గురువారం, అక్టోబర్ 05, 2023

గాంధీ కంటనీరు పెట్టిన వేళ...



''ఏంట్రా? మొహం వేలాడేసుకుని ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమైంది?'' అంటూ లోపలి నుంచి వచ్చారు గురువుగారు.

శిష్యుడు పరధ్యానంలోంచి తేరుకుని, ''అబ్బే... ఏం లేదు సార్‌...'' అంటూ సర్దుకుని కూర్చున్నాడు.

''ఒరేయ్‌... నువ్వా రాజకీయాలు నేర్చుకుంటున్నావు. రేప్పొద్దున గద్దెనెక్కావనుకో, ప్రజలు కదా ఇలా దిగాలు మొహం పెట్టుకునేది? మరి నువ్వెలా ఉండాలి? నీ పాలన ఏడ్చినట్టున్నా, నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా మెత్తని మొహం పెట్టుకుని, ముసిముసి నవ్వులు నవ్వుతూ, పెద్ద ఏదో ఊడబొడిచేస్తున్నట్టు పోజులెట్టాలి. నీచ రాజకీయాల్లో ఇదే కదా నికార్సయిన పాఠం?''

''ఏం రాజకీయాలో ఏంటో సార్‌... మనసంతా పాడయిపోయిందండి...''

''వార్నీ... డర్టీ పోలిటిక్స్లో మనసెక్కడుంటుందిరా. ముందు దాన్ని చంపుకుంటేనే కదా, నవ్వు రాణించేది? ఇంతకీ అసలేమైందో చెప్పు, నీ మనసేంటో, దాని గోలేంటో నేను సరి చేస్తాను''

''ఏం చెప్పమంటారండీ? రాత్రి కలలో గాంధీ కనిపించాడండి...''

''ఒట్టి గాంధీ అంటే ఏం తెలుస్తుందిరా? మన దేశంలో చాలా మంది గాంధీలున్నార్రా. నీ కల్లోకి చొచ్చుకొచ్చింది ఎవరో తెలియద్దూ? రాజీవ్గాంధీనా? రాహుల్గాంధీనా? ఇందిరా గాంధీనా? సోనియా గాంధీనా?''

''అబ్బే  వీళ్లెవరూ కాద్సార్‌. మహాత్మా గాంధీ అండి...''

''ఏంటి మన జాతిపిత గాంధీనే? అబ్బో... మంచిదే. మరి నీకు దిగులెందుకు?''

''ఏం చెప్పమంటారండీ? కలలో ఆయనే దిగులుగా కనిపించారండి. పైగా కళ్ల నీళ్లు కూడా పెట్టుకున్నారండి... ఎప్పుడూ బోసినవ్వులతో ఉండే ఆయన అలా కనిపించేసరికి బాధొచ్చిందండి...''

''ఓహో... మరి ఏమైనా మాట్లాడారా?''

''ఆయ్‌... నేనంటే అంత చులకనైపోయానా అన్నారండి. నా అడుగుజాడల్లో నడవడమంటే ఇదేనా అని అడిగారండి. అలా అంటూనే కంటతడి పెట్టారండి... ఈలోగా కల చెదిరిపోయి మెలకువ వచ్చేసిందండి...''

''అలాగా? ఇలాంటి కలలు ఊరికే రావురోయ్‌. దానికేదో కారణం ఉంటుంది. అది తెలియాలంటే నిన్న నువ్వు ఏం చేశావో, ఏం చూశావో, ఏం విన్నావో చెప్పు.  దాన్ని బట్టి సంగతేంటో అంచనా వేద్దాం...''

''ఏముందండీ? రాజకీయాలు నేర్చుకునేటప్పుడు నేతల కార్యక్రమాలకు వెళుతూ వాళ్లేం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని మీరు చెప్పారు కదండీ? అందుకని నిన్న మన ముఖ్యనేత సభకెళ్లానండి. ఆయన మాటలు విని నోట్సు రాసుకున్నానండి...''

''బాగుందిరా... మరైతే ఆయన ఏం మట్లాడాడో గుర్తుందా?''

''లేకేమండీ? రికార్డు కూడా చేశానండి. ... ఇప్పుడు గుర్తొచ్చిందండోయ్‌. ఆయన ఎప్పటిలాగే ముసిముసిగా నవ్వుతూ, ఖైమా కొడుతున్నట్టు చేతులూపుతూ ఉపన్యాసం దంచాడండి. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నాడండి. ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించానన్నాడండి. ఆయనే తనకు ఆదర్శమన్నాడండి...''

''అద్గదీ సంగతి! మరందుకనే సాక్షాత్తూ మహాత్మాగాంధీ గారు నీ కల్లోకి వచ్చేశారు. అర్థమైందా?''

''అదేంటండీ? ఆ సభలో బోలెడు మంది ఉంటే నా కల్లోకే రావడమేంటండీ?''

''నువ్వు రాజకీయాలు నేర్చుకుంటున్నావు కదరా? అందుకని వచ్చి ఉంటారులే''

''పోనీ వస్తే వచ్చారు కానీ కంట తడి పెట్టుకోవడం దేనికండి?''

''ఇంకా ఎందుకంటావేంట్రా? నీ ముఖ్యనేత చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి? ఆయన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు చెప్పుకుంటుంటే వింటున్న మనకే ఒళ్లంతా కంపరమెత్తిపోతుంటే, ఇక పాపం ఆ మహాత్ముడి మనసెంత కలవరపడి ఉంటుందో ఊహించుకో. వీడు గాంధీగారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చేశాడా? చెప్పుకోడానికి వాడికి సిగ్గు లేకపోతే, వినడానికి మనకైనా ఉండద్దురా? ఒక్కసారి గ్రామ పంచాయితీల కేసి చూడు. సంగతేంటో తెలుస్తుంది. సర్పంచుల గోడు విను, వాళ్ల గోల అర్థమవుతుంది. ఒకటి కాదు, రెండు కాదురొరేయ్‌... ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల పంచాయితీ నిధుల్ని ఈ దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వాడేసుకోలే? కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్ని కూడా లాగేసుకోలే? ఇంకా నీ నీచ, నికృష్ట, నిస్సిగ్గు, నయవంచన నేత ఏమని ప్రచారం చేసుకుంటున్నాడో గమనించలేదా? గ్రామ సచివాలయ వ్వవస్థను తీసుకొచ్చి గాంధీ కలల్ని నిజం చేశానని చెప్పుకుంటాడా? అసలది నోరేనా అని? గ్రామ సచివాలయాల వల్ల ఏం జరిగిందో నీకు తెలియదా? గ్రామాల్లో సర్పంచులకు సమాంతర వ్యవస్థ ఏర్పండింది కదా? అందువల్ల ప్రజల ఓట్లతో ఎన్నికైన గ్రామ ప్రతినిధులు కేవలం ఉత్సవ విగ్రాహాలుగా మిగిలిపోలేదూ? వాళ్లకేమైనా అధికారాలంటూ మిగిలాయా చెప్పు? ఏపని చేయాలన్నీ సచివాలయాల అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందా? మరి ఇదేనా గ్రామ స్వరాజ్యమంటే? పాపం సర్పంచులు ఆఖరికి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా దిక్కులేక చేతులు కట్టేసినట్టయిపోయి దిగాలు పడిపోవడం లేదూ? కొంత మంది సర్పంచులు తమ సొంత నిధులతో పనులు చేయిస్తే వాటి బిల్లులయినా వెంటనే పాసయ్యేలా చేస్తున్నాడా మీ ముఖ్యనేత? మరి సిగ్గు లేకుండా మీవాడు గప్పాలు కొట్టుకుంటున్నదే నిజమనుకుంటే, గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ మహాత్ముడి విగ్రహాల ముందు నిరసనలు ఎందుకు చేస్తారో ఆలోచించు? సర్పంచులందరూ నల్ల చొక్కాలు, రిబ్బన్లు ధరించి, చేతులకు సంకెళ్లు వేసుకుని, మోకాళ్లపై నుంచుని తమ నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తే ఆ సంగతి కనబడలేదా మీ ముఖ్యనేతకి? అసలు జాతిపిత ఏమని చెప్పాడురా? మద్యం, సారా, మత్తు పదార్థాలను పరిత్యజించాలని చెప్పలేదూ? మరి మీ దుర్జన, దురంహంకార ముఖ్యనేత ఏం చేస్తున్నాడురా? ఊరూ వాడా మద్యాన్ని ఏరులై ప్రవహించేలా చేయడం లేదూ? మద్యం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు రాష్ట్రాన్నే రాజధానిగా మార్చేశాడు కదరా? మద్యం అమ్మకాల ద్వారా రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేయడానికి రాష్ట్రమేదైనా ఆయన అబ్బగారి సొత్తంట్రా? రేప్పొద్దున వీడు ఓడిపోయినా వీడు పెట్టిన అప్పుల్ని మోయక తప్పని దుస్థితి తీసుకొచ్చాడు కదరా? మరి ఇదంట్రా గాంధీగారి అడుగుజాడల్లో నడవడం? అంతదాకా ఎందుకురా? సమాజంలో అణగారిన బడుగు వర్గాల వారంటే మహాత్ముడికి ఎంత ప్రీతి? వారి అభ్యున్నతి కోసమే అహరహం తపించేవాడు కదరా ఆయన? అలాంటిది మీ నయవంచక ముఖ్యనేత పాలన ఎలా అఘోరిస్తోందో గమనించావా? కేవలం మాస్కు ధరించలేదని ఓ దళితుడిని ఎస్సై కొట్టి చంపిన చీరాల సంఘటనని మరువగలవా? మరో అభాగ్యుడిని స్వయంగా వచ్చి మరీ తీసుకెళ్లి చంపేసి శవాన్ని తిరిగి ఇంటికి చేర్చిన అధికార పార్టీ నేత ఎలాంటి శిక్షలూ లేకుండా, దర్జాగా కాలరెగరేసుకుని బయట తిరుగుతుంటే ఏమనాలిరా నీ పరగణా ప్రజల దౌర్భాగ్యాన్ని? ఇదేనేంట్రా గాంధీ కలల్ని నెరవేర్చడం? సత్యం, అహింసల్ని బోధించిన ఆ మహాత్ముడెక్కడ? అసత్యాలతో, అబద్ధపు ప్రచారాలతో, హింసాత్మక విధానాలతో బరితెగించిన నీ నాయకుడెక్కడ? అవినీతి నిర్మూలనే గాంధీజీ ధ్యేయమే? మరి మీ పరిపాలకుడు? లక్ష కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్లొచ్చి కూడా, బెయిలు మీద తిరుగుతూ, అమాయక ప్రజల్ని అమలు సాధ్యం కాని వాగ్దానాలతో ఆకర్షించి, మాయ చేసి, ఆశలు రేకెత్తించి, అధికారం లోకి వచ్చి వాళ్ల నెత్తినే భస్మాసుర హస్తం మోపుతున్నాడే? అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని మహాత్ముడు బోధిస్తే, రైతులు రోడ్ల మీదకొచ్చి ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా ఉక్కు పాదాలతో అణచి వేస్తున్న మీ మాయలమారి ముఖ్యనేత తగుదునమ్మా అంటూ జాతిపిత అడుగుజాడల్లో నడుస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటాడా? ఛీ!''

''సార్గురూగారూ! శాంతించండి సార్‌. నాకిప్పుడు అర్థం అయింది. మా నికృష్ట నేత ఉపన్యాసం విని వచ్చి పడుకునే సరికి నాలో జరిగిన అంతర్మధనమే మహాత్ముడి కల రూపంలో వచ్చి ఉంటుందనిపిస్తోందండీ. గాంధీగారు అందుకనే కంటతడితో కనిపించి ఉంటారండి. కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను సార్‌. రాజకీయ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తాను. ప్రజల సమస్యల మీదే పోరాడుతూ, వాళ్ల అభ్యున్నతి  కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టి, నిస్వార్థంగా పని చేస్తున్న నిజమైన జన సేనా నాయకుల అడుగుజాడల్లోనే నడుస్తాను. అమాయక ప్రజలను చైతన్య పరిచి, ఊసరవెల్లుల్లాంటి నయవంచక రాజకీయ నాయకుల నిజస్వరూపాన్ని జనం గ్రహించేలా చేసి, రాబోయే ఎన్నికల్లో స్వచ్ఛమైన నేతల్ని ఎన్నుకునేలా ఓటర్లను నడిపిస్తాను సార్‌...''

''సెభాష్రా. అదే మహాత్ముడికి అసలైన నివాళి. రేపు నీకు కలలో జాతిపిత కనిపించినా బోసినవ్వులతో ఆశీర్వదిస్తాడురా. ఇక పోయిరా!''

-సృజన 

PUBLISHED ON 5.10.2023 ON JANASENA WEBSITE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి