శుక్రవారం, డిసెంబర్ 21, 2012

అద్దంలో అవినీతి కొండ...

అద్దంలో అవినీతి కొండ... 



'పందొమ్మిదొందల పద్దాలుగు... పందొమ్మిదొందల పదేను... పందొమ్మిదొందల...'
ఆగకుండా, ఆవేశంగా, అరుస్తూ అంకెలు లెక్కపెడుతున్న అప్పారావును అతడి భార్య పంకజాక్షి జబ్బ పుచ్చుకొని లాక్కొచ్చి, డాక్టర్‌ పిచ్చేశ్వరరావు ముందు కూలేసింది. అప్పారావు కూర్చుంటూనే బల్ల మీద ఉన్న మందుల చీటీ పుస్తకం తీసుకుని చకచకా నోట్లు లెక్క పెట్టినట్టు లెక్కబెట్టసాగాడు. నర్సు గబగబా వచ్చి అతడి చేతిలో పుస్తకం లాక్కుంది.

అప్పారావు 'కయ్యి...'మంటూ అరచి, 'ఛీ... నీ వల్ల లెక్క తప్పింది. మళ్ళీ మొదట్నుంచీ లెక్కెట్టాలి...' అంటూ పుస్తకం లాక్కుని, 'ఓట్రెండ్మూడ్నాలుగైదారేడు...' అంటూ లెక్కపెట్టసాగాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు అతడి వాలకాన్ని గమనిస్తూనే 'ఏమైందమ్మా?' అన్నారు పంకజాక్షితో.

పంకజాక్షి చీర చెంగుతో కళ్లొత్తుకుని ఓసారి చీది, 'ఏం చెప్పమంటారు డాక్టర్‌, పొద్దున్న పేపరు చూడగానే కెవ్వున కేకేశారండి. వంటింట్లోంచి పరుగెత్తుకు వచ్చి చూద్దును కదా, గాలిలో వేళ్లు తిప్పుతూ అంకెలు లెక్కెట్టడం మొదలు పెట్టారండి. ఇదేంటండీ అనడిగితే, లెక్క తప్పిందని మొదట్నుంచీ లెక్కలెడుతున్నారండి. ఈయన్ని మీరే కాపాడాలి...' అంది వెక్కుతూ.

'పేపర్లో ఏ వార్త చదువుతుండగా ఇలా జరిగిందో చెప్పగలవామ్మా?'

'ఆయ్‌... ఏదో నల్లధనం గురించండి. ముందు దాన్ని పైకి గట్టిగా చదివారండి. ఆ తరవాత అమ్మో... అమ్మో... అని గుండెలు బాదుకున్నారండి. వెంటనే ఓసారి ఏడ్చారండి. ఆపై పగలబడి నవ్వారండి. ఇహ అక్కడ్నుంచి ఇదండి వరస. వందలు, వేలంటూ లెక్కలెట్టేస్తున్నారండి. అదేదో పెద్ద సొమ్మంట గదండీ?'

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు నిట్టూర్చాడు. ఆపై చెప్పాడు, 'అవునమ్మా, మన దేశంనుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన నల్లధనం అది. ఏకంగా ఆరు లక్షల డెభ్ఫైమూడు వేల కోట్ల రూపాయల పైచిలుకు సొమ్ము. అది చదివే మీవారు షాక్‌కి గురై ఉంటారు...' అన్నాడు.

'అయ్యబాబోయ్‌ అంత సొమ్మాండీ? అదంతా ఉండుంటే ఎన్ని మంచి పన్లు చేయొచ్చోగదండీ...'

'అదే మన దేశ దౌర్భాగ్యం తల్లీ...'

'ఆ దౌర్భాగ్యం సంగతి సరేగానీ, ముందు నా సౌభాగ్యం సంగతి చూడండి డాక్టర్‌! ఈయన మళ్ళీ మన్లోకొస్తారంటారా?'

డాక్టర్‌ అప్పారావుకేసి చూశాడు.

'రెండొందలారు... రెండొందలేడు...' అంటున్నాడు.

అప్పారావు దగ్గరగా డాక్టరు వెళ్లి, 'నేను పొద్దున్నే లెక్క పెట్టేశా తెలుసా?' అన్నాడు.

'అవునా, ఎలా? అంత డబ్బు లెక్క ఓ పట్టాన తేల్తుందేంటీ? మీరు అబద్దాలాడుతున్నారు...' అన్నాడు అప్పారావు ఉక్రోషంగా.

'ఇదో పెద్ద డబ్బేంటి? ఇంతకన్నా ఎక్కువ డబ్బు చూపిస్తా. లెక్కెడతావా?' అంటూ డాక్టర్‌ ఓ మీట నొక్కాడు. వెంటనే ఆ గదిలో తెర మీద ఓ చిత్రం వచ్చింది. అందులో సముద్రంపై కాకి ఎగురుతోంది. అలా ఎగురుతూ అది రెట్ట వేసింది.

'నీకు ఏం కనిపించింది?' అని అడిగారు డాక్టర్‌.

'సముద్రంలో కాకిరెట్ట' అన్నాడు అప్పారావు.

'సరిగ్గా చెప్పావు. నువ్వు ఇందాకా లెక్క పెట్టిన డబ్బు కూడా అంతే' అంటూ మాటల్లో పెట్టి సూది మందు ఇచ్చాడు డాక్టర్‌.

అప్పటికి అప్పారావు దృష్టి మళ్లింది. నీరసంగా కూర్చుని 'అదెలా?' అన్నాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వరరావు చెప్పసాగాడు. 'చూడు అప్పారావ్‌, దేశంలో జరుగుతున్న కుంభకోణాల సంగతి మర్చిపోయావా? అధికారం ముసుగులో అవినీతి కథాకళి చూడటం లేదా? పదేళ్ల కాలంలో దేశంనుంచి తరలిపోయిన చీకటి డబ్బు చాలా విలువైనదే! కాదనను. కానీ మనదేశంలో ప్రజలిచ్చిన అధికారం అనుభవిస్తూ, దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడికి పాల్పడిన అవినీతి నేతల దారుణాల విలువ ముందు ఇదెంత? నువ్వన్నట్టు సముద్రంలో కాకిరెట్ట కాదూ? టూజీలో టక్కుటమారమైన కోట్లను లెక్కపెట్టగలవా? సీడబ్ల్యూజీ పేరు చెప్పి ఆటల్లో అరటిపళ్లుగా లాగించిన సొమ్మును సొమ్మసిల్లకుండా గణించగలవా? చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం కట్టిన నివాసాల్లోతిష్ఠ వేసిన చెదపురుగులు తినేసిన డబ్బుకు విలువ కట్టగలవా? ఆంధ్రా రాజావారి కుటుంబం ఆరగించిన లక్ష కోట్ల నిగ్గు తేల్చగలవా? దేశానికి అల్లుడైనా, రాష్ట్రంలో కొడుకైనా, తమిళ సీమ చెల్లాయైనా, కర్ణాటక సోదరులైనా ఎవరి వాటా ఎంతెంతో తేల్చి చూపగలవా? ఈ డబ్బంతా లెక్కపెట్టడానికి నీ జీవితం సరిపోతుందా చెప్పు?' అంటూ సముదాయించాడు.

అప్పారావు దిగాలుగా మొహం పెట్టి 'మరి ఈ దారుణాలను ఇలా కొనసాగనివ్వాల్సిందేనా? స్పందించే హృదయాన్ని బంధించి బతికేయాలా?' అన్నాడు.

డాక్టర్‌ అతడి భుజం తట్టి, 'చూడు అప్పారావ్‌, నీకు సామాజిక స్పృహ చాలా ఉంది. కానీ, ఇలా చీటికీమాటికీ తెలివి తప్పి ప్రవర్తించడం మాత్రం బాగోలేదు. నీ ఆవేశాన్ని సరైన దిశలోకి మళ్లించు. నీతిమాలిన నేతల పనిపట్టే సమయం వచ్చినప్పుడు వాళ్లకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండు' అన్నాడు ధైర్యం చెబుతూ.





PUBLISHED IN EENADU ON 21.12.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి