''న...న... నమస్కారం సార్...''
''ఏందయ్యా సెక్రట్రీ... ఇంత పొద్దుటేలే వచ్చావేంటి?''
''స...స.. సార్... మీరేం కంగారు పడకండి... నిబ్బరంగా ఉండండి... ఇక్కడికి
బయల్దేరే ముందే అంబులెన్స్‌కి కూడా ఫోన్ చేశానండి... కాసేపట్లో డాక్టర్ గారు కూడా
వచ్చేస్తారండి...''
''అంబులెన్సేంటి? డాక్టరేంటయ్యా? ఇంతకీ నీ మొహం నిండా ఆ చెమట్లేంటి? ఆరోగ్యం బానే ఉందా?''
''అదేంటి సార్? మీరీపాటికి ఏ గుండె దడో వచ్చి
కుప్పకూలిపోయుంటారని ఆదరా బాదరా నేను పరిగెత్తుకొస్తే మీరు నన్ను పరామర్శిస్తున్నారు?''
''నాకు గుండె దడ రావడమేంటయ్యా? నీ గొడవేంటసలు?''
''అది కాద్సార్... పేపర్లింకా చూడలేదాండీ?''
''చూశానే? పొద్దున్నే మొత్తం చదివేశాను... ఏం?''
''మరి హెడ్‌లైన్స్ చదివారాండీ?''
''హెడ్‌లైన్ న్యూస్ కాకపోతే, హెడ్ లెస్ న్యూసెన్స్ చదువుతానేంటయ్యా?
ముందు సంగతేంటో చెప్పేడు, ఊరికే నస పెట్టక...''
''అదే సార్... ఆ ఈడీ గాళ్లు మన కూపీ మొత్తం
లాగినట్టున్నారు కదండీ? అరెస్టులు కూడా మొదలెట్టారు. మన పార్టీ ఎంపీ అల్లుడి
సోదరుడిని అరెస్టు చేసి రిమాండ్ కి కూడా
పంపారని పేపర్లలో చదివి ఉన్నపళంగా ఆదరాబాదరా పరిగెట్టుకు వచ్చానండి. మన ఎంపీ అల్లుడుంగారి
చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది కదండీ?''
''ఓ... అదా... అయితే ఏంటయ్యా?''
''అయ్యబాబోయ్... అంత నిదానంగా ఎలా ఉన్నారండీ
బాబూ? తీగ లాగితే మరి
డొంకంతా కదిలినట్టే కదండీ? మన రాష్ట్రంలోనే కాదు, ఆఖరికి దేశం మొత్తం మీద కూడా మద్యం వ్యాపారాన్ని మనమూ, మన మనుషులూ ఎలా గుప్పెట్లో పెట్టేసుకున్నామో బయట పడిపోయింది కదండీ?
ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయో లెక్కలు చెబుతోందండి
ఈడీ. మరా లెక్కన మన పరువేంగాను? ప్రజల్లో మన ఇమేంజేంగాను?
జనంగానీ తమరి అసలు స్వరూపం పసిగడితే మన అధికారం ఏంగాను? అసలే ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి కదండీ? అందుకే తెగ బెంగొచ్చేసిందండి
బాబూ. ఇప్పటికింకా నా గుండె దడదడా కొట్టుకుంటూనే ఉందండి...''
''హ...హ్హ...హ...హ్హా! అదా సంగతి? వార్నీ... ఒట్టి కంగారు గొడ్డులాగున్నావయ్యా.
మనమేంటి, మన యవ్వారమేంటి, మన జమానా ఇజ్జతేంటి,
మనవాడే పవర్ గేమ్ పసేంటి... ఇయ్యన్నీ తెలిసి కూడా ఇలా అయినదానికీ,
కానిదానికీ బెంబేలెత్తితే ఎలాగయ్యా?''
''సార్... మీరెన్నిచెప్పండి. మీకున్న ధిలాసా
నాకుండదండి. మీ సెక్రటరీగా నేను చాలా దూరం ఆలోచించాలి కదండీ? ఎప్పటికప్పుడు మీకు నిజాలు చెప్పి,
అవసరమైతే హెచ్చరించి మరీ పరిస్థితిని విడమర్చాల్సిన బాధ్యత నాదే కదండీ?
అందుచేతనే ఇంత కంగారండి...''
''సర్లేవయ్యా... నువ్వు బాధ్యతలు గట్రా తెలిసిన
నమ్మకస్తుడవని గుర్తించాన్లేవయ్యా... ఇంతకీ ఏంటంటావిప్పుడు?''
''ఏం లేద్సార్... దేశం మొత్తం మీద జరిగే
మద్యం వ్యాపారాన్ని సగానికి సగం మనవే చేజిక్కించుకున్నామని ఈడీ వాసన పట్టేసిందండి.
ఇదిక్కడితో ఆగేలా లేదండి. అటు దేశంలోను,
ఇటు రాష్ట్రంలోను మన లోపాయికారీ వ్యవహారాల గుట్టు మొత్తం బట్టబయలయ్యే
అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అరెస్టయినోడు, లోగడ తమరి మీదున్న
కేసుల్లో కూడా నిందితుడే కదండి మరి? ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని
చెప్పడానికే వచ్చానండి...''
''బాగుందయ్యా సెక్రట్రీ... నీ అంకిత భావం
చూస్తుంటే తెగ ముచ్చటేస్తోందయ్యా... వీలుంటే నిన్ను కూడా ప్రభుత్వానికి నూట యాభయ్యారో ఏంటో... ఆ లెక్క గుర్తులేదు కానీ... మరో సలహాదారుగా
ఆర్డరిచ్చేసి, క్యాబినెట్
హోదా గట్రా కల్పించేయాలనుందయ్యా... ఏమంటావ్?''
''అయ్యా... ఆ సంగతి తర్వాత ఆలోచిద్దామండి.
అదెలాగూ తమరి చేతిలో పనే కదండీ... మరింతకీ ఈ వ్యవహారంలో ఏం చేద్దామని సెలవు?''
''చూడు సెక్రట్రీ... నీకో సంగతి చెబుతాను
బాగా గుర్తెట్టుకో. మనం చేసేవన్నీ యదవ పన్లయినప్పుడు, అడపాదడపా ఒకటో రెండో బయటపడకుంటా
ఎట్టా ఉంటాయి చెప్పు? పడనీ... దాందేముంది? నువ్వన్నట్టు తీగ లాగితే డొంక కదులుతుందన్నది నిజమే కానీ, మనది వట్టి డొంక కాదయ్యా... అడుగడుగునా అల్లుకుపోయిన అవినీతి అడవి. అక్రమాల
అరణ్యం. ఇట్టాంటి చిన్న చిన్న తీగలట్టుకుని లాగితే అవే పుటుక్కున తెగుతాయి కానీ...
మనకి మాత్రం ఢోకా లేదయ్యా... అర్థమైందా?''
''ఆహా... ఎంత నిబ్బరం? ఎంత భరోసా? ఇన్నేసి అడ్డగోలు పనులు చేస్తూ కూడా అంత కులాసాగా ఎలా ఉంటారో అంతుపట్టడం లేదండి...''
''చాలా సింపులయ్యా... నీ సంగతేమో కానీ, నాకు మాత్రం మన చట్టం మీద,
దాని పనితీరు మీద వల్లమాలిన అపనమ్మకమయ్యా... ఈ కేసులోపట్టాన తెమిలేవి
కావు, ఏడ్చేవీ కావు. ఊరికే హడావుడి చేస్తారంతే...''
''సార్... అలా మరీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో
ఎలా ఉంటారండీ? ఈడీ
కావచ్చు, సీబీఐ కావచ్చు, మరో యాంటీ కరెప్షన్
బ్యూరో కావచ్చు, మనీ ల్యాండరింగ్ మోనటరింగ్ బాడీ కావచ్చు...
ఎవరైనా ఎక్కడైనా ఏ కొంచెం ఆధారాలు సేకరించగలిగినా... తమరి అక్రమ లావాదేవీలన్నీ నడిరోడ్డున
పడతాయి కదండీ... అదే నా బెంగ...''
''ఓరెర్రి సెక్రట్రీ... నిన్ను చూస్తుంటే
జాలేస్తోందయ్యా... పొద్దున్నే కాఫీ కూడా తాగావో లేదో, నా గురించే ఆదుర్దా పడుతూ,
కంగారు పడుతూ, బెంబేలు పడుతూ, కలవర పడుతూ, పరిగెట్టుకుని పడుతూ లేస్తూ వచ్చావు కాబట్టి... నాకు బాగా నమ్మకస్తుడివి కాబట్టి... అన్నింటినీ
మించి నా సెక్రట్రీవి కాబట్టి... ఇక ముందు ఇలా చీటికీ మాటికీ ఉరుక్కుంటూ వచ్చి నన్ను
ఊదరగొట్టకుండా ఉండడానికి నీకు మొదటి నుంచీ మొత్తం విడమరిచి చెబుతానయ్యా... అలా స్థిమితంగా
కూర్చుని, చెవులు రిక్కించి వినుకో... సరేనా?''
''ఆనందంగా సార్! తమరంతట తమరు... తమరు రచించి, సాగించి, నడిపించి, సాధించి, తరించిన అవినీతి
పురాణాన్ని చెబుతానంటే అంతకన్నా అదృష్టమేముంటుందండీ? అదంతా నా
సుకృతమనుకుంటాను. నా జన్మ ధన్యమైందనుకుంటాను. చెప్పండి సార్...''
''ఏం లేదయ్యా... ఇదంతా ఒక ఆట... నిజం చెప్పాలంటే
తొండాట. అవినీతి అడ్డాట. అక్రమాట దొడ్డాట. దీనికి ఈ పత్రికల వాళ్లు లేరూ? వాళ్లొక మంచి పేరు కూడా పెట్టారయ్యా.
దాన్ని 'క్విడ్ ప్రో కో' అంటారు. అంటే
తెలుగులో 'నీకిది... నాకిది' అంటారంట. అదీ
ఆళ్లే చెప్పార్లే. ఇంతకీ ఇది ఆడాలంటే నీ దగ్గర అధికారం ఉండాలయ్యా. అంటే... పేకాట ఆడాలంటే
ముందు డబ్బులుండాలి చూడు, అట్టాగన్నమాట. అధికారం కానీ చేతిలో
ఉండి, నీ మనసులో నీతి, నిజాయితీ అనేవి మచ్చుకి
కూడా లేవనుకో... ఈ ఆట భలే రక్తి కడుతుందయ్యా.
ఇప్పుడంటే మనకి అధికారం ఉంది కానీ... ఒకప్పుడు మనకి అది అందని ద్రాక్ష పండేలే.
నాకో సొంత ఇల్లంటూ కూడా ఉండేది కాదు. ఏదో ఓ చిన్న కరెంటు కంపెనీతో కాలక్షేపం చేస్తుండేవాడిని.
మా నాన్న కూడా పాపం... ఇంచుమించు అంతేలే. ఏదో అసెంబ్లీలోకి కాలు మోపే వీలు చిక్కింది
కాబట్టి... అప్పట్లో ప్రతిపక్షంలో ఉంటూ చీటికీ మాటికీ గొంతు చించుకుంటూ ఉండేవాడు. ఆ
తర్వాత ఆయనో ఉపాయం కనిపెట్టాడు. అధికారం కావాలంటే ఏం కావాలి? ప్రజల మద్దతు కావాలవునా? దాని కోసం ఆయన ఊరూ వాడా చెప్పులరిగేలా
తిరిగాడనుకో. ఎన్ని చెప్పులు అరిగిపోయాయో తెలీదు కానీ... చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకుండా
చెప్పుకుంటూ చెప్పులేసుకుని తిరిగాడు. మొత్తం మీద జనం ఆయన చెప్పులు చూసో, ఆయన చెప్పినవి నమ్మో... ఓట్లు గుద్దేశారు. ఇంకేముందీ? ఆయన అధికార సింహాసనం మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. దాంతో...మనం యువరాజులమైపోయాం.
అప్పుడు మొదలెట్టానయ్యా... ఈ 'క్విడ్ ప్రో కో' ఆట. అర్థమవుతోందా?''
''మహా రంజుగా సార్... ఇంతకీ ఈ ఆట ఎలా ఆడార్సార్?''
''ఏముందయ్యా... అధికారం నాన్నది. ఆటంతా మనది.
రాష్ట్రంలో ఉండే భూములు, గనులు, సెజ్‌లు పెద్ద పెద్ద కంపెనీలకి రాసిచ్చేట్టూ...
అలా రాసివ్వాలంటే ఆళ్లు నా కంపెనీలోకి నిధులు బదలాయించేట్టూ... ఆట మొదలైందయ్యా...''
''అయ్యా... మాటకడ్డొచ్చాననుకోనంటే, ఓ చిన్న సందేహం...''
''అడగవయ్యా... పురాణం వినేప్పుడు చిన్నదైనా
పెద్దదైనా అడిగే తీరాల... తెలుసుకోవాల..''
''అహ... ఏంలేద్సార్. ఎంత అధికారం చేతిలో
ఉన్నా వందలాది, వేలాది
ఎకరాలు రాసిచ్చేయడం ఎలా కుదురుతుందా అని...?''
''ఓ అదా నీ అనుమానం? పేకాట్లో జోకరు తెలుసుగా?
అందులో ఒకటో, రెండో జోకర్లుంటే... ఈ అధికారం అడ్డాటలో
ప్రజలే జోకర్లయ్యా... ఆళ్ల పేరు చెప్పి ఏదైనా చేసేయొచ్చు... పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు
గట్రా కడతారని, విదేశాల్నుంచి బడా కంపెనీలొచ్చేసి ఆఫీసులెట్టేస్తారని...
ఆ ఆఫీసుల్లో బిడ్డలకి ఎడా పెడా ఉద్యోగాలు వచ్చేస్తాయని చెబుతామన్నమాట. దాంతో ఎవరూ నోరెత్తరు...
తెలిసిందా?''
''అయ్యా... మళ్లీ మరో ప్రశ్న... ఓ పక్క మీ
కంపెనీల్లోకి కోట్లకు కోట్లు మళ్లించి,
మళ్లీ ఆ భూముల్లో ఇన్నేసి అభివృద్ధి పనులు అవీ చేసేస్తే ఇక ఆ కంపెనీల
వాళ్లకి ఏం మిగుల్తుందా అని... ఏం గిట్టుబాటవుతుందా అని...''
''వ... హా... ర్నీ... సెక్రట్రీ... నువ్వు
నేననుకున్నదానికన్నా వెర్రిబాగులోడివయ్యా! ఆ పేరు చెప్పి భూములు కేటాయిస్తామంతే. ఆనక
ఆళ్లు అయ్యన్నీ చేస్తారా, ఏమన్నానా? ఆర్భాటంగా ఓ బోర్డెట్టి, దానికి రంగు రంగుల కరెంటు దీపాలెట్టి, పెద్ద పెద్దాళ్లతో
ప్రారంభోత్సవాలు చేయించి... ఊరుకుంటారంతే. అనంతపురం లేపాక్షి హబ్‌లో ఏం జరిగిందో గుర్తులేదా?
అలాగన్నమాట. కొన్నాళ్లకి జనం మర్చిపోతారు. విషయం బాగా సద్దుమణిగాక ఆ
భూముల్ని కైవసం చేసుకున్నోళ్లు అందులో రియల్ ఎస్టేటు వ్యాపారం చేసుకుని అంతకంత సంపాదించుకుంటారు.
లేదా మరో కంపెనీల వాళ్లకి టోకున సబ్ కాంట్రాక్టులిచ్చేసినట్టు కాగితాలు గీకేసి,
ఆళ్ల దగ్గర్నుంచి కోట్లు రాబట్టుకుంటారు...''
''ఆహా... అద్భుతం సార్! పైకి ప్రజా సేవ
పేరు చెప్పి లోపల లోపాయికారీగా కోట్లకు కోట్లు దుళ్లగొట్టుకోవడమన్నమాట... ఆ తర్వాత
కథ చెప్పండి సార్...''
''ఆ తర్వాతేముందయ్యా... నేనూ మానాన్న బాటలోనే
నడిచా. మా నాన్న పేరు చెప్పి నానా ఏడుపులూ ఏడిచా. జనం ఏడవకపోయినా ఓదార్చా. బుగ్గలు
పుణికా. ముద్దులు పెట్టా. అమ్మా,
అయ్యా, అక్కా, అన్నా,
చెల్లీ, అవ్వా, తాతా... అంటూ
మెత్తగా నవ్వుతూ పలకరించా. లేనిపోని మాటలు చెప్పి నమ్మించా. మొత్తం మీద అధికారం అందుకున్నా.
ఇప్పుడు నాకు నేనే, నా వాళ్లతో కలిసి 'నీకిది
నాకది' ఆట ఆడేసుకుంటున్నా. అదిగో ఆ ఆటలో భాగమేనయ్యా... ఇప్పుడు ఈడీగాళ్లు గోల చేస్తున్న
మద్యం యవ్వారం. ఇంతా చేసి ఈళ్లు చెబుతున్నది వంద కోట్ల సంగతవునా? దానికే పత్రికలోల్లు పెద్ద పెద్ద అక్షరాలు అచ్చెత్తించి యాగీ చేస్తున్నారు.
అవి చూసి నువ్వు దుడుసుకున్నావు. కానీ నీకో అసలు సంగతి చెప్పనా? ఒక్క ఈ మద్యం సంగతే తీసుకుంటే మనం ఆడిన ఆట మొత్తంలో ఫుల్‌కౌంట్ ఎంతో నిజానికి
నేనే చెప్పలేననుకో. కానీ నీకంటూ ఓ అంచనా రావడానికి ఉజ్జాయింపుగా ఓ లెక్క చెబుతాలే.
దరిదాపుగా ఓ డెబ్బై అయిదు వేల కోట్లుంటుదయ్యా.
ఇదంతా మనం కుర్చీ ఎక్కాక రాష్ట్రంలో పారించిన మద్యం విలువన్నమాట. మరి డిస్టిలరీలు,
డీలరు షిప్పులు, తయారీ సంస్థలు, సరఫరా కంపెనీలు... అన్నీ మన కనుసన్నల్లోనే కదా నడిచేది? నడిపించేది కూడా మన మనుషులే కదయ్యా? సీసాలెంత ఘనంగా ఉన్నా
అందులో ఉన్న సరుకులో అసలెంతో, నకలెంతో తెలియనంతగా అమ్ముకోమని
మనం గ్రీన్ సిగ్నలివ్వాలంటే మరి మనకెంత ఆళ్లు ముట్టజెప్పి ఉంటారో... నువ్వు తీరిగ్గా
ఇంటికెల్లి లెక్కలేసుకో. ఇక ఇప్పుడు పేపర్లలో పేర్లు బయటకొచ్చిన వారికి మనం ఎకరాలకెకరాల
సర్కారు భూములు బదలాయించామన్న సంగతి కూడా మరవమాక. అలా భూములిచ్చినందుకు కూడా మన సొంత
కంపెనీల్లోకి కోట్లొచ్చి పడ్డాయిలే. అయ్యన్నీ లెక్కలేసుకోవాలంటే... నాకే తల ప్రాణం
తోక్కొస్తుంది. నీకయితే జీవితం కూడా సరిపోదనుకో. ఇక ఈ ఈడీగాళ్లు చెప్పేదెంత?
చూపించేదెంత? నిరూపించేదెంత? ఏమంటావ్?
''ఇంకేమంటానండీ బాబూ... కళ్లు గిరగిరా తిరిగిపోతుంటేనూ.
కానీ సార్... మరి అప్పట్లో తమరు ఊరూవాడా తిరిగేప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని
ఎందుకు చెప్పారండీ బాబూ....?''
''అదంతా ప్రజల్ని నమ్మించడానికయ్యా. ఏదేదో
చెప్పి, మన మనసంతా
ప్రజలేనన్నట్టు... రాత్రిళ్లు నిద్రలో కూడా
ప్రజా సంక్షేమం కోసమే కలవరిస్తున్నట్టూ... అసలు మన జీవితమే ప్రజల కోసమన్నట్టూ... మాయమాటలు
చెప్పి నమ్మించకపోతే... ఇప్పుడీ కుర్చీ మీద ఉండేవాళ్లమా చెప్పు? మరీ ఆట ఆడగలిగేవాళ్లమా చెప్పు?''
''ఆహా... తమరు చెప్పిన అధికారంతో తొండాట
కథ చాలా బాగుంది కానీండీ, మరి ప్రజలు ఇవన్నీ గమనించేసి, తమరి అసలు నిజరూపం పసిగట్టేస్తేనోనండీ?''
''ప్రజలొట్టి వెర్రిబాగులోళ్లనేది నా ప్రగాఢ
నమ్మకమయ్యా. ఆళ్ల కళ్ల ముందే మనం లక్షలాది కోట్లు దోచేసుకున్నా కానుకోలేరు. అలా మనం
దోచినదాంట్లో కాసింత తృణమో, పణమో వాళ్లకి పడేస్తే... పాపం... జేజేలు కొడుతూ పడుంటారు. కాబట్టి నువ్వూరికే
కంగారు పడ్డం మానెయ్యి. నీకింకా గుండె దడ తగ్గలేదనుకో. ఇందాకా అంబులెన్స్ పిలిచానన్నావుగా,
దాంట్లో పడుకుని ఇంటికెళ్లి ముసుగుదన్ను. పోయిరా!''
- సృజన
PUBLISHED ON 11.11.2022 ON JANASENA WEBSITE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి