గురువారం, అక్టోబర్ 19, 2023

దసరా దండకం!అమ్మా దుర్గమ్మా నీ బిడ్డలమేనమ్మా

ఆదరించి మమ్మేలు అమ్మలగన్నమ్మ!

ఆంధ్రదేశ పౌరులం అగచాట్లకు వారసులం

ఆదుకునే దిక్కులేక అలమటించు దీనులం!

ఆశచూపి అణగార్చే ఏలికలకు పావులం

అడుగడుగున మోసబోయి అల్లాడే జీవులం!

ఓదారుస్తామంటూ ఓట్లు అడిగినారమ్మ

తీరా ఓటేశాక ఏడిపించినారమ్మా!

జగనన్నను నేనంటూ జబ్బచరిచినాడమ్మా

జనుల కోసమే జన్మము తనదన్నాడమ్మా!

పేదల కష్టాలు ఇకపై గతమన్నాడమ్మా

పెత్తనమిస్తే పచ్చని బతుకదిగోననెనమ్మా!

ఆ మాటలు నమ్మినాము ఆదరించి నిలిచినాము

ఆనాటికి ఈనాటికి ఎదుగులేక మిగిలినాము!

ఏమని చెప్పము తల్లీ నీకు తెలియదా నిజము

ఏరు దాటి తెప్ప తగలబెట్టిన మా నేత విధము!

అసురుల ఉసురులు తీసి లోకాలను ఏలినావు

ఎందుకమ్మ మా నేతల ఆటకట్టి ఆదుకోవు?

పేదల పాలిటి పెన్నిధి నీవే కద పెద్దమ్మా

ఈ రక్కసి మూకలపై అలసత్వం వద్దమ్మా!

అలనాటి ఆ రాక్షసులే మార్చుకొనిరి తమ రూపు

ఇలనాటికి మా నేతలై వచ్చినారు, కరుణ చూపు!

మహిళల పాలిట శత్రువు ఆ మహిషారుడమ్మా

అంతకు మించిన ఘనులే దాపురించినారమ్మా!

అడుగడుగున శాంతి లేదు భద్రత ముందే లేదు

ఆడవారికి రక్షణ లేదన్నది నిజమైన చేదు!

నాలుగేళ్ల పాలనలో కానరాదు రాజధాని

మూడు ముక్కల మాటే మా నెత్తిన దిగని శని!

వెనక దగా ముందు దగా కుడిఎడమల దగా దగా

అన్న పలుకులకు అద్దం మా బతుకులు ఎగాదిగా!

ఎన్నని చెప్పను తల్లీ  మా నేతల కృత్యాలు

ఎదుగూబొదుగూలేని రాష్ట్రానికవి దర్పణాలు!

విద్యార్థికి చదువు లేదు, చదువరికి ఉపాధి లేదు

పేదలకు మిగిలేది లేదు, శ్రమజీవికి సుఖం లేదు!

రైతన్నకి విలువ లేదు, నేతన్న ఎదిగింది లేదు

కార్మికులకు కొలువు లేదు, నిరుపేదకు నవ్వు లేదు!

వ్యవస్థలన్నీ అణగారిన అవస్థలై కుమిలిపోయె

ప్రగతన్నది ప్రజలకొక పగటికలై మిగిలిపోయె!

అప్పు చేసి పప్పుకూడు మా నేతల విధమమ్మా

పండగైన పప్పుకూడు లేని బతుకు మాదమ్మా!

ఎడాపెడా పన్నులతో నడ్డి విరిచినారమ్మా

మా పన్నుల సొమ్ములతో సోకులు మరిగారమ్మా!

ప్రజల పేరు పైకి చెప్పి పథకాలను చేపట్టినారు

నిధులను మళ్లించి ఘనమగు వాటాలను పట్టినారు!

మా కన్నుల ముందే నేతలు సంపన్నులై ఎదిగినారు

మా బతుకులు అణగార్చి ఆపన్నులుగ మార్చినారు!

మా నేతల పాలనంత దారుణ దాష్టీకము

అహంకార ధోరణికది నిలువెత్తు నిదర్శనము!

మా నేత మనసు నిండా రాజకీయ కక్ష

తల్లీ, ఆ తీరుకు ఇక లేదా తగిన శిక్ష?

హత్యలు కావేషాలు నిత్య సత్యమే ఇచట

సుఖ సంతోషాలకు మాత్రం అనునిత్యం కటకట!

నాలుగేళ్ల పాలనంత క్షణక్షణం ఘోరం

నిరుపేదల బతుకులిచట నిత్యం నిస్సారం!

ఇంత చేసినా కూడా అబద్దాల ప్రచారం

మా నేతల తీరమ్మా అది మా గ్రహచారం!

అపరకాళివమ్మ నువ్వు ఆదరించు మమ్ము

మా బతుకులు దిద్దుకునే తెలివిడి మాకిమ్ము!

దనుజుల కూల్చిన తల్లీ నీకు జయము జయము

దయను చూపి మమ్మేలు అదే మాకు వరము!

 PUBLISHED ON 19.10.2023 ON JANASENA WEBSITE

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి