మంగళవారం, డిసెంబర్ 09, 2025

జీవం... ఓ అద్భుతమైన ప్రకాశం



జీవం అంటేనే వెలుగు. ప్రకాశం. సృష్టికి మూలం ఈ ప్రకాశమే.

అలాంటి ఓ అద్భుతమై ప్రకాశాన్ని జీవ శాస్త్రవేత్తలు చూడగలిగారు. సృష్టికి మూలమైన ఆ కాంతి పుంజాన్ని చూడడమే కాదు, తొలి సారిగా ఫొటో కూడా తీయగలిగారు.

జీవం ఏర్పడే ఆ క్షణంలో సూక్ష్మంగా విరజిమ్మిన ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు.

ఇది జీవ శాస్త్రంలో చోటు చేసుకున్న ఓ అరుదైన, అద్భతమైన ఆధునిక విజయం.

వీర్యకణం, అండాన్ని చేరుకున్న తరుణంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించారు.

జీవం ఏర్పడడానికి తొలి దశ అయిన ఆ అపురూప క్షణంలో మెరుపు లాంటి ఓ ప్రకాశం వెల్లివిరుస్తుందని గమనించారు. దీనికి ‘జింక్ స్పార్క్’ అని పేరు పెట్టారు.

వీర్యకణం విజయవంతంగా అండాన్ని చేరే క్షణంలో ఈ ప్రకాశం ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో అండం మిలియన్ల సంఖ్యలో జింక్ అయాన్లను ఒక్కసారిగా విడుదల చేస్తుంది. అది కేవలం క్షణంలో జరిగే మెరుపువంటి ప్రక్రియ. అత్యంత శక్తివంతమైన మైక్రోస్కోపులతో మాత్రమే చూడగలిగేది. మొదట ఈ ఘటనను ఎలుకల అండాలలో గమనించారు. తరువాత అదే ప్రక్రియ మానవ అండాలలో కూడా జరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. దీనితో జీవం మొదలయిందనడానికి చిన్న మెరుపు ఒక సంకేతమని తేలింది.

జీవ సంకేతమైన ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ మెరుపు, ఆ కాంతి పుంజం... అందంగా, అద్భుతంగా గోచరమైంది. అంతే కాదు, ఫలదీకరణ విజయవంతమైందనడానికి... ఆ వెలుగే ఓ ఆరంభమని సూచించే అరుదైన శాస్త్రీయ ఆవిష్కరణ ఇది.

దాని అందం ఒక్కటే కాదు—ఈ జింక్ స్పార్క్ ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇది ఫలదీకరణ నిజంగా విజయవంతమైందని ఖచ్చితంగా తెలియజేసే సంకేతం.  భ్రూణ శాస్త్రవేత్తలకు, ఫెర్టిలిటీ నిపుణులకు ఈ ఆధునిక ఆవిష్కరణ... గర్భధారణ ప్రక్రియను మరింతగా అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి సహాయపడే కొత్త సాధనంగా మారనుంది.

ఒక జీవితం ప్రారంభమయ్యే క్షణాన్ని అక్షరాలా వెలుగులా చూడగలగడం ఎంత విస్మయకరమో ఇదంతా తెలియజేస్తుంది. సూక్ష్మ ప్రపంచంలో జరిగే ఈ మెరుపు, కొత్త జీవం ప్రారంభమయ్యే ఆ నిమిషానికే ప్రకృతి ఇచ్చే ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వేడుకవంటిది. జీవం ఎంత సున్నితమైనదో, ఎంత ఖచ్చితమైనదో, ఎంత అద్భుతమైనదో ఇది గుర్తు చేస్తుంది.

 

గురువాయూర్ మహిమ





 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్‌ ఒకటి. 

🌹ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గురువాయురప్పన్‌గా వెలిసి భక్తజన కల్పవృక్షంగా భాసిస్తున్నాడు. 

🌹ఈ క్షేత్రంలోనే "నారాయణీయం " అన్న స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మానవుడు ఎదుర్కొనే ఆధి "వ్యాధులు"  హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఇది "" మేల్పుత్తూర్‌ నారాయణ భట్టతిరి""  సంస్కృతంలో స్తోత్ర రూపంలో చేసిన అద్భుత రచన. దీని ఆవిర్భావం వెనుక ఆసక్తికర కథ ఒకటి ప్రచారంలో ఉంది.

🌹పదహారేళ్ల ప్రాయానికే వేదాధ్యయనాన్ని, సంస్కృత వ్యాకరణాన్ని ఆపోశన పట్టిన అసమాన ధీశాలి నారాయణ భట్టతిరి. తన గురువైన "అచ్యుతపిషారతి"  క్షయ వ్యాధితో బాధ పడుతుండటం చూసి నారాయణ భట్టతరి ఎంతో కుమిలిపోయాడు. గురుదక్షిణగా ఆ వ్యాధిని భగవత్‌ ప్రార్థనతో తనకు బదిలీ చేసుకుంటాడు. తరువాత గురువాయూర్‌ చేరుకుని తన వ్యాధిని తగ్గించమని వేడుకుంటూ "రోజుకు ఒక దశకం"  చొప్పున స్తుతి చేయడం ప్రారంభించాడు. ప్రతి శ్లోకం చివర తన వ్యాధిని నయం చేయమని భగవంతుడిని వేడుకుంటాడు.

🌹ఈ విధంగా 1036 శ్లోకాలు పూర్తయ్యేసరికి ఆయన వ్యాధి పూర్తిగా తగ్గడంతో పాటు దైవ సాక్షాత్కారం కూడా లభించింది. వేదవ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాలతో రచించిన భాగవతానికి సంక్షిప్త రూపంగా అసాధారణ ప్రజ్ఞతో నారాయణీయం రచించాడు భట్టతిరి. ఇప్పటికీ గురువాయూర్‌ దేవాలయంలో ఈ పారాయణాన్ని చేయడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నారాయణీయం మొత్తం పారాయణం చేయలేని వారి కోసం ఒక దగ్గరి దారిని చూపారు.

🌹అస్మిన్‌ పరాత్మన్‌ నను పాద్మకల్పే
త్వమిత్థ ముత్థాపిత పద్మయోనిః
అనంత భూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయవాస విష్ణో

🌹నారాయణీయంలోని ఎనిమిదో దశకంలోని పదమూడవ శ్లోకం ఇది. నిత్యం 108 సార్లు చొప్పున, 48 రోజులు పాటు భక్తి విశ్వాసాలతో ఈ శ్లోకం పారాయణం చేస్తే వైద్యానికి లొంగని మొండి రోగాలు సైతం ఉపశమిస్తాయని ప్రతీతి. పరమాచార్యుల సూచన మేరకు శ్లోకపారాయణం చేసి ప్రయోజనం పొందిన వారెందరో ఉన్నారు...

మన కర్మలకు పద్దెనిమిది మంది సాక్షులు





🍁👉🏾చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ...

🍁👉🏾‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి "" మూగ సాక్షులు""  పద్దెనిమిది ఉన్నాయి. 

🌹👉🏾అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. 

🍁👉🏾ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.

🍁👉🏾దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.

🌹👉🏾అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.

🍁👉🏾నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.