శుక్రవారం, జులై 26, 2024

తాటకగా మారిన అందమైన యక్షిణి! (పిల్లల కోసం రాముడి కథ-9)

విశ్వామిత్రుడి వెంట బయల్దేరిన రామ లక్ష్మణులు రెండో రాత్రిని అంగదేశంలోని మునుల ఆశ్రమంలో గడిపారు. ఆ మర్నాడు మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలైంది. ఆ ఆశ్రమంలోని మునులు వారి కోసం ఒక నావను సిద్ధం చేశారు. ఆ నావపై గంగానది దక్షిణ తీరానికి వెళ్లసాగారు. ప్రవాహం మధ్యలోకి నావ రాగానే నది వేగం ఒక్కసారిగా పెరిగింది. అలల ఉధృతికి వచ్చే శబ్దాలు అధికమయ్యాయి. ఇది గమనించిన రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని అడిగాడు. 

''మహాత్మా! ఉన్నట్టుండి నది వేగం ఎందుకు పెరిగింది? నీటిలోంచి వినిపిస్తున్న ఆ భయంకర శబ్దాలకు కారణమేంటి?'' అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు.

''రామా! పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తపస్సు చేశాడు. తనకు దగ్గరలో ఒక సరస్సు ఉంటే బాగుంటుందని తలపోశాడు. వెంటనే అక్కడొక చక్కని సరస్సు ఏర్పడింది. బ్రహ్మ మనో సంకల్పం వల్ల పుట్టింది కాబట్టి దానికి 'మానస సరోవరం' అనే పేరు కలిగింది. ఆ సరోవరం నుంచి ఒక నది పుట్టింది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి అది సరయూ నది అయింది. ఆ నది ఇక్కడ గంగానదితో కలుస్తోంది. రెండు నదీ ప్రవాహాల వల్లనే అలల వేగం, శబ్దం కూడా పెరిగాయి. పవిత్రమైన ఈ నదుల సంగమ ప్రదేశానికి నమస్కరించు'' అని చెప్పాడు. రామలక్ష్మణులు భక్తితో ఆయన చెప్పినట్టుగానే చేశారు. 

తర్వాత వాళ్లు గంగానదిని దాటి దక్షిణ తీరానికి చేరి నడవసాగారు. చుట్టూ దట్టమైన అడవి. అలా నడుస్తూ ఉండగా రాముడు ఆసక్తిగా మరో ప్రశ్నను విశ్వామిత్రుడిని అడిగాడు. 

''మహర్షీ! ఎంత దూరం నడిచినా ఎక్కడా మానవ సంచారం కనిపించడం లేదు. క్రూర మృగాలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక్కడ పెరిగిన మహా వృక్షాల వల్ల సూర్యరశ్మి కూడా నేల మీద పడటం లేదు. నిర్జనమైన ఈ  అరణ్యం పేరేమిటి?'' అని వినయంగా ప్రశ్నించాడు.

విశ్వామిత్రుడు వివరించాడు.

''రామా! ఇప్పుడు దట్టమైన అడవిలా మారిన ఈ ప్రదేశంలో పూర్వం రెండు దేశాలు ఉండేవి. అవి దేవతలచే ఏర్పడినవి. అవే మలద, కరూశ దేశాలుగా పేరొందాయి. వాటిని దేవతలు ఎందుకు నిర్మించారో కూడా చెబుతాను విను. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు, వృత్రాసురుడిని చంపాడు. ఆ కారణంగా అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఫలితంగా అతడిని ఆకలి పీడించసాగింది. అప్పుడు దేవతలు ఇంద్రుడిని పవిత్రమైన ఇక్కడి గంగా జలాలతో మంత్ర పూర్వకంగా  అభిషేకించారు. వెంటనే ఇంద్రుడి మాలిన్యం, పాపము కూడా తొలగిపోయాయి. అందుకు సంతోషించిన ఇంద్రుడు ఈ ప్రదేశంలో ధనధాన్యాలతో తులతూగే రెండు దేశాలు ఏర్పడతాయని, మలద కరూశ దేశాలుగా ప్రసిద్ధికెక్కుతాయని వరం ఇచ్చాడు. అలా దేవతలు నిర్మించిన ఈ దేశాలలో ప్రజలు ఎంతో వైభవంగా జీవించేవారు. అలాంటిది ఒక యక్షిణి కారణంగా ఆ రెండు దేశాలు నాశనమయ్యాయి.  ఆమె పేరు తాటక. పుడుతూనే వేయి ఏనుగుల బలం ఆమె సొంతం. ఆమెకు మారీచుడనే రాక్షసుడు పుత్రుడిగా కలిగాడు. వాడు మహాకాయుడు. ఇంద్రుండంతటి పరాక్రమశాలి. దుర్మార్గులైన ఆ తాటక, మారీచుల వల్లనే ఈ రెండు దేశాలూ ధ్వంసమయ్యాయి. ప్రజలెవరూ ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఇక్కడికి ఒకటిన్నర యోజనాల దూరంలోనే ఆమె ఉంటున్నది. తాటకవనంగా పేరొందిన ఆ దారినే మనం ముందుకు సాగాల్సి ఉంది. రెండు దేశాలను కబళించిన ఆ తాటకను నువ్వు వధించాలి. ఈ దేశాలకు ఆమె బెడదను తొలగించాలి'' అన్నాడు.

తాటక గురించి వినగానే రాముడి మనసులో మరో ప్రశ్న ఉదయించింది.

''మునీశ్వరా! సాధారణంగా యక్షులకు అంతటి పరాక్రమవంతులు ఉండవంటారు కదా? మరి అబల అయినప్పటికీ తాటకికి మాత్రం వెయ్య ఏనుగుల బలం ఎలా కలిగింది?'' 

అప్పుడు విశ్వామిత్రుడు తాటకి వృత్తాంతాన్ని విపులంగా చెప్పాడు.

పూర్వం సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడు.  అతడు మంచి ప్రవర్తన కలిగినవాడు, పరాక్రమవంతుడు. కానీ సంతానం లేనివాడు. ఆ చింతతో అతడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతడికి వెయ్యి ఏనుగుల బలంతో ఒక కుమార్తె పుడుతుందని వరం ఇచ్చాడు. ఆమే తాటక. ఎంతో అందచందాలతో ఎదిగింది. సుకేతుడు ఆమెను జంభాసురుడి కుమారుడైన సుందుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. వారిద్దరికి పుట్టిన వాడే మారీచుడు. ఒకసారి తాటక భర్త అయిన సుందుడు, అగస్త్య మునికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురై మరణించాడు. తన భర్త మృతికి కారణమైన అగస్త్యునిపై కోపంతో తాటక, మారీచుడితో కలిసి దాడికి సిద్ధపడింది. తనను చంపడానికి వస్తున్న ఆ ఇద్దరిని కూడా అగస్త్యుడు శాపించాడు. ఆ శాపం వల్ల మారీచుడు రాక్షసత్వాన్ని పొందాడు. తాటక తన సుందరమైన రూపాన్ని పోగొట్టుకుని వికృతమైన నరమాంస భక్షకురాలిగా మారిపోయింది. అగస్త్యుడి మీద కోపంతోనే తాటక, ఆయన సంచరించిన ఈ ప్రదేశాన్ని ధ్వంసం చేసింది. రాక్షస స్వభావంతో నిరపరాధులైన ఇక్కడి జనులను కబళిస్తోంది. 

ఇదంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, ''నాయనా! లోక కంటకిగా మారిన ఆ తాటకను నువ్వు చంపు. స్త్రీని చంపడం అధర్మమని సందేహించకు. ప్రజలకు మేలు చేకూర్చడమే రాజకుమారుడి ధర్మం కదా?'' అన్నాడు. 

దానికి రాముడు వినయంగా,  ''మహర్షీ! మీరు ఏమి చెప్పినా చేయమని నా తండ్రి నన్ను ఆదేశించారు. కాబట్టి నిస్సందేహంగా తాటకను వధిస్తాను'' అన్నాడు. 

అలా అంటూనే తన కోదండాన్ని ఎక్కుపెట్టి నారి సారించి వదలడం ద్వారా ధనుష్టంకారం చేశాడు. ఆ వింటినారి నుంచి వెలువడిన మహా ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆ భయంకర శబ్దం తాటకి చెవులను సోకింది. వెంటనే తాటక ఆవేశంతో నలుదిక్కులా చూసి, ఆ ధ్వని వినిపించిన వైపు వడివడిగా వచ్చింది. అక్కడ రామలక్ష్మణులు కనిపించారు. 

వికృతమైన ముఖంతో, మిక్కిలి లావైన, ఎత్తయిన శరీరంతో కోపావేశంతో వస్తున్న తాటకను చూసి రాముడు, లక్ష్మణుడితో ''చూశావా లక్ష్మణా ఈమె ఎంత భయంకరంగా ఉందో? ఈమెను చూస్తేనే సామాన్య జనం భయంతో గుండె పగిలి చనిపోతారు. ఈమె ముక్కు చెవులు ఖండించి పారిపోయేలా చేస్తాను'' అన్నాడు. కోపంతో చేతులు పైకెత్తి దూసుకు వస్తున్న తాటకను చూసి విశ్వామిత్రుడు ''రామలక్ష్మణులకు జయమగుగాక!'' అంటూ ఆశీస్సులు అందించాడు. ఈలోగా తాటక సుడిగాలిని సృష్టించి అక్కడంతా దుమ్ము, ధూళి రేగేలా చేసింది. తన మాయాశక్తితో కనబడకుండా రాళ్ల వర్షం కురిపించింది. రాముడు ఒక బాణంతో దుమ్మంతా చెదిరిపోయేలా చేసి, మరికొన్ని బాణాలతో రాళ్లను ఛేదించాడు. తాటక రెండు చేతులను కూడా ఖండించాడు. చేతులు తెగిపోయినా మీదకు వస్తున్న తాటకను లక్ష్మణుడు చూసి ముందుకు దూకి ఆమె ముక్కు చెవులను కోసేశాడు. కామరూపిణి అయిన తాటక తన మాయతో అనేక రూపాలు పొంది వారిని భ్రమపెట్టడానికి ప్రయత్నించింది. రాళ్ల వర్షం కురిపించసాగింది. ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు, వారిని అప్రమత్తం చేశాడు. ''రామా! ఈమెపై జాలి చూపించకు. పాపాత్మురాలైన ఈమె యజ్ఞయాగాలకు అవాంతరాలు కలిగిస్తూ ఉంటుంది. చీకటి పడితే రాక్షసులు మరింత బలం పుంజుకుంటారు. వెంటనే హతమార్చు'' అన్నాడు. 

వెంటనే రాముడు శబ్దవేధి బాణాన్ని సంధించి తాటకపైకి ప్రయోగించాడు. ఆ బాణం గుండెల్లో గుచ్చుకోవడంతో తాటక అక్కడికక్కడే మరణించింది. తాటక మరణించగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు. విశ్వామిత్రుడు పరమానందంతో రాముని ప్రశంసించి, ''మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు ఉదయం బయల్దేరి ఆశ్రమానికి చేరుకుందాం'' అన్నాడు. అయోధ్య నుంచి బయల్దేరాక మూడో రాత్రిని రామలక్ష్మణులు తాటక వనంలో గడిపారు. మర్నాడు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి