ఆదివారం, ఫిబ్రవరి 09, 2025

మరుగుజ్జులుగా మారిన అప్సరసలు! (పిల్లల కోసం రాముడి కథ-12)

మారీచుడు, సుబాహుడు మొదలైన రాక్షసుల్ని చంపి సిద్ధాశ్రమంలో యాగాన్ని సంరక్షించిన రామ లక్ష్మణులు, ఆ మర్నాడు విశ్వామిత్రుడి సూచనపై అతడి వెంట మిథిలా నగరానికి బయల్దేరారు. ఆ సాయంత్రానికి శోణ నదీ తీరానికి చేరుకున్నాక, ఆ ప్రదేశం ఎవరిదని రాముడు కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు విశ్వామిత్రుడు ఆ కథతో పాటు, తన వంశానికి సంబంధించిన వివరాలను కూడా చెప్పుకొచ్చాడు.

''రామా! పూర్వం బ్రహ్మ మనసు నుంచి పుట్టిన కుశుడనే మహా తపస్వి ఉండేవాడు. ఆయనే మా వంశానికి మూల పురుషుడు'' అంటూ మొదలు పెట్టి ఇలా చెప్పాడు.

''బ్రహ్మ మానస పుత్రుడైన కుశుడు, వైదర్భి అనే రాకుమారిని పెళ్లి చేసుకుని నలుగురు కుమారులను కన్నాడు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో తన కుమారులతో భూమిని పంచుకుని న్యాయంగా ప్రజలను పరిపాలించమని ఆదేశించాడు. అప్పుడు ఆ నలుగురు కుమారులూ నాలుగు నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు. కుశాంబుడు కౌశాంబీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. కుశనాభుడు మహోదయమనే మహానగరాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఆధూర్తరజసుడు ధర్మారణ్యమనే పురాన్ని కట్టుకున్నాడు. వసువు అనేవాడు గిరివ్రజమనే నగరాన్ని నిర్మించుకున్నాడు. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఆ గిరివ్రజంలోదే. ఈ దేశం చుట్టూ అయిదు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలో పుట్టిన శోణానది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఈ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తోంది'' అంటూ వివరించాడు.

ఆపై ఆయన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పసాగాడు.

''రామా! కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడొకడు ఉన్నాడని చెప్పాను కదా! ఆయన భార్య ఘృతాచి అనే అప్సరస. వీళ్లకి వంద మంది అందమైన ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకసారి ఆ నూరుమంది కన్యలూ చక్కగా అలంకరించుకుని వన విహారానికి వెళ్లారు. ఆట పాటలతో ఆనందిస్తున్న వారిని చూసిన వాయుదేవుడు మోహించాడు. ఆయన వారి ముందుకు వచ్చి, ''మీరందరూ నన్ను పెళ్లి చేసుకోండి. మీరందర్నీ ముసలితనమూ, చావూ లేని దేవతలుగా మారుస్తాను'' అంటూ బలవంతపెట్టాడు. 

అందుకు ఆ కన్యలందరూ ముక్తకంఠంతో తిరస్కరించారు. ''అన్ని జీవులలోనూ ప్రాణ రూపంలో ఉండే నీ ప్రభావం గురించి మాకు తెలుసు.  నువ్వెందుకు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నావు? మేం కుశనాభుడి కుమార్తెలం. మా త్రండి ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటాం. నువ్వు దేవుడవే అయినా దుర్భిద్ధి చూపుతున్నావు. మేం తల్చుకుంటే నీ దివ్యశక్తులను కూడా తీసివేయగలం. కానీ మా తపశ్శక్తి తగ్గిపోతుందని అలా చేయడం లేదు'' అంటూ కచ్చితంగా చెప్పేశారు. 

వాళ్ల మాటలు విన్న వాయుదేవుడు కోపించి వారిని మరుగుజ్జులుగా మార్చేశాడు. వాళ్లంతా ఏడుస్తూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. 

అంతా విన్న కుశనాభుడు ''కుమార్తెలారా! మీరందరూ ఒకే మాటపై నిలబడి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. మీరు ఆ వాయుదేవుడిని క్షమించి వదిలి పెట్టడం మరింత గొప్ప విషయం. దాన యజ్ఙాల వల్ల కలిగే గొప్ప ఫలాలన్నీ కూడా, క్షమా గుణం వల్ల లభిస్తాయి. మీ అంతటి క్షమను కలిగి ఉండడం దేవతలకు కూడా సాధ్యం కాదు'' అంటూ ప్రశంసించి, ఆపై జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచన చేశాడు. తన కుమార్తెలకు పెళ్లి చేయాలని నిర్ణయించి తగిన వరుడి కోసం మంత్రులతో చర్చించాడు.

ఆ కాలంలోనే చూళి అనే మహాముని ఉండేవాడు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేసుకుంటున్న సమయంలో సోమద అనే ఓ గంధర్వ కన్య ఆయనకు సపర్యలు చేసేది. ఆమె సేవలకు సంతోషించిన చూళి మహాముని ఒక రోజు, ''నీకేం వరం కావాలో కోరుకో'' అని అడిగాడు. అందుకామె వినయంగా నమస్కరించి, ''స్వామీ! నేను ఎవరికీ భార్యను కాను. పవిత్రురాలను. మీ బ్రహ్మతేజస్సు ప్రభావంతో ఒక పుత్రుడిని ప్రసాదించండి'' అని కోరుకుంది. అప్పుడాయన తన మనస్సు నుంచి బ్రహ్మదత్తుడనే కుమారుడిని అనుగ్రహించాడు. ఆ బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. కుశనాభుడు ఆ బ్రహ్మదత్తుడిని ఆహ్వానించి తన కుమార్తెలతో పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడు ఆ నూరుగురు అమ్మాయిల చేతులను వరసగా తాకగానే, వారికి ఉన్న వాయు దోషము తీరిపోయి, తిరిగి చక్కని అందగత్తెలుగా మారిపోయారు'' 

ఈ కథంతా చెప్పిన విశ్వామిత్రుడు తన పుట్టుక గురించి కూడా చెప్పాడు.

''రామా! ఆ కుశనాభుడు తన వంద మంది కుమార్తెలకు వివాహం చేశాక, పుత్రుడి కోసం పుత్రకామేష్ఠి యాగాన్ని ఆచరించాడు. ఫలితంగా ఆయనకు గాధి అనే కుమారుడు కలిగాడు. ఆ గాధియే నా తండ్రి. నేను కుశ వంశంలో పుట్టాను కాబట్టి నాకు కౌశికుడు అనే పేరు కూడా ఏర్పడింది. గాధి మహారాజుకు నాతో పాటు సత్యవతి అనే కుమార్తె కలిగింది. కుశ వంశంలోనే పుట్టింది కాబట్టి ఆమెకు కౌశికి అనే పేరు కూడా ఉంది. ఆమె మహా పతివ్రత. శరీరంతో స్వర్గానికి చేరింది. ఆమే కౌశికి అనే పేరుతో హిమాలయాల్లో నదిగా మరి భూతలంలో ప్రవహిస్తోంది. ఆమె మీద మమకారంతోనే నేను హిమాలయాల్లో ఉంటాను. సిద్ధాశ్రమానికి యాగం కోసమే వచ్చాను. నీ పరాక్రమం వల్ల యాగం చక్కగా పూర్తయింది'' అంటూ విరమించాడు. 

ఆ రాత్రి వారందరూ శోణ నదీ తీరంలో విశ్రమించారు. అయోధ్య నుంచి బయల్దేరిన రామలక్ష్మణులకు ఇది పదకొండవ రోజు. మరుసటి రోజు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి