్కడ ఆ మద్యం, సారాలు దొరికేలా అక్కడి ప్రభుత్వమే
చేస్తున్నది. ఆఖరికి ఫోన్ కొడితే సీసాల్ని హోమ్ డెలివరీ చేసేంతగా అక్కడి వ్యవహారం
మితిపోయింది. ఎందుకంటే మద్యం అమ్మకాల మీద
వచ్చే లక్షలాది కోట్ల రూపాయలే ప్రధాన ఆదాయ వనరుగా అక్కడి ప్రభుత్వానికి మారింది.
మీకో దారుణమైన సంగతి చెప్పనా? అక్కడి అధినేత సంపూర్ణ మద్య
నిషేధం చేస్తానంటూ ఊరూవాడా వాగ్దానాలు గుప్పించి, ఆడపడుచులను
నమ్మించి మరీ అధికారంలోకి వచ్చాడు. కానీ సింహాసనం ఎక్కాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు.
అక్కడి నేతల అస్మదీయులకే మద్యం కాంట్రాక్టులు, ఫ్యాక్టరీలు
కట్టబెట్టారు. పైగా మద్యం అమ్మకాలపై రాబోయే ఆదాయాన్ని కూడా అక్కడి నాయకుడు తనఖా
పెట్టి మరీ అప్పులు చేశాడు. ఈ దారుణ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఆడపడుచుల బాధ
తల్చుకుంటేనే బాధ కలుగుతోంది..." అంటూ వివరించాడు వినాయకుడు.
****
ఈసారి వినాయకుడి ముందుకి ఓ కుటుంబం వచ్చింది.
అమ్మా, నాన్న,
బాబు, పాప. వాళ్లు వినాయకుడి ముందు ఓ పుష్పం
పెట్టి వినయంగా నమస్కరిస్తూ కళ్లు మూసుకున్నారు.
"ఏం చెయ్యం స్వామీ? నీకు దండిగా పిండివంటలు, కానుకలు సమర్పించుకుందామనుకున్నా
వీలు కుదరలేదు. అన్ని సరుకుల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాలు కూడా కొనుక్కోలేక
నిట్టూరుస్తున్నాము. పైగా రకరకాల పన్నులు విధిస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు.
ఈ ఏడాదైనా ఓ ఇల్లు కట్టుకుందామనుకుంటే ఎక్కడా సాధ్యమయ్యేలా లేదు స్వామీ. నెల నెలా
వచ్చే జీతమే ఎప్పుడొస్తుందో తెలియకుండా ఉంది..." అంటూ ఆ ఇంటాయిన గోసకి కైలాసం ఖంగుమంది.
"వినాయకా! మా కుటుంబాన్ని చల్లగా చూడు
తండ్రీ. ఎక్కడ చూసినా దౌర్జన్యం పెరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు మితిమీరి పోతున్నాయి.
మా బాబుని, పాపని
చల్లగా చూడు..."
వినాయకుడు నిట్టూర్చి చెప్పసాగాడు.
"అమ్మా, నాన్నా విన్నారా? కైలాసంలో మన కుటుంబం మంచుకొండల
మధ్య చల్లగానే ఉంది. కానీ అక్కడ ఆ కుటుంబం మాత్రం అలా లేదు. ఆయనకి ఇల్లు కట్టుకోవాలనే
కోరిక పాపం. కానీ ఇసుక సైతం సక్రమంగా దొరకని పరిస్థితి అక్కడ తాండవిస్తోంది.
చల్లని గోదావరి పారుతున్నా, తీరప్రాంతమంతా ఇసుక ఇబ్బడి
ముబ్బడిగా ఉన్నా, ఇసుక ధర మాత్రం ఆకాశంలోకి చేరింది. అది కూడా
బ్లాకులో అధిక ధర పెట్టుకుని కొనుక్కుంటే తప్ప దొరకని దుస్థితి. ఇక సిమెంటు,
ఇనుము ఇలా ప్రతి సరుకు ధరలు పెరిగిపోయి సొంతింటి కోసం తహతహలాడుతున్న
ఇలాంటి కుటుంబాలెన్నో అక్కడ కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఆక్రోశం విన్నారా? ఆడవాళ్లపై అత్యాచారాలు, దౌర్జన్యాలు ఎక్కువ జరిగే
ప్రాంతం దేశం మొత్తం మీద అక్కడిదేనని సర్వేలు
చెబుతున్నాయి. నేరాలను అరికట్టాల్సిన రక్షక భట వ్యవస్థ అధినేతకు గులామైపోయింది.
గిట్టని వాళ్లపై అన్యాయపు కేసులు పెట్టడానికే వాళ్లని ఉపయోగించుకుంటున్నారక్కని
నేతలు. ఆఖరికి ఛోటా నాయకుడి మాట వినకపోయినా ఎక్కడ చిక్కుల్లో పడాల్సి వస్తుందోననే
భయంతో చేష్టలుడిగిపోయారు అక్కడి రక్షక వ్యవస్థ ప్రతినిధులు. ఓ పక్క మాదక ద్రవ్యాలు
విచ్చలవిడిగా దొరుకుతుంటే తన కొడుకు ఎక్కడ వాటి బారిన పడతాడోనని భయపడుతోంది
ఆ తల్లి. మరో పక్క తన కూతురు ఎక్కడ అధికార పార్టీ అనుచరుల దౌర్జన్యాలకు గురవుతుందోనని
తల్లడిల్లుతోంది. ఇలాంటి దారుణ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి..." అంటూ ఏకరువు
పెట్టాడు ఏకదంతుడు.
*****
ఇంతలో ఓ యువకుడు వినాయకుడి గుడి ముందుకు వచ్చాడు.
అతడి మనసులో మాట కైలాసంలో మార్మోగింది.
"నీకేం వినాయకా! హాయిగా ఉన్నావు. భక్తులు
సమర్పించే కుడుములు, ఉండ్రాళ్లు బొజ్జనిండా తిని చిద్విలాసంగా నవ్వుతున్నావు. కానీ నా పరిస్థితి
చూడవు. డిగ్రీ ప్యాసయి కొన్నేళ్లయింది. ఉద్యోగం రాలేదు. ఇంటికెళ్లి కంచం ముందు కూర్చోవాలన్నా
సిగ్గుగా ఉంది. వచ్చే ఏడాదికైనా నా సంగతి కాస్త చూడు మరి..."
వినాయకుడు ఇబ్బందిగా మొహం పెట్టి చెప్పసాగాడు...
"చూశారా... పాపం ఇలాంటి యువతీ యువకులు
లక్షలాది మంది ఇలాగే కునారిల్లుతున్నారక్కడ. అధికారంలోకి రాగానే జాబుల మేళా చేస్తానని
ఆశ పెట్టాడక్కడి అధినేత. కుర్చీలో కూర్చుని
మూడేళ్లయినా ఉద్యోగాల భర్తీ సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ పక్క లక్షలాది
ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటి కోసం నోటిఫికేషన్లు జారీ చేయడు. పరీక్షలు
జరపడు. ఓ పక్క కోచింగుల కోసం ఇలాంటి యువతీ యువకులు ఇంటి దగ్గర అమ్మానాన్నలను
ఫీజులను అడగలేక అడుగుతూ పట్టుదలతో శిక్షణ పొందుతూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
వీళ్లంతా నా పందిళ్లలో నవరాత్రులకు ఉత్సాహంగా చిందులేస్తుంటే నాకే ఎంతో జాలి కలుగుతోంది.
ఇలా వీళ్లే కాదు... అక్కడ ఆ ప్రాంతంలో ఎవరిని చూసినా ఎవరూ స్తిమితంగా లేరు. అక్కడి
వ్యవస్థలన్నీ నాశనమైపోయాయి. ఏ రంగం చూసినా పట్టుదప్పింది. స్వప్రయోజనాలే
తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు అక్కడి నేతలు. పైగా ప్రశ్నిస్తే
చాలు పగబట్టి వేధిస్తున్నారు. అధికార మదోన్మత్తులై, అహంకార పూరితులై, అబద్ధపు ప్రచారంతో కాలం గడుపుతున్నారు. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని
అన్యాయంగా పంచభూతాలను సైతం కబళిస్తున్నారు. ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నేనక్కడికి వెళ్లి అక్కడి అమాయకపు సామాన్య జనం భక్తితో సమర్పించే
కుడుములు తిని రమ్మంటారా? అందుకే వెళ్లనంటున్నాను..." అంటూ భీష్మించాడు
వినాయకుడు.
శివుడు,
పార్వతి మొహమొహాలు చూసుకున్నారు. కైలాస గణాలన్నీ తెల్లబోయాయి.
సరిగ్గా సమయానికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు
నారదుడు.
"నారాయణ... నారాయణ" అంటూ ఓ సారి
మహతి మీటి అందుకున్నాడు.
"అంతా అవగతమైనది కైలాస నాథా! వినాయకుడి
మీమాంస సమంజసమైనదే. పూర్వంలోలాగా ఏ ఒక్కడో కంటకుడైతే ఏదో అవతారమెత్తి వాడిని
పరిమార్చిన సరిపోయేది. ఇప్పుడలా కాదే?
ప్రజలే ఏరి కోరి నెత్తిన పెట్టకున్న అధినేతలను వారే ఐదేళ్ల పాటు
భరించాల్సిందే. అయితే ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్లకుండా ఉండక్కరలేదయ్యా వినాయకా!
దానికో ఉపాయం ఉంది..." అన్నాడు నారదుడు.
"ఏమిటది నారదా?" అన్నాడు వినాయకుడు. శివపార్వతులు ఆసక్తిగా
చూశారు.
"ఏమీ లేదు వినాయకా! నీవు నిశ్చింతగా అక్కడికి
వెళ్లి రా. అక్కడి భక్తులు సమర్పించే ఉండ్రాళ్లు, కుడుములు ఆనందంగా స్వీకరించు. ఆపై అక్కడి ప్రజలకు
తాము ఎన్నుకున్న నాయకుల నిజస్వరూపాలను గ్రహించగలిగే చైతన్యాన్ని ప్రసాదించు.
మెరమెచ్చు మాటలకు, అబద్ధపు వాగ్దానాలకు లొంగిపోకుండా ఆలోచించగలిగే
తెలివి తేటలను అందించు. తమను సక్రమంగా పరిపాలించగలిగే సరైన జనసేనానాయకుడిని
ఎన్నుకోగలిగే విచక్షణను అనుగ్రహించు, చాలు. ఆపై అక్కడి
ప్రజల సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారమవుతాయి..." అంటూ నారదుడు
ముగించాడు.
వినాయకుడు మొహం వికసించింది. వెంటనే మూషికాన్ని
పిలిచి భూలోక యాత్రకు బయల్దేరాడు.
-సృజన
PUBLISHED ON 28.8.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి