సోమవారం, జులై 01, 2024

గేటు దూకించిన... 'బాల భారతం'



వెండితెరంతా మిలమిలలాడుతున్న నక్షత్రాలు... వాటి మధ్యలో బాణాలతో కట్టిన నిచ్చెన... దానిపైకి గద పట్టుకుని ఎక్కుతున్న బాల భీముడు... నేపథ్యంలో ఘంటశాల గానం...
''మానవుడే మహనీయుడు... శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు...''
... మరిలాంటి దృశ్యం పిల్లల్ని కళ్లప్పగించి చూసేలా చేయదూ? మళ్లీ మళ్లీ చూడాలనిపించేయదూ?
సరిగ్గా... యాభై ఏళ్ల క్రితం నాదీ అదే పరిస్థితి! 
అప్పట్లో నేను పిలగాణ్ణే. బహుశా ఆరో తరగతో, ఏడో తరగతో. మా వీధి చివరే ఉండేది సినిమా హాలు. ఊరు చోడవరం. అనకాపల్లి దగ్గర. నాన్నగారు జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిషు లెక్చరర్. మనం పండిత పుత్రులమన్నమాట. సరిగ్గా సాయంత్రం నాలుగుంబావు సమయానికి మ్యాట్నీలో ఆ పాట వస్తుందని నాకూ, చెల్లా శీనుగాడికీ తెలుసు. ఇద్దరికీ ఆ సినిమా తెగ నచ్చేసింది. ఆ పాట అయితే మరీనీ. మంచి సినిమా అంటే ఏదో ఓసారి తీసుకెళ్తారు పెద్దవాళ్లు. కానీ మళ్లీ మళ్లీ చూడాలినిపిస్తే ఎలా? 
''ఒరేయ్‌... గేటు దూకి చూసేద్దామేంట్రా?'' అన్నాడు చెల్లా శీనుగాడు.
''మరి పట్టుకోరూ?'' అని నా భయం.
చెల్లా శీనుగాడు నాకన్నా ఒకటో, రెండో క్లాసులు చిన్నవాడే అయినా మహా చలాకీగాడు. 
''ఎహె... ఏం కాదు రా...'' అంటూ వాడు పరుగు. వాడి వెనకే నేను.
ఇద్దరం హాల్లోకి వెళ్లాం. అక్కడ పోస్టర్లు, స్టిల్సు చూస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాం. వాటి పక్కగా ఉండేది చెక్క గేటు. మా ప్రాణానికి అది నిలువెత్తుదే. మధ్యలో ఉండే అడ్డ చెక్కలే మాకు నిచ్చెన మెట్లన్నమాట. శీనుగాడు అటూ ఇటూ చూసి గేటు సందుల్లో కాళ్లు పెట్టి చకచకా ఎక్కేశాడు. అటువైపు దిగిపోయి 'ఎక్కెయ్‌...' అన్నట్టు సైగ చేశాడు. నేనూ ఎక్కేశా. అటువైపు దిగాం. నేను దర్జాగా రిజర్వ్‌డ్‌ క్లాసు వైపు వెళుతుంటే వాడు నా చొక్కా పట్టుకుని ఆపాడు. నా చెయ్యి పట్టుకుని, స్తంభాల చాటు నుంచి నక్కుతూ నేల క్లాసు తలుపు కేసి నడిచాడు. ఆ తలుపు ఓరగా చేరవేసి ఉంది. నెమ్మదిగా తీశాడు. లోపలికి దూరిపోయాం. లోపలంతా చీకటి. తెరకేసి చూసేసరికి రంగురంగుల 'బాల భారతం' సినిమా! అప్పుడే అర్జునుడు బాణాలతో ఆకాశానికి నిచ్చెన కట్టేశాడు. బాలభీముడు గద పుచ్చుకుని ఎక్కడం మొదలు పెట్టాడు.
మేం కళ్లప్పగించేశాం. 
''మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే...
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే!''
మేం కాస్త అటూ ఇటూ చూసి ఖాళీగా ఉన్న బెంచీ చూసుకుని తెర మీంచి తల తిప్పకుండానే, తడుముకుంటూ కూర్చున్నాం. 
''గ్రహరాశులనధిగమించి...
ఘన తారల పథము నుంచి...
గగనాంతర రోదసిలో గంధర్వ గోళ తతుల దాటి...
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా 
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు!''
మేం కిమ్మనలేదు. ఆ సీను అలాంటిది! మా వయసు అలాంటిది!!
అక్కడి నుంచి సినిమా పూర్తయ్యేవరకు చూసేశాం. 
అది మొదలు. ప్రతి రోజూ అదే పని. నాలుగింటికల్లా చెల్లా శీనుగాను వచ్చేసేవాడు. నేను రెడీగా ఉండేవాణ్ణి. 
రోజులన్నీ ఒకేలా గడుస్తాయా? ఆ సంగతి ఇప్పుడు తెలుసు కానీ, అప్పటికి తెలీదుగా.
ఓసారి మామూలుగానే బయల్దేరాం. శీనుగాడు గేటు దూకేశాడు. నేను కూడా ఎక్కి దూకా. 
''ఒరేయ్‌... ఎవర్రా అది?'' అంటూ ఓ కేక వినపడింది.
నా గుండె గుభేలుమంది. హాలు పనివాడో, గేటు కీపరో ఎవరో తెలీదు కానీ వచ్చి నన్ను పట్టుకున్నాడు. బిక్కచచ్చిపోయా. అప్పటికే శీనుగాడు నేల క్లాసు తలుపు తీస్తున్నాడు. మనం వాడిని వెళ్లనిస్తామా?
''అదిగో వాడు కూడా ఉన్నాడు సార్‌...'' అంటూ చూపించేశా.
వాడు చటుక్కున వెళ్లి వాడిని కూడా రెక్క పుచ్చుకుని లాక్కొచ్చాడు. ఈలోగా మరొకడు కూడా వచ్చాడు.
ఇద్దరూ కలిసి మమ్మల్ని ఓ ఆట ఆడుకున్నారు.
''ఒరేయ్‌... చొక్కాలిప్పండ్రా...'' అన్నారు. 
మేం ఏడుపు మొహాలతో చొక్కా బొత్తాలిప్పుతూనే బతిమలాడ్డం మొదలెట్టాం.
''సార్‌... వదిలేయండి సార్‌...''
''తప్పయిపోయింది... ఇంకెప్పుడూ రాం సార్‌...''
మాలాంటి కుర్రాళ్లు దొరికితే కాసేపు కాలక్షేపం చేయకుండా ఎలా ఉంటారు?
''పదండ్రా... మేనేజర్‌ దగ్గరకి తీసుకెళ్దాం...'' అని బెదిరింపులు.
బిత్తరి చూపులతో, బిక్క మొహాలతో మేం. 
నాకు దొరికిపోయినందుకు కాదు బెంగ. ఆ హాలు యజమానిగారబ్బాయి ఎక్కడ చూస్తాడో అని బాధ. ఎందుకంటే... ఆ అబ్బాయి పేరు నానాజీ. ఇంటర్‌ చదివేవాడు. మా నాన్నగారి దగ్గరే రోజూ ట్యూషన్‌కి వచ్చేవాడు. మంచి సినిమా వస్తే మమ్మల్ని రమ్మనేవాడు. అమ్మా, నాన్నగారూ, నేనూ వెళితే టిక్కెట్లు తీసుకోనిచ్చేవాడు కాదు. రిజర్వ్‌డు క్లాసులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడు. ఇంటర్వెల్‌ లో సమోసాలు, కూల్‌డ్రింకులు కూడా పంపేవారు. అలా దర్జాగా సినిమా చూసేవాడిని ఇలా గేటు దాటుతూ పట్టుబడితే ఎంత సిగ్గు చేటు? అదీ నా దిగులు.
ఆఖరికి కాసేపు ఏడిపించాక ఆ హాలు పనివాళ్లు మా చొక్కాలు మాకిచ్చేసి ''పొండి... '' అని వదిలేశారు.
అంతే... బతుకు జీవుడా అనుకుని వాళ్ల ముందే మళ్లీ చెక్క గేటు చకచకా ఎక్కేసి ఇటు వైపు దూకి ఇళ్లకు పరుగో పరుగు. 
మళ్లీ మేం గేటు దూకితే ఒట్టు. 
చోడవరం శ్రీనివాసా థియేటర్‌లో దాదాపు యాభై ఏళ్ల క్రితం నా చిన్ననాటి 'నాటీ' జ్క్షాపకం ఇది. అప్పట్లో మా ఇంటికి దగ్గర్లో రెండు థియేటర్లు ఉండేవి. ఒకటిదైతే మరోటి పూర్ణా థియేటర్‌. ఆ థియేటర్‌ యజమాని కొడుకు పేరు రాజాజీ. నానాజీ, రాజాజీ ఇద్దరూ మా నాన్నగారి స్టూడెంట్లే. అమ్మ ఏ ఉల్లిపాయలో తెమ్మన్నప్పుడు నేను అలా ఏ థియేటర్‌ దగ్గరకి వెళ్లి సరదాగా స్టిల్స్‌ చూస్తున్నా, నానాజీ కానీ, రాజాజీ కానీ చూస్తే... ''బాబూ! లోపలకి వెళ్లి కూర్చో...'' అని చెప్పేవాళ్లు. పైగా హాలు పనివాళ్లని పిలిచి ''ఈ బాబుని రిజర్వ్‌డ్‌ లో కూర్చోబెట్టు'' అనేవాళ్లు. నేను ఉల్లిపాయల మాట మానేసి సినిమా చూసి చక్కా వచ్చేవాడిని. 
అమ్మ తిట్టి పోసేది. ''పకోడీలు వేద్దామని ఉల్లిపాయలు తెమ్మంటే ఇంత సేపా? ఇంత సేపూ ఏం చేశావ్‌?'' అంటూ కేకలేసేది.
అలాంటిది సినిమా హాలు గేటు దూకి దొంగతనంగా సినిమా చూడాలనిపించడమేంటి... ఆకతాయితనం కాకపోతే?! 
మొత్తానికి 'బాల భారతం' సినిమా నాకో గుణపాఠం నేర్పింది. 
ఇంత చెప్పుకుని ఆ సినిమా గురించి చెప్పుకోకపోతే ఎలా? 
పౌరాణిక బ్రహ్మగా పేరొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తీసిన 'బాల భారతం' 1972లో వచ్చింది. అందులో నాకెంతో నచ్చిన 'మానవుడే మహనీయుడు' పాట ఆరుద్ర రాసింది. 
''దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే...
సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే...
సృష్టికి ప్రతి సృష్టి చూయు విశ్వామిత్రుడు నరుడే...
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే''
ఎంత బాగా రాశాడు! స్వతహాగా నాస్తికుడైనా ఓ పౌరాణిక సినిమాకి మంచి సందర్భంలో పాట రాస్తూ, ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మానవుడి విజయాల గురించి ఎంత స్ఫూర్తిదాయకంగా చెప్పాడు! 
సాలూరి రాజేశ్వర రావు స్వర కల్పనలో ఘంటశాల గానంలో ఆ పాట ఎంత బాగా వచ్చిందో, వెండితెర మీద కూడా అంత అద్భుతంగానూ ఆవిష్కృతమైంది. పిల్లల్ని పాత్రధారులుగా పెట్టినా మహాభారతంలో పాండవులు, కౌరవులు పెద్దవాళ్లయ్యేంత వరకు కథని తీసుకుని, కురువంశం మూలాల నుంచి ధర్మరాజు పట్టాభిషేకం అయ్యేవరకు తీసిన ఆ సినిమా ఇప్పటికీ అందరినీ అలరించేదే. ఎస్వీరంగారావు, ధూళిపాళ, కాంతారావు, హరనాథ్‌, అంజలీదేవి, ఎస్‌. వరలక్ష్మి తదితరుల పాత్రోచితమైన అభినయాలు, ఆకట్టుకునే పాటలూ చాలా చక్కగా అమరాయి. పెద్దయ్యాక అందాల తారగా చిత్రసీమను ఏలిన శ్రీదేవి ఇందులో దుస్సలగా పెద్ద పెద్ద కళ్లతో అలవోకగా నటించేసింది. 
'నారాయణ నీ లీల నవరస భరితం... నీ ప్రేరణచే జనియించెను బాలభారతం...'
'భలె భలె భలె భలె పెద బావా... భళిర భళిర ఓ చిన బావ...'
'ఆడెనోయి నాగ కన్యకా... చూడాలోయి వీర బాలకా...'
'తారంగం తారంగం తాండవ కృష్ట తారంగం...'
'విందు భోజనం పసందు భోజనం...' 
లాంటి పాటలన్నీ చాలా బాగుంటాయి. ఇప్పటికీ ఏ టీవీలోనే ఈ సినిమా వస్తే కళ్లప్పగించి చూస్తూనే ఉంటాను. నేనే కాదు... అందరూనూ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి