బుధవారం, నవంబర్ 07, 2012

అసలైన 'మార్పు'


అసలైన 'మార్పు' 



అబ్బే... లాభంలేదు. చాలా మార్పులు తీసుకురావాలి. వూరించి వూరించి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసి ఉండవచ్చు. బులిపించి బులిపించి అస్మదీయులకు పదవుల పంపిణీ చేసి ఉండవచ్చు. ఉన్నవారినే అటూ ఇటూ మార్చి 'తార్‌మార్‌ తక్కిడమార్‌...' చేసి ఉండవచ్చు. అసలు తమ పార్టీవల్లనే 'మార్పు' అనేది సాధ్యమని కాంగ్రెస్‌ అధినేతలు ఉప్పొంగిపోతూ ప్రకటించవచ్చు. ఇవన్నీ సరే, అసలైన మార్పుల గురించి ఆలోచించరేం? ఎవరికీ పట్టని, ఏమాత్రం ఆలోచించని, వూహించలేని మార్పులెన్నో ఇంకా బోలెడు చేయాల్సి ఉంది. మంత్రివర్గం సంగతలా ఉంచండి, అసలు మంత్రిత్వ శాఖలకేసి ఓసారి చూడండి. ఎంత పాతవవి, ఎన్నాళ్లయింది వాటిని ఏర్పరచి, ఎల్లకాలమూ ఇవేనా, కొత్త శాఖలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కసారైనా ఆలోచించారా?
ఇకనైనా మించిపోయింది లేదు. దేశంలో రాజకీయ మేధావులంతా కూర్చుని ఆలోచనలను చిలగ్గొట్ట వలసిందే. అవసరమైతే రాజ్యాంగాన్నో, అందులోని విభాగాల్నో మార్చేయండి. అప్పుడే ప్రభుత్వ నిర్వహణ సజావుగా, సక్రమంగా జరుగుతుంది. విదేశీ వ్యవహారాల శాఖ ఉంది సరే, మరి మిగతా వ్యవహారాల సంగతేంటి? వాటికి కూడా శాఖలు ఉండొద్దూ! మొన్నటికి మొన్న శశి థరూర్‌, నరేంద్ర మోడీల పరస్పర వ్యాఖ్యానాలు వింటే ఏమనిపిస్తోంది? అత్యవసరంగా 'స్వదేశీ ప్రేమ వ్యవహారాల శాఖ' ఒకటి పెట్టాలనిపించడం లేదూ! మోడీగారి రూ.50కోట్ల వ్యంగ్యం వెనక ఏ కుంభకోణం నీడలున్నాయో, శశిగారి వ్యాఖ్యల వెనక ఏ ప్రేమ ప్రలోభాలు ఉన్నాయో తేల్చద్దూ! పోనీ ఆ సంగతి వదిలేసినా దేశానికే పెద్దింటి కూతురుది కూడా ప్రేమ వ్యవహారమే కదా? ఆ ప్రేమ ఎంత విలువైనదో ఆ పెద్దింటి అల్లుడు కొనసాగిస్తున్న వ్యవహారాలనుబట్టి తెలియడం లేదూ!

ఇలా చూసుకుంటే, బోలెడు వ్యవహారాలు ఈ శాఖతో చక్కబెట్టవచ్చు. ముసలి మాజీ గవర్నర్‌గారు వయసులో ఉన్నప్పుడు మనసు పడిన వ్యవహారంలో పుట్టాను కాబట్టి ఆయనే నా తండ్రని కోర్టుకెక్కిన కొడుకు వాదన లాంటి సంగతులు, రసిక మంత్రిగారికి ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయినమహిళ కేసులాంటి రహస్య బాగోతాలు... ఇలా ఒకటేమిటి, దేశ వ్యాప్తంగా ఎన్నో రసవత్తర ఘట్టాలను ఈ శాఖకు బదలాయించవచ్చు.

ఇక్కడితో అయిపోయిందా? 'సకల పార్టీ పొత్తుల శాఖ' కూడా ఒకటి ఉండాల్సిందే. సంకీర్ణ ప్రభుత్వాన్ని పల్లకిలో కూర్చుని నడపాలంటే ఏ ప్రాంతీయ పార్టీతో ఎలాంటి వ్యవహారాలు నడపాలి, ఎవరికి ఎలాంటి పదవులు పంపిణీ చేయాలి, వాళ్లలో ఎవరైనా అడ్డగోలుగా అవినీతికి పాల్పడితే గంభీరంగా మౌనం వహించి లోపాయికారీగా ఎలా విషయాన్ని నాన్చాలి, ఎప్పుడు ఎవరు తోకజాడిస్తే ఎవరి మద్దతుతో నెట్టుకు రావాలి... లాంటి అనేక వ్యవహారాల్ని చూసుకోవడానికి ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ అంటూ ఉంటే చాలా సులువుగా ఉంటుంది. అటు ప్రభుత్వానికీ సుఖం, ఇటు పత్రికలవాళ్లకూ సులువు. నేరుగా ఆ శాఖ మంత్రినే విషయమేమిటో కనుక్కుని, ప్రజానీకం జ్ఞాననేత్రాలు తెరిపించి చైతన్యపరచవచ్చు.

'వారసత్వ శాఖ' కూడా అత్యవసర శాఖల్లో ఒకటి. దీన్ని అధినేతలే స్వయంగా నిర్వహించవచ్చు. లేదా నమ్మకస్థులైన నమ్మినబంటుల్లాంటి వారికైనా అప్పగించవచ్చు. దేశాధినేతలనుంచి, రాష్ట్ర నేతల వరకు ఎవరెవరికి వారసులు ఉన్నారో, వారి కార్యకలాపాలేమిటో ఈ శాఖ గమనిస్తూ ఉంటుంది. అధికార పార్టీకి వారసుడెవరైనా ఉంటే అతణ్ని సమయానుకూలంగా పొగడ్డం, సభల్లో పాల్గొనేలా చేయడం, అతడి మేధావితనాన్ని చాటిచెప్పడం లాంటి అసంఖ్యాక వ్యవహారాలు చూసుకుంటుంది. అలాగే ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారసులు ఉంటే వారి సంగతులు ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఎలా వారిని అడ్డుకోవాలో కూడా ఇది చూసుకుంటుంది.

ఇక 'సమస్త పనుల గుత్తేదారుల నిర్వహణ శాఖ' కూడా అత్యవసరం. అస్మదీయ గుత్తేదారులందరూ ఈ శాఖలో తమ పేరు నమోదు చేయించుకుంటే పరిపాలన చాలా సులువుగా ఉంటుంది. అధికారులకు టెండర్లు పిలవడం, నిబంధనలు రూపొందించడం, జీఓలు మార్పించడం,అప్పటికప్పుడు చట్టాల్లో లొసుగుల గురించి వెతకడం లాంటి అనవసర ప్రయాసలన్నీ తప్పుతాయి. ఎన్ని అడ్డంకులున్నా కావాల్సినవారికే ఎలాగూ పనులు దక్కుతాయి కాబట్టి, ఎకాఎకి వాళ్లకే పనులన్నీ అప్పగించేసి చేతులు దులుపుకోవచ్చు.

'ప్రత్యక్ష, పరోక్ష పైరవీల మంత్రిత్వ శాఖ' ఆవశ్యకతను ఇప్పటివరకు ఎవరూ గుర్తించినట్టు లేదు. ఇదొకటి పెట్టి ఓ మంత్రిగారిని, ఆయన కింద పనిచేసే అధికార వర్గాన్ని కేటాయిస్తే జాతీయ, ప్రాంతీయ పైరవీలన్నీ దీనికిందకు తీసుకురావచ్చు. దాంతో ఏ పనికి ఎవరిని ఎలా పట్టుకోవాలో, ఎలా పైరవీలు చేయించుకోవాలో లాంటి సవాలక్ష పనులు చకచకా జరిగిపోయి ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది.

ఇలా చెప్పుకొంటూ పోతే 'దర్యాప్తులను నీరుగార్చే శాఖ', 'ఆరోపణలను తిప్పికొట్టే శాఖ', 'నానావిధ విమర్శల ఖండన శాఖ', 'ఎదురెట్టి ఏకే శాఖ', 'సానుభూతి శాఖ', 'బేరసారాల శాఖ', 'పాదయాత్రల శాఖ','స్వీయ ప్రచార శాఖ', 'బురద జల్లుడు శాఖ'... అబ్బో చాలా ఉంటాయి. అప్పుడు చాలామందికి పదవులూ దక్కుతాయి, అసంతృప్తులూ ఆగుతాయి.

అయితే గియితే ఇలాంటి సమూల వినూత్న విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ఆలోచించాలి కాని, వూరికే వేదికలెక్కి 'మార్పు' గురించి ఎంత చెప్పినా దండగే. ఏతావతా ప్రజలు కూడా సరైన మార్పు గురించి ఆలోచిస్తే మటుకు ఈ రాజకీయ నాయకుల ప్రయత్నాలు ఏమవుతాయని ఎవరైనా అడిగితే, వాళ్లతో మాట్లాడకపోవడమే మేలు. ఎందుకంటే వాళ్లు నిజమైన మేధావులు మరి!



PUBLISHED IN EENADU ON 07.11.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి