బుధవారం, మే 08, 2013

అన్నగారి ఆత్మఘోష




అయ్యారే... ఇదేమి సభామంటపము? సర్వాంగ సుందరముగా, శోభాయమానంబుగా వెలుగొందుచున్నదే! మహామహుల మూర్తిమత్వ ధీరగంభీర ప్రతిమా స్వరూపములకు ఆలవాలమై అలరారుచున్నదే!
ఓహో... అవగతమైనది! ఇయ్యది... అఖిల భారతావని అప్రమేయ అధికార విలాసములకు ఆటపట్టు! సకల జనాభీష్టములకు అనుగుణముగా సాకారమైన సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పట్టుగొమ్మ! ఇంద్రప్రస్థ మహానగరాన వెలసిన అత్యద్భుత, అద్వితీయ, అనుపమాన, అపురూప సభామంటపము! పార్లమెంటు పరిపాలనా ప్రాంగణము!
ఎవరది? ఆ చెంతన విగ్రహ రూపమెవరిది? నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమై, నిజాయతీకి నిత్య దర్పణమై నిలుచుండిన ఆ స్వరూపము టంగుటూరి ప్రకాశం పంతులుగారిదేనా! కాక మరెవ్వరు? బ్రిటిష్‌వారి తుపాకి గుండుకు ఎదురుగా గుండెనిలిపి నిలిచిన అసమాన ధైర్యసాహసాలకు ప్రతిరూపమైన తెలుగుతేజం అదే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నత హోదానందుకుని కూడా, నిరుపేదవలె నిత్యజీవనము సాగించిన నిరుపమాన రాజకీయ దురంధరా, మీకిదే నా వందనము! కానీ పంతులుగారూ! గమనించితిరా? నేటి రాజకీయ దౌర్జన్య, దురాగత, దుర్నిరీతి, దుర్విధానములను? పదవి పొందిన మర్నాటి నుంచి ప్రజా ప్రయోజనములను పక్కనపెట్టి, స్వీయ కుటుంబ సంక్షేమమే పరమావధిగా... ఆంధ్ర రాష్ట్రమున సస్యశ్యామలమైన వ్యవసాయ సుక్షేత్రములను, అంతులేని ఖనిజ సంపదలకు ఆలవాలమైన సువిశాల గనులను, అస్మదీయులకు అడ్డగోలుగా కట్టబెట్టి... అందుకు ప్రతిఫలంబుగా తన కుపుత్రుని సంస్థల్లోకి పెట్టుబడులను ఆకర్షించి అచిరకాలముననే లక్షలాది కోట్ల రూపాయల అక్రమార్జనకు తెరతీసిన నేటి మనరాష్ట్ర పాలకుల నీచ నికృష్ట రాజకీయ తెంపరితనమును చూచితిరా? సామాన్య జన జీవనాల్లో ఇసుమంతైననూ మార్పు తీసుకురావాలనే తపనతో నిరంతరము పరితపించిన మీ విధానములెక్కడా? అధికారము కోసమే కలవరిస్తూ, అందుకోసం అమాయక ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి, భ్రమలు కల్పించి, భ్రాంతుల్లో ముంచి, మాయ చేసి, అబద్ధపు వాగ్దానాల వలలో పడేసి, అసంబద్ధ పథకాల అనుచిత విధానాలతో ఆకర్షించి... అధికారం అందగానే దురహంకారులై, దుర్య్యాపార కార్యకలాపములకు ద్వారాలు తెరచి... ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న నేటి ప్రభువుల నిర్లజ్జాకర పరిపాలనా ప్రాధాన్యములెక్కడ? అహో... తలచుకుంటున్న కొద్దీ మనసు వికలమైపోవుచున్నదే!
ఆ పక్కన ఎవరు? ఓ... ఎన్‌జీ రంగా గారా? అయిదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయవేత్తగా రికార్డును నెలకొల్పి, పద్మవిభూషణ్‌ అందుకుని, తెలుగువారి తెగువను జాతి మరువలేని రీతిలో తేటతెల్లం చేసిన మీకిదే అభివందనం! అన్నదాతల సంక్షేమం కోసం అకుంఠిత దీక్షతో పోరాడి, రైతు ఉద్యమానికి ఆద్యులైన మీ కృషి సదా, సర్వదా సంస్మరణీయం! కానీ... నేడు మన తెలుగు రాష్ట్రమున... అధికారమును అధిరోహించిన అవినీతి పాలకుల పాలబడిన కర్షకుల కన్నీటి గాథలు మీ చెవిని తాకలేదా రంగాజీ? రైతులే తమకు దేవుళ్లంటూ, కర్షకులే తమ కళ్లంటూ కల్ల మాటలాడి, కపట ప్రేమలొలకబోసిన మాయదారి నేతల మోసపూరిత విధానాలతో అన్నదాతలు నిలువునా నీరుగారిపోతున్నారు! ఇది మనలాంటి కర్షకమిత్రులకెంత మనోక్లేశము! ఎంత దుర్భరము!

అటు పక్క ఆ తెలుగు తేజమెవరిది? ఓహో... భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిదా? స్వాతంత్య్ర సమర యోధునిగా, ఉత్తమ రాజకీయ నేతగా తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మీకిదే అభివందనము. దేశాభివృద్ధికి బ్యాంకుల వ్యవస్థ ఎంతగానో దోహద పరుస్తుందని నమ్మి, ఆంధ్రా బ్యాంకు సంస్థాపకునిగా వినుతికెక్కిన మీ దూరదృష్టికి జోహార్లు! కానీ... ఈనాటి బ్యాంకుల వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవాంఛిత విధానములను గమనించితిరా పట్టాభిగారూ? స్వార్థపరులైన వాణిజ్యవేత్తలతో, అవినీతి రాజకీయ నేతలతో జట్టుకట్టి, నల్ల ధనమును తెల్లగా మార్చడంలో అనుచిత విధానాలకు అవి ఆటపట్టుగా మారుతున్నవని వినికిడి! ఎంతటి దర్వ్యవస్థ ఇది?

ఏమైననూ మీవంటి తెలుగు తేజముల సరసన పార్లమెంటు భవనమున సముచిత స్థానమును పొందుట నాకెంతో ముదావహము! ఏమంటిరి? తెలుగువారి ఆత్మగౌరవమును, దేశవిదేశాలలో సైతము చాటి చెప్పిన ఘనత నాదేనందురా? అదియంతయూ మీ అభిమానము! తెలుగు ప్రజల అద్వితీయ ఆదరణ ఫలితము!!

ఒక్కసారి... ఈ మహోన్నత సభాభవన ప్రాంగణమును పరికించి చూసెద! అయ్యదే... అది ఏమి? శోభాయమానమైన ఈ సభామండపమున గోడలకు ఆ మసి ఏమి? అసీ! బొగ్గు నుసి! దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అపార బొగ్గు నిక్షేపాలను వెలికి తీసి, జాతి ఉద్ధరణకు దోహద పడవలసిన దేశాధినేతలు, నిర్లజ్జగా వాటిని అవినీతిపరులకు అప్పగించిన విధము ఎంతటి దుర్భరము? ఎంతటి దుస్సహము? ప్రతిపక్షములన్నియూ కోడై కూస్తున్ననూ, నిఘా సంస్థలు నిజాలు వెల్లడిస్తున్ననూ చలించక, నైతిక బాధ్యతగానైనను వ్యవహరించక, మొండికెత్తి వ్యవహరిస్తున్న ఈనాటి నేతల కార్యకలాపములకు నేనిక మౌనసాక్షిగా నిలబడవలసిందేనా?

అరెరె... అక్కడదేమి? ఏదో మడుగు వలె గోచరించుచున్నదే! అఘో... అవినీతి మడుగు! అడుగడుగునా అవినీతి కుంభకోణాలతో కునారిల్లుతున్న ఇప్పటి పాలకుల అనుచిత విధానములన్నియు ఇక్కడ బురద మడుగుగా నా కళ్లకు కన్పట్టుచున్నది! దూరశ్రవణ పరికరములలో అదనపు సౌకర్యములను కల్పించు నెపముతో కుంభకోణము... అంతర్జాతీయ ఆటగాళ్లు అరుదెంచే అరుదైన సందర్భమున వసతి కల్పించు పనిలో సైతము కుంభకోణము... ప్రభుత్వ యంత్రాంగములో భాగమయ్యే అత్యున్నత పదవుల కోసము సైతము అవినీతికి పాల్పడు కుంభకోణము... ఎటు చూసినా అవినీతి, అక్రమములే! హతవిధీ!

ఆ... అదేమి ఆక్రందనము? ఎవరది... అక్కడ ఎవరో స్త్రీ రోదించుచున్నదే? అరెరే... ప్రజాస్వామ్య ప్రతిరూపమా? ఎంతటి ఘోరము! నిండు సభలో ఆమె విలువల వలువలను వలచుచున్నారే! ఎంతటి దురహంకారము! ఇటువంటి దృశ్యములను చూచుటకా నేనిట కొలువైనది?

నేనిదే ఎలుగెత్తి చాటుచున్నాను. దేశ ప్రజల మనసులలో నిత్య చైతన్య విస్ఫులింగాలను పుట్టించే స్ఫూర్తికి, నా ప్రతిమ నిలువెత్తు నిదర్శనమై నిలుచుగాక! అవినీతిని దునుమాడి, అక్రమార్కులను తరిమికొట్టే జనజాగృతి దావానల సదృశమై రగులుగాక!

PUBLISHED IN EENADU ON 08.05.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి