ఎక్కడికి వెళ్లినా సెల్‌ఫోన్ పైకెత్తి అందులోని కెమేరాతో ఓ సెల్ఫీ కొట్టకపోతే తోచదు కదా! ఆ సెల్ఫీని చూసుకుని మీరు మురిసిపోయి మీ స్నేహితులందరికీ పంపిస్తారవునా?
కానీ ఎవరూ వెళ్లలేని చోట తీసుకున్న సెల్ఫీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ సెల్ఫీని ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కరంగా చూస్తోంది. అంతేకాదండోయ్... అందులో ఓ 'డెవిల్' కూడా ఉందని గమనించారు. ఇంతకీ ఏంటా సెల్ఫీ? ఎవరు తీసుకున్నారు? ఎక్కడ? ఆ దెయ్యం ఏంటి?
.... ఇవన్నీ తెలుసుకోవాలంటే చదువుకోండి మరి.
ఆ సెల్ఫీ భూమ్మీద తీసినది కాదు. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో తీసుకున్నది!
తీసుకున్నది ఎక్కడో తెలుసా? మార్స్ గ్రహం మీద!
తీసిందెవరనుకుంటున్నారు? నాసా వాళ్లు అక్కడికి పంపిన రోవర్! రోవరంటే తెలుసుగా? వేరే గ్రహాల మీద పరిశోధనల కోసం వేర్వేరు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు పంపే ఓ చిన్న రోబో వాహనం అన్నమాట. దాని పేరు పెర్ సెర్వరెన్స్ రోవర్. దీన్ని అమెరికా వాళ్లు అక్కడికి పంపి 1500 మార్షియన్ డేస్ అయింది. ఆ సందర్భంగా అదొక సెల్షీ తీసుకుని భూమికి పంపించింది. ఒక మార్షియన్ డే అంటే సుమారు 24 గంటల 39 నిమిషాలు. ఇంచుమించు మన భూమి మీద రోజుతోనే సమానం. దాన్ని మన భూమి రోజుల్లోకి మారిస్తే అది సుమారు నాలుగేళ్ల రెండు నెలలతో సమానం. ఈ రోవర్ 2021 ఫిబ్రవరిలో మార్స్ గ్రహం మీద దిగింది. ఈ నాలుగేళ్లూ అదక్కడ ఏం చేసిందయ్యా అంటే... తన బుల్లి బుల్లి చక్రాల సాయంతో 22 మైళ్లు చక్కర్లు కొట్టింది. 37 బండల్ని తొలిచి వాటిలో ఏముందో చూసింది. మరో 27 మార్స్ ఉపరితలం శాంపిల్స్‌ను తీసుకుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ రోవరూ పంపనంత సమాచారాన్ని భూమికి పంపించింది. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుందో పరిశోధించడానికి ఇవన్నీ చాలా విలువైన వివరాలన్నమాట.
ఇంతకీ సెల్షీ ఎక్కడ తీసుకుందో తెలుసా? మార్స్ మీద 'జెజొరో' అనే ఓ బిలం ఉంది. దాని పక్కనే 'విచ్ హాజిల్' అనే కొండ ఉంది. రోవర్ గారు ఆ ఎత్తయిన ప్రదేశానికి ఎక్కి అక్కడి నుంచి చకచకా సెల్ఫీలు తీసుకుని 'చూసుకోండ్రా' అన్నట్టు భూమ్మీదకి పంపేసింది. వాటన్నింటినీ ఇక్కడి అంతరిక్ష పరిశోధకులు కొన్ని నెలలుగా క్షుణ్ణంగా పరిశీలించారు.
అలా చూస్తుంటేనే వాటిలో ఓ 'దెయ్యం' కనిపించింది!
ఏంటా దెయ్యం?
మార్స్ మీద దెయ్యమా? అమ్మో! అని భయపడకండి. అది శాస్త్రవేత్తలు పెట్టిన పేరు. రోవర్‌కి మూడు మైళ్ల దూరంలో దుమ్ము ధూళితో కూడిన ఓ పెద్ద సుడిగాలి అన్నమాట. దీన్ని 'డస్ట్ డెవిల్' అని పిలుస్తున్నారు. రోవర్‌గారు పంపిన 59 సెల్ఫీలను క్రోడీకరించి ఒకే పెద్ద దృశ్యంగా మార్చినప్పుడు అందులో ఓ డస్ట్ డెవిల్ కనిపించిందన్నమాట. 'ఇలాంటి సమాచారాన్ని, ఫొటోలను విశ్లేషించినప్పుడు ఆ గ్రహం గురించి ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు తెలస్తాయి' అంటూ కాలిఫోర్నియాలోని అంతరిక్ష పరిశోధకులు తెగ సంబరపడిపోతున్నారు. అదన్నమాట... ఈ అరుదైన సెల్షీ, అందులో దెయ్యం కథ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి