బుధవారం, జులై 30, 2025

మాస్‌ సినిమాలకు తగ్గని 'మహావతార్‌'!


చప్పట్లు...

ఈలలు...

కేకలు...

ఇవన్నీ థియేటర్లో వినిపిస్తున్నాయంటే ఏంటి దానర్థం?

అది మాస్‌ సినిమా అయ్యుండాలి...

హీరో ఇమేజ్‌ అదిరిపోయి ఉండాలి...

పాటలు ఉర్రూతలూగిస్తూ ఉండాలి...

ఫైట్లు, డ్యాన్సులు ఆకట్టుకుని ఉండాలి...

కానీ ఇవేమీ లేకుండాలనే థియేటర్‌ చప్పట్లు, ఈలలు, కేకలతో సందడిగా మారితే?

అది చాలా అరుదైన విషయమే!

అదే జరుగుతోంది ఇప్పుడు చాలా థియేటర్లలో...

అయితే అది మాస్‌ సినిమానా? కాదు!

అగ్ర కథానాయకుడి సినిమానా? కాదు!

హీరో హీరోయిన్ల డ్యాన్సులు అదిరాయా?

అబ్బే... అసలు డ్యూయెట్లే లేవు!

పోనీ హాలీవుడ్ యాక్షన్‌ సినిమానా? కానే కాదు!

చిత్రంగా ఉందే... ఇంతకీ ఏంటా సినిమా?

సాదాసీదా భక్తి సినిమా!

అందరికీ తెలిసిన కథతో తీసిన సినిమా!

మామూలు యానిమేషన్‌ సినిమా!

అదే... ''మహావతార్‌ నరసింహ'' సినిమా!

పెద్దగా ప్రచారం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన  ఈ యానిమేషన్‌ సినిమాకు తల్లిదండ్రులు పనిగట్టుకుని పిల్లలతో కలసి వస్తున్నారు. ఒకరికొకరు చెప్పుకుని మరీ చూస్తున్నారు. సినిమాలో చాలా చోట్ల ఈతరం పిల్లలు, నవతరం యువతీ యువకులు చప్పట్లు, ఈలలు, కేకలతో థియేటర్లను ఊదరగొడుగున్నారు.

అవడానికి ప్రహ్లాదుడి కథే! హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోతే వరాహస్వామి అవతరించడం, హిరణ్యకశిపుడు గొంతెమ్మ కోరికలు కోరుతూ తపస్సు చేస్తే బ్రహ్మ వరాలివ్వడం, ఆ వరగర్వంతో విష్ణు ద్వేషిగా మారి అకృత్యాలు చేయడం, తన కొడుకు ప్రహ్లాదుడే హరి భక్తుడవడంతో

నానా కష్టాలూ పెట్టడం, ఆఖరికి విష్ణువు నరసింహ స్వామిగా అవతరించి, బ్రహ్మ వరాలకు అనుగుణంగానే హిరణ్యకశిపుడిని సంహరించడం!

ఈ కథతో గతంలో దాదాపు అన్ని భాషల్లో పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్ములు వచ్చాయి. తెలుగులోనే రెండు మూడు సినిమాలు వచ్చాయి.

అయినా ఇది ఈతరం వాళ్లని బాగా ఆకట్టుకుంటోందనడానికి థియేటర్లలో సందడే కాదు, వసూళ్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలే.

రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ 141 నిమిషాల యానిమేషన్‌ సినిమా జులై 25న విడుదలై ఆరు రోజుల్లోనే దాదాపు రూ. 38 కోట్లు వసూలు చేసిందంటే చెప్పుకోదగ్గ విషయమే.

సినిమా దర్శుకుడు అశ్విన్‌ కుమార్‌. ఎడిటింగ్‌ కూడా అతడే. రచనలో కూడా భాగస్వామ్యం ఉంది.

బాగా తెలిసిన పురాణ కథే అయినా, అందులోనూ యానిమేషన్‌ సినిమానే అయినా ఓ కమర్షియల్‌, మాస్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ''మహావతార్‌ నరసింహ'' సినిమాను తెరకెక్కించిన అతడిని అభినందించాల్సిందే.

అందులోనూ... సినిమాకు వచ్చినా వెండితెర మీద కన్నా చేతిలోని సెల్‌ ఫోన్‌ తెరమీదే దృష్టి నిలిపే ఈతరం వాళ్లని కూడా ఆకట్టుకునేలా తీసినందుకు మెచ్చుకోవలసిందే.

పౌరాణిక సినిమాలనగానే పురాణాల్లోని మూల కథకి సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు కల్పనలు జోడించి ప్రేక్షకుల మీదకు వదిలేసిన అనేక సినిమాల్లాంటిది కాదిది.

సినిమా మొదట్లోనే చెప్పినట్టు.... పురాణాలను గౌరవిస్తూ, మూలకథకి ఎక్కడా భంగం కలగకుండా తీయడం ఓ మంచి విషయం. ఇందులోనూ కల్పనలు ఉన్నా, కొంత డ్రామాను జోడించినా, నేటి తరానికి తగ్గట్టుగా తీసినా... ఎక్కడా మితి మీరకుండా, పాత్రల ఔచిత్యానికి అనుగుణంగా తీయడం మరో గొప్ప విషయం. 

తీసేలా తీస్తే, భావోద్వేగాలను చక్కగా వ్యక్తీకరించగలిగితే, తగిన సన్నివేశాలతో కథను మలచగలిగితే అది పురాణ కథ అయినా, భక్తి కథ అయినా, మరే కథ లయినా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమా చర్చల దగ్గర నుంచి తెరకెక్కేవరకు చూసుకుంటే దాదాపు నాలుగున్నరేళ్లు  పట్టింది. 

ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిత్రం యూనిట్‌ వాళ్లెవరూ మాంసాహారాన్ని ముట్టుకోలేదు. కొందరైతే ఏకాదశి ఉపవాసాలు సైతం చేశారు. 

అంతటి భక్తి శ్రద్ధలతో తీశారు కాబట్టే... ఓ యానిమేషన్‌ అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమాగా ఇది అందరినీ అలరిస్తోంది. 

'మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌'లో భాగంగా తలపెట్టిన ఏడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. విష్ణుమూర్తి పది అవతారాలపై తీయనున్న సినిమాల్లో మొదటిది ఇది. ఈ సినిమాలన్నీ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రానున్నాయి.

ఈ సినిమా తర్వాత 'మహావతార్‌ పరశురామ్‌' (2027), 'మహావతార్‌ రఘునందన్‌' (2029), 'మహావతార్‌ ద్వారకాధీశ్‌' (2031), 'మహావతార్‌ గోకులనంద' (2033), 'మహావతార్‌ కల్కి'-1 (2035), 'మహావతార్‌ కల్కి-2' (2037) సినిమాలను రూపొందించే పనిలో దర్శక నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు లక్ష్యాలు పెట్టుకున్నారు. హోంబాలే ఫిలింస్‌, క్లీం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రానున్న ఈ సినిమాలన్నీ విజయవంతం కావడంతో పాటు నవతరం ప్రేక్షకులకు హిందూ పురాణ కథలను మరోసారి అద్భుతంగా పరిచయం చేస్తాయని ఆశిద్దాం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి