శిష్యుడు రాగానే గురువుగారు ప్రసాదం పెట్టారు. శిష్యుడు దాన్ని కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని, 'ఇదేంటి గురూగారూ! కొత్తగా?' అన్నాడు.
'అహ... ఏం లేదురా! ఇవాళే కొత్తగా 'శిష్యప్రసాదం' అనే పథకాన్ని ప్రవేశపెట్టా. ఇన్నాళ్లుగా నా దగ్గరకు రాజకీయాలు నేర్చుకోడానికి వస్తున్నా ఏమీ పెట్టలేదుగా? అందుకని!'
ఇంతలో గురువుగారి సతీమణి వచ్చి దానిమ్మ గింజలు ఇచ్చారు. శిష్యుడు నోరెళ్లబెట్టగానే గురువుగారు వివరించారు...
'ఇది ఆవిడ ప్రవేశ పెట్టిన 'దానిమ్మహస్తం' పథకం... ఇవాళ నీ పంట పండిందిలే. నోట్లో వేసుకో'
'ఆహా... ఎంతదృష్టం. ఇలా పథకం మీద పథకం ప్రవేశపెట్టడానికి కారణమేంటి గురూగారూ?'
'ఒరే... నువ్వు నా దగ్గర శిష్యరికం చేసి ఎంతోకొంత ఎదిగావనుకున్నా కానీ, లేదని తేలిపోయిందిరా. పథకాలకు కారణాలడుగుతావేంటి... అడిగితే మాత్రం చెబుతానా, చెప్పినా నిజం చెబుతానా? కాబట్టి, నోరు మూసుకుని ఇచ్చింది పుచ్చుకోవడమే...'
'బుద్ధొచ్చిందండి. కానీ గురూగారూ... ఈ పథకాలనేవి ఎన్ని రకాలు, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చెబుతారా?'
'అది చెప్పాలనే కదరా ఇలా మొదలెట్టింది? రాసుకో. పథకాలు ప్రధానంగా రెండు రకాలు. బయటికి కనిపించేవి, పైకి కనిపించనివి. కనిపించేవాటి పేరెలాగూ తెలుస్తుంది. కనిపించని వాటి పేర్లు మాత్రం నువ్వే కనిపెట్టాలి. అది నీ రాజకీయ చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇటీవల మన సీఎం ప్రవేశపెట్టిన పథకాల గురించి చెప్పు చూద్దాం...'
'ఓ... పేపర్లలో చదివానండి. ఆడపిల్లల కోసం 'బంగారు తల్లి', పేదవారి కోసం 'అమ్మహస్తం', బడుగుల కోసం 'పచ్చతోరణం' పెట్టారండి. ఉద్దేశాలు మంచివే కదండి...'
'అవి మంచివో కావో ప్రజలు తేలుస్తారు... మనం చదువుకుంటున్నది రాజకీయ పాఠాలు కాబట్టి వాటి అంతరార్థాలు తెలుసుకోవాలి. వాటిలో ఒకటి 'కంగారు తల్లి'. ఎందుకంటే ఓ పక్కన కాలం గడిచిపోతోంది. మరో పక్క ఈ సీఎం సామర్థ్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఆయన కంగారుగా పథకం ప్రకటించేశాడు. దీని గురించి తమకేమీ తెలీదని ఆ పార్టీలోనే సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి... గమనించావా? అంటే ఎవరితోనూ చర్చించకుండా, ఎలా అమలు జరపాలో కూడా ఆలోచించకుండా ప్రకటించాడనే కదా? దీనివల్ల జరిగే మేలు పక్కన పెడితే, ఇది ప్రచారానికి మాత్రం బంగారు తల్లే! ఇక రెండోది, మన భాషలో 'అమ్మో...హస్తం'. అధికారంలో ఇన్నాళ్లు ఉండి ఏమీ చేయలేకపోయేసరికి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి తలచుకుని 'అమ్మో...' అనుకుని- పెట్టారన్నమాట! ఇక ఆ పచ్చతోరణం 'మెరమెచ్చు తోరణం' అన్నమాట. తొమ్మిదేళ్ల క్రితం కట్టిన అధికార పచ్చతోరణం వాడిపోయేసరికి సవాలక్ష తోరణాలు వెదికి ఇది కనిపెట్టారన్నమాట...'
'బాగుంది కానీండీ, మరి కనిపించని పథకాలన్నారు... అవేంటండీ?'
'పైకి బంగారు తల్లి కనిపిస్తోందా, మరి కనిపించకుండా అమలు చేస్తున్నది 'దొంగారు తండ్రి' పథకం. మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లను కాపాడ్డానికి చేసే కృషి అంతా దీని కిందకే వస్తుంది. అలాగే అనుకోకుండా దొరికిన కుర్చీని కాపాడుకోవడానికి చీటికీ మాటికీ ఢిల్లీ పరిగెత్తడం 'అధిష్ఠాన అనుగ్రహ' పథకమన్నమాట. ఇలా 'తాత్సార పథకం', 'ఉదాసీన పథకం' లాంటివెన్నో కనిపిస్తాయి...'
'సరే గురూగారూ! కనిపించేవో, కనిపించనివో అసలీ పథకాల ప్రయోజనమేంటండీ?'
'పథకాలనేవి అధికారానికి పట్టుకొమ్మలురా! సాధ్యమో, అసాధ్యమో నీకిష్టం వచ్చినన్ని పథకాలు జనంలోకి విసిరిపారెయ్యాలి. తొమ్మిదేళ్ల క్రితం వైఎస్ చేసిందిదే కద? అవన్నీ మేడిపండులాగా నిగనిగలాడినా, విప్పి చూస్తే అన్నింట్లోను అవినీతి పురుగులే కదా? ఉచిత విద్యుత్- అనుచిత విద్యుత్ అయిపోయిందా? జలయజ్ఞం- అక్రమార్కుల ధనయజ్ఞం అయిపోయిందా? ఆరోగ్యశ్రీ- అనారోగ్యశ్రీ అయిపోయిందా? ఇలా చెబితే చాంతాడంత! ఇక ఆయన కనిపించకుండా అమలు జరిపిన పథకాలకు మనం 'పుత్రశ్రీ', 'జామాత మజా', 'గని గజినీ', 'హవాలా వల', 'బంధోద్ధరణ', 'గాలి గిలి', 'భూ భోజన', 'అక్రమ జీవో భవ', 'అవినీతి వాడి', 'కరెన్సీ కరకర' లాంటి బోలెడు పేర్లు పెట్టుకోవచ్చు... ఏమంటావు?'
'అద్భుతం గురూగారూ! ఇక ఇలాంటి పథకాలను భవిష్యత్తులో ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెబుదురూ...'
'చెప్పడానికేముందిరా! సమకాలీన రాజకీయాలు చూసి అల్లుకుపోవాలి. అవతల కర్ణాటక ఎన్నికల్లో పార్టీలన్నీ ఆడుతున్న 'జజ్జనకరి జనారే...' చూస్తున్నావుగా? రూపాయి బియ్యాలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఉచిత అంతర్జాలాలు, రుణాల మాఫీలు, రోగులకు పింఛన్లు అంటూ చేస్తున్న వాగ్దాన పథక వీరంగాలు గమనించు. అంతక్రితం తమిళ మహారాణి టీవీలు, గ్రైండర్లు, తాళిబొట్లు, పురిటినొప్పుల బిల్లుల్లాంటి పథకాలను దృష్టిలో పెట్టుకో. ఇక నువ్వు బియ్యం ఇవ్వడమే కాదు, 'వండి వార్చే' పథకం పెట్టు. నంచుకోవడానికి 'ఆవకాయ బద్ద' పథకం పెట్టు. దురదేస్తే 'ఉచిత గోకుడు' పథకమను, స్నానం చేసేప్పుడు 'వీపు రుద్దుడు' పథకమను... ఒకటేంటి? నీ నోటికొచ్చినట్టు వాగు. ఆనక అధికారంలోకి వచ్చాక వాటి అమలు పేరుతో కనిపించని 'నిలువు దోపిడి' పథకం అమలు చెయ్యి!'
'ధన్యోస్మి గురూగారూ... ధన్యోస్మి!'
PUBLISHED IN EENADU ON 04.05.2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి