గురువారం, జనవరి 02, 2014

సామాన్యుడి సంకల్పం


'కుర్రో కుర్రు... ఏంది బిడ్డా, మొగం దిగాలు సేసుకుని కూకున్నవ్‌?' అన్నాడు కోయదొర సామాన్యుడితో. 
సామాన్యుడు నిట్టూర్చాడు. 'ఏం చెప్పమంటావు దొరా! మనసేం బాలేదు' అన్నాడు. 
'అదేంటి అట్లంటవ్‌? కొత్త ఏడాది గునగునా నడిసొచ్చింది. దిగులంతా పక్కనెట్టి దిలాసుగుండాల. అసలు నీ గోసకి మూలమేందో సెప్పరాదూ? నాకాడ బోలెడు తాయెత్తులున్నాయి...'
సామాన్యుడు నిర్వేదంగా నవ్వాడు. 'తాయెత్తులతో తీరేది కాదులే నా బాధ. కొత్త ఏడాది వచ్చిందన్నమాటే కానీ నా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఏది కొనాలన్నా ఆకాశంలోకి చూడాల్సి వస్తోంది. ఎందుకంటే ధరలన్నీ అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చున్నాయి. నూకలు కొందామన్నా రూకలు మాయమైపోతున్నాయి. గంజిలోకి నంజుకుందామన్నా ఉల్లిపాయ గిల్లి మరీ ఏడిపిస్తోంది. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలే... అది కాదు నా బాధ. ఎన్నికలు వస్తున్నాయి. కొత్త నాయకులని ఎన్నుకోవాలి. ఎవరిని చూసినా తీయగా మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ వూరిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరు ఎలాంటివారో తెలియడం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నా'

'కుర్రో కుర్రు... మరి చెప్పవేం? దానికి నాకాడ ఓ మంత్రముంది. నీ చెయ్యి నాకిచ్చి మనసులో ఓ నాయకుడిని తలుసుకో. ఆడెలాంటోడో, ఆడి మనసులో ఎలాటి తైతక్కలున్నాయో సెబుతా. కొండదేవర ఆన!' 
సామాన్యుడికి ఇదేదో సరదాగా తోచింది. ఉత్సాహంగా చెయ్యి చాపి, మనసులో ఒకర్ని తలుచుకున్నాడు. 
కోయదొర ఆ చేతిని పట్టుకుని అటూ ఇటూ వూపుతూ తనదైన ధోరణిలో పాటలాగా సాగదీస్తూ మొదలు పెట్టాడు.

'ఆ... అంబ పలుకు. జగదంబ పలుకు. కోనలమ్మ తల్లి కులుకు పలుకు. కొండదేవర పలుకు. నిండు నిజము పలుకు...' అంటూ కొనసాగించాడు. సామాన్యుడు వింటున్నాడు. 
'ఎరిక పడిందిలే ఎవరిదో రూపమ్ము. బిడ్డ సక్కనివాడు... బిరుసు వయసువాడు. నిగనిగల రంగుతో నిగ్గుతేలినవాడు. గరుకు గెడ్డమువాడు... సరుకు లేనివాడు... తెలిసిందా బిడ్డా?' అన్నాడు కోయదొర. 
సామాన్యుడు ఆశ్చర్యపోయి 'సరిగ్గా అతడినే తలుచుకున్నా. చెప్పు... చెప్పు' అన్నాడు.

కోయదొర కొనసాగించాడు. 'పుట్టిన వంశమ్ము గొప్ప వంశమ్ము... కానీ ఏం లాభం? అమ్మ కొంగుసాటు... అతడి గ్రహపాటు. మాట తొందరపాటు... చేత తత్తరపాటు. రాచకుర్చీపై ఆశపడుతున్నాడు... పరుగుపెట్టిన కొద్దీ వెనక పడుతున్నాడు. అరచెయ్యి నీడలో, అమ్మ హయాములో... దేశమ్ము జారిపడె పాతాళ గొయ్యిలో. సేసిన కార్యాలు మా సెడ్డ కార్యాలు. చివరికవి అవుతాయి ఆ బిడ్డ శాపాలు. నమ్మి సేరావంటే... నట్టేట మునిగేవు'

సామాన్యుడి ముఖం వికసించింది. 'నిజమే, అర్థమైంది. ఇప్పుడు ఇంకో నాయకుడిని తలుచుకుంటా. అతడి సంగతేంటో చెప్పు' అన్నాడు. 
'ఆ... కరకు చూపులవాడు. మెత్తగా నవ్వుతాడు. జెల్ల కొడతాడు. తీయగా మాటాడి, తీట తీసేస్తాడు. తండ్రి సాటున ఎదిగి... తంత్రాలు మరిగాడు. జనము సొమ్ములు దోచి, జాతరలు సేశాడు. బడుగు బతుకులతోటి జూదమాడాడు. భూమి సుట్టేశాడు. గనులు కుమ్మేశాడు. నీరు పేరు చెప్పి నిధులు నొక్కేశాడు. పేదవారి కోసమే బతుకంటు సెబుతాడు. పెద్ద మూటలుకట్టి కోటలో దాస్తాడు. ఓదార్చ వస్తాడు... వూడ్చుకుని పోతాడు. తెలుసుకున్నావా బిడ్డా?'

'అయ్యబాబోయ్‌... సరిగ్గా చెప్పావు. ఎవరెలాంటివారో చక్కగా చెప్పావు. వీళ్లను దగ్గరకి రానిస్తే దేశం, రాష్ట్రం ఏమవుతాయో తెలియజేశావు. నా మనసులో సందేహాలు తీర్చావు. ఇంతకీ నేనేం చేయాలో అది కూడా కొండదేవరనడిగి చెప్పరాదూ?' అన్నాడు సామాన్యుడు ఆశగా.

'ఆ... పంచప్రాణాలాన. పంచభూతాలాన. పసిడి పలుకులు పలుకు దేవతల ఆన. నిజము సెబుతానయ్య... నిక్కముగ వినవయ్య. బడుగుజీవిని నేనంటు దిగులు పడమాకయ్య. నీ సేతిలో ఓటు వజ్రాయుధమ్మయ్య. దాని శక్తిని జూసి నిబ్బరపడవయ్య. మెరమెచ్చు మాటలు విని మోసపోకయ్య. నోటు రెపరెపలకు తొట్రుపడకయ్య. అవినీతి నాయకుల అంతు సూడవయ్య. అక్రమార్జన పరుల పీచమణచవయ్య. ఈ కొత్త ఏడాది, నీకొక్క వరమయ్య. ఎన్నికలవేళలో ఎరికతో నిలువయ్య. నీతిగల నేతలను ఎన్నుకోవయ్య. నీ శక్తి తెలుసుకుని, నీ బతుకు దిద్దుకుని, దేశానికే నీవు దిక్కు చూపాలయ్య. కుర్రో కుర్రు!' అన్నాడు కోయదొర.
కొత్త సంవత్సరం ఏం చేయాలో నిర్ణయించుకున్న సామాన్యుడు నూతనోత్సాహంతో ముందుకు నడిచాడు.

PUBLISHED IN EENADU ON 02.01.2014

1 కామెంట్‌:

  1. భలే రాశారు సార్, కుర్రో కుర్రు స్టయిల్లో..!
    ఇద్దరు యువరాజాల్ని భలే కుళ్లబొడిచారు సర్. :-)

    రిప్లయితొలగించండి