శనివారం, ఆగస్టు 13, 2022

హిర‌ణ్యాక్షుడు బ‌లాదూర్‌!

 


గురూగారూ... కొంప మునిగింది. ఇక నా బొచ్చెలో రాయి ప‌డిన‌ట్టే... అంటూ వ‌గ‌రుస్తూ వచ్చాడు శిష్యుడు.

గురువుగారు నిదానంగా చూసి, “కొంప‌లు ముంచే రాజ‌కీయాలు నేర్చుకుంటూ ఈ గ‌గ్గోలేంట్రా బ‌డుద్ధాయ్‌! ముందు సంగ‌తేంటో చెప్పేడు... అన్నారు.

శిష్యుడు కాసేపు ఆయాస‌ప‌డి తేరుకుని, “ఇంకా ఏం చెప్ప‌మంటారు గురూగారూ! ఈడీ స్పీడు పెంచిందండి. ఒకొక్క‌ళ్ల‌నీ మూసేస్తోందండి. మొన్న ప‌శ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని అరెస్టు చేసిందాండీ? ఇప్పుడు మ‌హారాష్ట్ర రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ వంతండి... ఓ ప‌క్క జాతీయ పార్టీ అధినేత్రిని, ఆమెగారు కొడుకుని కూడా కూర్చోబెట్టి ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధిస్తోందాండీ? మ‌రో ప‌క్క మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాసినో దందాలో హ‌వాలా లావాదేవీల‌పై ఆరా తీస్తోందాండీ? ఇక ఇలాగైతే ఎలాగండీ?” అన్నాడు.

ఒరే... ఆ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ దాని ప‌ని అది చేసుకుంటుంటే మధ్య‌లో నీ వ‌గర్పేంట్రా స‌న్నాసీ? కొంప‌దీసి ఆ పార్థా చ‌ట‌ర్జీ త‌న స్నేహితురాలు అప‌ర్ణా బెన‌ర్జీతో పాటు నీ ఇంట్లో కూడా కొన్ని కోట్లేమైనా దాచాడేంట్రా? లేక‌పోతే ఆ సంజ‌య్ నీక్కూడా ఏమైనా ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడా?” అన్నారు తాపీగా గురువుగారు.

ఊరుకోండి  గురూగారూ! మ‌న‌కంత సీనెక్క‌డిదండీ? నేనింకా మీద‌గ్గ‌ర రాజ‌కీయాలు నేర్చుకునే ద‌శ‌లోనే ఉన్నాను క‌దండీ... ఆ కుంభ‌కోణాల్లో ఒక్క కోణంలో కూడా మ‌న‌ముండ‌మండి...

మ‌రెందుకురా నీకు ఆదుర్దా?”

అదికాదండి గురూగారూ... నా ఆశ‌యం మీకు తెలుసుగా. ఎలాగోలా మీ ద‌గ్గ‌ర నాలుగు నీచ రాజ‌కీయాలు నేర్చుకుని ఎప్ప‌టికోప్పుడు ఓ నేత‌నై... ఇలాంటి ద‌గుల్బాజీ నాయ‌కుల అడుగుజాడ‌ల్లో న‌డిచి, నాలుగు త‌రాల పాటు త‌ర‌గ‌ని ఆస్తులు కూడ‌బెట్టుకోవాల‌నేదే కదండీ నా ఆశ? మ‌రిలాంట‌ప్పుడు ఓ ఈడీ కానీండి, ఓ సీబీఐ కానీండి, మ‌రో దర్యాప్తు సంస్థ కానీండి... ఇలా చ‌ట్టాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతే ఎలాగండీ? ఇలా అన్ని వైపుల నుంచి బిగించేస్తుంటే రేప్పొద్దున్న నేనింకేం కూడ‌బెట్టుకోగ‌ల‌నండీ? పొద్దున్నే పేప‌ర్లు చ‌దివిన ద‌గ్గ‌ర్నుంచి మ‌న‌సు మ‌న‌సులో లేదండి. గుండెల్లోంచి ఒక‌టే బెంగ త‌న్నుకొచ్చేసి మీ ద‌గ్గ‌ర‌కి ప‌రిగెత్తుకుని వ‌చ్చేశానండి... ఆయ్‌!

గురువుగారు చిలిపిగా న‌వ్వి ఒరేయ్‌... ఈ సంగ‌తలా ఉంచుగానీ నీగ్గానీ కొడుకు పుడితే సోమ‌లింగం అని పేరు పెట్ట‌రా... బాగుంటుంది... అన్నారు.

అదేంటి గురూగారూ! నేనోటి మాట్లాడుతుంటే మీరోటి చెబుతున్నారు. మ‌ధ్య‌లో నా కొడుకు సంగ‌తెందుకండీ?  నాకింకా పెళ్లే కాలేద‌ని తెలుసుగా?” అన్నాడు ఉక్రోషంగా.

మ‌రేంలేదురా, నీ ఆత్రం చూస్తుంటే...  ఆలు లేదు  చూలు లేదు... కొడుకు పేరు సోమ‌లింగం అంటారే,   సామెత గుర్తొచ్చిందిరా. నువ్వింకా రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నేలేదు, అప్పుడే అరెస్టుల గురించి బెంబేలు ప‌డ‌తావేంట్రా?”

శిష్యుడు బుంగ‌మూతి పెట్టి, “నా ఆవేద‌న అర్థం చేసుకోకుండా జోకులేస్తారేంటండీ... మీకు నేను బొత్తిగా అలుసైపోయానండి...అన్నాడు.

అలుసూ లేదు, న‌లుసూ లేదురా... ఆత్ర‌గాడికి బుద్ధి మ‌ట్టం అన్న‌ట్టు... ఓన‌మాలు వంట‌బ‌ట్ట‌లేదు కానీ, గుణింతాల గుట్టు చెప్ప‌మ‌న్నాట్ట నీలాంటోడే  వెన‌క‌టికెవ‌డో. అట్టాగుంది నీ కంగారు...

అది కాదు గురూగారూ! నా బాధ‌లో అర్థం లేదంటారా?”

ఆవ‌గింజలో అర‌భాగం లేక‌పోలేద‌నుకో... కానీ ఒరే... ఆ బెంగాల్ ఛ‌టర్జీ, ఈ ముంబై రౌతుజీల అవినీతి ఎంతరా? స‌ముద్రంలో కాకిరెట్టంత‌! ఉద్యోగాల వ్య‌వ‌హారంలో ఆ ఛ‌ట‌ర్జీ ద‌గ్గ‌ర దొరికిన కూసిన్ని కోట్లు, పాత్రాచాల్ ఇళ్ల కేసులో ఈ సంజ‌య్ నొక్కేసిన కాసిన్ని కోట్లు ఏ మూల‌కిరా? నువ్వంటూ నీచ రాజకీయ నేత‌గా ఎదిగావే అనుకో... ఈ చిల్ల‌ర పైస‌ల‌కంట్రా క‌క్కుర్తి ప‌డేది? ఓ ప‌క్క ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దోచేసి, పొరుగు రాష్ట్రాల్లో సైతం కోట‌ల్లాంటి భ‌వనాలు క‌ట్టుకుంటూ ద‌ర్జాగా, ధిలాసాగా, కులాసాగా, విలాసంగా, విచిత్ర విన్యాసాలు చేస్తూ అధికారం చెలాయిస్తున్న నేతాశ్రీల‌ను నువ్వు ఆద‌ర్శంగా పెట్టుకోవాలి కానీ... అబ్బే... ఇలా భ‌య‌ప‌డితే ఎలారా?”

అయ్య‌బాబోయ్‌... ల‌క్ష‌ల కోట్లాండీ? అది కూడా అధికారంలో ఉండ‌గానాండీ? అదెలా సాధ్య‌మండీ? చ‌ట్టం ఊరుకుంటుందేంటండి...

ఒరే... తెలివితేట‌లు ఉండాలే కానీ చ‌ట్టం నీ చుట్టంరా... ఇంకా మాట్టాడితే నీ పెంపుడు కుక్క‌నుకో... దాన్ని దువ్వుతూ పెంచుకోవ‌చ్చు...  కావాలంటే కిట్ట‌ని వాళ్ల‌పైకి ఉసిగొల్ప‌వ‌చ్చు...

అదెలాగండీ... మీరు మ‌రీ అడ్డ‌గోలుగా చెబుతున్నారూ?”

నువ్వు చేసేవే అడ్డ‌గోలు ప‌నులైన‌ప్పుడు చ‌ట్టాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా ఏమార్చాలో, ఎలా అడ్డం పెట్టుకోవాలో తెలిసుండాలి క‌ద‌రా... ముందా తెలివి అల‌వ‌ర్చుకో...

ఆహా... ఇదేదో బాగుంది సార్‌... మ‌రైతే ఆ సూత్రాలేంటో, చిట్కాలేంటో, కిటుకులేంటో కాస్త చెబుదురూ...

అన్నీ చెప్ప‌డం కాదురా బ‌డుద్ధాయ్‌... కాస్త నీ చుట్టూ ప‌రికించి చూసుకుని, అలాంటి వాళ్లని గ‌మ‌నించి, వాళ్ల‌ని ఆద‌ర్శంగా పెట్టుకుని, వాళ్లు చేసే అడ్డ‌గోలు ప‌నుల అడుగుజాడ‌ల్లో దూసుకుపోవాలి...

అంతటి అవ‌గాహ‌న‌, తెలివి ఉంటే... ఇలా మీ ద‌గ్గ‌రే ఎందుకు ప‌డి ఉంటాను సార్‌... ఈ పాటికి ఓ చిన్న‌పాటి నీచుడినై నిగ్గుతేలేవాడిని క‌దా? కాబ‌ట్టి మీరే ఆ మ‌హానుభావులెవ‌రో, వాళ్ల ప‌నులేంటో... కాస్త అర‌టి పండు ఒలిచిన‌ట్టు చెబుదురూ పుణ్య‌ముంటుంది...

వార్నీ ఆ ప‌ని కూడా నా నెత్తి మీదే పెట్టావ్‌? స‌రే... శిష్యుడిగా చేర్చుకున్నాక త‌ప్పుతుందా? చెవులు రిక్కించుకుని శ్ర‌ద్ధ‌గా విను.  నీ ప‌రిస‌రాల్లో ఏం జ‌రుగుతోందో ఓసారి తేరిపారి చూస్తే  ప్ర‌కృతి సంప‌ద‌ను సైతం పిండుకుంటున్న ప్ర‌బుద్ధుడు క‌నిపిస్తాడు. ఇసుక రేణువుల్ని కాసులుగా మ‌లుచుకుంటున్న మాయ‌ల మ‌రాఠీ క‌నిపిస్తాడు.  కొండ‌ల్ని కొల్ల‌గొడుతున్న కిలాడీ క‌నిపిస్తాడు. నీటి వ‌న‌రుల నుంచి నిధులు నింపుకుంటున్న నీచుడు క‌నిపిస్తాడు. ప్ర‌జాధ‌నాన్ని పీల్చేస్తున్న ప్ర‌ముఖుడు క‌నిపిస్తాడు...

ఆహా... ఓహో... ఆ మ‌హానుభావుడెవ‌రో అర్థ‌మైందండి. కానీ గురూగారూ, కుర్చీలో కులాసాగా కూర్చుని కొబ్బ‌రిబొండంలో నీళ్ల‌ని స్ట్రా పెట్టుకుని పీల్చేస్తున్నంత చులాగ్గా ఖ‌జానా కొల్ల‌గొడుతుంటే చ‌ట్టం ఎందుక‌ని చూస్తూ ఊరుకుందంటారు?”

ఎందుకంటే... చ‌ట్టం చ‌ట్రంలోనే చ‌క్క‌బెడుతున్నాడు కాబ‌ట్టి. పైకి అంతా చ‌ట్ట‌బ‌ద్ధంగా సాగుతున్న‌ట్టు క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు కాబ‌ట్టి. చ‌ట్టానికి అతీత‌మైన, అద్వితీయ‌మైన‌, అమోఘ‌మైన‌, అసాధార‌ణ‌మైన‌, అద్భుత‌మైన తెలివితేట‌ల‌తో అధికారాన్ని ఉప‌యోగించుకుంటున్నాడు కాబ‌ట్టి. అర్థ‌మైందా?”

అబ్బే... కాలేదండి. మీరు నా మ‌ట్టి బుర్ర‌ని దృష్టిలో పెట్టుకుని కాస్త విడ‌మ‌రిచి చెప్పాల్సిందే...

అయితే శ్ర‌ద్ధ‌గా విని అఘోరించు. నీ ప‌ర‌గ‌ణాలో అంత‌కు ముందు కూడా ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కానీ అది ల‌భించే విధానాలు మారిపోయాయి క‌దా? రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని త‌వ్వుకునే కాంట్రాక్టుకు టెండ‌ర్లు పిలిచారు. అది చ‌ట్టబ‌ద్ధ‌మే క‌దా? అందులో ఒక‌రిని ఎంచుకుని వారికి ఆ ప‌ని అప్ప‌గించారు. అదీ అధికారికంగానే క‌దా? కానీ వాళ్లు మ‌రొక‌రికి స‌బ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇది కూడా కాద‌న‌డానికి లేనిదే కదా? కానీ ఆ స‌బ్ కాంట్రాక్టు ద్వారా సీన్‌లోకి వ‌చ్చిందెవ‌రు? అంత‌వ‌ర‌కు అయిపూ అజా లేని ఓ అస్మ‌దీయ కంపెనీ వారు.  టెండ‌ర్లు పిల‌వ‌డానికి ముందే పుట్టుకొచ్చిన పుట్టగొడుగు కంపెనీ వారు. మ‌రిప్పుడు వాళ్లు చేస్తున్న‌దేమిటి? అడ్డ‌గోలు దోపిడీ. అంతా ఆన్‌లైన్లోనే పార‌ద‌ర్శ‌కంగా ఇసుక‌ను బుక్ చేసుకుని పొంద‌వ‌చ్చంటూ  ఊద‌రగొడుతూ ఓ ప‌క్క ప్రచారం చేసుకుంటుంటే, వాస్త‌వానికి ఏం జ‌రుగుతోంది? ఎప్పుడు చూసినా స‌ర్వ‌ర్ బిజీనే. కానీ ఇసుక ర‌వాణా ఆగుతోందా? య‌ధావిధిగా జ‌రుగుతోంది. అంటే అర్జంటుగా ఇసుక కావ‌ల‌సిన వాళ్లు అధికంగా చెల్లిస్తే హాయిగా లోడ్ ఇంటికొస్తోంద‌న్న‌మాట‌. పోనీ బిల్లులు స‌రిగా ఉన్నాయా అంటే అదీ అరకొర‌గానే. చిత్తు కాగితాల మీద గీకేసి చేతిలో పెడుతుంటే... ఇసుక దొరికింద‌దే చాల‌నుకుంటూ కొన్న‌వాళ్లు కిమ్మ‌న‌కుండా ఊరుకుంటున్నారు. అంటే ఏంటి దాన‌ర్థం? ఇలా అన‌ధికారికంగా, అధికంగా వ‌సూల‌వుతున్న కోట్లాది రూపాయ‌ల సొమ్ము ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేర‌న‌ట్టే క‌దా? మ‌రి ఇలా స‌మ‌కూరుతున్న ప్ర‌జాధ‌నం ఎక్క‌డికి పోతోంది? మొద‌ట అస్మ‌దీయుల జేబుల్లోకి చేరి, ఆపై వాటాలుగా మారి అధికారం వెల‌గ‌బెడుతున్న వారి ద‌గ్గ‌ర‌కే చుట్టుతిరిగి వ‌స్తోంద‌ని ఎవ‌రికైనా అర్థం అవుతోంది క‌దా? అదిగో... ఇలాంటి అడ్డ‌గోలు తెలివితేట‌ల్నే నువ్వు పెంచుకోవాలి. తెలిసిందా?”

వార్నాయ‌నో... ఇసుక నుంచి కాసులు రాల్చుకోవ‌డ‌మంటే  ఇద‌న్న‌మాట‌...

ఆగు అప్పుడే గుడ్లు తేలేయ‌కు. ఇప్పుడు గ‌నుల ద‌గ్గ‌ర‌కి వ‌ద్దాం. నీ ప‌ర‌గ‌ణాలో ఉన్న కొండ‌ల్లో, గ‌నుల్లో అమూల్య‌మైన ఖ‌నిజాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ‌నులు త‌వ్వుకోడానికి, ఖ‌నిజాలు వెలికి తీయ‌డానికి చ‌ట్టబ‌ద్దంగానే అనుమ‌తులు ఉంటాయి. అయితే పైకి ఇచ్చే అనుమ‌తి వేర‌యితే, లోప‌ల త‌వ్వుకునే ఖ‌నిజం వేరు. ఏ సున్న‌పురాయి త‌వ్వ‌కానికో ఇచ్చిన అనుమ‌తిని అడ్డం పెట్టుకుని ప‌ని మొద‌లు పెట్టి అతి విలువైన ఖ‌నిజాల‌ను వెలికితీసి హాయిగా ర‌వాణా చేసుకుంటారు. మ‌రి ఇదంతా చ‌ట్ట‌బ‌ద్ధ‌మే క‌దా? కానీ అధికార పీఠం మీద నువ్వు బాసింప‌ట్టు వేసుకుని కూర్చున్నాక నువ్వు అనుకున్న వాడికే అనుమ‌తులు వ‌స్తాయి క‌దా? ఆ అనుమ‌తి పొందిన వాడు నీకు ఇవ్వాల్సింది స‌మ‌ర్పించుకుంటాడు క‌దా? మరి ఇలాంటి అసాధార‌ణ‌మైన కిటుకుల్నే నువ్వు నేర్చుకోవాలి అర్థ‌మైందా?”

అయ్య‌బాబోయ్‌... కొండ‌ల్ని కొల్ల‌గొట్ట‌డ‌మంటే ఇద‌న్న‌మాట‌...

ఇక్క‌డితో అయిపోలేదురా... నీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వడం చ‌ట్ట బ‌ద్ద‌మే క‌దా? కానీ ఆ కాంట్రాక్టులు ఎవ‌రికి ద‌క్కుతున్నాయి? అయిన‌వారికే. మ‌రి ఆపై ఆ ప్రాజెక్టుల అంచ‌నాలు సంత‌కాల నాటి క‌న్నా అంత‌కంత‌కు పెరుగుతాయి.  అలా పెరిగిన అంచ‌నాలు అధికారికంగానే శాంక్ష‌న్ అయిపోతాయి. కానీ జ‌రిగిన ప‌నికీ, పెరిగిన అంచ‌నాకీ మ‌ధ్య వ్య‌త్యాసంగా నిలిచే కోటానుకోట్ల రూపాయ‌లు ఎక్క‌డికి వెళ‌తాయో అర్థం చేసుకుంటే అస‌లు కిటుకేంటో తేలిగ్గానే తెలుస్తుంది. ఇలా ఒక‌టా రెండా... అభివృద్ధి పేరుతో నువ్వు ఏ ప‌ని చేపట్టినా, దానికి న‌వ్వు కేటాయించే ప్రజాధ‌నం చుట్టు తిరిగి నీ ద‌గ్గ‌రికే వ‌స్తుందన్న మాటే కదా? ఇప్ప‌టికైనా బోధ‌ప‌డిందా?”

బోధ‌ప‌డ్డ‌మేంటండి బాబూ... క‌ళ్లు గిర్రున  తిరిగిపోతుంటేను. అప్పుడెప్పుడో ఓ రాక్ష‌సుడు ఏకంగా భూమిని చుట్ట‌బెట్టేసి, చంక‌లో పెట్ట‌కుని చ‌క్క‌పోయాడ‌ని మా బామ్మ పురాణం చెప్పేదండి. ఇప్పుడు చ‌ట్టాన్ని చుట్టంగా చేసుకుని, లొసుగుల్ని ఒడుపుగా తెలుసుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, హోల్సేలుగా హోలాంధ్రానే  అడ్డ‌గోలుగా అయిన‌కాడికి దుళ్ల‌గొడుతున్న ఈ అధినేత ముందు, అల‌నాటి హిర‌ణ్యాక్షుడు కూడా బలాదూర్ అనిపిస్తోందండి!

బాగా చెప్పావురా... ఇక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 10.8.22 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి