బుధవారం, మే 29, 2013

సానుభూతి వేషాలు!



'గుండెల్లో గునపాలు... గుచ్చారే నీ వాళ్లు...
విరిగినది నీ మనసు... అతుకుటకు లేరెవరూ...'

'ఏంట్రోయ్‌... అంత బరువైన కూనిరాగం పాడతా వత్తన్నావు? కొంపదీసి ఖూనీగానీ కానిచ్చావేటి?'

'అదేంటి గురూగారూ, అంత మాటనేశారు? ఖూనీ చేస్తే కులాసాయే కానీ, కుదేలైపోతామా చెప్పండి...'

'మరంత ఏడుపుగొట్టు పాట పాడే అవసరం ఎందుకొచ్చిందా అని?'

'ఏముంది గురూగారూ! నా దారిన నేనేదో ప్రజాసేవ చేసుకుపోతుంటే చట్టం వూరుకోడం లేదండి. కోడిగుడ్డుకు ఈకలు పీకి అవన్నీ వెధవ పన్లంటోందండి. రేప్పొద్దున ఎటు తిరిగి ఎటొచ్చినా జనం గుండెల్లో సానుభూతిని సజీవంగా ఉంచాలని తాపత్రయమండి. అందుకు మీరేమైనా ఐడియాలు ఇస్తారేమోనని ఇలా వచ్చానండి'

'ఓరెర్రోడా! లొల్లాయి రాగాలు తీత్తే సానుబూతి కురిసిపోద్దేంట్రా? దానికెంత తతంగముంటదీ? ఓ లెక్క ప్రెకారికంగా దాన్ని జమాయించుకోవాల మరి. ఎక్కడా జనం సూపు జారిపోకండా కాపు కాయాల. రాజకీయాల్లో సానుబూతనేది శానా గొప్పదొరే. ముందా సంగతి మనసులోలెట్టుకో'

'అందుకే కదండీ, చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, నేనిలా పనిగట్టుకుని మీ దగ్గరకి వచ్చింది? నాకిన్ని సూత్రాలు బోధించి మీ పని కూడా మీరు కానివ్వండి మరి...'

'సానుబూతి సునామీలో జనాన్ని నిలువునా ముంచేయాలనుకుంటే ముందుగా సేయాల్సిన పనొకటుందిరా. ఎకాఎకినెల్లి అద్దం ముందు నుంచోవాల. నీ మొగాన్ని పరీచ్చగా సూసుకోవాల. ఏ మూలనైనా సిరునవ్వు జాడలు గట్రా కనిపిత్తే ఎంటనే తుడిసేసుకోవాల. వీలయినంత దిగులుగా మొగమెట్టడం నేరుసుకోవాల. ఆనకే జనం ముందుకెల్లాల. ఎల్లాక ఆల్ల కట్టాలు ఎరికొచ్చి నువ్వు పద్దాకా కుమిలిపోతున్నట్టు సూసినోల్లంతా నమ్మేట్టు కనిపించాల. అయ్యోపాపం... బిడ్డ, మన కోసమెంత తల్లడిల్లిపోతున్నాడో, ఏలకి తిండైనా తింటన్నాడో లేదోనని పెజానీకమంతా బెంగెట్టేసుకునేలా నీ వాలకం ఉండాల. ఆల్ల అమాయకత్వం చూసి నీకో పక్కనుంచి గబుక్కున నవ్వొచ్చేత్తన్నా, తత్తరపడిపోకుండా తమాయించుకుని అది నవ్వో ఏడుపో తెలీనంతగా మొగమెట్టేయాల. ఇది తొలి మెట్టన్నమాట'

'అబ్బో... కష్టమేనండి. వాళ్లని నమ్మించి, వూరించి, వూదరగొట్టి, ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక... వాళ్లకి తెలీకుండానే వాళ్ల సొమ్ముల్ని చుట్టుతిప్పుకొచ్చి మన జేబులో పడేసుకుంటున్న విషయం జనంలోకి వెళ్లగానే గుర్తొచ్చేస్తుందండి. ఆ పళంగా పెదాలపై తెగ నవ్వు, కులుకు, కులాసా, దిలాసా వచ్చేస్తుంటాయండి. లోపలినుంచి తన్నుకొచ్చే సంబరాన్ని అదిమిపట్టి పైకి అలా అయోమయం మొహం పెట్టడమంటే మరి... మహా నటుడైతేనే సాధ్యమండి. అయినా నేర్చుకుంటాలెండి, తప్పుతుందా? రాజకీయాల్లోకి దిగాక ఇలాంటి కష్టాలెన్నయినా దిగమింగుకోవాలి మరి. ఇక తతిమ్మా సూత్రాలేంటో చెప్పరూ?'

'ఇక పీటమెక్కగానే నువు సేసేవెలాగూ ఎదవ పన్లే కాబట్టి అయి ఎలాగోలా బయటపడక మానవు. ముందుగా ఎగస్పార్టీవోల్లు పత్రికలోల్లని కేకేసి ఇదిగో ఈడింత ఎదవ, అంతెదవ, మరీ ఇంతోటెదవనుకోలేదూ... ఇందులో దోసేసాడు, అందులో నొక్కేసాడు, ఆకాడ దాచేసాడు, ఈకాడ బొక్కేసాడు, ఇల్లిక్కడ గిల్లేసాడు, అల్లక్కడ నొల్లేసాడు, మాయసేసాడు, ముంచేసాడని మొదలెడతారు. అయ్యన్నింటినీ కూడా నువ్వు సానుబూతికి జమేసేసుకోవాల. ఎలాగో సెబుతానినుకో. ఇదిగో అమాయక జనాలూ... సూసారా, నేనేదో మీకింత మేలు సేద్దారని నానా పన్లూ సేత్తాంటే, ఈల్లు ఓర్వలేకపోతన్నారూ, నా మీద కుట్రలు గట్రా పన్నేత్తన్నారని సెప్పేసేసి ఆ పత్రికలోల్లనే కేకేసి కూసేయాల. ఈలుంటే నీకంటూ ఓ పేపరెట్టుకుంటే ఇంకా మంచిది. అంటే ఎవరే తప్పు సూపెట్టినా ఎదురెట్టేయడన్నమాట. ఇంకా కావలిస్తే ఆల్ల సెరిత్రలోకి పోయి అక్కడేమీ లేకపోయినా ఉన్నదాన్నే బూతద్దంలో సూపిత్తా ఈల్లేం తక్కువ కాదని వాగేయాల, అచ్చేయాల'

'మరి చట్టం సీన్లోకొస్తేనోనండీ?'

'ఏముందిరా... ఎదురెట్టేవోడికి సెట్టమైనా ఒకటే, నేయమైనా ఒకటే. ఆకరికి ఆ దేవుడే దిగొచ్చి నువ్వొట్టి దగుల్బాజీవని సెప్పినా, మొన్నోపాలి టెంకాయ కొట్టనందుకు పగబట్టేసాడని బుకాయించడమే! నీ మీద వాగినోల్లది కుట్ర, కూపీ లాగినోల్లది కుట్ర, రుజువులు సూపినోడిది కుట్ర, సివరాకరికి సిచ్చ పడినా కోర్టోల్లది కూడా కుట్రే అని గగ్గోలు పెట్టేయాల'

'ఆహా బాగుందండీ. మరి అరెస్టయిపోయి జైల్లో పడితేనోనండీ?'

'అదింకా మంచిదొరే. సినేమావోల్లు సూడు, మా సినిమా బయటకొచ్చి ఇన్ని వారాలైంది, అన్ని వారాలైందని సెబతా సాటుకుంటారుగా? అట్టాగే నువ్వు లోపలికెల్లి ఆర్నెల్లయింది, ఏడాదైందని వాల్‌పోస్టర్లు గుద్దించి వూరూవాడా మైదా పిండెట్టి అతికించేయాల. నీ కంటూ పేపరుంటే ఇక రోజూ అదే పని మరి. అందరూ కలిసి దరమ దేవత గుడ్డలూడదీసేత్తన్నారూ, నిజాల నోరు నొక్కేత్తన్నారూ, నేయ దేవత పీక పిసికి సంపేత్తన్నారూ... అంటూ సానుబూతి పిండుకోవాల. అక్కడికి నువ్వేదో పరమ అవతార పురుసుడవన్నట్టన్న మాట. వీలుంటే సెల్లినో, తల్లినో, బామ్మర్దినో జనంలోకి పంపి మైకులిచ్చి ఎక్కడలేని ఏడుపులూ ఏడవమనాల'

'సరే కానీ గురూగారూ! చేసిన పన్లన్నీ రుజువైపోయి జనాలు మన నీచ నిజ స్వరూపాన్ని, అవినీతి విశ్వరూపాన్ని తెలుసుకుని చైతన్యవంతులేపోతేనోనండీ?'

'అప్పుడిక నిజమైన ఏడుపుగొట్టు పాటలు పాడుకుంటా, నీమీద నువ్వే సానుబూతి పడొచ్చు. రాగానే పాడావు సూడు ఆ పాట పల్లవోసారి అను'

'నీ ఆశ అడియాస... చేజారే మణిపూస... బతుకంతా అమావాస... లంబాడోళ్ల రాందాస...'

'అదీ అసల్లెక్క. ఇక పోయిరా!'


PUBLISHED IN EENADU ON 28.05.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి