జైలే ఒక యోగం
'నమస్కారం గురూగారూ...'
'శీఘ్రమేవ కారాగారవాస ప్రాప్తిరస్తు!'
'అయ్యబాబోయ్, ఇదేం దీవెనండీ బాబూ? నేనేదో మీ దగ్గర నాలుగు రాజకీయ పాఠాలు నేర్చుకుని ఓ చిన్నపాటి నేతననిపించుకోవాలని తపిస్తుంటే, అంత మాటనేశారు!'
'భలేవాడివిరా, జైలుకెళ్లే యోగం అంత తొందరగా పడుతుందేంట్రా? అందుకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. లేదా ప్రస్తుత జన్మ వికృతం కావాలి. నీకది అర్థం కావాలంటే మరో జన్మ ఎత్తాలేమోనన్నదే నా బెంగ'
'ఏమిటో గురూగారూ, మీ మాటలోపట్టాన మింగుడు పడవు. కానీ, మీరు నా మంచి కోరేవారు కాబట్టి కాస్త వివరంగా చెబుదురూ'
'ఒరే, నీచ రాజకీయ నేతగా ఎదగాలనుకునేవాడికి జైలుకు వెళ్లడమనేది మహర్దశ లాంటిదిరా. ముందు ఈ పాఠం ఒంటపట్టించుకో'
'మీరెంత చెప్పినా నా మట్టి బుర్రకు ఎక్కడం లేదండీ. జైలుకెళ్లడమంటే ఎంత సిగ్గుచేటు, ఎంత తలవంపు? ఇక నలుగురిలో నవ్వగలమా, ఎవరినైనా పలకరించగలమా, మొహం చూపించగలమా, కళ్లలోకి సూటిగా చూడగలమా? ఇంటా బయటా నరకం కాదుటండీ?'
'అలాగంటావా? అయితే రేపట్నుంచి నా దగ్గరకి రాకు, సరేనా?'
'అంటే, రాజకీయ పాఠాలు అయిపోయాయాండీ? మీ దగ్గర పాసైపోయినట్టేనా? ఓ నేతగా ఎదగడానికి తగిన అర్హత సాధించినట్టేనా?'
'కాదురా సన్నాసీ, అడ్డంగా ఫెయిలైపోయావు. నేతగా ఎదిగే అవకాశమే నీకు లేదు. బయటికి పో!'
'గు... గు... గు... గురూగారూ! శాంతించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి'
'తప్పా? తప్పున్నరా? నీలాంటి మంచివాళ్ల మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు పట్టుకుంటాయి. సిగ్గు, శరం, మానం, అభిమానం లాంటిసుగుణాలు నీలో ఇంకా ఏ మూలనో ఏడిశాయి. వాటిని చిదిమేస్తేనే కానీ నీచ రాజకీయాల్లో ఎదగలేవు. ముందు వాటిని వదిలించుకుని ఆనక వచ్చి అఘోరించు'
'అర్థమైంది గురూగారూ, పొరపాటున ఓ సాధారణ మనిషిలా ఆలోచించేశాను. దయచేసి పాఠం చెప్పండి. జైలుకెళితే కలిగే లాభాలేమిటో వివరించండి. నోరెత్తకుండా రాసుకుంటాను'
'అట్టారా దారికి, సమకాలీన రాజకీయ పరిణామాలు చూస్తూ కూడా పాఠాలు నేర్చుకోకపోతే ప్రజాసేవకు తప్ప ఇంకెందుకూ పనికి రావు. జైలు గేటులోంచి కాలు బయటపెడుతూ కూడా ఏమాత్రం ఆత్మన్యూనత కనబడనీయకుండా విశాలంగా నవ్వుతూ, పెద్ద ఘనకార్యం చేసినట్టు చేతులూపుతూ, ఘరానాగా కోర్టు వాయిదాలకెళ్లొస్తున్న నేతల్ని నిన్నా మొన్నా టీవీల్లో చూశావుగా? వాళ్లే నీకు ఆదర్శం! కాబట్టి, అలాంటి నేతగా ఎదగాలంటే ముందు నువ్వు మనిషిగా దిగజారాలి. అందుకు తగిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. తెలిసిందా?'
'తెలిసింది కానీండీ, కొంత సందేహం పీడిస్తోందండి. అరెస్ట్ చేశారంటే ఎంతో కొంత మనం చేసిన వెధవ పన్లు బయటపడినట్టే కదండీ? మరలాంటప్పుడు అన్నీ గమనిస్తున్న జనం మననెందుకు నమ్ముతారండీ? ఎంత సిగ్గు చిదిమేసుకుని చేతులూపినా నవ్వుకోరాండీ?'
'అదిగో మళ్ళీ సిగ్గు మాటెత్తుతావ్? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుగా లేదురా? నికార్సయిన నీచ నికృష్ట నేతగా ఎదిగిపోయాక ఇంకా సిగ్గేంట్రా, సిగ్గులేనెదవా? నువ్వు సిగ్గు పడాల్సింది సిగ్గులేని నేతగా ఎదగలేకపోయినప్పుడు మాత్రమే. అర్థమైందా?'
'సిగ్గొచ్చిందండి బాబూ సిగ్గొచ్చింది! ఇక సిగ్గు మాటెత్తితే ఒట్టు. కానీ జైల్లోకెళ్లి కూర్చున్నాక ఇక చేసేదేముంటుందండీ?'
'ఎందుకు ఉండదురా? నికృష్ట నేతకి అన్నీ అవకాశాలేరా! అసలు నిన్ను అరెస్టు చేయడమే నీచ రాజకీయమని గోల చేయవచ్చు. తడిగుడ్డతో గొంతులు కోయగలవాడివైనా సరే, నోట్లో వేలెడితే కొరకలేనంత అమాయకుడినని గొల్లుమనొచ్చు. కళ్లముందు కోట్లకు పడగెత్తినా సరే, ఎర్రని యాగానీ ఎరుగనట్టు యాగీ చేయవచ్చు. పేద ప్రజానీకానికి సేవ చేసేసి, వాళ్ల బతుకులెక్కడ బాగు చేసేస్తానోనని కిట్టనివాళ్లంతా కలిసి కాళ్లూ చేతులూ కట్టేసి లోపల పడేశారని మోరెత్తుకుని మరీ బుకాయించవచ్చు. జాలిగుండెలున్న జనం కరిగి నీరైపోయేలా సానుభూతి కోసం నీ తల్లినో, చెల్లినో, భార్యనో, బామ్మర్దినో యాత్రలకు పంపించవచ్చు. అసలు నీ అరెస్టంటూ జరిగి ఉండకపోతే జనమంతా ఈపాటికి కోటీశ్వరులైపోయేవారని వూరూవాడా హోరెత్తించవచ్చు. నిన్ను జైల్లో పెట్టడం మూలాన, రావలసిన స్వర్ణయుగం సరిహద్దుల్లో ఆగిపోయిందని భ్రమ కలిగించవచ్చు. పనిలో పనిగా ఎదుటి పార్టీల్లోని వాళ్లకి, నువ్వు అడ్డంగా దోచుకున్న ప్రజాధనంలో ఓ అర పైసా వాటా బయటికి తీసి ఎరలేయవచ్చు. అదిగదిగదిగో అన్ని పార్టీలవాళ్లూ నీకేసి వెనకా ముందూ చూడకుండా దూకేసి కాళ్లుచేతులు విరగ్గొట్టుకుంటున్నారని వూదరగొట్టొచ్చు. బుర్రకెక్కిందా?'
'ఎక్కిందండి. మరంతగా ఎదగడానికి ఏం చేయాలండీ?'
'అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి. చట్టంలో లొసుగులు ఉపయోగించుకోవాలి. ప్రజల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తూ జనం జెల్ల కొట్టాలి. ఖజానా కొల్లగొట్టి కోట్లకి పడగెత్తాలి. ఇన్ని చేసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు నీతికబుర్లు చెప్పే ఆత్మస్త్థెర్యాన్ని పెంచుకోవాలి'
'ఆహా, ఎంత బాగా చెప్పారండీ! నేనిక ఎన్ని వెధవ పన్లు చేసి, ఎంత తొందరగా జైలుకెళ్లి మీ పేరు నిలబెడతానో మీరే చూద్దురుగాని!'
'శెభాష్, అదేరా నువ్వు నాకిచ్చే గురుదక్షిణ, వెళ్లిరా!'
PUBLISHE IN EENADU ON 7.12.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి