''అనగనగా ఒక రాజుగార్రా...'' అన్నారు గురువుగారు, శిష్యుడు వచ్చి కూర్చోగానే.
''ఓహో... ఇవాళ కథతో మొదలు పెట్టారన్నమాట...'' అంటూ ఉత్సాహంగా పుస్తకం తెరిచాడు శిష్యుడు.
''తెరవాల్సింది పుస్తకం కాదురా... మస్తకం.
ముందు విను. ఆ తర్వాత రాసుకుందువుగాని...''
అన్నారు గురువుగారు.
''సరే సార్... చెప్పండి'' అంటూ పెన్ను జేబులో పెట్టుకుని
పుస్తకం మూసేశాడు శిష్యుడు.
''ఏం?... ఆ రాజుగారికి ఓ విచిత్రమైన కోరిక కలిగింది. తన
పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ఆ పళంగా మంత్రితో సహా
మారువేషం వేసుకుని దేశాటనకి బయల్దేరారు. సామాన్యుల్లా సత్రాల్లో బస చేశారు. బాటసారుల్లాగా
నలుగురితో కలిసి నడిచారు. చెట్ల కింద, వంతెనల దగ్గర, కూడళ్లలోను ప్రజలతో కలిసిపోయి, వాళ్లంతా ఏం చెప్పుకుంటున్నారో
విన్నారు. తాము పొరుగు రాజ్యం పౌరులమనీ, యాత్రలకి వచ్చామనీ మాట
కలిపారు. మీ దేశంలో పాలనెలా ఉందని అడుగుతూ వాకబు చేశారు. 'రహదారులు
బాలేవండీ... అబ్బే...' అన్నారు కొందరు. 'పన్నులు ఎక్కువండిక్కడ...' అంటూ నిట్టూర్చారు కొందరు.
'రైతుల సంగతి పట్టదండి బాబూ మా రాజుగారికి...' అంటూ ఏకరువు పెట్టారు ఇంకొందరు. 'రాజాధికారులతో చస్తన్నామంటే
నమ్మండి... ప్రతి పనికీ లంచమే. చేయి తడపందే కాలు కదపరు..' అంటూ
గుసగుసలాడారు చాలా మంది. 'ఇక అమాత్యుల సంగతి చెప్పక్కర్లేదండి...
ఒక్కడికి తీరూతెన్నూ లేదండి...' అన్నారు చాలామంది. ఇలా రాజుగారు,
మంత్రి గారు కలిసి తమ పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లేంటో తెలుసుకోగలిగారు.
తర్వాత దేశాటన ముగించి రాజధాని చేరుకున్నారు...'' అంటూ ఆగారు
గురువుగారు.
''అప్పుడేమైందండీ?'' అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా.
''తాత పక్కలో పడుకుని కథ వింటున్న మనవడిలా
అడిగితే ఎలారా? నా
దగ్గర ఇన్నాళ్ల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నావు కదా? మరి
ఆ రాజుగారు ఏం చేయాలో, ఏం చేసి ఉంటారో నువ్వు ఊహించు...''
అనడిగారు గురువుగారు పడక్కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటూ.
''ఓహో... ఇది కూడా ఓ రకమైన పాఠమేనన్నమాట.
ఇవాళ సరదాగా కథ చెప్పి పంపేస్తారనుకున్నాను. మధ్యలో ఇలా పరీక్ష పెడతారనుకోలేదండి...''
''ఏడిశావ్‌గానీ... ముందు సమాధానం చెప్పు...''
శిష్యుడు బుర్రగోక్కున్నాడు. కాసేపు ఆలోచించి చెప్పాడు.
''ఏముందండీ? మారు వేషంలో దేశాటన చేసిన రాజుగారికి
తన పరిపాలన అస్సలు బాగా లేదని అర్థమైపోయి ఉంటుందండి. వెంటనే ఆ లోపాలన్నీ సరిదిద్దుకుని ఉంటారండి. విన్న
సమస్యలన్నీ పరిష్కరించేసి ఉంటారండి. లంచగొండి అధికారుల భరతం పట్టి ఉంటారండి. ప్రజల
చేత మామంచి మారాజు అనిపించుకుని ఉంటారండి.
అంతేనాండీ?''
''అంతే...అంతే... ఇంకేముందీ? కథ కంచికి. నువ్వు ఇంటికి. ఇక
పోయిరా... నువ్వు చందమామ కథలు చదువుకోడానికి తప్ప ఎందుకూ పనికిరావని తేలిపోయిందిరా
బడుద్ధాయ్. బయల్దేరు...'' అన్నారు గురువుగారు కోపంగా.
శిష్యుడు తెల్ల మొహం వేశాడు.
''అయ్యబాబోయ్ గురూగారూ... నేనేమన్నా తప్పు
చెప్పానాండీ, అంత మాటనేశారు?
పోనీ మీరే చెప్పండి. ఆ రాజుగారు ఏం చేశారు?''
గురువుగారు కథ కొనసాగించారు.
''వెంటనే ఆ రాజుగారు సైన్యాధ్యక్షుడిని పిలిపించారు.
రక్షకభట ఉన్నతాధికారులను సమావేశ పరిచారు. ఆపై తన దేశాటనలో ఎక్కడెక్కడ, ఎవరెవరు తన పరిపాలనలో లోపాలు చెప్పారో,
విమర్శించారో, సమస్యలు ఎత్తి చూపించారో వాళ్లందరి
ఆచూకీ బయటపెట్టారు. దాంతో ఆ రక్షక భటులు, సైనికులు ఊళ్ల మీద పడ్డారు.
వాళ్లందరినీ పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. తీసుకొచ్చి ఖైదు చేయించారు. కొరడాలతో
కొట్టించారు. అదేమని అడిగిన వారి మక్కెలిరగదన్నించారు. సమస్యలు పరిష్కరించలేదు సరికదా,
వాటి పేరెత్తిన వారిని కొరతవేయించారు. బాగుందా ?''
''చెత్తలా ఉందండి. ఇదేం కథండీ? అసలా రాజెవడండీ బాబూ? ఆడికసలు బుద్ధుందా అని? అయినా ఈ కథ నుంచి నేర్చుకోవలసిన
నీతి ఏముందండీ?'' అన్నాడు శిష్యుడు ఆవేశంగా.
''కథలో నీతి వెతుక్కునే స్థితిలో ఉంటే, ఇక నువ్వు రాజకీయాలకి ఏం పనికొస్తావురా?
నువ్వు వెతుక్కోవలసింది అవినీతిని. అసలా మాటకొస్తే ఇది కథని నీకెవడు
చెప్పాడు?''
''కథ కాదాండీ? మరైతే వాస్తవమాండీ? అయితే ఎవడా పిచ్చిమారాజు గురూగారూ?''
''కాస్త కళ్లెట్టుకుని చుట్టూ ఓసారి చూడరా.
ఆ రాజుగారి ప్రతినిధి నీ పరగణాలోనే లేడూ?
మరిక్కడ జరుగుతున్నది కూడా ఇదే కాదూ? చుట్టూ చూస్తే
అన్నీ సమస్యలేనా? పరిష్కరించే నాధుడున్నాడా? అసలు వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోలేదూ? అరాచకం రాజ్యమేలడం
లేదూ? విసిగిపోయి ఎవడైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం
లేదూ? జనం తరఫున మాట్లాడడానికి ఏ మనసున్న నాయకుడో బయల్దేరితే
ఏం జరుగుతోంది? ఆ నాయకుడికి అడుగడుగునా ఆటంకాలు కల్పించే కఠోర
వాస్తవం కనిపించడంలేదూ? లేనిపోని నిబంధనలు, ఆంక్షలు పెట్టడం లేదూ? అంతేనా... ఆ నాయకుడి సభ జరిగిన
ఊళ్లపై కక్ష కట్టడం లేదూ? అప్పటికప్పుడు అభివృద్ధి పేరు చెప్పి
ఇళ్లకు ఇళ్లు కూలగొట్టడం లేదూ? మరి ఈ రాజునేమంటావురా?''
''ఇంకేమంటానండీ... రాజాధముడు. రాజదరిద్రుడు.
అస్తవ్యస్త అరాచక పరిపాలనా దురంధర దౌర్భాగ్యుడు. నాకు కోపం కట్టలు తెంచుకుంటోందండి...
ఇంతకీ ఈ కథకాని కథ నాకెందుకు చెప్పారో కాస్త
చెప్పండి...''
''ఎందుకేంట్రా... రాజకీయ సూత్రాలు నేర్చుకోడానికే....'
''ఇవేం సూత్రాలు గురూగారూ? నాకేం అర్థం కావడం లేదు,
మీరే చెప్పండి...''
''అధికారం చేతికందాక, దాన్ని చెలాయించడం కాదురా... దాన్ని
సుస్థిరం చేసుకోడానికి, ఎలాంటి అస్థిర పరిస్థితులనైనా కల్పించడానికి
వెనకాడకూడదని నేర్చుకోవాలి. ఎలాంటి అసంతృప్తి ఉన్నా నోరెత్తడానికి కూడా జనం భయపడే వాతావరణం
సృష్టించాలి. ఎవరూ ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకోడానికి జంకేలా చేయడానికి ఎంతకైనా తెగించాలి...
ఏమాత్రం వ్యతిరేకత తలెత్తినా దాన్ని చెప్పుతో నలిపేసేంతలా దౌర్జన్యకాండకు దిగగలిగే
తెంపరితనం అలవర్చుకోవాలి. ఇవిగో... ఇవన్నీ చెప్పడానికే నీకివాళ పాఠం 'అనగనగా ఒక రాజుగారితో' మొదలెట్టానన్నమాట... అర్థమైందా?''
''అర్థమైంది గురూగారూ. కానీ మీరు చెప్పిన
రాజుగారు మారువేషంలో దేశాటన చేశారండి. మరీ రాజుగారు అలా చేయడం లేదు కదండీ?''
''ఈయనకి మారువేషాలు ఎందుకురా, అన్నీ తారుమారు వేషాలే అయినప్పుడు?
అసలు వేషంతోనే అరాచక దేశాటనలు చేయగలడు. మొన్నటికి మొన్న ఈయనగారు చేసిన
పర్యటన సందర్భంగా ఎంత గందరగోళం జరిగిందో గమనించలేదా?''
''అవునండోయ్... గుర్తొచ్చింది. అసలీయన పర్యటనలంటేనే
జనం గగ్గోలు పెడుతున్నారండి. ఈయన సభకు బయల్దేరితే అంతా రభసేనండి. ఆయనగారి దృష్టిలో
పడడానికి అధికారులు మితిమీరి, మతిమాలి మరీ 'అతి' చేస్తున్నారండి.
అసలే అసమ్మతితో ఉన్న జనం ఈయనగారొస్తున్నారంటే ఆవులిస్తూ... 'వస్తే ఏంటంట?' అనుకుంటారనుకున్నారో ఏంటో కానీ... ఇంటింటికీ తిరిగి మరీ ఆహ్వాన పత్రాలు పంపిణీ
చేశారండి. ఆయన సభకు రాకపోతే ఏం జరుగుతుందో ఏందో అనుకునేంతగా జనాల్లో భయం పెంచుతున్నారండి.
దారిలో ఆయనగారి వాహనాలకు అడ్డొచ్చినా రాకపోయినా పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను నరికేసి
హంగామా చేస్తున్నారండి. నీడనిచ్చే పచ్చని చెట్లను కూడా కొట్టేస్తున్నారండి. దారి పొడుగూతా ఏ గోడల్నీ వదలలేదండి.
ఆటన్నింటి మీదా రంగులేసేసి, బొమ్మలు గట్రా వేసేసి, ఈయనగారి గొప్పలన్నీ రాసేస్తున్నారండి. అంతేకాదండి బాబూ... కాలేజీలు,
విద్యాసంస్థలను కూడా మూయించేత్తన్నారండి. స్కూళ్ల పిల్లల్ని తీసుకొచ్చే
వాహనాలన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆటిలో జనాన్ని బలవంతగా తరలిస్తున్నారండి. మార్గమధ్యంలో
ఉండే షాపులు, వ్యాపార సంస్థల షన్‌షేడ్లు గట్రా పీకి పారేస్తున్నారండి.
రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల వాళ్లని కూడా తరిమి కొట్టేస్తున్నారండి.
దాంతో పాపం వాళ్ల ఉపాధికి, వ్యాపారాలకి గండి పడి నష్టాల పాలవుతున్నారండి.
అయ్యబాబోయ్ ఇదెక్కడి పర్యటనరా బాబూ అనుకునేంతగా అతలాకుతలం చేసేస్తున్నారండి బాబూ...''
''మరి చూశావురా... నేను చెప్పిన రాజుగారి
దేశాటనకి, ఈయనగారి
పర్యటనకి ఎంత పోలిక ఉందో? ఇంతకీ ఈ సమకాలీన, సమస్యాత్మక, సర్వసత్తాక, సర్వోత్కృష్ట,
సర్వ నికృష్ట, సాహసోపేత, భయభ్రాంత సహిత, బీభత్స భయానక పర్యటనలు చేసే ఈ రాజులుంగారిని
తల్చుకుంటే నీకేమనిపిస్తోందో చెప్పు మరి...''
''రాజూ... వెడలే... రభసకు... టడట్టడాయ్!
ప్రజలూ... బెదిరే... గొడవకు... టడట్టడాయ్!... అనిపిస్తోందండి. ఆయ్!''
''సెభాష్ సరిగ్గా చెప్పావు. పోయిరా''
-సృజన
PUBLISHED ON 25.11.2022 on JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి