శనివారం, జులై 06, 2024

రాముడికి అందిన అపురూప విద్యలు!

తండ్రి దశరథుడి మాట మీద రామలక్ష్మణులు మహర్షి విశ్వామిత్రుడి వెంట బయలుదేరారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న దేవతలు వారిపై పూల వర్షం కురిపించారు. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు. పదహారేళ్లయినా నిండని లేత వయసులో జులపాల జుట్టుతో ఎంతో సుకుమారంగా అందంగా ఉన్న రాముడు ధనుర్ధారియై ఆయనను అనుసరించాడు. లక్ష్మణుడు తోడుగా నడిచాడు. అమ్ముల పొదులను భుజాన కట్టుకుని, నడుముకు ఖడ్గాలు ధరించికోదండాలు పట్టుకుని ఆ అన్నదమ్ములిద్దరూ హుందాగా నడుస్తుంటే వారి శోభలు నలుదిశలా వెలుగులు చిమ్మాయి. కాలినడకన ఆ ముగ్గురూ అలా ఒకటిన్నర యోజనముల దూరం నడిచారు. ఒక యోజనం ఎనిమిది తొమ్మిది మైళ్లకు సమానం. అంటే సుమారు పన్నెండు, పదిహేను కిలోమీటర్ల దూరం. అలా ప్రయాణించి వాళ్లు సరయూ నదీ తీరానికి చేరుకున్నారు. 

అప్పుడు విశ్వామిత్రుడు ఆగి రాముడితో ఇలా అన్నాడు. 

''నాయనా! ఈ నదీ జలాలతో ఆచమనం చెయ్యి. నీకు బల, అతిబల అనే రెండు మంత్రాలను ఉపదేశిస్తాను. వీటి వల్ల నీకు అలసట కలుగదు. ఆకలిదప్పులు ఉండవు. నువ్వు నిద్రిస్తున్నా, ఏమరుపాటుతో ఉన్నా సరే, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మంత్రాల ప్రభావం వల్ల బల పరాక్రమాల్లో ముల్లోకాల్లోనూ నీకు సాటి రాగలవారు ఉండరు. ఈ విద్యలు రెండూ బ్రహ్మ దేవుడి నుంచి పుట్టినవి. వీటిని అందుకోడానికి అర్హతగల ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి'' అంటూ వివరించాడు.

రాముడు శుచియై ఆయన నుంచి ఆ రెండు విద్యలను గ్రహించి తేజస్సుతో వెలుగొందాడు. ఆ రాత్రి ఆ ముగ్గురూ సరయూ నదీ తీరంలోనే గడిపారు. రామలక్ష్మణులు వినయంగా విశ్వామిత్రుడి పాదములు ఒత్తుతూ సేవలందించారు. ఆయన విశ్రమించాక ఆ రాకుమారులిద్దరూ ఆ పక్కనే గడ్డి పరుచుకుని కటిక నేలపై పడుకున్నారు.

రాత్రి గడిచింది. తెలతెలవారుతుండగా ముందుగా విశ్వామిత్రుడు లేచాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను చూసి మృదువుగా మేల్కొలిపాడు. 

''కౌసల్యాదేవికి సుపుత్రుడవైన ఓ రామా! సూర్యోదయం కావస్తోంది. లెమ్ము. దైవికమైన సంధ్యావందనాది క్రియలను ఆచరించు''.

ఆ మేలుకొలుపే...

''కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌'' అనే సుప్రభాత శ్లోకంగా ఎంతగానో ప్రాచర్యం పొందింది. 

వెంటనే రామలక్ష్మణులిద్దరూ లేచి, స్నానం చేసి, సూర్యునకు నమస్కరించి అర్ఘ్యప్రదానం చేశారు. దేవతలకు, రుషులకు తర్పణములు ఇచ్చారు. గాయత్రిని జపించారు. అనంతరం ప్రయాణానికి సిద్ధమై విశ్వామిత్రుడికి నమస్కరించారు. 

మళ్లీ ప్రయాణం మొదలైంది. కొంత సేపు నడిచిన తర్వాత వాళ్లు ముగ్గరూ సరయూ నది, గంగానదితో కలిసే చోటుకు చేరుకున్నారు. అక్కడ  దూరంగా ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆ పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. 

అదంతా చూసి రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని వినయంగా ప్రశ్నించాడు.

''మహాత్మా! పవిత్రమైన ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలని ఉంది''

విశ్వామిత్రుడు చిరునవ్వుతో చెప్పసాగాడు.

''రామా! విను. పూర్వం ఈ ప్రదేశంలో పరమశివుడు తపస్సు ఆచరించాడు. ఒకసారి మన్మథుడు ఈ ప్రదేశానికి వచ్చి శివుడి తపస్సుకు భంగం కలిగించాడు. తన ధ్యానానికి అంతరాయం కలగడంతో శివుడు కళ్లు తెరిచి కోసంగా చూశాడు. దాంతో మన్మథుడి శరీరం కాలి బూడిదైపోయింది. అప్పటి నుంచి మన్మథుడు శరీరం లేనివాడయ్యాడు. అందువల్లనే మన్మథుడిని అనంగుడు కూడా అంటారు. అతడు కాలి బూడిదయ్యాడు కాబట్టి ఈ దేశానికి అంగదేశమనే పేరు స్థిరపడింది. పరమ శివుడు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కాబట్టి ఇక్కడ శివభక్తులైన మునులు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. మనం ఈ రాత్రికి ఇక్కడే గడుపుదాం. రేపు గంగానదిని దాటుదాం'' అంటూ వివరించాడు విశ్వామిత్రుడు. 

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా సంభాషిస్తున్న విషయాన్ని ఆ ఆశ్రమంలోని మునీశ్వరులు దివ్యదృష్టితో చూడగలిగారు. వెంటనే వారంతా ఎంతో ఆనందంగా పులకించి పోతూ వచ్చారు. విశ్వామిత్రుడిని అర్ఘ్య పాద్యాలతో పూజించి వారిని సాదరంగా ఆశ్రమానికి ఆహ్వానించారు. అయోధ్య  కోట నుంచి బయల్దేరిన రామలక్ష్మణులకు ఇది రెండవ రాత్రి. విశ్వామిత్రుడు, ఆశ్రమ మునులు చెప్పుకున్న కథలను, విషయాలను వింటూ వారిద్దరూ విశ్రమించారు. మర్నాడు వారి మూడో రోజు ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

2 కామెంట్‌లు:

  1. అప్పుడు రామయ్య వయసు పదమూడు అండీ పదహారు కాదు.

    రిప్లయితొలగించండి
  2. సర్‌... నమస్తే... మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు... వాల్మీకి రామాయణంలో రాముడి వయసు 13 సంవత్సరాలని రాయలేదు. విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తనతో పంపమని కోరినప్పుడు దశరథుడు ఆయనతో రాముడికి ఇంకా పదహారు సంవత్సరాలైనా పూర్తిగా నిండలేదని అంటాడు. దాన్ని బట్టి పదహారేళ్ల లేత వయసులో అని రాశాను. కృతజ్ఞతలు... మీరు తరచు మీ అభిప్రాయాలను పంచుకోవాలని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి