మంగళవారం, మార్చి 11, 2014

టోకున టోపీ


'అయ్యా... కొంప మునిగిపోయింది. వార్త వినగానే సెలవు రద్దుచేసుకుని పరిగెత్తుకు వచ్చేశా. ఇప్పుడేం చేద్దామని సెలవు?'
'ఛ ఛ వూరుకో! అపశకునం మాటలు నువ్వూను. మన కొంప మునగడమేంటయ్యా?'

'అయ్యా... మనం కొంపలు ముంచేవాళ్లం, కూల్చేవాళ్లమని ఇన్నాళ్లూ తెగ సంబరపడిపోయేవాడినండి. ఇప్పుడు మన కొంపకే ఎసరు వచ్చినట్టుందని గాబరాగా ఉందండి'

'వూరికే నాన్చక విషయమేంటో చెప్పవయ్యా. ఏదో కొత్త సెక్రట్రీవి కదా, పనికింకా అలవాటు పడలేదని వూరుకుంటుంటే నన్నే కంగారు పెట్టేస్తున్నావు'

'అయ్యా... తమరిది నిబ్బరమో నిండా మునిగిన ధైర్యమో తెలియడం లేదండి. అమ్మో అమ్మో... ఒకటా రెండా- ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడమంటే మాటలేంటండి? ఈపాటికి తమరికి ఏ గుండెపోటో వచ్చేసుంటుందని, ఐసీయూలో చేరిపోయి ఉంటారని ఆదరాబాదరా పరిగెత్తుకు వస్తే, తమరేమో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నాకేమీ అర్థం కావడం లేదండయ్య!'

'వార్నీ, అదా నీ కంగారు? ముందు నిదానంగా కూర్చుని కాసిని మంచినీళ్లు తాగు. దుడుకు తగ్గాక దూకుడు పెంచుదువుగాని'

'ఏంటో, మీరెన్ని చెప్పినా మనసు కుదుటపడటం లేదండి. అన్నేసి వందల కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారంటే... రేప్పొద్దున తమరి లావాదేవీలన్నీ ఏమవుతాయి? ఎలా తేరుకుంటాయనేదే దిగులండి'

'అదిగో మళ్ళీ గింగిరాలెత్తుతున్నావు. సర్లె, నువ్వు కొత్తోడివిలే కానీ- ఇది మనకొక లెక్క కాదయ్యా. మనం దిగమింగిన దాంట్లో ఇదెంత? సముద్రంలో కాకిరెట్టంత. గిన్నెడు పాయసంలో కిస్‌మిస్‌ పండంత. వందెకరాల జామ తోటలో ఓ లేత పిందంత. నీకో పట్టాన అర్థం కాదులే. అందుకే పనిలోకి చేరగానే మన చరిత్రంతా చదువుకోమని చెప్పింది. అదంతా తెలుసుకుని ఉంటే ఇంత గాబరా పడేవాడివి కాదు. ఇంకా నయం... నీకే గుండెపోటో వచ్చేసింది కాదు... వట్టి కంగారుగొడ్డులాగున్నావే?'

'అమ్మయ్య, ఇప్పటికి నా ప్రాణం కుదుట పడిందండి. నిజానికి తమరి చరిత్ర చదువుదామని పాత దస్త్రాలు తీశానండి. అమ్మో, ఎన్నెన్ని కుంభకోణాలు, ఎన్నెన్ని దారుణాలు, ఎన్నెన్ని అకృత్యాలు? అవన్నీ చదవాలంటే నా జీవితం సరిపోదనిపించిందండి. ఎలాగోలా ఉపోద్ఘాతాలైనా చదివి తమరి నిజస్వరూపాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తానండి. అయినా, నాకు తెలియక అడుగుతానండీ... అవడానికి ఇది పెద్ద దెబ్బే కదండి? ఇక తమరి పరువేం కాను, మరి ప్రజలకు మొహమెలా చూపిస్తారండీ? కాస్తయినా సిగ్గేయదూ?'

'హ హ హ్హ... పిచ్చోడా! ఆ సిగ్గు, పరువులాంటివి ఉండేడిస్తే అసలిలాంటి పనులు చేస్తామా చెప్పు? అవి వదిలేశాకే కదా, ఇవన్నీ మొదలెట్టింది? అయినా అట్టాంటివి మా ఇంటా వంటా లేవనుకో. అయినా ఇదీ మన మంచికేలే...'

'మంచికా, అదెలాగండి? ఏమిటో, మీరే కాదు, మీ మాటలూ ఓ పట్టాన మింగుడుపడటం లేదండి. ఆస్తులు జప్తుచేశారంటే, అక్రమాలు బయటపడ్డట్టే కదండీ, నిజాలు పట్టుబడ్డట్టే కదండీ? మరి ప్రజానీకానికి తమరి మీద నమ్మకం తగ్గిపోతుందేమోనని నా బెంగండి!'

'చూడు సెక్రట్రీ. జనం మీద నాకెలాంటి దిగులూ లేదయ్యా. వాళ్ల అమాయకత్వం మీద నాకంత నమ్మకం. వట్టి వెర్రిబాగులోళ్లనుకో. వాళ్ల కళ్లముందే మనం వెయ్యి రూపాయలు దోచేసుకుని జేబులో పెట్టేసుకున్నా, ఒక్క రూపాయి వాళ్ల మొహాన పడేస్తే సంబరపడిపోతారు. మొదట్నుంచీ మన సిద్ధాంతం అదే కదా? ఆ దార్లోనే మరి మనం ఎన్నో వేల కోట్ల రూపాయలు వెనకేశాం. చరిత్ర చదువుకో బాగుపడతావు'

'అవుననుకోండి. కానీ ఇలాంటి అవినీతి, అవకతవక, అకృత్య కార్యకలాపాల వల్ల మొత్తం వ్యవస్థ నాశనమైపోతుందని, చుట్టుతిరిగి ఈ అవినీతి వ్యవహారాలన్నీ కలిసి తమ జీవితాలనే అతలాకుతలం చేస్తాయని జనం తెలుసుకోలేరు... పాపం!'

'ఏందయ్యో, ప్రజానీకం మీద అంతేసి జాలి పడిపోతున్నావ్‌. జాగ్రత్త... ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పది కాలాలపాటు పది కాసులు వెనకేసుకుంటూ అంతస్తు మీద అంతస్తులు పెంచుకోవాలంటే ఇట్టాంటి దరిద్రగొట్టు ఆలోచనల్ని దరి చేరనివ్వకూడదు. నాలాంటివాడి దగ్గర పనిచేయాలంటే నువ్వూ ఇవన్నీ నేర్చుకోవాలి మరి'

'సరేనండయ్య. కానీ, ఇప్పుడు ఆ జప్తు యవ్వారం నుంచి బయట పడేదెలాగో కాస్త చెబుదురూ'

'ఏముందయ్యా, మాటకు మాట అనడమే. మన జనాదరణ చూసి అధికార పార్టీకి దడ పట్టుకుందని, అందుకే ఇలా కక్షకట్టి సాధిస్తోందని, నోట్లో వేలు పెట్టినా కొరకడం రాని నాలాంటివాడిమీద లేనిపోని అభాండాలు వేసి కేసులపాలు చేస్తోందని వూదరగొట్టే ఏర్పాట్లు చూడు. వెర్రిజనం కాబోసనుకుని మన మీద సానుభూతి కురిపించేత్తారు. వారంతా కళ్లొత్తుకునేలా నమ్మించడానికి మన అనుచరవర్గాల్ని సభలెట్టి మైకుల్లో ఉపన్యాసాలు దంచమను. వూరూవాడా పోస్టర్లు అతికించి కరపత్రాలు పంచి నానా అల్లరీ చేయమను. అర్థమైందా?'

'ఆహా, అద్భుతం సార్‌! మీ సానుభూతి వేషాలు చూస్తుంటే రసానుభూతి కలుగుతోందండి. ఎవరైనా ఒకరికి ఒక టోపీ పెట్టగలరు. మీరు మాత్రం ప్రజలందరికీ ఒకే టోపీ వేయడంలో ఘనాఘనులు. తమరి దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమంటే నమ్మండి'

'జాగ్రత్త... భక్తితో కళ్లుతిరిగేను. పడతావ్‌. పోయిరా!'

PUBLISHED IN EENADU ON 11/03/2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి