అయోధ్య నుంచి విశ్వామిత్రుడితో కలిసి బయల్దేరిన రామలక్ష్మణులు, నాలుగో రోజు రాత్రికి సిద్ధాశ్రమం చేరి అక్కడ విశ్రమించారు. మర్నాడు తెల్లవారుతూనే వాళ్లు స్నాన సంధ్యాదికాలు ముగించి, సర్వసన్నద్ధులై మునులందరి మధ్య ఉన్న విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించారు.
''మునీశ్వరా! యాగ సంరక్షణకు మేం సిద్ధంగా ఉన్నాం. రాక్షసులు ఎప్పుడు వస్తారో తెలియజేయండి'' అని వినయంగా అడిగారు.
ఆ మాటలు విని అక్కడ ఉన్న మునులందరూ ఎంతో సంతోషించి, ''నాయనలారా! నేటి నుంచి విశ్వామిత్ర మహర్షి ఆరు రోజుల పాటు మౌన దీక్షలో ఉంటారు. యాగం జరిగే ఈ కాలమంతా మీరు అప్రమత్తులై ఉండి యాగ రక్షణ చేయండి'' అన్నారు.
అప్పటి నుంచి రామలక్ష్మణులు ఆ సమీపంలోనే తిరుగుతూ ధనుర్బాణాలు ధరించి సిద్ధంగా ఉన్నారు. అయిదు రోజుల పాటు యాగం నిరాటంకంగా జరిగింది. ఆరో రోజు వేద మంత్రాల మధ్య యాగం సాగుతుండగా, ఆకాశం నుంచి ఒక భీకరమైన శబ్దం వినిపించింది. వర్షాకాలంలో కమ్ముకొచ్చే మేఘాల మాదిరిగా రాక్షసులు వడివడిగా అక్కడికి వచ్చారు. భయంకరులైన మారీచుడు, సుబాహుడు అనుచరులతో కూడి రాక్షస మాయలు ప్రయోగిస్తూ, ఆ యాగ ప్రదేశమంతా రక్త వర్షం కురిపించసాగారు. అది చూసిన రాముడు వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి లక్ష్మణుడితో, ''లక్ష్మణా! దుర్మార్గులైన ఈ రాక్షసులపైకి మానవాస్త్రాన్ని సంధిస్తున్నాను చూడు! ఇది పెనుగాలి మేఘాలను తరిమినట్లు వీళ్లను చెల్లాచెదరు చేస్తుంది'' అంటూ వెలుగులు చిమ్ముతున్న ఆ బాణాన్ని మారీచుడి గుండెలకు గురి చూసి వదిలాడు. ఆ దెబ్బకు మారీచుడు స్పృహ కోల్పోయి గాలిలో గిరగిరా తిరుగుతూ నూరు యోజనాల దూరం ఎగిరిపోయి ఎక్కడో సముద్రంలో పడిపోయాడు. ఆ తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహువు పైకి వదిలాడు. దాని ధాటికి వాడు నేల కూలి మరణించాడు. అదే వేగంతో రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి మిగిలిన రాక్షసులందరినీ కూడా తుద ముట్టించాడు.
యాగం పరిసమాప్తమయింది. మునులందరూ రామలక్ష్మణులను ఎంతగానో ప్రశంసించి పూజించారు.
విశ్వామిత్రుడు పరమానంద భరితుడై, ''రామా! నీ వల్ల యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నువ్వు నీ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టకున్నావు. ఈ సిద్ధాశ్రమం పేరు నిలబెట్టావు'' అంటూ మెచ్చుకున్నాడు.
ఆ రాత్రి ఆ ఆశ్రమంలో అందరూ నిశ్చింతగా నిద్రపోయారు. తెల్లవారుతూనే రామలక్ష్మణులు శుచులై, విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, ''మునీశ్వరా! మేము నీ సేవకులం. ఇంకా మేమేం చేయాలో ఆనతియ్యండి'' అని మృదు మధురంగా పలికారు.
విశ్వామిత్రుడితో సహా అక్కడి మునులందరూ కలసి, ''ఓ రామా! మిథిలా నగరానికి రాజయిన జనకుడు ఒక యాగాన్ని చేయబోతున్నాడు. మనమందరం అక్కడికి వెళ్దాం. మీరిద్దరూ కూడా రండి. అక్కడొక అద్భుతమైన ధనుస్సు ఉంది. సాటిలేని శక్తిగల ఆ ధనువు శత్రువులకు భయంకరమైనది. దాన్ని ఎక్కుపెట్టడానికి గంధర్వులు, అసురులు, రాక్షసులు, దేవతలు సైతం సరిపోరు. దాని శక్తిని తెలుసుకోడానికి ఎందరో రాజులు, రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు.'' అంటూ వివరించారు.
ఆ ధనువే శివధనుస్సుగా పేరు పొందింది. పూర్వం శివుడి భార్య సతీదేవి, తన తండ్రి దక్షుడు తలపెట్టిన యజ్క్షానికి ఆహ్వానించకపోయినా వెళ్లి, అవమాన పడి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు, ఈ ధనువునే ఉపయోగించి శివుడు ఆ యాగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఆయన దాన్ని దేవతలకు ఇచ్చివేశాడు. మిథిలా నగరానికి ఒకప్పటి రాజైన దేవరాతుడు ఒక యాగం చేసినప్పుడు దేవతలు ఈ ధనుస్సును
ఆయనకు బహూకరించారు. అప్పటి నుంచి అది ఆ వంశీయులచే పూజలందుకుంటూ ఉంది.
విశ్వామిత్రుడు చెప్పిన మీదట రామలక్ష్మణులు వారందరితో కలిసి మిథిలకు బయల్దేరారు. యాగ సంరంభాలతో కూడిన వంద వాహనాలతో కలిసి వారంతా కదిలారు. విశ్వామిత్రుడు అక్కడి వనదేవతలకు నమస్కరించి వీడ్కోలు తీసుకుని నడవసాగాడు. ఆ ఆశ్రమంలోని జంతువులు, పక్షులు కూడా వారి వెంట సాగుతుండగా, కొంత దూరం తర్వాత విశ్వామిత్రుడు ప్రేమతో వాటిని వారించి వెనుకకు పంపేశాడు. ఆ రోజంతా ఉత్తర దిశగా ప్రయాణించి వాళ్లందరూ సూర్యుడు అస్తమించే వేళకి శోణ నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదిలో స్నానసంధ్యాదికాలు పూర్తి చేశాక విశ్వామిత్రుడితో రాముడు ''మహాత్మా! దట్టమైన వృక్షాలతో ఉన్న ఈ ప్రదేశం ఎవరిది?'' అంటూ కుతూహలంగా ప్రశ్నించాడు. అందుకు విశ్వామిత్రుడు ఆ ప్రదేశానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చెప్పాడు.
ఆ కథేంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి