కుతంత్ర రాజకీయం
'నమస్కారం గురూగారూ!'
'ఏంట్రోయ్ శాన్నాళ్లకి కనిపించావ్? సేతిలో ఏటది... పుత్తకమా?'
'అవునండి. విజయానికి 116 మెట్లని ఎవరో రాశారండి, చూద్దామని కొన్నా'
'వార్నీ, అందుకే నువ్వింకా ఎదగలేదొరే... ఇజయం సాధించాలంటే అడ్డదార్లు ఎతకాలి! మెట్లెవరికి కావాల్రా? మోకాళ్లు అరిగేట్లు ఎక్కద్దూ?'
'మరందుకేనండి. ఆ అడ్డదార్లేవో చెబుతారనే పుస్తకం కొనగానే ఇలా వచ్చా...'
'పోన్లే, బతికించావ్. ఇన్నాళ్లూ రాకపోతే నువ్వేమన్నా నా మీద కుట్రలు సేత్తన్నావేమో అనుకున్నా...'
'అయ్యబాబోయ్ అదేంటండీ బాబూ! మీ మీద కుట్రా? కలలో కూడా అనుకోనండి...'
'కలలో సంగతలా ఉంచు. ఇలలో మాత్రం నువ్వెన్ని కుట్రలు సేసైనా కుట్ర సంగతేంటో తెలుసుకోవాల్రా...'
'ఈ కుట్రల గొడవేంటండి బాబూ, సరిగా చెప్పండి...'
'ఏం లేదురా. కుట్రలు సేయడం వేరు. ఎదుటోల్లు కుట్ర సేశారని గగ్గోలు పెట్టడం వేరు. ఈ రెంటికీ తేడా తెలుసుకో ముందు. రాజకీయాల్లోకి రాగానే నువ్వెలాగా కుట్రలే మొదలెడతావు. ఏ పథకాన్ని అడ్డవెట్టుకుని ఎలా దోసుకోవాలన్న కాన్నుంచి, నీ నిజ రూపం జనానికి తెలీకుండా ఎలా జో కొట్టాలనేంత వరకు నీయన్నీ కుట్రలని పెత్తేకంగా సెప్పాలా? నేను సెప్పబోయేది ఆటి గురించి కాదు. సీటికీ మాటికీ ఎదుటోన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆడే నీపై కుట్రలు సేత్తన్నాడని ఎదురెట్టి బురదెయ్యాల. అప్పుడాడు కాదని సెప్పుకోడానికి నానా తంటాలూ పడతాడు. ఒకేల ఆడు నీ వంకర మాటలు పట్టించుకోకుండా వూరుకున్నాడనుకో, కాదన్లేదు కాబట్టి నిజమే కాబోలని జనం నమ్మేత్తారు. అర్దమైందా?'
'అబ్బో... ఇది రెండు విధాలా ఉపయోగపడే కుట్రన్నమాటండి...'
'సురుకైన వోడివే కానీ, ఇదొట్టి రెండిందాలే కాదు, వందిందాల పనికొచ్చే మాట. కిందపడినా అనచ్చు, మీదకి సేరినా అనచ్చు...'
'కిందున్నప్పుడైతే సరేగానీండీ, పైకెదిగాక ఎలా ఉపయోగపడుతుందండీ?'
'బలేవోడివే. నీ మీద కుట్రల్ని పెజానీకం నమ్మలేదని, తిప్పికొట్టిందని వాడేసుకోవచ్చు. అర్దమైందా?'
'భేషుగ్గానండి! ఇక ఈ కుట్రని వదలనంటే నమ్మండి. ఇంకా ఏయే సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుందో చెబుతారా?'
'ఒహటని కాదురా. దేనికైనా అడ్డమేసుకోవచ్చు. చివరాకరికి నువ్వు సేసిన కుట్రపన్లు బయటపడి అరెస్టులు గట్రా అయినా ఇది పనికొత్తాదిరా...'
'అప్పుడెలా పనికొస్తుందండీ?'
'ఏముందిరా... అరెస్టయ్యాక నీ సేతికి బేడీలేత్తారా? అన్నన్నన్నా... నేనెంత గొప్పోన్నీ, నా ఇలువేంటీ, ఇంతలేసి నీచపు పన్లు సేసాను కదా... నాక్కూడా మామూలు నేరగాడికేసినట్టు ఇనుప సంకెల్లు ఏత్తారా? బంగారు బేడీలెయ్యద్దా? ఇది నన్ను అవమానింసినట్టు కాదా? కావాలనే కుట్ర పన్ని ఇలా సేసారని గోలెట్టొచ్చు. జైల్లో ఏశారనుకో, వజ్రాలు పొదిగిన ఊసలు లేవుకాబట్టి ఇదంతా కుట్రనొచ్చు. వెండి కంచంలో అన్నవెట్టకుండా సీవండి బొచ్చెలో ముద్దేశారు కాబట్టి... కుట్రకాక మరేంటని ఎదురెట్టొచ్చు. నీపై విసారణ సేసిన అధికారిది, నిన్ను పట్టుకున్న పోలీసోడిది, నీకు సిచ్చేసిన జడ్జిగోరిది, ఆ వార్తలు రాసిన ఇలేకర్లది, ఇంటికి పేపరేసే కుర్రాళ్లది, ఆకరికి నీ జైలు గదికి కాపలాకాసే సెంట్రీది కూడా... కుట్రేననొచ్చు. రాసుకుంటన్నావా?'
'ఓ రాసుకున్నానండి. కుట్ర పదం వెనక ఇన్నేసి కుట్రలున్నాయన్నమాట. ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చెబుదురూ?'
'అంటిపండొలిచినట్టు అన్నీ సెబుతారేంట్రా? కుసింత అందిస్తే మిగతాది అల్లుకుపోవాల. అయినా అమాయకుడివి కాబట్టి ఇసదంగా ఇవరిత్తా. ఉదారనకి నువ్వు రోడ్డు మీదకొచ్చాక సెప్పు కరిసిందనుకో- అది కిట్టనోడి కుట్రేననాల. ఆడే రాత్రేల సెప్పులు మార్సేసాడనాల. ఈదిలో నడుస్తుంటే నెత్తిమీద కాకి రెట్టేసిందనుకో... అదీ అంతేననాల. ఆ కాకి ముందు మా ఇంటిమీద వాలి, ఆనక ఆడింటిమీద వాలిందనీ, అది కిట్టక నేను బయటకొచ్చినప్పుడే ఆడు ఉస్సుస్సని దాన్నదిలించాడనీ, అంచాతే నా నెత్తిమీద రెట్టేసిందనీ ఆరోపించాల. నీ కారు సెక్రానికి పంచరైందనుకో, ఎగస్పార్టీవోడు మేకులిసిరించాడనాల. నీ పెన్ను కక్కిందనుకో, ఇంకు ఆడిదేననాల. సివరాకరికి మీ ఆవిడ కొన్న వంకాయల్లో పుచ్చులున్నా, పొద్దుటేలే కూరలమ్మినోడు ఎగస్పార్టీవోల్ల మడిసనాల. ఇంత అడ్డగోలుగా దూసుకుపోయావనుకో. నయా రాజకీయాల్లో నీకిక డోకా ఉండదొరే...'
'అబ్బబ్బబ్బ... ఏం చెప్పారండీ? కానీ మరీ ఇంత చవగ్గా కుట్రలు ఆపాదిస్తే జనం నమ్ముతారాని...'
'మరీ నమ్మరనిపిత్తే నీ తరపున ఓ పేపరెట్టుకో. దాన్లో ఇంకు బదులు బురద నింపి అచ్చేయించుకో. రోజూ అదే దరువేత్తే నమ్మక సత్తారా? ఇయ్యాల ఏం ఏడిశావో సూడ్డానికైనా రోజూ కొంటారు'
'మరి... ఇన్ని పన్లుచేసి ప్రజల దగ్గర మొహం ఎలా చూపించాలండీ... సిగ్గేయదూ?'
'సిగ్గు మాట నీ నోట ఇనిపించిందంటే నువ్వు రాజకీయాలకి పనికి రావనే అర్థం. కాబట్టి దాన్నొదిలెయ్. ఇక పెజానీకం దగ్గరకి ఎప్పుడెల్లినా ఏడుపు మొగం పెట్టుకుని ఎల్లాల. లోకమంతా ఏకమై నిన్ను పెజాసేవ సేయనీయట్లేదన్నంత జాలిగా మొగమెట్టాల. అదే జైలుకెల్లేప్పుడు మాత్రం పెద్ద గనకార్యం సేసినట్టు నవ్వుతా, సేతులూపుతా ఎల్లాల... సిద్విలాసంగా వేనెక్కాల. అర్దమైందా?'
'ఆహా... మీ దగ్గరికొస్తే దివ్యోపదేశం లభిస్తుందండి. విజయానికి అడ్డగోలు దార్లని మీరో పుస్తకం రాస్తే లక్షల్లక్షలు అమ్ముడు పోతుందండి'
'మరీ ఎక్కువ పొగుడుతున్నావంటే కుట్రేదో సేత్తన్నావని అర్దం. కాబట్టి బజన ఆపేసి పోయిరా!'
PUBLISHED IN EENADU ON 26.06.12
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి