శనివారం, నవంబర్ 24, 2012

పిశాచాల సందేహం


పిశాచాల సందేహం

విద్యాధర పురానికీ, వైశాలీనగరానికీ మధ్య ఉన్న దట్టమైన అడవిలో, కాలి బాటకు పక్కన ఉన్న ఒక మర్రిచెట్టు మీద, రెండు కొంటె పిశాచాలుండేవి.

ఆ రెండు పిశాచాల్లో ఒకటి వృద్ధ పిశాచం కాగా, రెండవది కుర్ర పిశాచి. కాలి బాట వెంట వచ్చే మనుషుల ముఖాలను వృద్ధ పిశాచి పరీక్షగా చూసి, వాళ్ల బలహీనత ఏమిటో చెప్పగలిగేది. ఆ బలహీనతకు అనుగుణంగా కుర్ర పిశాచి వాళ్లను ఆకర్షించి ాట పట్టించేది.

 ఒక రోజున, ఆ రెండు పిశాచాలూ చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న సమయంలో, అన్నింటికన్నా పెద్ద బలహీనత ఏది? అన్న విషయం చర్చకు వచ్చింది.

అప్పుడు వృద్ధ పిశాచి, ‘ఎవరి బలహీనత వల్ల, వారి చుట్టు పక్కల వాళ్లందరికీ మనస్తాపం కలుగుతుందో, అదె పెద్ద బలహీనత’ అన్నది.

అయితే, ఆ బలహీనత ఏదన్న విషయంలో, రెండు పిశాచాలూ ఏకాభిప్రాయానికి రాలేక వాదులాడుకుంటున్న సమయంలో, కాలిబాట వెంట ఒక  మనిషి రావడం వాటి కంటపడింది. వృద్ధ పిశాచి, ఆ మనిషి ముఖంలోకి పరీక్షగా చూసింది. కాని, అతడి బలహీనత ఏమిటో దానికి అంతుపట్టలేదు. కారణం అతడి ముఖం చాలా గంభీరంగా  ఉన్నది.
వృద్ధ పిశాచి ఏమీ చెప్పకపోయేసరికి, కుర్రపిశాచి ఒక డబ్బు సంచీని సృ ష్టించి, కాలిబాట మధ్యలో పడవేసింది.
దారే వస్తున్న మనిషి, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయక, ‘పాపం, ఎవరో డబ్బు సంచీని ఇక్కడ పారేసుకున్నారు’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు.
 అది చూసి పిశాచాలు రెండూ నిరుత్సాహపడ్డాయి. ఇంతవరకూ అందరూ కూడా డబ్బు సంచీని చూడగానే తబ్బిబ్బు పడేవాళ్లు. తర్వాత తలతిప్పి చుట్టుపక్కల చూసి, డబ్బు సంచీని దుస్తుల మాటున దాచుకుని, ఎవరూ లేని చోట విప్పేవాళ్లు. అప్పుడు సంచీలో రాళ్లో, తేళ్లో ఉండేలా చేసి, వాళ్ల భయం చూసి పిశాచాలు రెండూ పొట్ట  చెక్కలయేలా నవ్వుకునేవి.

 ఆ వచ్చిన వాడు, డబ్బు సంచీని వదిలి ముందుకు పోవడంతో, కుర్రపిశాచికి పట్టుదల పెరిగింది. వెంటనే అది చెట్టు దిగి, అపురూప సౌందర్య వతిలాగా రూపం ధరించి, ఒయ్యారంగా ఆ మనిషికి ఎదురు వచ్చింది.


అయితే, ఆ మనిషి ఆమెను చూసి పక్కకు తప్పుకుని వెళ్లిపోశాగాడు. ఆమె కాలిలో ముల్లు గుచ్చుకున్న దానిలాగా, ‘అబ్బా’ అంటూ కూలబడి పోయింది.

 ఆ మనిషి వెనక్కు తిరిగి వచ్చి, చక్కని యువతి రూపంలో ఉన్న కుర్రపిశాచి కాలిలోని ముల్లును తీసేశాడు. ఆ మరుక్షణం, యువతి అతడి చేయి పుచ్చుకుని, ఎక్కడలేని ప్రేమ నటిస్తూ ‘నేను నిన్ను ప్రేమిస్తన్నాను. నన్ను పెళ్లి చేసుకో’ అన్నది.

 దానికతడు చిరాకు పడుతూ, ‘చిన్న ముల్లు తీయగానే, నా వెంటపడ్డావు. రేపు మరెవడో  ఇంతకంటే పెద్ద ముల్లు తీస్తే , వాడి వెంట పోతావు. నా కిలాంటి ప్రేమలంటే చెడ్డ చిరాకు’ అంటూ వెళ్లి పోయాడు.

 నిరుత్సాహంగా తిరిగి వచ్చిన కుర్రపిశాచితో, వృద్ధ పిశాచి, ‘అతణ్ణి నేను ఆట పట్టిస్తాను చూడు’ అంటూ మాయమైపోయింది.


ఆ మనిషి అలా నడిచిపోతుండగా, ఒక పొదచాటు నుంచి, ‘దాహం, దాహం’ అన్న మూలుగులు వినిపించాయి.

అతడు ఆగి చూడగా, మహారాజు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి, అక్కడ పడి ఉన్నాడు. ఆయన ఒంటి నిండా గాయాలు. వెంటనే అతడు తన సంచీలోంచి మర చెంబొకటి తీసి, నీళ్లను దాహం అంటున్న వ్యక్తి నోటిలో పోశాడు.

  కొంత సేపటికి రాజులా ఉన్న వ్యక్తి తేరుకుని, ‘మీరు, నా ప్రాణం కాపాడిన మహానుభావులు. నేనీ దేశాన్నేలే రాజును. మీరు, నా వెంట రాజధానికి రండి. మీకు గొప్ప పదవి, కీర్తీ లభించేలా చూస్తాను’ అన్నాడు.
  అందుకు దారేపోయే మనిషి, ‘దాహంతో ఉన్నవారిని సేద తీర్చడం మానవ థర్మం. నాకే ప్రతిఫలమూ అక్కర్లేదు’ తన దారిన తాను వెళ్లసాగాడు.

అతడు అలా వెళ్లగానే, కుర్రపిశాచి  మహారాజు వేషంలో ఉన్న వృద్ధ పిశాచి దగ్గరకు వచ్చి, ‘ఇతనెవరో, ఏ బలహీనతా లేని మనిషిలా ఉన్నాడు’ అన్నది.

 దానికి వృద్ధ పిశాచి, ‘లోకంలో, ఏదో  ఒక బలహీనతలేని మనిషంటూ ఉండడు. ఇప్పుడతణ్ణి మనుష్యరూపంలో వెంబడించి, అతడి బలహీనత ఏదో తెలుసుకుందాం. పద’ అన్నది.

వెంటనే అవి రెండూ తండ్రీ కొడుకుల్లాగా రూపాలు ధరించి బయలుదేరాయి. వాటికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న బాటసారి మనిషి కనిపించాడు. పిశాచాలు ప్రయాణికుల్లాగా నటిస్తూ, అతడి పక్కన చేరి, అతణ్ణి మాటల్లోకి దించాయి.

 కొద్ది సేపట్లోనే, ఆ మనిషి అడవి ప్రయాణంలో తనకు కలిగిన అనుభవాలను గురించి వాటికి చెప్పసాగాడు.

దారిలో తనకు డబ్బు మూట కనిపించడం, అందమైన యువతి తారసపడడం, మహారాజు దాహం తీర్చడం- ఇవన్నీ పిశాచాలకు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇవన్నీ తెలిసినవే అయినా, పిశాచాలు రెండూ వింత కనబరుస్తూ విన్నాయి.
 అంతా చెప్పాక, ఆ మనిషి పిశాచాలను, ‘ఇప్పడు చెప్పండి, నాలాగా ధనదాహం, అందం పట్ల వ్యామోహం, కీర్తి కాంక్షా లేనివాణ్ణి  ఎక్కడైనా చూశారా?’ అని అడిగాడు.

‘చూడలేదు. చూడలేదు’ అన్నవి పిశాచాలు రెండూ ఏకకంఠంగా.

ఆ జవాబుకు అతడు సంతృప్తిపడి, తన చిన్ననాటి విషయాలు వాటికి చెప్పసాగాడు. తనకున్న మంచి గుణాలను, వాటి సాయంతో జీవితాన్ని తానెలా తీర్చి దిద్దుకున్నదీ, అంచెలంచెలుగా వివరించడం మొదలు పెట్టాడు.

 పిశాచాలు రెండూ చాలా సేపు ఓపికగా విన్నాయి. కాని, ఆ మనిషి తనను గురించి గొప్పగా చెప్పుకోవడం ఆపలేదు. క్రమంగా పిశాచాలకు ఓపికపోయి, మెదడు స్తంభించి, కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. మరి కాసేపటికి  చెవులు గింగుర్లెత్తడం, కళ్ల వెంట నీళ్లు కారడం మొదలైంది. అయినా ఆ మనిషి తనను గురించి చెప్పుకోవడం ఆపలేదు. ఇక భరించలేక, పిశాచాలు మాయమైపోయి, వాటి నివాసమైన మర్రిచెట్టును చేరాయి.

‘అయ్యోబూబూ, ఏం మనిషి. తల వాచేలా చేశాడు’ అన్నది కుర్రపిశాచి.

అందుకు వృద్ధ పిశాచి నవ్వి, ‘తల వాస్తే వాచింది కానీ, మన సందేహం తీరిపోయింది’ అన్నది.

కుర్రపిశాచం అర్థం కానట్టు చూసింది.

వృద్ధ పిశాచం తాపీగా చెట్టు కొమ్మకు జారగిలపడి, ‘చూశావా, అన్నిటికన్నా పెద్ద బలహీనత తనను తాను పొగడుకోవడం. ఒక మనిషికి  ఏ దుర్గుణాలూ లేకపోవచ్చు కానీ, తనను తాను పొగడుకోవడం అనే బలహీనత ఉంటే, ఇక అతడి సుగుణాలకు విలువ ఉండదు. ఒకరి సుగుణాలను ఇతరులు గ్రహించాలి తప్ప, తానే పొగడుకోకూడదనే ఆలోచన లేకపోవడం వల్ల, నలుగురిలో చులకన అవుతుంటారు. ఇంతెందుకు, ఎప్పడూ మనుషుల్ని ఏడిపించే మనల్నే, ఏడిపించాడీ మనిషి’ అన్నది.

వృద్ధ పిశాచం చెప్పినదానికి, కుర్రపిశాచం అవునన్నట్టు తలాడించింది.




PUBLISHED IN CHANDAMAMA CHILDREN'S MAGAZINE IN 1988 DECEMBER ISSUE






2 కామెంట్‌లు:

  1. కథ చాలా బాగుంది. జీవిత సత్యం దాగి ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రోత్సాహానికి చాలా సంతోషిస్తున్నాను సాయి కిరణ్ గారూ....

      తొలగించండి