శుక్రవారం, అక్టోబర్ 12, 2012


పెద్దింటి అల్లుళ్లు 





'అల్లుడెందుకొచ్చాడు? 
అప్పాలు తినడానికొచ్చాడు! 
కూతురెందుకొచ్చింది? 
కుడుములు తినడానికొచ్చింది!'

 అనే పాట దసరా రోజుల్లోనే పాడుకోనక్కర్లేదు. సరదాగా ఉన్నా పాడుకోవచ్చు. పాట పాడినంత మాత్రాన అందరికీ ఇలాంటి సరదాలూ తీరవు. ఏ పాటలూ పాడకపోయినా కొందరికి ఈ సరదాలొచ్చి ఒళ్లో వాలతాయి. పెట్టి పుట్టడమంటే అదే. పెట్టి పుట్టకపోయినా, పుట్టి సాధిస్తున్నవారి గురించి పాడుకుంటే అదో సరదా. వూరికే బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం?

అప్పాలు తిన్న అల్లుడుగారు అరుగుమీద పడక్కుర్చీలో కూర్చుని పండగ చేసుకుంటుంటే చూసి ఉడుక్కోవడంలో అర్థం లేదు. ఆయనగారి అదృష్టానికి జోహార్లర్పించే విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అత్తగారి సొత్తుమీద అల్లుడికి కాక ఇంకెవరికి హక్కుంటుంది? అసలామాటకొస్తే, పాపం పండక్కొచ్చి అప్పాలు తినే అల్లుళ్లంతా వట్టి అమాయకుల కిందే లెక్క. ఒకటికి రెండు వడ్డిస్తేనే ఆనందపడి ఆరగించి ఆపై ఆయాసపడి అరాయించుకోలేక ఆపసోపాలు పడతారు. ఇలాంటి అల్లాటప్పా అల్లుళ్లను మించిపోయే గొప్ప గొప్ప అల్లుళ్లు చాలామంది ఉన్నారు. అదృష్టమంటే వాళ్లదీ!

సోదాహరణంగా చెప్పాలంటే ఢిల్లీ అల్లుడి హరికథ, ఆంధ్రా అల్లుడి బుర్రకథ వినాలి. ఒక్కసారి వాళ్లకేసి చూస్తే అటు అత్తగారి గొప్పదనం, ఇటు మామగారి ఘరానాతనం అర్థమవుతాయి. అత్తసొత్తు అల్లుడి దానమంటూ సామెతలు చెబుతారు కానీ, అల్లుడికి తన సొత్తే కాకుండా ప్రజల సొత్తునూ దానంచేసే అత్త చరిత్ర తెలుసుకుంటే జన్మ తరిస్తుంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అల్లుడిగారికి గనులూ గట్రా కట్టబెట్టిన మామ పురాణం పారాయణచేస్తే పురుషార్థమంటే ఏమిటో తేటతెల్లమవుతుంది.

కాబట్టి, అల్లుళ్లందరూ ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని వచ్చే జన్మలోనైనా రాజకీయాల్లో చక్రం తిప్పే అత్తమామలు దొరకాలని వ్రతాలేమైనా ఉన్నాయేమో వాకబు చేసుకుని, చేసుకుంటే మంచింది.

'ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా...

సేవలంది మాకు వరములీయవమ్మ...' - అంటూ పాటలు గట్రా ఇప్పటి నుంచే కంఠతా పట్టుకోవడం మేలు. పదిమంది అల్లుళ్లను పేరంటానికి పిలిచి యథాశక్తి వాయినాలిచ్చుకుంటే ఢిల్లీలో అధికార పీఠాన్ని అదృశ్యంగా అజమాయిషీచేసే ఘరానా అత్తగారు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు ఎంచక్కా దేశంలోని భూముల్నే అప్పాల్లాగా అప్పనంగా ఆరగించవచ్చు. ఆరోపణలు వెల్లువెత్తినా అమాయకంగా అరాయించుకోనూ వచ్చు. నోరు విప్పాల్సిన పని కూడా లేదు. అవసరమైతే అల్లుడిగారిని వేలెత్తి చూపే దుస్సాహసగాళ్లపై దుమ్మెత్తి పోయడానికి అత్తగారి హయాములో అమాత్యులంతా మూకుమ్మడిగా సిద్ధంగా ఉంటారు. ఈలోగా ప్రజాశ్రేయం కోసం కేటాయించిన భూముల్ని ఎకరాలకు ఎకరాలు కొనడం, ఆనక అమ్మినవాళ్లకే అమ్మడం, వడ్డీలేని రుణాలు పొందడం, ఆస్తులు పెంచుకోవడం, పెంచుకున్నవి లెక్కెట్టుకోవడం, లెక్కెట్టుకున్నవి దాచుకోవడం, దాచుకున్నవి దక్కించుకోవడం లాంటి పనులు తిరగామరగా చేస్తూ 'తార్‌మార్‌ తక్కిడమార్‌... ఎక్కడి దొంగలు అక్కడేే గప్‌చిప్‌' అంటూ ఆటలాడుకోవచ్చు.

ఇలాంటి చిత్రవిచిత్ర లీలావిన్యాసాలతో సాగిపోయే ఢిల్లీ అల్లుడి హరికథ వింటుంటే ఎవరికైనా సరే ఒళ్లు పులకించి, రోమాంచితమై 'అత్తగారూ మీరు వాసిగలవారు... అల్లుడింట్లో సిరుల రాసిపోశారు...' అని పాడుకోకుండా ఉండగలరా? కొండొకచో ఒకరిద్దరు కళ్లెర్రజేసి 'అల్లుడు చేసిన గిల్లుడి పనులకు అత్తగారిని ఆడిపోసుకుంటారేం?' అని కోప్పడినా దేశవాసులందరూ కితకితలు పెట్టినట్టు నవ్వుకుంటారు. ఎందుకంటే ఆవిడగారి అధికార ఛత్రం నీడంటూ లేకపోతే అంత అడ్డగోలుగా ఆస్తుల అప్పాలు అల్లుడిగారి విస్తట్లో వడ్డిస్తారా అనే ఇంగితజ్ఞానం అంతో ఇంతో అందరికీ ఉంది మరి!

కాబట్టి, ఇలాంటి అత్తా అల్లుళ్ల గురించి పాటలు పాడుకుంటూ ముందు ముందు ఆడవాళ్లంతా 'అల్లుడు లేని అత్త ఉత్తమురాలూ ఓయమ్మా... అత్తలేని అల్లుడు వట్టి వాజమ్మా... ఆహుం... ఆహుం...' అంటూ కారాలూ అవీ దంచుకోవచ్చు!

ఢిల్లీ హరికథనుంచి ఆంధ్రా బుర్రకథ దగ్గరకి వస్తే మామగారి జమానా జబర్దస్తీ జమాయింపు కళ్లముందు కదలాడుతుంది. తవ్వినకొద్దీ గనుల కథలు జ్ఞాపకాల్లో ఊరుతూ కంచికి చేరకుండా కవ్విస్తూనే ఉంటాయి. 'మామగారి మనసు బంగారం...

ఆయన చేతిలో అధికారం...

అల్లుడిగారి కొంగుబంగారం...' లాంటి పాటలు పాడుకోవాలనిపిస్తుంది.

ఏతావతా చెప్పుకోవాలంటే ఏడిస్తే ఇలాంటి అల్లుళ్ల అదృష్టానికి ఏడవాలి కానీ, పాపం అప్పాలు తినే అమాయకపు అల్లుళ్ల మీద పాటలు పాడ్డం మహా ఘోరం. అయినా అధికారంతో ఆటలాడగలిగే నాయకమ్మన్యులుండాలే కానీ ఒక్క అల్లుళ్లేం ఖర్మ- కొడుకులు, కూతుళ్లు, అయినవాళ్లు అందరూ తరించిపోరూ!

రాష్ట్రంలో రంగేళీ రాజాగారి కంగాళీ కథాకళిని మరిచిపోగలమా? ఆయనగారి కొడుకులుంగారి పనులింకా ఎవరికీ కొరుకుడు పడ్డమే లేదు. 'ఓ నాన్నా... నీ మనసే వెన్న...' అంటూ అతగాడు అలుపెరగకుండా పాడుకునేంతగా ప్రజల భూములు ఎవరెవరికో ధారాదత్తమై, వాళ్లనుంచి పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా ఇంట్లోకొచ్చి వాలలేదూ?

దానాదీనా ఒక్క విషయం అర్థం చేసుకుంటే మంచిది. రాజకీయ రాబందుల బంధుజనుల విందువినోద వికృత కృత్యాల గురించి తలచుకుంటే మనసు వికలం కావడం తథ్యం. అందువల్ల ఆ మాటెత్తకుండా, నోరెత్తకుండా పడి ఉంటే అందరికీ ఆరోగ్యం!

PUBLISHED IN EENADU ON 12.10.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి